1 రాజులు 18
18
ఏలీయా మరియు బయలు ప్రవక్తలు
1వర్షాలు లేకుండా పోయి మూడు సంవత్సరాలయ్యింది. అప్పుడు యెహోవా ఏలీయాతో, “నీవు వెళ్లి రాజైన అహాబును కలుసుకో. నేను త్వరలో వర్షం కురిసేలా చేస్తాను” అని చెప్పాడు. 2కావున ఏలీయా అహాబును కలిసేటందుకు వెళ్లాడు.
అప్పుడు షోమ్రోనులో క్షామం నెలకొన్నది. 3రాజైన అహాబు ఓబద్యాను పిలిపించాడు. ఓబద్యా రాజభవన నిర్వాహకుడుగా పని చేస్తున్నాడు. (ఓబద్యా యెహోవాకు నిజమైన అనుచరుడు.) 4ఒకసారి యెజెబెలు యెహోవా ప్రవక్తలందరినీ చంపటం మొదలు పెట్టింది. అప్పుడు ఓబద్యా నూరుమంది ప్రవక్తలను చేరదీసి, వారిని రెండు గుహలలో దాచాడు. ఓబద్యా ఏబది మందిని ఒక గుహలోను, మరో ఏబది మందిని ఒక గుహలోను దాచాడు. ఓబద్యా వారికి ఆహార పానీయాలు ఇచ్చి కాపాడాడు. 5రాజైన అహాబు ఓబద్యాతో ఇలా అన్నాడు: “నాతో కలిసిరా. మనిద్దరం దేశంలో వున్న నీటి వనరులన్నీ పరిశీలిద్దాము. మన గుర్రాలు, కంచర గాడిదలు బతకటానికి తగిన పచ్చగడ్డి దొరుకుతుందేమో చూద్దాం. అప్పుడు మన పశువులను చంపే అవసరము వుండదు.” 6నీటి వనరులు వెదకటానికి ఎవరేదిశకు వెళ్లాలో వారు నిర్ణయించుకున్నారు. వారిద్దరూ దేశమంతా తిరగనారంభించారు. అహాబు ఒక దిశలో వెళ్లాడు. ఓబద్యా మరోదిశలో వెళ్లాడు. 7ఓబద్యా ప్రయాణం చేస్తూండగా అతడు ఏలీయాను కలిశాడు. ఏలీయాను చూడగానే, అతనెవరో ఓబద్యా తెలుసుకున్నాడు. ఓబద్యా ఏలీయాకు సాష్టాంగ నమస్కారం చేసి, “నీవు నా యజమానివైన ఏలీయావే గదా?” అని అడిగాడు.
8“అవును నేనే. నీవు వెళ్లి నేనిక్కడ వున్నానని నీ యజమానియగు రాజుకు తెలియజేయి” అని ఏలీయా సమాధానం చెప్పాడు.
9అందుకు ఓబద్యా ఇలా అన్నాడు: “నేను అహాబుతో నీవెక్కడ వున్నదీ నాకు తెలుసునని చెప్పితే అతడు నన్ను చంపుతాడు! నీ పట్ల నేనేమీ అపచారం చేయలేదు! నేను చనిపోవాలని నీవెందుకు కోరు కుంటున్నావు? 10నీ దేవుడైన యెహోవా సాక్షిగా చెబుతున్నాను. రాజు నీ కొరకై ప్రతి చోటా చూస్తూన్నాడు! నిన్ను వెదకమని తన మనుష్యులను అన్ని దేశాలకు పంపాడు. ఏ పాలకుడైనా తన దేశంలో నీవు లేవని చెపితే అహాబు అంతటితో ఆగక నీవతని రాజ్యంలో లేవని ప్రమాణం చేయమని బలవంతపెట్టు తున్నాడు. 11ఈ పరిస్థితుల్లో నేను వెళ్లి నీవిక్కడ వున్నావని చెప్పమంటున్నావా? 12ఒకవేళ నేను పోయి రాజైన అహాబుతో నీవిక్కడ వున్నావని చెపితే, ఈ లోపు యెహోవా నిన్ను ఇక్కడ నుంచి మరో చోటికి తీసుకుని పోవచ్చు. రాజైన అహాబు వచ్చి నీవిక్కడ లేకపోవటం చూచి, నన్ను చంపేస్తాడు! నేను నా బాల్యం నుండి యెహోవాను ఆశ్రయించియున్నాను. 13నేను ఏమి చేశానో నీవు వినే వుంటావు! యెజెబెలు యెహోవా యొక్క ప్రవక్తలందరినీ చంపుతూండగా, నేను వంద మంది ప్రవక్తలను గుహలలో దాచాను. ఏభై మంది ప్రవక్తలను ఒక గుహలోను, మరో ఏభై మందిని వేరొక గుహలోను దాచాను. వారికి అన్న పానాదులిచ్చి ఆదుకున్నాను. 14ఇప్పుడు నన్ను వెళ్లి నీవిక్కడ వున్నట్లు రాజుతో చెప్పమంటున్నావు. రాజు నన్ను చంపేస్తాడు!”
