కీర్తన 69
69
ప్రధాన సంగీతకారుని కోసం. శోషన్నీము (కలువల రాగం) అనే రాగంలో పాడవలసినది. దావీదు కీర్తన
1దేవా, నన్ను కాపాడు. నా ప్రాణం మీద నీళ్ళు పొర్లి పారుతున్నాయి.
2లోతైన అగాధంలాంటి ఊబిలో నేను దిగబడిపోతున్నాను. నిలబడలేకుండా ఉన్నాను. లోతైన నీళ్ళలో నేను మునిగిపోయాను. వరదలు నన్ను ముంచెత్తుతున్నాయి.
3నేను కేకలు వేసి అలసిపోయాను, నా గొంతు ఎండిపోయింది. నా దేవుని కోసం కనిపెడుతూ ఉండగా నా కళ్ళు క్షీణించాయి.
4ఏ కారణం లేకుండా నా మీద పగబట్టిన వారు నా తలవెంట్రుకలకంటే ఎక్కువమంది ఉన్నారు. అకారణంగా నాకు శత్రువులై నన్ను చంపాలని చూసేవారు అనేకమంది. నేను దోచుకోని దాన్ని నేను తిరిగి ఇవ్వాల్సి వచ్చింది.
5దేవా, నా బుద్ధిహీనత నీకు తెలుసు. నా పాపాలు నీకు తెలియనివి కావు.
6దేవా, సేనల ప్రభువైన యెహోవా, నీ కోసం ఎదురు చూసే వారికి నా మూలంగా సిగ్గు కలగనీయవద్దు. ఇశ్రాయేలు దేవా, నిన్ను వెదికే వారు నా మూలంగా అవమానం పాలు కానీయకు.
7నీ కోసం నేను నిందలు పడ్డాను. నీ కోసమే నేను సిగ్గు పడాల్సి వచ్చింది.
8నా సోదరులకు నేను పరాయివాణ్ణి అయ్యాను. నా తల్లి కొడుకులకు పరదేశిని అయ్యాను.
9నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను తినివేసింది. నిన్ను నిందించిన వారి నిందలు నా మీద పడ్డాయి.
10నేను ఉపవాసముండి ఏడ్చినపుడు నా ఆత్మకు అది నింద కారణమైంది.
11నేను గోనెపట్ట కట్టుకున్నప్పుడు వారు అపహాస్యం చేశారు.
12నగర ద్వారాల్లో కూర్చున్నవారు నన్ను గురించే మాట్లాడుకుంటున్నారు. తాగుబోతులు నన్ను గూర్చి పాటలు పాడతారు.
13యెహోవా, నీకే నేను ప్రార్థన చేస్తున్నాను. అనుకూల సమయంలో జవాబివ్వు. దేవా, నమ్మదగిన నీ రక్షణ సత్యాన్ని బట్టి నాకు జవాబు దయచెయ్యి.
14ఊబిలోనుండి నన్ను తప్పించు. నన్ను మునిగి పోనీయకు. నన్ను ద్వేషించే వారి చేతినుండి, లోతైన జలాల నుండి నన్ను తప్పించు.
15వరదలు నన్ను ముంచెయ్యనియ్యకు. అగాథం నన్ను మింగనియ్యకు. నన్ను గుంటలో పడనియ్యకు.
16యెహోవా, నీ నిబంధన కృపలోని మంచితనాన్ని బట్టి నాకు జవాబివ్వు. అధికమైన నీ కృపను బట్టి నావైపు తిరుగు.
17నీ సేవకుడి నుండి నీ ముఖం తిప్పుకోకు. నేను నిస్పృహలో ఉన్నాను, నాకు త్వరగా జవాబివ్వు.
18నా దగ్గరికి వచ్చి నన్ను విమోచించు. నా శత్రువులను చూసి నన్ను విడిపించు.
19నాకు నింద, సిగ్గు, అవమానం కలిగాయని నీకు తెలుసు. నా విరోధులంతా నీ ఎదుటే ఉన్నారు.
20నింద వలన నా హృదయం బద్దలైంది. నేను ఎంతో కృశించిపోయాను. నన్ను ఎవరైనా కనికరిస్తారేమో అని చూశాను గానీ ఎవరూ లేరు. ఓదార్చే వారి కోసం కనిపెట్టాను గాని ఎవరూ కనిపించ లేదు.
21వారు నాకు ఆహారంగా చేదు విషాన్ని పెట్టారు. నాకు దాహం అయినప్పుడు తాగడానికి పులిసిన ద్రాక్షరసం ఇచ్చారు.
22వారి సంపద#69:22 సంపద భోజనం బల్ల వారికి ఉరి అవుతుంది గాక. క్షేమంగా ఉన్నామని అనుకున్నప్పుడు అది వారికి ఒక బోనుగా ఉంటుంది గాక.
23వారు చూడలేకపోయేలా వారి కళ్ళకు చీకటి కమ్ముతుంది గాక. వారి నడుములకు ఎడతెగని వణకు పుడుతుంది గాక.
24వారి మీద నీ ఉగ్రతను కుమ్మరించు. నీ కోపాగ్ని వారిని ఆవరిస్తుంది గాక.
25వారి నివాసం నిర్జనం అవుతుంది గాక. వారి గుడారాల్లో ఎవరూ నివాసం ఉండరు గాక.
26నువ్వు దెబ్బ కొట్టిన వాణ్ణి వారు బాధిస్తున్నారు. నువ్వు గాయపరచిన వారి వేదన గూర్చి వారు కబుర్లాడుతున్నారు.
27ఒకదాని తరవాత ఒకటిగా అపరాధాలు వారికి తగలనివ్వు. నీ నీతిగల విజయంలోకి వారిని చేరనివ్వకు.
28జీవగ్రంథంలో నుండి వారి పేరు చెరిపివెయ్యి. నీతిమంతుల జాబితాలో వారి పేర్లు రాయవద్దు.
29నేను బాధలో, వేదనలో మునిగి ఉన్నాను. దేవా, నీ రక్షణ నన్ను లేవనెత్తు గాక.
30దేవుని నామాన్ని గానాలతో స్తుతిస్తాను. కృతజ్ఞతలతో ఆయన్ని ఘనపరుస్తాను.
31ఎద్దు కంటే, కొమ్ములు డెక్కలు గల కోడె కంటే అది యెహోవాకు ఇష్టం.
32దీనులు అది చూసి సంతోషిస్తారు. దేవుని వెదికేవారలారా, మీ హృదయాలు తిరిగి బ్రతుకు గాక.
33అక్కరలో ఉన్నవారి ప్రార్థన యెహోవా ఆలకిస్తాడు. బంధకాల్లో ఉన్న తన వారిని ఆయన అలక్ష్యం చేయడు.
34భూమీ ఆకాశాలూ ఆయనను స్తుతిస్తాయి గాక. సముద్రాలు, వాటిలోని సమస్తం ఆయనను స్తుతిస్తాయి గాక.
35దేవుడు సీయోనును రక్షిస్తాడు. ఆయన యూదా పట్టణాలను తిరిగి కట్టిస్తాడు. ప్రజలు అక్కడ నివాసం ఉంటారు. అది వారి సొంతం అవుతుంది.
36ఆయన సేవకుల సంతానం దాన్ని వారసత్వంగా పొందుతారు. ఆయన నామాన్ని ప్రేమించేవారు అందులో నివసిస్తారు.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
కీర్తన 69: IRVTel
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
TEL-IRV
Creative Commons License
Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.