1 రాజులు 15

15
యూదాకు అబీయాము రాజగుట
1నెబాతు కుమారుడు యరొబాము ఇశ్రాయేలును పాలిస్తూ వుండెను. అతని పాలనలో పదునెనిమిదో సంవత్సరం గడుస్తూ వుండగా, అబీయాము యూదాకు రాజు అయ్యాడు. 2అబీయాము మూడు సంవత్సరాలు పాలించాడు. అతని తల్లి పేరు మయకా. ఆమె అబీషాలోము కుమార్తె.
3పూర్వం తన తండ్రి చేసిన తప్పులన్నీ అతను కూడా చేశాడు. తన తాత దావీదు తన ప్రభువైన యెహోవాకు యథార్థుడై వున్నట్లు, అబీయాము యెహోవాకు విశ్వాసపాత్రుడై వుండలేదు. 4యెహోవా దావీదును ప్రేమించాడు. అందువల్ల అబీయాముకు యెరూషలేములో ఒక రాజ్యాన్ని ఇచ్చాడు. అతనికి ఒక కుమారుని కూడ కలుగజేశాడు. యెహోవా ఇంకా యెరూషలేమును సురక్షితంగా వుండేలా చేశాడు. ఇదంతా యెహోవా దావీదు కొరకు చేశాడు. 5యెహోవా కోరిన ప్రకారం దావీదు అన్నీ సవ్యమైన పనులు చేశాడు. యెహోవా ఆజ్ఞలను సదా పాటించాడు. హిత్తీయుడైన ఊరియా పట్ల తను చేసిన పాపం ఒక్కటి తప్ప, దావీదు యెహోవాకు సదా విధేయుడైయున్నాడు.
6రెహబాము, యరొబాము ఇద్దరూ ఒకరితో ఒకరు ఎల్లప్పుడు యుద్ధం చేస్తూనే వున్నారు.#15:6 రెహబాము … వున్నారు ఈ వచనం ప్రాచీన గ్రీకు అనువాదంలో లేదు. 7అబీయాము చేసిన ఇతరమైన పనులన్నీ యూదా రాజుల చరిత్రలో వ్రాయబడ్డాయి.
అబీయాము పరిపాలించే సమయంలో అబీయాముకు, యరొబాముకు యుద్ధం జరిగింది. 8అబీయాము చనిపోయినప్పుడు అతడు దావీదు నగరంలో సమాధి చేయబడ్డాడు. అబీయాము కుమారుని పేరు ఆసా. అబీయాము స్థానంలో ఆసా రాజయ్యాడు.
యూదా రాజుగా ఆసా
9యరొబాము పాలన మొదలై ఇరవైయవ సంవత్సరం జరుగుతూండగా, ఆసా రాజ్యానికి వచ్చాడు. 10ఆసా యెరూషలేములో నలుబది యొక్క సంవత్సరాలు పాలించాడు. అతని తల్లి పేరు మయకా. మయకా అబ్షాలోము కుమార్తె.
11ఆసా తన పూర్వికుడైన దావీదువలె యెహావా దృష్టిలో యథార్థమైన వాటిని చేసాడు. 12ఆ రోజులలో కూడా లైంగిక వాంఛలకై తమ శరీరాలను ఆరాధనా స్థలాలలో అమ్ముకుని చిల్లర దేవుళ్లను పూజించే పురుషులున్నారు. అటువంటి పురుషగాములను ఆసా దేశంనుండి వెళ్ళగొట్టాడు. మరియు ఆసా తన పూర్వికులు తయారు చేసిన విగ్రహాలన్నిటినీ తీసి వేశాడు. 13తన తల్లి మయకాను రాణి పదవి నుంచి ఆసా తొలగించాడు. కారణ మేమంటే మయకా ఒక హేయమైన అషేరా దేవతా విగ్రహాన్ని తయారు చేయించింది. ఈ భయంకర విగ్రహాన్ని ముక్కలు చేసి ఆసా వాటిని కిద్రోనులోయలో తగులబెట్టాడు. 14కాని ఆసా ఉన్నత స్థలాలను నాశనం చేయలేదు. తన జీవిత కాలమంతా ఆసా యెహోవాకు విశ్వాస పాత్రుడుగా ఉన్నాడు. 15ఆసా తండ్రి కొన్ని వస్తువులను యెహోవాకు సమర్పించాడు. ఆసా కూడ కొన్ని కానుకలను యెహోవాకు సమర్పించాడు. వారు బంగారం, వెండి, తదితర వస్తు సామగ్రిని కానుకలుగా సమర్పించారు. అవన్నీ ఆసా దేవాలయంలో వుంచాడు.