15అది విన్న ఏలీయా, “సర్వశక్తిమంతుడైన యెహోవా సాక్షిగా ఈ రోజు నేను రాజు ముందు నిలుస్తానని ప్రమాణం చేస్తున్నాను” అని అన్నాడు.
16అందువల్ల ఓబద్యా రాజైన అహాబు వద్దుకు వెళ్లాడు. ఏలీయా ఎక్కడ వున్నదీ అతనికి చెప్పాడు. రాజైన అహాబు ఏలీయాను చూడటానికి వెళ్లాడు.
17ఏలీయాను అహాబు చూచి, “నీవేనా? ఇశ్రాయేలులో కల్లోలం సృష్టించే వాడివి నీవే కదా!” అని అన్నాడు.
18ఏలీయా ఇలా అన్నాడు, “నేను ఇశ్రాయేలులో కల్లోలం సృష్టించటం లేదు. కష్టాలన్నీ నీ మూలంగా, నీ తండ్రి కుటుంబం వారివల్ల వచ్చినవే. యెహోవా ఆజ్ఞలను తిరస్కరిస్తూ, బూటకపు దేవుళ్లను పూజిస్తూ, నీవే ఈ కష్టాలన్నిటికీ కారకుడవయ్యావు. 19ఇశ్రాయేలీయులందరినీ ఇప్పుడు కర్మెలు పర్వతం వద్ద నన్ను కలవమని సమాచారం పంపు. పైగా నాలుగు వందల ఏభై మంది బయలు దేవత ప్రవక్తలను, నాలుగు వందల మంది బూటకపు దేవత అషేరా ప్రవక్తలను అక్కడికి తీసుకొనిరా. రాణీ యెజెబెలు ఈ ప్రవక్తలందరినీ పోషిస్తూ#18:19 రాణీ … పోషిస్తూ ఈ ప్రవక్తలందరూ యెజెబెలు బల్లవద్ద భోజనం చేస్తారని శబ్దార్థం. వున్నది.”
20పిమ్మట అహాబు ఇశ్రాయేలు వారందరినీ, ఆ ప్రవక్తలను కర్మెలు పర్వతం వద్దకు పిలువనంపాడు. 21ఆ ప్రజలందరి వద్దకు ఏలీయా వచ్చాడు. అతడు వారినుద్దేశించి, “మీరంతా ఎవరిని అనుసరించాలనేది ఎప్పుడు నిర్ణయిస్తారు? యెహోవా నిజమైన దేవుడైతే మీరాయనను అనుసరించండి. బయలు నిజమైన దేవత అయితే మీరా దేవతను అనుసరించండి” అని అన్నాడు.
ప్రజలు ఏమీ మాట్లాడలేదు. 22అందువల్ల ఏలీయా ఇలా అన్నాడు: “ఇక్కడ నేనొక్కడినే యెహోవాయొక్క వ్రవక్తను. నేను ఒంటరిగా వున్నాను. కాని నాలుగు వందల ఏభై మంది బయలు ప్రవక్తలున్నారు. 23కావున మీరు రెండు ఆబోతులను తీసుకునిరండి. వాటిలో ఒక దానిని బయలు ప్రవక్తలను తీసుకోనివ్యండి. వారు దానిని చంపి ముక్కలు చేయనీయండి. ఆ మాంసాన్ని ఒక చితిపై వుంచండి. కాని ఆ చితికి నిప్పు పెట్టవద్దు. నేను కూడ ఆ రెండవ ఆబోతును అలాగే చేస్తాను. నేనూ ఆ చితికి నిప్పు అంటించను. 24బయలు దేవత ప్రపక్తలారా! మీరు మీ దేవునికి ప్రార్థించండి. నేను నా యెహోవాను ప్రార్థిస్తాను. ఏ దేవుడైతే ప్రార్థనలను ఆలకించి, చితిని రగిలింప చేస్తాడో అతడే నిజమైన దేవుడు.”
ప్రజలంతా ఇది మంచి ఆలోచన అని ఒప్పుకున్నారు.
25బయలు ప్రవక్తలతో మళ్లీ ఏలీయా ఇలా అన్నాడు: “మీరు చాలా మంది వున్నారు. కనుక పని మీరు ముందు మొదలు పెట్టండి. ఒక ఆబోతును ఎన్నుకుని తయారు చెయ్యండి. కాని నిప్పు మాత్రం రగల్చకండి.”
