ఫిలిప్పీ పత్రిక 4:1-9

ఫిలిప్పీ పత్రిక 4:1-9 OTSA

కాబట్టి, నా సహోదరీ సహోదరులారా, నా ఆనందం నా కిరీటమైన నా ప్రియ స్నేహితులారా, నేను మిమ్మల్ని ప్రేమించి, ఈ విధంగా మీరు ప్రభువులో స్థిరంగా నిలబడి ఉండాలని కోరుకుంటున్నాను. ప్రభువులో ఏక మనస్సు కలిగి ఉండమని యువొదియను, సుంటుకేను బ్రతిమాలుతున్నాను. అవును, నా నిజమైన సహకారీ, జీవగ్రంథంలో పేర్లు వ్రాయబడిన ఈ స్త్రీలు క్లెమెంతుతో మిగతా నా సహపనివారితో కలిసి సువార్త పనిలో నాతోకూడ ప్రయాసపడ్డారు. కాబట్టి వారికి సహాయం చేయమని నిన్ను అడుగుతున్నా. ఎల్లప్పుడు ప్రభువులో ఆనందించండి, మరల చెప్తున్నాను ఆనందించండి. మీ శాంత స్వభావాన్ని అందరికి స్పష్టంగా తెలియనివ్వండి. ప్రభువు సమీపంగా ఉన్నారు. దేన్ని గురించి వేదన పడకండి, కాని ప్రతి విషయంలో ప్రార్థనావిజ్ఞాపనల చేత కృతజ్ఞతా పూర్వకంగా మీ విన్నపాలను దేవునికి తెలియజేయండి. అప్పుడు సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం యేసు క్రీస్తు వలన మీ హృదయాలను మీ తలంపులను కాపాడుతుంది. చివరిగా, సహోదరీ సహోదరులారా, ఏదైనా యోగ్యమైనదిగా లేదా మంచిగా ఉంటే, సత్యమైన వాటి మీద, గొప్పవాటి మీద, న్యాయమైన వాటి మీద, పవిత్రమైన వాటి మీద, సుందరమైన వాటి మీద, ఘనమైన వాటి మీద మీ మనస్సులను పెట్టండి. మీరు నా నుండి ఏవి నేర్చుకున్నారో, పొందారో లేదా విన్నారో లేదా నాలో ఏమి చూశారు వాటిని ఆచరణలో పెట్టండి. అప్పుడు సమాధానకర్తయైన దేవుడు మీతో ఉంటారు.