16యూదా రాజుగా ఆసా కొనసాగినంత కాలం, ఇశ్రాయేలు రాజైన బయెషాతో యుద్ధాలు కొనసాగించాడు. 17బయెషా యూదా వారితో యుద్ధం చేశాడు. ఆసా రాజ్యమైన యూదాకు ప్రజల రాకపోకలను నిలిపివేయమని బయెషా సంకల్పించాడు. అందువల్ల రామానగరాన్ని అతడు చాలా పటిష్ఠపర్చినాడు. 18దేవాలయం ఖజానా నుండి, రాజభవనం నుండి ఆసా వెండి, బంగారాలను తీశాడు. అతని సేవకులకు వాటినిచ్చి అరాము రాజైన బెన్హదదుకు పంపాడు. (బెన్హదదు తండ్రి పేరు టబ్రిమ్మోను, టబ్రిమ్మోను తండ్రిపేరు హెజ్యోను) అతడు దమస్కు నగరంలో వుంటున్నాడు. 19అతనికి ఆసా ఇలా వర్తమానం పంపాడు, “నా తండ్రికి, నీ తండ్రికి మధ్య ఒక శాంతి ఒడంబడిక జరిగింది. ఇప్పుడు నీతో నేను కూడ శాంతి ఒడంబడిక నొకదానిని చేసుకోదలిచాను. నీకు వెండి బంగారాలు కానుకలుగా పంపుతున్నాను. ఇశ్రాయేలు రాజైన బయెషాతో నీకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకోవలసిందిగా కోరుతున్నాను. అప్పుడు బయెషా నా రాజ్యం వదిలిపోతాడు.”
20రాజైన బెన్హదదు ఆసా రాజు కోరిన దానికి ఒప్పుకున్నాడు. కావున ఇశ్రాయేలు పట్టణాలమీదికి తన సైన్యాలను పంపాడు. ఈయోను, దాను, ఆబేల్బేత్మయకా, కిన్నెరెతు పట్టణాలను ఓడించాడు. కిన్నెరెతు, నఫ్తాలీలను అతడు పూర్తిగా ఓడించాడు. 21ఈ దండయాత్రలను గురించి బయెషా విన్నాడు. దానితో అతడు రామా నగరాన్ని కట్టు దిట్టం చేయటం మానివేశాడు. అతడు రామా నగరాన్ని వదిలి తిర్సాకు తిరిగి వెళ్లాడు. 22అప్పుడు రాజైన ఆసా యూదా ప్రజలందరి సహకారాన్ని కోరుతూ ఒక అభ్యర్థన చేశాడు. వారంతా బయెషా రామా నగరాన్ని పటిష్ఠం చేయటానికి వినియోగిస్తున్న రాళ్లను, కలపను తీసుకొనిపోయారు. వాటిని బెన్యామీనీయుల నగరమైన గెబకు, మరియు మిస్పాకు చేరవేశారు. రాజైన ఆసా ఆ రెండు నగరాలను పటిష్టంగా పునర్నిర్మించాడు. 23ఆసా చేసిన ఇతరమైన అన్ని పనులు, అతని బలం, అతను నిర్మించిన నగరాల విషయం యూదా రాజుల చరిత్ర గ్రంథంలో వ్రాయబడ్డాయి. ఆసా ముసలివాడైనప్పుడు, అతని పాదాలలో జబ్బు ఏర్పడింది. 24ఆసా చనిపోయినప్పుడు, అతని పూర్వికుడైన దావీదు నగరంలో సమాధి చేయబడ్డాడు. తరువాత ఆసా కుమారుడు యెహోషాపాతు అతని స్థానంలో రాజు అయ్యాడు.
ఇశ్రాయేలు రాజుగా నాదాబు
25యూదాకు రాజైన ఆసా పాలన రెండవ సంవత్సరం గడుస్తూ వుండగా యరొబాము కుమారుడు నాదాబు ఇశ్రాయేలుకు రాజయ్యాడు. నాదాబు ఇశ్రాయేలును రెండు సంవత్సరాలు పాలించాడు. 26యెహోవా దృష్టిలో అతను చాలా తప్పులు చేశాడు. తన తండ్రి యరొబాము చేసిన తప్పులన్నీ ఇతడూ చేశాడు. యరొబాము ఇశ్రాయేలు ప్రజలు కూడ పాపం చేయటానికి కారకుడయ్యాడు.
27బయెషా అహీయా కుమారుడు. వారు ఇశ్శాఖారు వంశస్థులు. రాజైన నాదాబును చంపి వేయటానికి బయెషా పధకం వేశాడు. అది నాదాబు, ఇశ్రాయేలు వారంతా కలిసి గిబ్బెతోను నగరంపై దాడి జరుపుతున్న సమయం. గిబ్బెతోను ఫిలిష్తీయుల నగరం. అక్కడ నాదాబును బయెషా హత్య చేశాడు. 28యూదాపై ఆసా పాలన మూడవ సంవత్సరం జరుగుతుండగా ఇది జరిగింది. ఇశ్రాయేలుకు తరువాత బయెషా రాజు అయ్యాడు.
ఇశ్రాయేలు రాజుగా బయెషా
29బయెషా రాజైన పిమ్మట అతడు యరొబాము కుటుంబాన్ని హతమార్చాడు. యరొబాము కుటుంబంలో ఒక్కడిని కూడా బయెషా ప్రాణంతో వదలలేదు. యెహోవా ఎలా జరుగుతుందని సెలవిచ్చాడో, అదే రీతిలో ఇదంతా జరిగింది. షిలోహులో తన సేవకుడైన అహీయా ద్వారా యెహోవా ఇది పలికాడు. 30ఇదంతా ఎందుకు జరిగినదనగా రాజైన యరొబాము చాలా పాపకార్యాలు చేశాడు. అంతే కాకుండా, ఇశ్రాయేలు ప్రజలు కూడా పాపకార్యాలు చేయటానికి యరొబాము కారకుడయ్యాడు. హేయమైన తన పనులతో యరొబాము ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు మిక్కిలి కోపం కల్గించాడు.
31నాదాబు చేసిన ఇతర కార్యాలన్నీ ఇశ్రాయేలు రాజుల చరిత్ర గ్రంథంలో వ్రాయబడ్డాయి. 32బయెషా ఇశ్రాయేలును యేలినంత కాలం యూదా రాజైన ఆసాతో యుద్ధాలు చేస్తూనేవున్నాడు.
33ఆసా యూదా రాజ్యాన్ని మూడవ సంవత్సరం పాలిస్తూండగా, అహీయా కుమారుడైన బయెషా ఇశ్రాయేలుకు రాజయ్యాడు. బయెషా ఇరువది నాలుగు సంవత్సరాలు తిర్సాలో పరిపాలించాడు. 34కాని బయెషా యెహోవాకు వ్యతిరేకంగా అనేక దుష్టకార్యాలు చేశాడు. యరొబాము చేసిన పాపాలే ఇతడు కూడ చేశాడు. ఇశ్రాయేలు ప్రజలు కూడా పాపం చేయటానికి యరొబాము కారకుడయ్యాడు.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

1 రాజులు 15: TERV

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి