1 సమూయేలు 2:1-10

1 సమూయేలు 2:1-10 TERV

హన్నా దేవుని ఇలా కీర్తించెను: “నా హృదయం దేవునిలో పరవశించి పోతూవుంది. నా దేవుని ద్వారా నాకు బలము కలిగెను. నా శత్రువులను నేను పరిహసించగలను. నా విజయానికి మురిసిపోతున్నాను. యెహోవా వంటి మరో పరిశుద్ధ దేవుడు లేడు. నీవు తప్ప మరో దేవుడు లేడు! మన దేవుని వంటి బండ మరొకడు లేడు. ఇక డంబాలు పలుకవద్దు! గర్వపు మాటలు కట్టి పెట్టండి! ఎందువల్లనంటే యెహోవా దేవునికి అంతా తెలుసు దేవుడు మనుష్యులను నడిపిస్తాడు, వారికి తీర్పు తీరుస్తాడు. మహా బలశాలుల విల్లులు విరిగిపోతాయి! బలహీనులు బలవంతులవుతారు! ఇది వరకు సమృద్ధిగా భోజనం ఉన్నావారు భోజనం కోసం పని చేయాలి ఇప్పుడు కాని ఇదివరకు ఆకలితో కుమిలేవారికి ఇప్పుడు సమృద్ధిగా భోజనం! గొడ్రాలుకు ఏడుగురు పిల్లలు! సంతానవతికి పుత్రనాశనంతో దుఃఖపాటు. యెహోవా జనన మరణ కారకుడు! దేవుడు నరులను చావుగోతికి తోసివేయ గలడు. ఆయన వారిని మరల బ్రతికించగలడు. యెహోవా కొందరిని పేద వారిగా చేస్తాడు, మరికొందరిని ధనవంతులుగా చేస్తాడు. పతనానికీ, ఉన్నతికీ కారకుడు యెహోవాయే. మట్టిలో ఉండే వారిని యెహోవా ఉన్నతికి తీసుకొని వస్తాడు ఆయన వారి దుఃఖాన్ని నిర్ములిస్తాడు. యెహోవా పేదవారిని ప్రముఖులుగా చేస్తాడు. యువ రాజుల సరసన కూర్చుండబెడ్తాడు. యెహోవా వారిని ఘనులతో బాటు ఉన్నతాసీనులను చేస్తాడు. పునాదుల వరకూ ఈ సర్వజగత్తూ యెహోవాదే! యెహోవా ఈ జగత్తును ఆ పునాదులపై నిలిపాడు. యెహోవా తన పరిశుద్ధ ప్రజలను కాపాడుతాడు. వారు పడిపోకుండా ఆయన వారిని కాపాడుతాడు. కాని దుష్టులు నాశనం చేయబడతారు. వారు అంధకారంలో పడిపోతారు. వారి శక్తి, వారు జయించేందుకు తోడ్పడదు. యెహోవా తన శత్రువులను నాశనం చేస్తాడు. సర్వోన్నతుడైన దేవుడు ప్రజల గుండెలదిరేలా పరలోకంలో గర్జిస్తాడు. సర్వలోకానికీ యెహోవా తీర్పు ఇస్తాడు! యెహోవా తన రాజుకు శక్తి ఇస్తాడు. ఆయన నియమించిన రాజును బలవంతునిగా చేస్తాడు.”