రోమా పత్రిక 8
8
1ఇప్పుడు క్రీస్తు యేసులో ఉన్న వారికి ఏ శిక్షా లేదు.
(4) ఆత్మ నూతన నియమం విడుదల కలిగిస్తుంది, నిర్దోషిగా తీరుస్తుంది
2క్రీస్తు యేసులో జీవాన్నిచ్చే ఆత్మ నియమం పాపమరణాల నియమం నుండి నన్ను విడిపించింది. 3-4ఎలాగంటే శరీర స్వభావాన్ని బట్టి ధర్మశాస్త్రం బలహీనంగా ఉండడం వల్ల అది దేనిని చేయలేక పోయిందో దాన్ని దేవుడు చేశాడు. శరీరాన్ని కాక ఆత్మను అనుసరించి నడిచే మనలో ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధిని నెరవేర్చాలని పాప పరిహారం కోసం దేవుడు తన సొంత కుమారుణ్ణి పాప శరీరాకారంతో పంపి, ఆయన శరీరంలో పాపానికి శిక్ష విధించాడు.
(5) శరీరంతో ఆత్మ ఘర్షణ
గలతీ 5:16-18
5శరీరానుసారులు శరీర విషయాల మీద, ఆత్మానుసారులు ఆధ్యాత్మిక విషయాల మీద శ్రద్ధ చూపుతారు. 6శరీరానుసారమైన మనసు చావు. ఆత్మానుసారమైన మనసు జీవం, సమాధానం. 7ఎందుకంటే శరీరానుసారమైన మనసు దేవునికి విరోధంగా పని చేస్తుంది. అది దేవుని ధర్మశాస్త్రానికి లోబడదు, లోబడే శక్తి దానికి లేదు కూడా. 8కాబట్టి శరీర స్వభావం గలవారు దేవుణ్ణి సంతోషపెట్ట లేరు. 9దేవుని ఆత్మ మీలో నివసిస్తూ ఉంటే మీలో ఆత్మ స్వభావమే ఉంది. శరీర స్వభావం కాదు. ఎవరిలోనైనా క్రీస్తు ఆత్మ లేకపోతే అతడు క్రీస్తుకు చెందినవాడు కాడు. 10క్రీస్తులో ఉంటే పాపం కారణంగా మీ శరీరం చనిపోయింది గాని నీతి కారణంగా మీ ఆత్మ జీవం కలిగి ఉంది. 11చనిపోయిన వారిలో నుండి యేసును లేపిన వాడి ఆత్మ మీలో నివసిస్తూ ఉంటే, ఆయన చావుకు లోనైన మీ శరీరాలను కూడా మీలో నివసించే తన ఆత్మ ద్వారా జీవింపజేస్తాడు.
12కాబట్టి సోదరులారా, శరీరానుసారంగా ప్రవర్తించడానికి మనం దానికేమీ రుణపడి లేము. 13మీరు శరీరానుసారంగా నడిస్తే చావుకు సిద్ధంగా ఉన్నారు గానీ ఆత్మ చేత శరీర కార్యాలను చంపివేస్తే మీరు జీవిస్తారు.
నాలుగవ భాగం-సువార్త వలన కలిగే పరిపూర్ణమైన ఫలితం
(1) విశ్వాసి కుమారునిగా, వారసునిగా అవుతాడు
గలతీ 4:4
14దేవుని ఆత్మ ఎందరిని నడిపిస్తాడో, వారంతా దేవుని కుమారులుగా ఉంటారు. 15ఎందుకంటే, మళ్లీ భయపడడానికి మీరు పొందింది దాస్యపు ఆత్మ కాదు, దత్తపుత్రాత్మ. ఆ ఆత్మ ద్వారానే మనం, “అబ్బా! తండ్రీ!” అని దేవుణ్ణి పిలుస్తున్నాం. 16మనం దేవుని పిల్లలమని ఆత్మ మన ఆత్మతో సాక్షమిస్తున్నాడు. 17మనం పిల్లలమైతే వారసులం కూడా. అంటే దేవుని వారసులం. అలాగే క్రీస్తుతో కూడా మహిమ పొందడానికి ఆయనతో కష్టాలు అనుభవిస్తే, క్రీస్తు తోటి వారసులం.
(2) బాధల నుండి, మరణం నుండి విడుదలైన సృష్టి దైవకుమారుల కోసం సిద్ధంగా ఉంది
ఆది 3:18, 19
18మనకు వెల్లడి కాబోయే మహిమతో ఇప్పటి కష్టాలు పోల్చదగినవి కావని నేను భావిస్తున్నాను. 19దేవుని కుమారులు వెల్లడయ్యే సమయం కోసం సృష్టి బహు ఆశతో ఎదురు చూస్తూ ఉంది. 20ఎందుకంటే తన ఇష్టం చొప్పున కాక దాన్ని లోబరచినవాడి మూలంగా వ్యర్థతకు గురైన సృష్టి, 21నాశనానికి లోనైన దాస్యం నుండి విడుదల పొంది, దేవుని పిల్లలు పొందబోయే మహిమగల స్వేచ్ఛ పొందుతాననే నిరీక్షణతో ఉంది. 22ఇప్పటి వరకూ సృష్టి అంతా ఏకగ్రీవంగా మూలుగుతూ ప్రసవ వేదన పడుతున్నదని మనకు తెలుసు. 23అంతే కాదు, ఆత్మ ప్రథమ ఫలాలను పొందిన మనం కూడా దత్తపుత్రత్వం కోసం, అంటే మన శరీర విమోచన కోసం కనిపెడుతూ లోలోపల మూలుగుతున్నాం. 24ఎందుకంటే మనం ఈ ఆశాభావంతోనే రక్షణ పొందాం. మనం ఎదురు చూస్తున్నది కనిపించినప్పుడు ఇక ఆశాభావంతో పని లేదు. తన ఎదురుగా కనిపించే దాని కోసం ఎవరు ఎదురు చూస్తాడు? 25మనం చూడని దాని కోసం ఎదురు చూసేవారమైతే ఓపికతో కనిపెడతాము.
(3) విశ్వాసిలో నివాసముండే విజ్ఞాపన కర్త పరిశుద్ధాత్మ
హెబ్రీ 7:25
26అలాగే పరిశుద్ధాత్మ కూడా మన బలహీనతలో సహాయం చేస్తున్నాడు. ఎందుకంటే మనం సరిగా ఎలా ప్రార్థన చేయాలో మనకు తెలియదు. కాని, మాటలతో పలకడానికి వీలు లేని మూలుగులతో పరిశుద్ధాత్మ మన పక్షంగా వేడుకుంటున్నాడు. 27ఆయన దేవుని సంకల్పం ప్రకారం పవిత్రుల పక్షంగా వేడుకుంటున్నాడు. ఎందుకంటే హృదయాలను పరిశీలించే వాడికి ఆత్మ ఆలోచన ఏమిటో తెలుసు.
(4) సువార్త మూలంగా దేవుడు ఉద్దేశించిన అమోఘమైన ఫలితాలు
28దేవుణ్ణి ప్రేమించేవారికి, అంటే ఆయన తన సంకల్పం ప్రకారం పిలిచిన వారికి, మేలు కలిగేలా దేవుడు అన్నిటినీ సమకూర్చి జరిగిస్తాడని మనకు తెలుసు. 29ఎందుకంటే తన కుమారుడు అనేక సోదరుల్లో జ్యేష్ఠుడుగా ఉండాలని, దేవుడు ముందుగా ఎరిగిన వారిని, తన కుమారుణ్ణి పోలిన రూపం పొందడానికి ముందుగా నిర్ణయించాడు. 30ఎవరిని ముందుగా నిర్ణయించాడో వారిని పిలిచాడు, ఎవరిని పిలిచాడో వారిని నిర్దోషులుగా ఎంచాడు. అంతే కాదు, ఎవరిని నిర్దోషులుగా ఎంచాడో వారిని మహిమ పరిచాడు.
31వీటిని గురించి మనమేమంటాం? దేవుడు మన పక్షాన ఉండగా మనకు విరోధి ఎవడు? 32తన సొంత కుమారుణ్ణి మనకీయడానికి సంకోచించక మనందరి కోసం ఆయనను అప్పగించిన దేవుడు ఆయనతోబాటు అన్నిటినీ మనకీయకుండా ఉంటాడా? 33దేవుడు ఏర్పరచుకున్న వారి మీద నేరారోపణ చేయగల వాడెవడు? నిర్దోషిగా ప్రకటించేవాడు దేవుడే. 34ఎవరు శిక్ష విధించ గలిగేది? క్రీస్తు యేసా? చనిపోయినవాడు, మరింత ప్రాముఖ్యంగా చనిపోయిన వారిలో నుండి లేచినవాడు, దేవుని కుడి పక్కన కూర్చుని ఉన్నవాడు, మన కోసం విజ్ఞాపన చేసేవాడు కూడా ఆయనే.
(5) విశ్వాసి భద్రత
35క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎవరు వేరు చేయగలరు? కష్టాలు, బాధలు, హింసలు, కరువులు, వస్త్రహీనత, ఉపద్రవం, ఖడ్గం, ఇవి మనలను వేరు చేస్తాయా? 36దీన్ని గురించి ఏమని రాసి ఉందంటే,
“నీ కోసం మేము రోజంతా వధకు గురౌతున్నాం.
వధ కోసం సిద్ధం చేసిన గొర్రెలుగా మమ్మల్ని ఎంచారు.”
37అయినా వీటన్నిటిలో మనలను ప్రేమించినవాడి ద్వారా మనం సంపూర్ణ విజయం పొందుతున్నాం. 38-39నేను నిశ్చయంగా నమ్మేదేమంటే, చావైనా, బతుకైనా, దేవదూతలైనా, ప్రభుత్వాలైనా, ఇప్పుడున్నవైనా, రాబోయేవైనా, శక్తులైనా, ఎత్తయినా, లోతైనా, సృష్టిలోని మరేదైనా సరే, మన ప్రభు క్రీస్తు యేసులోని దేవుని ప్రేమ నుండి మనలను వేరు చేయలేవు.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
రోమా పత్రిక 8: IRVTel
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
TEL-IRV
Creative Commons License
Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.