రోమా పత్రిక 9

9
ఐదవ భాగం-ఇశ్రాయేలు గురించిన విషయం
రోమా 9-11
ఇశ్రాయేలుతో నిబంధనను సువార్త వమ్ము చేయదు (1) ఇశ్రాయేలు జాతిని గురించి అపొస్తలుని ఆవేదన
1-2నా హృదయంలో గొప్ప దుఃఖం, తీరని వేదన ఉన్నాయి. నేను అబద్ధమాడడం లేదు, క్రీస్తులో నిజమే చెబుతున్నాను. పరిశుద్ధాత్మలో నా మనస్సాక్షి నాతో కలిసి సాక్షమిస్తున్నది. 3సాధ్యమైతే, శరీర సంబంధంగా నా సోదరులు, నా సొంత జాతి వారి కోసం, క్రీస్తు నుండి వేరుపడి దేవుని శాపానికి గురి కావడానికి కూడా నేను సిద్ధమే.
(2) ఇశ్రాయేలుకున్న ఏడింతల ఆధిక్యతలు
4వీరు ఇశ్రాయేలీయులు. దత్తపుత్రత్వం, మహిమ, నిబంధనలు, ధర్మశాస్త్రం అనే బహుమానం, దైవారాధన ఆచారాలు, వాగ్దానాలు వీరివి. 5పూర్వీకులు వీరి వారే. శరీరరీతిగా క్రీస్తు వచ్చింది వీరిలో నుండే. ఈయన సర్వాధికారియైన దేవుడు, శాశ్వత కాలం స్తుతిపాత్రుడు, ఆమేన్‌.
(3) అబ్రాహాము ద్వారా కేవలం సహజ సంతానమైన యూదులకూ ఆత్మ సంబంధమైన యూదులకూ తేడా
6అయితే దేవుని మాట భంగమైనట్టు కాదు. ఇశ్రాయేలునుండి వచ్చిన వారంతా ఇశ్రాయేలీయులు కారు. 7అబ్రాహాముకు పుట్టిన వారంతా నిజమైన వారసులు కాదు, “ఇస్సాకు మూలంగా కలిగే వారినే నీ సంతానం అని పిలుస్తారు.” 8అంటే శరీర సంబంధులంతా దేవుని పిల్లలు కారు గానీ దేవుని వాగ్దానం ద్వారా పుట్టిన పిల్లలే సంతానమని లెక్కలోకి వస్తారు. 9ఆ వాగ్దానం గురించిన వాక్యమిదే, “తిరిగి ఇదే కాలంలో వస్తాను. అప్పుడు శారాకు కొడుకు పుడతాడు.”
10అంతేకాదు, రిబ్కా మన తండ్రి ఇస్సాకు వలన గర్భం దాల్చినప్పుడు, 11దేవుని ఎన్నిక ప్రకారమైన ఆయన సంకల్పం, చేసే పనుల మూలంగా కాక వారిని పిలిచినవాడి మూలంగానే నెరవేరడం కోసం, 12పిల్లలు ఇంకా పుట్టి మంచీ చెడూ ఏమీ చేయక ముందే, “పెద్దవాడు చిన్నవాడికి సేవకుడు అవుతాడు” అని ఆమెతో చెప్పాడు. 13దీన్ని గురించి, “నేను యాకోబును ప్రేమించాను, ఏశావును ద్వేషించాను” అని రాసి ఉంది.
(4) దేవుని కృప ఆయన సార్వభౌమిక సంకల్పమే
14కాబట్టి ఏమంటాము? దేవుడు అన్యాయం చేశాడనా? కానే కాదు. 15అందుకు దేవుడు మోషేతో ఇలా చెప్పాడు, “నేను ఎవరిపై కనికరం చూపాలనుకుంటానో వారిపై కనికరం చూపిస్తాను. ఎవరిపై జాలి చూపాలనుకుంటానో వారిపై జాలి చూపిస్తాను.” 16కాబట్టి ఒకరు ఆశించడం వలన గానీ, ఒకరు ప్రయాస పడడం వలన గానీ కాదు, దేవుడు కనికరం చూపడం వల్లనే అవుతుంది.
17దేవుని వాక్కు ఫరోతో చెప్పిందేమంటే, “నేను నీలో నా బలాన్ని ప్రదర్శించాలి, నా పేరు భూలోకమంతా ప్రచురం కావాలి. ఈ ఉద్దేశం కోసమే నిన్ను హెచ్చించాను.” 18కాబట్టి ఆయన ఎవరిని కనికరించాలి అనుకుంటాడో వారిని కనికరిస్తాడు, ఎవరిని కఠినపరచాలి అనుకుంటాడో వారిని కఠినపరుస్తాడు. 19అలాగైతే, “ఆయన సంకల్పాన్ని ఎదిరించి నిలిచేదెవరు? ఇంకా ఆయన మనలను తప్పు పట్టడమెందుకు?” అని నీవు నాతో అనవచ్చు. 20అది సరే గానీ, ఓ మనిషీ, దేవుణ్ణి ఎదురు ప్రశ్నించడానికి నీ వెవరివి? నన్నెందుకిలా చేశావు అని తయారైనది తనను తయారు చేసిన వానితో చెప్పగలదా? 21ఒకే మట్టి ముద్దలో నుండి ఒక పాత్రను ప్రత్యేకమైన వాడకం కోసం, ఇంకొకటి రోజువారీ వాడకం కోసం చేయడానికి కుమ్మరికి అధికారం లేదా?
22ఆ విధంగా దేవుడు తన కోపాన్ని చూపాలనీ తన ప్రభావాన్ని వెల్లడి పరచాలనీ కోరుకుని, నాశనానికి నిర్ణయమై, కోపానికి గురైన పాత్రలను ఎంతో సహనంతో ఓర్చుకొంటే ఏమిటి? 23తద్వారా మహిమ పొందాలని ఆయన ముందుగా సిద్ధం చేసిన ఆ కరుణ పొందిన పాత్రల పట్ల, 24అంటే యూదులపై మాత్రమే కాక, యూదేతరుల్లో నుండి ఆయన పిలిచిన మనపై, తన మహిమైశ్వర్యాన్ని చూపాలని సంకల్పిస్తే ఏమిటి?
(5) యూదుల గుడ్డితనం, యూదేతరులకు కృప గురించి ప్రవక్తలు ముందుగానే చెప్పారు
25దీని గురించి హోషేయ గ్రంథంలో ఆయన ఇలా చెబుతున్నాడు,
“నా ప్రజలు కాని వారికి నా ప్రజలనీ,
ప్రేయసి కాని దానికి ప్రేయసి అనీ, పేరు పెడతాను.
26మీరు నా ప్రజలు కారని వారితో ఎక్కడ చెప్పారో అక్కడే ‘జీవం గల దేవుని కుమారులు’ అని వారికి పేరు పెట్టడం జరుగుతుంది.”
27-28“ఇశ్రాయేలు కుమారుల సంఖ్య సముద్రపు ఇసుకలాగా విస్తారంగా ఉన్నప్పటికీ శేషమే రక్షణ పొందుతుంది. ఎందుకంటే ప్రభువు తన మాటను ఈ భూలోకంలో త్వరితంగా, సంపూర్తిగా నెరవేరుస్తాడు” అని యెషయా కూడా ఇశ్రాయేలు గురించి పెద్ద స్వరంతో చెబుతున్నాడు. 29యెషయా ముందుగానే చెప్పిన ప్రకారం,
“సైన్యాలకు అధిపతి అయిన ప్రభువు, మనకు పిల్లలను మిగిల్చి ఉండకపోతే సొదొమలా అయ్యేవాళ్ళం,
గొమొర్రాలాగా ఉండే వాళ్ళం.”
30అలా అయితే మనం ఏమనగలం? న్యాయాన్ని వెదకని యూదేతరులు నీతిని, అంటే విశ్వాసమూలమైన నీతిని పొందారు. 31అయితే ఇశ్రాయేలు నీతికారణమైన నియమాన్ని వెంటాడినా దాన్ని చేరుకోలేకపోయారు. 32ఎందుకు? ఎందుకంటే వారు దాన్ని విశ్వాసంతో కాక తమ క్రియల ద్వారా అందుకోవాలని చూశారు.
33“ఇదిగో నేను సీయోనులో ఒక అడ్డురాయిని,
తొట్రుపడేలా చేసే ఒక అడ్డుబండను ఉంచుతాను.
ఆయనలో విశ్వాసం ఉంచేవాడు సిగ్గు పడడు”
అని రాసి ఉన్న ప్రకారం వారు ఆ అడ్డురాయి తగిలి, తొట్రుపడ్డారు.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

రోమా పత్రిక 9: IRVTel

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి