1 రాజులు 14

14
యరొబాము కుమారుని మరణం
1ఆ సమయంలో యరొబాము కుమారుడు అబీయా తీవ్రంగా జబ్బు పడ్డాడు. 2యరొబాము తన భార్యతో ఇలా అన్నాడు: “నీవు షిలోహుకు వెళ్లు. అక్కడ ప్రవక్త అహీయాను దర్శించు. నేను ఇశ్రాయేలుకు రాజునవుతానని చెప్పిన వాడే ఈ అహీయా. నీవు నా భార్యవని ప్రజలకు తెలియకుండా మారువేషం వేసుకొని వెళ్లు. 3ప్రవక్త కొరకు పదిరొట్టెలను, తీపి పదార్థాలను, ఒక జాడీ తేనెను కానుకగా పట్టుకు వెళ్లు. తరువాత మన కుమారునికి ఏమి జరుగుతుందో చెప్పమని ఆయనను అడుగు. ప్రవక్తయైన అహీయా అంతా చెపుతాడు.”
4అందువల్ల రాజు భార్య షిలోహుకు వెళ్లింది. ప్రవక్త అహీయా ఇంటికి వెళ్లింది. అహీయా పండు ముసలి వాడయ్యాడు. చూపుపోయింది. 5కాని ఈ లోపు యెహోవా అహీయాతో, “యరొబాము భార్య నీ వద్దకు వస్తూవుంది. ఆమె కుమారునికి జబ్బు చేయగా, అతనికి ఏమి జరుగుతుందో తెలుసుకోవాలని వస్తూవుంది” అని తెలియజేశాడు. తరువాత అహీయా ఆమెకు ఏమి చెప్పాలో కూడ యెహోవా వివరించాడు. యరొబాము భార్య అహీయా ఇంటికి వచ్చింది.
ఆమె ఎవరో ప్రజలకు తెలియకుండా వుండాలని ఆమె ప్రయత్నిస్తూ వుంది. 6ఆమె ద్వారం వద్దకు వచ్చినట్లు అహీయా శబ్దం విన్నాడు. వెంటనే అహీయా ఇలా అన్నాడు: “యరొబాము భార్యా, లోపలికి రా, ప్రజలు నిన్ను ఎవరో అనుకోవాలని నీవు ఎందుకు ప్రయత్నిస్తున్నావు? నీకు ఒక దుర్వార్త చెప్పదలిచాను. 7నీవు ఇంటికి తిరిగి వెళ్లి ఇశ్రాయేలు దేవుడైన యెహోవా యరొబాముకు చెప్పమన్న వర్తమానం తెలియజేయి. యెహోవా ఇలా అంటున్నాడు: ‘యరొబామా, ఇశ్రాయేలీయులందరిలోను నేను నిన్ను ఎంపిక చేశాను. నా ప్రజలకు నిన్ను పాలకునిగా చేశాను. 8దావీదు వంశం ఇశ్రాయేలును ఏలుతూ వుంది. కాని వారినుండి రాజ్యాన్ని తీసుకుని, దానిని నేను నీకిచ్చాను. నా సేవకుడగు దావీదువలె నీవు ప్రవర్తించలేదు. అతడు నా ఆజ్ఞలను ఎల్లప్పుడు పాటించాడు. పూర్ణ హృదయంతో అతడు నన్ను అనుసరించాడు. నేను అంగీకరించిన వాటినే అతడు చేసేవాడు. 9కాని నీవు ఘోరమైన పాపాలను చాలా చేశావు. నీ ముందు పాలించిన వారు చేసిన పాపాలకంటె నీవు అతి భయంకరమైన పాపాలు చేశావు. నన్ను వదిలిపెట్టి పెడ మార్గాన పడ్డావు. నీవు విగ్రహాలను, చిల్లర దేవుళ్లను తయారు చేశావు. ఇది నాకు చాలా కోప కారణమయ్యింది. 10కావున నేను యరొబాము కుటుంబానికి కష్టాలు కలుగజేస్తాను. నీ కుటుంబంలో పురుషులందరినీ చంపివేస్తాను. ఎండిన పేడను అగ్ని దహించి వేయునట్లు నేను నీ కుటుంబాన్ని సర్వనాశనం చేస్తాను. 11నగరంలో చనిపోయిన నీ కుటుంబం వారిని కుక్కలు పీక్కుతింటాయి. పొలాల్లో చనిపోయే నీ కుటుంబంవారిని పక్షులు పొడుచుకు తింటాయి.’ ఇదే యెహోవా వాక్కు.”
