1 రాజులు 7
7
సొలొమోను రాజగృహం
1రాజైన సొలొమోను తనకై ఒక రాజభవనం కట్టించాడు. సొలొమోను రాజభవన నిర్మాణానికి పదమూడు సంవత్సరాలు పట్టింది. 2అతడింకా “లెబానోను అరణ్యపు విశ్రాంతి గృహాన్ని” కూడ ఒకటి కట్టించాడు. అది నూట ఏభై అడుగుల#7:2 నూట ఏబై అడుగులు వంద మూరలు. పొడవు, డెబ్బది ఐదు అడుగుల#7:2 డెబ్బది ఐదు అడుగులు ఏబై మూరలు. వెడల్పు, మరియు నలభై ఐదు అడుగుల#7:2 నలబై ఐదు అడుగులు ముప్పై మూరలు. ఎత్తు కలిగివుంది. దానికి నాలుగు వరుసల దేవదారు స్తంభాలు వున్నాయి. వాటి పైన నగిషీ పని చేసిన దేవదారు స్తంభ శీర్షాలు నిలుపబడ్డాయి. 3స్తంభముల మీద పైకప్పుగా దేవదారు పలకలు పర్చబడ్డాయి. కప్పు భాగానికి నలభై ఐదు దూలాలను పరిచారు. నాలుగు స్తంభాల వరుసల మధ్యనున్న మూడు భాగాలకు ఒక్కొక్క దానికి పదిహేను కొయ్య కడ్డీలు చొప్పున అమర్చబడ్డాయి. 4ఈ వరుసల మధ్య కిటికీలున్నాయి. అవి ఒకదానికొకటి ఎదురెదురుగా నిర్మింపబడ్డాయి. 5తలుపులన్నీ చదరంగా వున్నాయి. ప్రతి వరుస చివరనున్న తలుపులు ఒకదానికొకటి ఎదురెదురుగా వున్నాయి.
6సొలొమోను “స్తంభాలతో ఒక మండపం” నిర్మించాడు. దాని పొడవు డెభ్బై అడుగులు; వెడల్పు నలభై అడుగులు, స్తంభాల నాధారంగా చేసుకొని మండపానికి ముందు ఒక వసారా వుంది.
7సొలొమోను తమ న్యాయ విచారణ జరుపుటకు సింహాసనమున్న ఒక గదిని కట్టించాడు. దానికి “న్యాయసభాస్థలి” అని పేరు పెట్టాడు. ఆ గదంతా కింది నేలనుండి పైకప్పు దూలాల వరకు దేవదారు చెక్కలతో కప్పబడింది.
8సొలొమోను నివసించే ఇల్లు ఈ న్యాయ సభాస్థలానికి బాగా వెనుక భాగంలో వుంది. అదే రకమైన మరియొక ఇంటిని తన భార్యకై నిర్మింపజేశాడు. తన భార్య ఈజిప్టు రాజు కుమారై.
9ఈ భవనాలన్నీ చాలా ఖరీదైన రాళ్లతో కట్టబడ్డాయి. ఈ రాళ్లన్నీ కావలసిన పరిమాణంలో చెక్కబడి, ప్రత్యేక రంపాలతో కోయబడ్డాయి. ఈ రాళ్లు ముందు వెనుక కోయబడ్డాయి. ఈ ఖరీదైన రాళ్లు పునాదుల నుండి పైవరుస వరకు వేయబడ్డాయి. ఆవరణ గోడలకు, ఆవరణలోను రాళ్లు వాడబడ్డాయి. 10పునాదులకు ఖరీదైన పెద్ద బండలు వేయబడ్డాయి. కొన్ని బండలు పదిహేను అడుగుల పొడవు గలవి; మరికొన్ని పన్నెండు అడుగుల పొడవుగలవై వున్నాయి. 11ఈ బండల మీద ఇతర ఖరీదైన రాళ్లు, దేవదారు కట్టెలు వేశారు. 12భవనపు ఆవరణ, దేవాలయపు ఆవరణ, దేవాలయ సింహద్వారపు గోడలు మూడు వరుసల చెక్కిన రాళ్లతో నిర్మింపబడి వాటి మీద దేవదారు దూలాలు వేయబడ్డాయి.
13రాజైన సొలొమోను తూరు పట్టణం నుండి హీరాము అను వానిని తన వద్దకు పిలిపించాడు. 14హీరాము తల్లి నఫ్తాలి వంశానికి చెందిన స్త్రీ. మరణించిన తన తండ్రి తూరు పట్టణపువాడు. హీరాము కంచు పనిలో బహు నేర్పరి. మంచి అనుభవజ్ఞుడు. రాజైన సొలొమోను అతనిని పిలవగా హీరాము అంగీకరించి వచ్చాడు. రాజైన సొలొమోను కంచు పనులన్నిటికీ అతనిని అధిపతిగా చేశాడు. కంచుతో చేసే పనులన్నీ హీరాము నిర్వహించాడు.
15హీరాము రెండు కంచు స్తంభాలు పోత పోశాడు. ఒక్కొక్కటి ఇరువై ఏడు అడుగుల పొడవు, పద్దెనిమిది అడుగుల చుట్టు కొలత (ఉరవు) కలిగి వున్నాయి. అయితే ఈ స్తంభాల లోపలి భాగం బోలుగా వుంది. స్తంభపు అంచు మందం నాలుగు అంగుళాలు.#7:15 నాలగు అంగుళాలు బెత్తెడు అని పాఠాంతరం. 16అతడు రెండు స్తంభ శీర్షాలు#7:16 స్తంభ శీర్షాలు పీటలు అని పాఠాంతరం. కూడా తయారు చేశాడు. అవి ఒక్కొక్కటి ఏడున్నర అడుగుల పొడవున వున్నాయి. ఈ స్తంభశీర్షాలను హీరాము తాను పోతపోసిన స్తంభాలపై నిలిపాడు. 17పిమ్మట గొలుసులతో వలలవంటి అల్లిక తయారు చేసి స్తంభాల మీద నున్న శీర్షాలను కప్పేలా పైనవేశాడు. 18దానిమ్మకాయల ఆకారంలో వేలాడే బంతులు గల రెండు కంచు గొలుసులను అతడు తయారు చేశాడు. ఈ కంచు దానిమ్మ కాయల వరుసలను స్తంభశీర్షాల మీదనున్న లోహపు వలలమీద చుట్టాడు. 19ఈ స్తంభశీర్షాలు ఏడున్నర అడుగుల పొడవున వికసించిన పద్మాకారంలో మలచబడ్డాయి. 20ఈ స్తంభశీర్షాలు కంచు స్తంభాలమీద పెట్టబడ్డాయి. పాత్ర ఆకారంలో ఉన్న వలలపైన అవి పెట్టబడ్డాయి. ఆ ప్రదేశంలో స్తంభశీర్షం చుట్టూ ఇరవై దానిమ్మ కాయలు గల గొలుసు చుట్టబడింది. 21ఈ రెండు కంచు స్తంభాలను హీరాము దేవాలయపు మండపం వద్ద నిలబెట్టాడు. ఒక స్తంభం దక్షిణ వైపున, మరొక స్తంభం ఉత్తరవైపున నిలుపబడ్డాయి. దక్షిణ స్తంభానికి యాకీను అని, ఉత్తర స్తంభానికి బోయజు అని పేర్లు పెట్టారు. 22పుష్పాకారంలో వున్న పీటలు కంచుస్తంభాలపై ఉంచబడ్డాయి. ఆ విధంగా స్తంభ నిర్మాణం పని పూర్తయింది.
23పిమ్మట హీరాము కంచుతో ఒక గుండ్రని కోనేరు తయారు చేశాడు. (దానిని వారు “సముద్రం” అని పిలిచారు) ఆ సముద్రం సుమారు నలభై ఐదు అడుగుల#7:23 నలబై ఐదు అడుగులు ముప్పది మూరలు. చుట్టు కొలత కలిగివుంది. ఒక అంచునుండి మరొక అంచు వరకు సముద్రం అడ్డుగా పదిహేను అడుగులు వుంది. దాని లోతు ఏడున్నర అడుగులు. 24దాని చుట్టు బయటి అంచున ఒక కమ్మి ఉన్నది. ఈ కమ్మి కింద రెండు వరుసల కంచు సొరతీగె పొందుపర్చబడింది. అనగా ఈ కంచు సొరతీగ ఒక్క ముక్కగానే చెరువుతో పాటు ఒకే సారి మలచబడింది. 25ఈ కోనేటిని పన్నెండు కంచు గిత్తల వీపులపై నిలిపారు. ఈ పన్నెండు గిత్తలు చెరువునుండి బయటికి చూస్తున్నాయి. మూడు ఉత్తరానికి, మూడు తూర్పుకు, మూడు దక్షిణానికి, మరి మూడు పడమరకు చూస్తున్నాయి. 26కంచు చెరువు అంచుమందం నాలుగు అంగుళాలు. చెరువు అంచు గిన్నె అంచులా, విచ్చిన పూరేకులా వున్నది. ఆ చెరువులో సుమారు తొమ్మిది గరిసెల#7:26 తొమ్మిది గరిసెలు పదకొండు వేల గాలనులు లేక రెండు వేల మందికి సరిపోయే స్నానోదకం అని పాఠాంతరం. నీరు పడుతుంది.
27హీరాము తరువాత పది కంచు తోపుడు బండ్ల వంటివి తయారుచేశాడు. ఒక్కొక్క దాని పొడవు ఆరు అడుగులు (నాలుగు మూరలు), వెడల్పు ఆరు అడుగులు, మరియు ఎత్తు నాలుగున్నర అడుగులు (మూడు మూరలు), 28వీటి పక్కలు నాలుగు మూలలుగా వున్న కంచు పలకలతో మూయబడ్డాయి. ఆ నాలుగు మూలలుగా వున్న పలకలు చట్రాలతో బిగించబడ్డాయి. 29ఆ పలకల మీద సింహాలు, గిత్త దూడలు, కెరూబులు చిత్రీకరించబడ్డాయి. ఆ సింహాల, గిత్తల బొమ్మలపై వరుస, కింది వరుసలలో పువ్వుల అలంకరణ కంచులోకి దట్టించి ముద్రించబడింది. 30ప్రతి బండికి నాలుగు కంచు చక్రాలున్నాయి. చక్రాలకు ఇరుసులున్నాయి. మూలల మీద పెద్ద గిన్నెలు నిలపటానికి కంచు ముక్కల ఆధారం వుంది. ఆ కంచు ఆధారాల మీద పూలు చెక్కబడ్డాయి. 31ఆ గిన్నెలకు పైన అంచు చుట్టూ చట్రముంది. గిన్నెకు పదునెనిమిది అంగుళాల ఎత్తున అదివుంది. గిన్నె మూతి గుండ్రంగా వున్నది. గిన్నెలోతు ఇరువది ఏడు అంగుళాలు. చట్రం మీద కూడ అలంకరణ చెక్కబడి వున్నది. ఈ చట్రం గుండ్రంగా గాక నాలుగు పలకలుగా వుంది. 32అడుగు చట్రం కింద నాలుగు చక్రాలున్నాయి. చక్రాలు ఇరవై ఏడు అంగుళాల ఎత్తు వున్నాయి. చక్రాల ఇరుసులు బండితో ఒకే రీతిగా చేయబడ్డాయి. 33వీటి చక్రాలు రథ చక్రాలను పోలి వున్నాయి. చక్రాలలో ప్రతిదీ వాటి మధ్య కడ్డీలు, అంచులు, చువ్వలు, చక్రపు నడిమి భాగం కంచుతో చేయబడింది.
34ప్రతి బండికీ నాలుగు మూలలా నాలుగు ఆధారాలున్నాయి. అవన్నీ బండితో పాటు ఒకే రీతిగా చేయబడినవే. 35ప్రతి బండి చుట్టూ పైభాగాన ఒక బొద్దు వంటి చట్రముంది. అది బండితో కలిసి ఏకంగా చేయబడింది. 36బండి పక్కన గల కంచు పలకలపై కెరూబుల, సింహాల, తమాల వృక్షాల చిత్రాలు మలచబడ్డాయి. ఎక్కడెక్కడ అవకాశం వున్నదో అక్కడ చిత్రాలు, అలంకరణలు చెక్కబడ్డాయి. చుట్టూ అనేక పుష్పాలు చెక్కబడ్డాయి. 37ఆ రకంగా హీరాము పది బండ్లను తయారు చేశాడు. ప్రతీదీ కరిగించిన కంచును మూసలో పోత పోశాడు. కావున అన్ని బండ్లు ఒకే పరిమాణంలో, ఒకే ఆకారంలో ఉన్నాయి.
38హీరాము పిమ్మట పది పెద్ద తొట్లను తయారు చేశాడు. ముందు నిర్మించిన పది బండ్ల మీదికి పది తొట్లను నిర్మించాడు. ప్రతి తొట్టి ఈ అంచు నుండి ఆ అంచు వరకు అడ్డంగా ఆరడుగులు వుంది. ప్రతి తొట్టిలోను ఏడువందల ఇరువది తూముల#7:38 ఏడువందల ఇరువది తూములు రెండు వందల ముప్పై గాలన్లు అని; నలబై మందికి సరిపోయే స్నానోదకం అని పాఠాంతరం. నీరు పట్టేది. 39హీరాము ఐదు బండ్లను దేవాలయానికి దక్షిణాన, మిగిలిన ఐదింటిని ఉత్తర భాగాన ఉంచాడు. పెద్ద కోనేటిని దేవాలయానికి ఆగ్నేయ భాగాన నెలకొల్పాడు. 40హీరాము ఇంకా కొన్ని కుండలను, చిన్నపాటి గరిటెలను, గిన్నెలను తయారు చేశాడు. రాజైన సొలొమోను హీరామును చేయుమని చెప్పిన వన్నీ అతడు పూర్తిచేశాడు. యెహోవా దేవాలయానికై హీరాము చేసిన వస్తువులు ఇవి:
41రెండు స్తంభాలు;
ఆ రెండు స్తంభాల మీద నున్న స్తంభశీర్షాలకు ఏర్పాటు చేసిన గిన్నెలాంటి పాత్రలు;
స్తంభాల మీది రెండు శీర్షాల కొరకు ఉంచబడిన రెండు గిన్నెలను కప్పటానికి రెండు అల్లికలు;
42ఆ అల్లికలకు నాలుగు వందల దానిమ్మకాయల బొమ్మలు; రెండు స్తంభాల మీది శీర్షాలకు అమర్చిన గిన్నెలపై గల అల్లికల మీద దానిమ్మకాయల గొలుసును రెండు వరుసల చొప్పున చుట్టారు.
43పది బండ్లు; వాటిపైన తొట్టెలు;
44పన్నెండు గిత్తలపై నిల్పిన ఒక పెద్ద కోనేరు;
45కుండలు, చిన్న పాటి గరిటెలు, గిన్నెలు, యెహోవా దేవాలయానికి కావలసిన తదితర పాత్రలు; మరియు రాజు ఇంటికి నలభై ఎనిమిది స్తంభాలు; రాజైన సొలొమోను కోరినవన్నీ హీరాము తయారు చేసి పెట్టాడు. అవన్నీ మెరుగు దిద్దిన కంచుతో చేయబడ్డాయి.
46సొలొమోను ఈ వస్తు సామగ్రిని చేయటానికి పట్టిన కంచును తూకం వేయలేదు. అది తూచటానికి అలివికానంత ఉంది. అందువల్ల వారు ఎంత కంచు వాడినది తెలియదు. 47ఈ కంచు సామగ్రి అంతా రాజు ఆజ్ఞ ప్రకారం యొర్దాను నది దగ్గర సుక్కోతుకు, సారెతానుకు మధ్య చేయబడ్డాయి. ఈ వస్తు సామగ్రినంతా కంచు కరగించి బంక మట్టితో చేసిన మూసలలో పోసి వారు తయారుచేశారు.
48దేవాలయం కొరకు అనేక వస్తువులు బంగారంతో చేయటానికి కూడ సొలొమోను ఆజ్ఞ ఇచ్చాడు. బంగారంతో దేవాలయానికి సొలొమోను చేయించిన వస్తువులు ఈ విధంగా వున్నాయి:
బంగారు బలిపీఠం;
బంగారపు బల్ల (దేవునికి అర్పించు సముఖపు రొట్టెలు ఉంచడానికి).
49పది దీప స్తంభాలు: (అతి పరిశుద్ధ స్థలము ముందు కుడిపక్కన ఐదు, ఎడమపక్కన ఐదు ఇవి ఉంచబడ్డాయి)
బంగారు పుష్పాలు, ప్రమిదెలు, పటకారులు;
50గిన్నెలు; దీపాలను కాంతి కొరకై ఎగదోసే పనిముట్లు;
పాత్రలు; పెనాలు; ధూపం వేయటానికి బొగ్గులు వేసే బంగారు ధూపకలశం; దేవాలయం సింహద్వారపు తలుపులు.
51ఆ రకంగా రాజైన సొలొమోను కోరుకున్న ప్రకారం యెహోవా దేవాలయంయొక్క పని పూర్తి అయింది. అప్పడు రాజైన సొలొమోను తన తండ్రి దావీదు దేవునికి అంకితం చేసిన వస్తువులన్నీ దేవాలయానికి తెచ్చాడు. దేవాలయపు ధనాగారంలో ఆ వెండి బంగారాలు భద్రపరిచాడు.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
1 రాజులు 7: TERV
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Telugu Holy Bible: Easy-to-Read Version
All rights reserved.
© 1997 Bible League International