26కావున ఆ ప్రవక్తలు తమకివ్వబడిన ఆబోతును తీసుకున్నారు. దానిని తయారు చేశారు. వారు బయలు దేవతకు మధ్యాహ్నం వరకు ప్రార్థనలు చేశారు. “ఓ బయలు దేవతా! మా ప్రార్థనలు ఆలకించు!” అని వేడుకున్నారు. కాని ఎటువంటి చప్పుడూ లేదు. ఎవ్వరూ సమాధాన మియ్యలేదు. వారు నిర్మించిన బలిపీఠం చుట్టూ ప్రవక్తలు నాట్యం చేశారు. కానీ నిప్పు రాజలేదు.
27మధ్యాహ్నమైనప్పుడు ఏలీయా వారిని హేళన చేయనారంభించాడు: “బయలు నిజంగా దైవమైతే మీరు బిగ్గరగా ప్రార్థన చేయాల్సివుంటుందేమో! బహుశః అతడు ఆలోచిస్తూ ఉండవచ్చు! లేక అతడు చాలా పని ఒత్తిడిలో ఉండవచ్చు. లేక అతను ప్రయాణం చేస్తూ ఉండవచ్చు! అతడు నిద్రపోతూ ఉండవచ్చు! బహుశః మీరతనిని లేపవలసి ఉంటుంది!” అంటూ అపహాస్యం చేశాడు ఏలీయా. 28అందువల్ల ఆ ప్రవక్తలు బిగ్గరగా ప్రార్థనలు చేయనారంభించారు. వారు కత్తులతోను, ఈటెలతోను శరీరమంతా చీరుకున్నారు. (అది వారి ఆరాధనా తీరు) వారు రక్తం కారేలాగు ఒళ్లు చీరుకున్నారు. 29మధ్యాహ్న సమయం దాటి పోయింది. అయినా నిప్పు అంటుకోలేదు. సాయంత్రపు బలుల సమయం అయ్యేవరకు ఆ ప్రవక్తలు తమ భయానక చేష్టలు#18:29 భయానక చేష్టలు హెబ్రీలో ఈ మాటకు “ఒళ్లు మరచుట” అని అర్థం కూడ వుంది. సాగించారు. బయలు వద్దనుండి సమాధానం లేదు. చితికి ఏమీ జరగలేదు.#18:29 బయలు … జరగలేదు ఎవరూ వినలేదనీ, ఏమీ పట్టించు కోలేదనీ పాఠాంతరం.
30అప్పుడు ఏలీయా ప్రజలతో, “నా వద్దకు రండి” అని అన్నాడు. వారంతా ఏలీయా చుట్టూ చేరారు. బేతేలులో ఉన్న యెహోవా యొక్క బలిపీఠం నాశనం చేయబడింది. ఏలీయా దానిని మళ్లీ నిర్మించాడు. 31ఏలీయా పన్నెండు రాళ్లను తీసుకున్నాడు. ఒక్కొక్క గోత్రానికి ఒక్కోక్క రాయి చొప్పున ఇశ్రాయేలు పన్నెండు గోత్రాలకు పన్నెండు రాళ్లను తీశాడు. యాకోబు పన్నెండు మంది కుమారుల పేర్లతో ఈ గోత్రాలు పిలవబడుతూ వున్నాయి. యాకోబునే యెహోవా ఇశ్రాయేలని పిలిచాడు. 32ఏలీయా ఈ రాళ్లను యెహోవా గౌరవార్థం బలిపీఠాన్ని నిర్మించటానికి ఉపయోగించాడు. పీఠం చుట్టూ ఏలీయా చిన్న కందకం తవ్వించాడు. అది రెండు షియాల#18:32 రెండు షియాలు ఆంగ్ల కొలమానం ప్రకారం ఏడు గాలన్ల నీరు పట్టేటంత కందకం. లేక రెండు మానికల ధాన్యం పట్టేటంత కందకం. విత్తనాలు నీటితో సహా పట్టేటంత వెడల్పు, లోతుకలిగివుంది. 33అప్పుడు ఏలీయా కట్టెనంతా బలిపీఠంపై వుంచాడు. అతడు ఆబోతును ముక్కలుగా నరికి, వాటిని పేర్చిన కట్టెలపై వుంచాడు. 34తరువాత ఏలీయా ప్రజలను నాలుగు జాడీలతో నీరు తీసుకుని మాంసం మీద, కట్టెల మీద చల్లమన్నాడు. వారిని అదే విధంగా మళ్లీ చేయమన్నాడు. ఆయన వారితో మూడవ సారి కూడా అలానే చేయమన్నాడు. 35ఆ నీరు బలిపీఠం నుండి జారి చుట్టూవున్న కందకాన్ని నింపేసింది.
36సాయంకాలపు బలులు ఇచ్చే వేళ అయ్యింది. ప్రవక్తయగు ఏలీయా పీఠం వద్దకు వెళ్లి ఇలా ప్రార్థించాడు: “ఓ ప్రభువా! అబ్రాహాము, ఇస్సాకు, యాకోబుల దేవా! ఇశ్రాయేలీయుల దైవం నీవేనని నిరూపించమని నేనిప్పుడు నిన్నడుగుతున్నాను. నేను నీ సేవకుడనని నిరూపించు. ఈ పనులన్నీ చేయమని నన్ను నీవే ఆదేశించినట్లు కూడ ఈ ప్రజలకు తెలియజేయి. 37ఓ ప్రభువా, నా ప్రార్థన ఆలకించు. ప్రభూ! నీవే దేవుడవని ఈ ప్రజలకు నిరూపించు. అప్పుడు ఈ ప్రజలందరినీ మరల నీవు నీ దగ్గరకు చేర్చుకుంటున్నావని వీరు తెలుసుకుంటారు.”
38అప్పుడు యెహోవా అగ్ని పంపించాడు. బలిమాంసాన్ని, కట్టెలను, రాళ్లను, బలిపీఠం చుట్టూవున్న ప్రదేశాన్ని అగ్ని దహించి వేసింది. కందకంలో వున్న నీరు కూడ అగ్నివల్ల ఇగిరి పోయింది. 39ప్రజలంతా ఇది చూశారు. వారు భూమి మీద సాగిలపడి. “యెహోవాయే దేవుడు! యెహోవాయే దేవుడు! అని స్తుతించసాగారు.”
40అప్పుడు ఏలీయా, “బయలు దేవత ప్రవక్తలందరినీ పట్టుకొనండి. ఒక్కడినీ పారి పోనీయవద్దు!” అని అన్నాడు. ప్రవక్తలందరినీ ప్రజలు పట్టుకున్నారు. ఏలీయా వారందరినీ కీషోను వాగు దగ్గరకు తీసుకుని వెళ్లాడు. అక్కడ ఆ ప్రవక్తలందరినీ చెంపేశాడు.
తిరిగి వర్షాలు పడటం
41ఏలీయా రాజైన అహాబుతో, “నీవు ఇప్పుడు వెళ్లి అన్నపానాదులు స్వీకరించు. ఒక భారీ వర్షం పడబోతూ వుంది” అని అన్నాడు. 42రాజైన అహాబు భోజనానికి వెళ్లాడు. అదే సమయంలో ఏలీయా కర్మెలు పర్వతం మీద అతడు వంగి తన మోకాళ్లమధ్య తలను పెట్టాడు. 43అప్పుడు ఏలీయా తన సేవకునితో సముద్రం చూడమన్నాడు. సముద్రం కనపడే చోటుకు సేవకుడు వెళ్లాడు.
“నేనేమీ చూడలేడు” అని సేవకుడు తిరిగి వచ్చి చెప్పాడు. మళ్లీ వెళ్లి చూడమని ఏలీయా అన్నాడు. ఈ విధంగా ఏడుసార్లు జరిగింది. 44ఏడవసారి నౌకరు తిరిగి వచ్చి ఒక పిడికెడంత మబ్బును చూసినట్లు చెప్పాడు. అది సముద్రం మీది నుంచి వస్తున్నదని అన్నాడు.
ఏలీయా తన సేవకునితో, “రాజైన అహాబు వద్దకు వెళ్లి తన రథం సిద్ధం చేసుకొని వెంటనే ఇంటికి వెళ్లమని చెప్పు. అతనిప్పుడు వెళ్లకపోతే వర్షం అతనిని ఆపేస్తుంది” అని అన్నాడు.
45ఆ తరువాత కొద్ది సేవటికే ఆకాశంలో కారుమేఘాలు కమ్ముకొచ్చాయి. భయంకరంగా గాలి, వాన ప్రారంభమైనాయి. అహాబు తన రథమెక్కి యెజ్రెయేలుకు తిరుగు ప్రయాణం సాగించాడు. 46యెహోవా శక్తి ఏలీయా మీదికి వచ్చింది. ఏలీయా తన బట్టలను నడుముకు బిగించి కట్టి రాజైన అహాబుకంటె ముందుగా యెజ్రెయేలుకు పరుగెత్తికొని వెళ్లాడు.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
1 రాజులు 18: TERV
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Telugu Holy Bible: Easy-to-Read Version
All rights reserved.
© 1997 Bible League International