12యరొబాము భార్యతో ప్రవక్త అహీయా ఇంకా ఇలా అన్నాడు: “ఇప్పుడు ఇంటికి వెళ్లు. నీవు నగర ద్వారం ప్రవేశించగానే నీ కుమారుడు చనిపోతాడు. 13ఇశ్రాయేలంతా వాని కొరకు విలపించి, అతనిని సమాధి చేస్తారు. యరొబాము కుటుంబంలో నీ కుమారుడు ఒక్కడే సమాధి చేయబడతాడు. ఎందువల్లననగా యరొబాము కుటుంబంలో అతడొక్కడే ప్రభువైన ఇశ్రాయేలు దేవుని సంతోషపరిచాడు. 14యెహోవా ఇశ్రాయేలుపై మరో కొత్త రాజును నియమిస్తాడు. ఆ కొత్త రాజు యరొబాము కుటుంబాన్ని నాశనం చేస్తాడు. ఇది శీఘ్రంగా జరుగుతుంది. 15అప్పుడు యెహోవా ఇశ్రాయేలును శిక్షిస్తాడు. ఇశ్రాయేలు ప్రజలు నీటిలోని ఎత్తైన గడ్డి అల్లాడినట్లు తల్లడిల్లి పోతారు. ఇశ్రాయేలు ప్రజల్ని ఈ మంచి దేశంనుండి యెహోవా లాగివేస్తాడు. ఈ రాజ్యాన్ని వారి పూర్వికులకు ఆయన ఇచ్చాడు. యూఫ్రటీసు నదికావల వీరు చెల్లాచెదరైపోయేలా చేస్తాడు. ఇది జరుగుతుంది. కారణమేమంటే యెహోవా ఆ ప్రజల పట్ల కోపంగా వున్నాడు. ప్రత్యేకమైన స్తంభాలు నిర్మించి అషేరాను ఆరాధించటం మొదలుపెట్టి ప్రజలాయనకు చాలా కోపం కలుగ జేశారు. 16యరొబాము పాపం చేశాడు. అతడు పాపం చేసి ఇశ్రాయేలు ప్రజలు కూడ పాపం చేయటానికి కారకుడయ్యాడు. కావున ఇశ్రాయేలు ప్రజలు ఓడింపబడేలా యెహోవా చేస్తాడు.”
17యరొబాము భార్య తిర్సాకు తిరిగి వెళ్లింది. ఆమె ఇంటికి వెళ్లగానే బాలుడు చనిపోయాడు. 18ఇశ్రాయేలీయులంతా అతని కొరకై విలపించి, అతనిని సమాధిచేశారు. యెహోవా ఎలా జరుగుతుందని చెప్పాడో, అదే విధంగా ఇది జరిగింది. తన సేవకుడైన ప్రవక్త అహీయా ద్వారా ఈ విషయాలన్నీ చెప్పాడు.
19రాజైన యరొబాము అనేకమైన ఇతర పనులు చేశాడు. అతడు యుద్ధాలు చేశాడు. ప్రజాపాలన కొనసాగించాడు. అతడు చేసిన పనులన్నీ ఇశ్రాయేలు రాజుల చరిత్ర గ్రంథంలో వివరించబడ్డాయి. 20యరొబాము రాజుగా ఇరువది రెండు సంవత్సరాలు పరిపాలించాడు. తరువాత అతడు చనిపోగా, వానిని అతని పూర్వీకులతో సమాధి చేశారు. అతని కుమారుడు నాదాబు అతని స్థానంలో రాజైనాడు.
యూదా రాజుగా రెహబాము
21యూదాకు రాజయ్యేనాటికి సొలొమోను కుమారుడు రెహబాము 41 సంవత్సరాలవాడు. యెరూషలేము నగరంలో రెహబాము పదిహేడు సంత్సరాలు పాలించాడు. ఈ నగరంలోనే యెహోవా తాను గౌరవింపబడాలని నిశ్చయించాడు. ఇశ్రాయేలు రాజ్యమంతటిలో ఈ నగరాన్నే ఆయన ఎన్నుకున్నాడు. రెహబాము తల్లి అమ్మోనీయురాలగు నయమా.
22యూదా ప్రజలు యెహోవా దృష్టిలో పాపకార్యాలు చేయటం కొనసాగించారు. వారంటే కోపగించుకొనేలా ప్రజలు యెహోవా పట్ల అనేక పాప కార్యాలు చేశారు. వారికి ముందు నివసించిన వారి పితరులకంటె ఘోరమైన పాపాలను వారు చేశారు. 23ఆ ప్రజలు ఉన్నత స్థలాలను,#14:23 ఉన్నత స్థలాలు బూటకపు దేవుళ్లను పూజించటానికి ప్రజలు యివన్నీ నిర్మించేవారు. స్మారకశిలను, పవిత్ర కొయ్యగుంజలను నిర్మించారు. వీటన్నిటినీవారు కొండల మీద, పచ్చని చెట్ల కింద ఏర్పాటు చేశారు. 24దేవుని ఆరాధన పేరుతో నీచమైన లైంగిక కార్యాలకు#14:24 దేవుని … కార్యాలకు ఈ రకమైన పురుష వ్యభిచారం కనానీయుల దేవతారాధనలలో భాగంగా వుండేది. అమ్ముడు పోయే పురుషులు కూడా అక్కడ వున్నారు. యూదా వారు కూడా చాలా చెడుకార్యలకు పాల్పడ్డారు. వారికి ముందు ఈ రాజ్యంలో నివసించిన జనులు కూడా అదే రకపు చెడుకార్యాలు చేశారు. అందుచే యెహోవా రాజ్యాన్ని వారి నుండి తీసుకుని ఇశ్రాయేలు ప్రజలకు అప్పగించాడు.
25రెహబాము రాజ్యానికి వచ్చిన ఐదవ సంవత్సరంలో, ఈజిప్టు రాజైన షీషకు యెరూషలేము పైకిదండెత్తి వచ్చాడు. 26షీషకు దేవాలయ ఖజానాను, రాజభవనాన్ని కొల్లగొట్టాడు. అరాము రాజైన హదదెజరు సైనికుల నుండి దావీదు తీసుకున్న బంగారు డాళ్లను కూడా అతడు ఎత్తుకొనిపోయాడు. దావీదు ఈ డాళ్లను యెరూషలేముకు తీసుకుని వచ్చాడు. షీషకు బంగారు డాళ్లన్నీ పట్టుకు పోయాడు. 27అందువల్ల రాజైన రెహబాము వీటికి మారుగా చాలా డాళ్లను చేయించాడు. అయితే ఈ డాళ్లన్నీ బంగారానికి బదులు కంచుతో చేయబడ్డాయి. రాజభవన ద్వార పాలకులకు అతనియొక్క డాళ్లను ఇచ్చాడు. 28రాజు యెహోవా దేవాలయానికి వెళ్లినప్పుడల్లా తన అంగరక్షకులు వెంట వెళ్లేవారు. వారు డాళ్లను చేతబట్టుకొని వెళ్లేవారు. వారు పని ముగించిన పిమ్మట వాటిని రక్షక భటుల గదిలో గోడకు తగిలించేవారు.
29రాజైన రెహబాము చేసిన కార్యాలన్నీ యూదా రాజుల చరిత్ర గ్రంధంలో పొందుపర్చబడ్డాయి. 30రెహబాము, యరొబాము ఇద్దరూ ఎప్పుడూ ఒకరితో ఒకరు యుద్ధం చేస్తూ వుండేవారు.
31రెహబాము చనిపోగా అతను తన పూర్వికులతో దావీదు నగరంలో సమాధి చేయబడినాడు. (అతని తల్లి అమ్మోనీయురాలగు నయమా) రెహబాము కుమారుడు అబీయాము అతని స్థానంలో రాజయ్యాడు.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

1 రాజులు 14: TERV

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి