పరమ 6

6
1(యెరూషలేము స్త్రీలు యువతితో మాట్లాడుతూ ఉన్నారు.)
జగదేక సుందరీ, నీ ప్రియుడు ఎక్కడికి వెళ్ళాడు? అతడేవైపుకు వెళ్ళాడు? అతన్ని వెదకడానికి మీతో పాటు మేము కూడా వస్తాము.
2(యువతి తనలో తాను మాట్లాడుకుంటూ ఉంది.)
మేపడానికీ లిల్లీలు ఏరడానికీ నా ప్రియుడు తన తోటలోకి వెళ్ళాడు.
సుగంధ వనస్పతులున్న తోటలోకి వెళ్ళాడు.
3నేను నా ప్రియుని దాన్ని, అతడు నావాడు. అతడు లిల్లీ మొక్కల్లో మేపుతాడు.
[ఐదవ భాగం] (యువతి ప్రియుడు ఆమెతో మాట్లాడుతున్నాడు)
4ప్రియా, నువ్వు తిర్సా పట్టణమంత సౌందర్య రాశివి.
నీది యెరూషలేమంత సౌందర్యం. నీ అందం చూసి నేను మైమరచి పోతున్నాను.
5నీ కళ్ళు నాపైనుండి తిప్పుకో. అవి నన్ను లొంగతీసుకుంటున్నాయి. నీ జుట్టు గిలాదు పర్వత సానువుల నుంచి దిగి వస్తున్న మేకల మందలా ఉంది.
6నీ పళ్ళు ఉన్ని కత్తిరించి, కడిగిన తరువాత పైకి వచ్చిన గొర్రెల్లాగా ఉన్నాయి. ఒక్కటీ పోకుండా జోడుజోడుగా ఉన్నాయి.
7నీ ముసుకుగుండా నీ చెక్కిళ్ళు, విచ్చిన దానిమ్మ పండులా కన్పిస్తున్నాయి.
8(ప్రియుడు తనలో తాను మాట్లాడుకుంటున్నాడు)
అరవై మంది రాణులూ ఎనభై మంది ఉపపత్నులూ లెక్క పెట్టలేనంత మంది యువతులూ ఉన్నారు.
9నా పావురం, ఏ దోషం లేనిది. ఈమె ఒక్కతే. ఈమె తన తల్లికి ఒకతే కూతురు. కన్నతల్లికి గారాబు బిడ్డ.
మా ప్రాంతం ఆడపడుచులు ఆమెను చూసి, చాలా ధన్య అన్నారు. రాణులూ ఉపపత్నులూ ఆమెను చూసి ప్రశంసించారు.
10తొలిసంధ్యలా విరాజిల్లుతూ, జాబిల్లిలా మనోజ్ఞంగా, భానుతేజ ప్రకాశంతో, వ్యూహంగా ఏర్పడిన సైన్యమంత భయద సౌందర్యం గల ఈమె ఎవరు?
11నేను బాదం చెట్ల తోటలోకి దిగి వెళ్లాను. లోయలో పెరిగే మొక్కలు చూడడానికి వెళ్లాను.
ద్రాక్షావల్లులు పూతకొచ్చాయో లేదో చూడడానికి, దానిమ్మ చెట్లు పూస్తున్నాయో లేదో చూడడానికి వెళ్లాను.
12రాకుమారుడి రథంలో ఎంతో ఆనందంగా వెళ్తున్ననట్టు ఉంది.
13(యువతి తనలో తాను మాట్లాడుకుంటూ ఉంది.)
అందాల రాశీ, వెనక్కి తిరిగి రా. వచ్చెయ్యి. తిరిగి వచ్చెయ్యి. నేను నిన్ను తనివితీరా చూడాలి.
(యువతి తన ప్రియునితో మాట్లాడుతూ ఉంది) రెండు వరసల నర్తకిల మధ్య నేను నాట్యం చేస్తున్నట్టు నావైపు అంత తదేకంగా ఎందుకు చూస్తావు?

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

పరమ 6: IRVTel

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి