1 సమూయేలు 16
16
సమూయేలు బేత్లెహేముకు వెళ్లుట
1యెహోవా, “ఎంతకాలం ఇలా సౌలుకోసం చింతిస్తావు? ఇశ్రాయేలు రాజుగా సౌలును నేను నిరాకరించాను. నీ కొమ్ములనునూనెతో నింపుకొని వెళ్లు. యెష్షయి అనే మనిషి దగ్గరకు నేను నిన్ను పంపిస్తున్నాను. యెష్షయి బేత్లెహేములో నివసిస్తున్నాడు. అతని కుమారులలో ఒకనిని నేను రాజుగా ఎంపిక చేసాను” అని సమూయేలుతో చెప్పాడు.
2కానీ, “నేను వెళితే ఈ వార్త సౌలు విని నన్ను చంపటానికి ప్రయత్నం చేస్తాడు” అని సమూయేలు అన్నాడు.
“నీవు ఒక కోడెదూడను తీసుకుని బెత్లెహేముకు వెళ్లు. ‘యెహోవాకు నేను ఒక బలి అర్పించటానికి వచ్చాను’ అని చెప్పు. 3బలి కార్యక్రమానికి యెష్షయిని రమ్మని ఆహ్వానించు. అప్పుడు ఏమి చేయాలో నేను నీకు తెలియచేస్తాను. నేను నీకు చూపిన మనిషిని నీవు తప్పక అభిషేకించాలి” అని యెహోవా చెప్పాడు.
4యెహోవా చెప్పినట్లు సమూయేలు చేసాడు. సమూయేలు బెత్లెహేముకు వెళ్లాడు. బెత్లెహేము పెద్దలు భయంతో వణకిపోయారు. వారు సమూయేలును కలుసుకొని, “నీవు సమాధానంగానే వచ్చావా?” అని అడిగారు.
5“అవును నేను సమాధానంగానే వచ్చాను. యెహోవాకు ఒక బలి అర్పించటానికి నేను వచ్చాను. మీరంతా తయారై బలి కార్యక్రమానికి నాతోకూడ రావటానికి సిద్ధపడండి” అని సమూయేలు జవాబు చెప్పాడు. సమూయేలు యెష్షయిని, అతని కుమారులను సిద్ధంచేశాడు. బలి అర్పణలో పాలుపుచ్చుకోమని సమూయేలు వారిని ఆహ్వానించాడు.
6యెష్షయి, అతని కుమారులు వచ్చినపుడు సమూయేలు ఏలీయాబును చూసాడు. “నిజంగా యెహోవా ఎంపిక చేసిన మనిషి ఇతడే” అని సమూయేలు తలంచాడు.
7అయితే యెహోవా, “ఏలీయాబు ఎంతో అందంగా ఎత్తుగా ఉన్నాడు. కానీ ఆ విషయాలు లక్ష్యపెట్టకు. మనుష్యులు చూసే విషయాలను కాదు దేవుడు చూసేదు. ప్రజలు బాహ్య సౌందర్యం చూస్తారు కానీ యెహోవా హృదయం చూస్తాడు. ఏలీయాబు తగిన వాడు కాడు” అని తెలియజేసాడు.
8అప్పుడు యెష్షయి తన కుమారుడైన అబీనాదాబును పిలిచాడు. అబీనాదాబు సమూయేలు ఎదుటనడిచాడు. కానీ సమూయేలు, “లేదు యెహోవా ఎంపిక చేసినవాడు ఇతడు కాదు” అన్నాడు.
9తరువాత షమ్మాను సమూయేలు ఎదుట నడువుమని యెష్షయి చెప్పాడు. కానీ సమూయేలు, “లేదు, ఇతనినికూడ యెహోవా ఎంపిక చేయలేదు” అన్నాడు.
10తన కుమారులు ఏడుగురిని యెష్షయి సమూయేలుకు చూపించాడు. కానీ, “వీరిలో ఎవ్వరినీ యెహోవా ఎంపిక చేయలేదని” సమూయేలు యెష్షయితో చెప్పాడు.
11అప్పుడు, “నీ కుమారులంతా వీరేనా?” అని సమూయేలు యెష్షయిని అడిగాడు.
“అందరికంటె చిన్నవాడు ఇంకొకడు ఉన్నాడు. కానీ వాడు గొర్రెలను మేపుతున్నాడు” అని యెష్షయి జవాబిచ్చాడు.
సమూయేలు, “అతనికి కబురు చేయి. అతన్ని ఇక్కడకు తీసుకునిరా. అతడొచ్చేవరకూ మనం భోజనానికి కూర్చోము” అని చెప్పాడు.
12యెష్షయి తన చిన్న కుమారుని తీసుకుని వచ్చేందుకు ఒకరిని పంపించాడు. ఈ కుమారుడు ఎర్రని తల వెంట్రుకలతో చక్కగా కనబడేవాడు. అతడు ఎర్రటివాడు మరియు చాలా అందగాడు.
“లేచి అతనిని అభిషేకించు. అతడే సుమా!” అని యెహోవా సమూయేలుతో చెప్పాడు.
13ప్రత్యేక నూనెతో ఉన్న కొమ్మును సమూయేలు తీసుకుని యెష్షయి చిన్న కుమారుని సోదరులందరి ఎదుటనే అతని మీద పోసాడు. ఆ రోజునుండి యెహోవా ఆత్మ దావీదు మీదికి మహా శక్తివంతంగా వచ్చింది. తరువాత సమూయేలు రామాకు వెళ్లి పోయాడు.
ఒక దుష్ట శక్తి సౌలును పీడించుట
14యెహోవా ఆత్మ సౌలును విడిచి పెట్టేసాడు. యెహోవా సౌలు మీదికి ఒక దుష్టాత్మను పంపించాడు. అది అతనికి చాలా ఇబ్బంది కలిగించింది. 15సౌలు సేవకులు అతనితో ఇలా అన్నారు: “దేవుని వద్దనుండి వచ్చిన ఒక దుష్ట ఆత్మ వచ్చి నిన్ను బాధ పెడుతోంది. 16మాకు ఆజ్ఞ ఇవ్వుము. సితారాను వాయించగలవాని కోసం వెదుకుతాము. యెహోవా దగ్గరనుండి ఆ దుష్ట శక్తి నీ మీదికి వస్తే ఇతడు సితారా వాయిస్తాడు. అప్పుడు ఆ దుష్ట ఆత్మ నిన్ను విడిచిపెట్టేస్తుంది. నీకు ఊరట కలుగుతుంది.”
17“ఒక మంచి సితార వాయించువానిని చూసి నా దగ్గరకు తీసుకుని రండి” అని సౌలు తన సేవకులతో చెప్పాడు.
18అప్పుడు నౌకర్లలో ఒకడు, “బేత్లెహేములో యెష్షయి అని ఒక మనిషి ఉన్నాడు. యెష్షయి కొడుకును నేను చూసాను. సితార వాయించటం అతనికివచ్చు. అతడు ధైర్యవంతుడు. బాగా పోరాడగలవాడు. కూడా. అతడు చాతుర్యంగలవాడు. అతడు అందగాడు యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు” అని చెప్పాడు.
19కనుక సౌలు కొందరు మనుష్యులను యెష్షయి దగ్గరకు పంపించాడు. “నీకు దావీదు అనే కొడుకు ఉన్నాడు. అతడు గొర్రెలను కాస్తున్నాడు. అతనిని నా దగ్గరకు పంపించు” అని సౌలు చెప్పినదానిని వారు యెష్షయికి చెప్పారు.
20కనుక యెష్షయి సౌలుకు కానుకలుగా కొన్ని వస్తువులు సిద్ధం చేసాడు. ఒక గాడిదను, కొంత రొట్టె, ఒక ద్రాక్షారసపు తిత్తి, ఒక మెక పిల్లను యెష్షయి సిద్ధం చేసాడు. యెష్షయి వాటిని దావీదుకు ఇచ్చి అతనిని సౌలు వద్దకు పంపించాడు. 21కనుక దావీదు సౌలు దగ్గరకు వెళ్లి అతని ఎదుట నిలిచాడు. సౌలు దావీదును చాలా ప్రేమించాడు. దావీదు సౌలుకు ఆయుధాలు మోసే సహాయకుడయ్యాడు. 22“దావీదును నాతో ఉండనియ్యి. నా సేవ చేయనియ్యి. అతడంటే నాకు చాలా ఇష్టం” అని యెష్షయికి ఒక సందేశం పంపాడు సౌలు.
23దేవుడు పంపిన దురాత్మ సౌలు మీదికి వచ్చినపుడు దావీదు తన సితార తీసుకుని వాయించేవాడు. ఆ దుష్ట ఆత్మ సౌలును వదిలిపోయేది, అతనికి హాయిగా ఉండేది.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
1 సమూయేలు 16: TERV
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Telugu Holy Bible: Easy-to-Read Version
All rights reserved.
© 1997 Bible League International