2 దినవృత్తాంతములు 15
15
ఆసా చేసిన మార్పులు
1దేవుని ఆత్మ అజర్యా మీదికి వచ్చింది. అజర్యా ఓబేదు కుమారుడు. 2ఆసాను కలుసుకోవటానికి అజర్యా వెళ్లాడు. అజర్యా యిలా అన్నాడు: “ఆసా, యూదా ప్రజలారా, బెన్యామీను ప్రజలారా నేను చేప్పేది వినండి! మీరు యెహోవాను నమ్మకొని ఉన్నన్ని రోజులూ, యెహోవా మీతో వుంటాడు. మీరు యెహోవాను వెదికితే, మీరాయనను కనుగొంటారు. కాని మీరు ఆయనను వదిలివేస్తే, ఆయన మిమ్మల్ని వదిలివేస్తాడు. 3చాలాకాలం ఇశ్రాయేలుకు ఒక నిజమైన దేవుడు లేకుండా వుండిపోయింది. వారు బోధించే యాజకుడుగాని, ధర్మశాస్త్రంగాని లేకుండా వుండి పోయారు. 4కాని ఇశ్రాయేలు ప్రజలకు కష్టంవచ్చినప్పుడు వారు మళ్లీ దేవుడైన యెహోవాను ఆశ్రయించారు. ఆయన ఇశ్రాయేలు దేవుడు. వారాయనను వెదకగా, యెహోవా వారికి కన్పించాడు. 5ఆ కష్టకాలంలో ఏ ఒక్కడూ క్షేమంగా ప్రయామాణం చేయగలిగేవాడు కాదు. రాజ్యాలన్నిటిలో అల్లకల్లోల పరిస్థితులు ఏర్పాడ్డాయి. 6ఒక రాజ్యం మరో రాజ్యాన్ని, ఒక నగరం మరో నగరాన్ని నాశనం చేసికోసాగాయి. దేవుడు వాటిని సర్వవిధాలుగా కల్లోల పెట్టిన కారణంగా ఆ పరిణామాలు వచ్చాయి. 7కావున ఆసా, నీవు మరియు యూదా, బెన్యామీను ప్రజలు బలవంతులై యుండండి. బలహీనులు కావద్దు. అధైర్యపడవద్దు. ఎందుకంటే, మీ మంచి పనులకు తగిన ఫలితం దొరుకుతుంది!”
8ప్రవక్త ఓబేదు మాటలు, వర్తమానం విన్న ఆసాకు చాలా ధైర్యం వచ్చింది. తరువాత అతడు యూదా, బెన్యామీను ప్రాంతాలన్నిటిలో వున్న అసహ్యకరమైన విగ్రహాలను తొలగించాడు. తానువశపర్చుకున్న ఎఫ్రాయిము కొండల ప్రాంతంలోని పట్టణాలలో వున్న హేయమైన విగ్రహాలను కూడా ఆసా తొలగించాడు. ఆలయ ముఖమండపంలో వున్న దేవుని బలిపీఠాన్ని కూడా అతడు బాగు చేయించాడు.
9పిమ్మట యూదా, బెన్యామీను ప్రజలందరినీ ఆసా సమావేశపర్చాడు. అంతేగాక ఎఫ్రాయిము, మనష్షే, మరియు షిమ్యోను కుటుంబాల వారిని కూడా పిలిచాడు. వీరు ఇశ్రాయేలునుండి వలసపోయి యూదాలో స్థిరపడినవారు. వారిలో చాలామంది యూదాకు వచ్చిన కారణమేమంటే, ఆసా దేవుడైన యెహోవా ఆసా పక్షాన వున్నట్లు వారు గమనించారు.
10ఆసా పరిపాలనలో పదిహేను సంవత్సరాలు దాటి మూడవనెల గడుస్తూవుండగా ఆసా, అతని ప్రజలూ యెరూషలేములో సమావేశమయ్యారు. 11ఆ సమయంలో వారు ఏడువందల గిత్త దూడలను, ఏడువేల గొర్రెలను, మేకలను యెహోవాకు బలి యిచ్చారు. ఆ జంతువులను, ఇతర విలువైన వస్తువులను ఆసా సైన్యం తమ శత్రువుల నుండి తీసుకొన్నారు. 12తరువాత వారు తమ పూర్ణ హృదయంతోను, తమ ఆత్మసాక్షితోను యెహోవాను సేవించటానికి ఒక ఒడంబడిక చేసుకొన్నారు. ఆయన వారి పూర్వీకులు సేవించిన దేవుడు. 13ఎవ్వరైనా దేవాధి దేవుని పూజించటానికి నిరాకరిస్తే అతడు చంపబడాలి. అట్టి మనిషి ఉన్నతుడేగాని, అల్పుడేగాని, పురుషుడే గాని, స్త్రీయేగాని ఎవ్వరైనా విచారణ లేకుండా చంపబడవలసినదే. 14అప్పుడు ఆసా మరియు ప్రజలు యెహోవాకు ఒక ప్రమాణం చేశారు. వారు ఏకగ్రీవంగా పెద్దగా అరిచారు. వారు బూరలు, పొట్టేలు కొమ్ములు వూదారు. 15యూదా ప్రజలంతా వారు చేసిన ప్రమాణం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. వారు పూర్ణ హృదయంతో ప్రమాణం చేశారు. గనుక వారికా సంతోషం. పూర్ణ హృదయంతో వారు దేవుని అనుసరించారు. వారు దేవుని కొరకు వెదకి, ఆయనను దర్శించారు. కావున యెహోవా వారికి దేశమంతా శాంతియుత వాతవరణం నెలకొనేలా చేశాడు.
16ఆసా తన తల్లియైన మయకాను రాజమాత పదవినుండి తొలగించాడు. అషేరా దేవతా స్తంభాన్ని#15:16 అషేరా దేవతా స్తంభం అషేరా కనానీయులు ఆరాధించే ఒక స్త్రీ దేవత. వారి ఆరాధన కొరకు ఒక హేయమైన స్తంభాన్ని నిలుపుతారు. నెలకొల్పటం ద్వారా ఆమె చేయించిన హేయమైన కార్యానికి అతడాపని చేశాడు. అషేరా స్తంభాన్ని ఆసా నరికించి చిన్న చిన్న ముక్కలు చేశాడు. తరువాత అతడా ముక్కలను కిద్రోను లోయలో తగులబెట్టాడు. 17అయితే యూదాలో వున్న ఉన్నత స్థలాలు తొలగింపబడలేదు. అయినప్పటికి ఆసా హృదయం అతని జీవితాంతం యెహోవాకు విశ్వాసపాత్రంగా వుంది.
18ఆసా తానూ, తన తండ్రీ దేవునికి సమర్పించిన కానుకలను, ఇతర విలువైన వస్తువులను ఆలయంలో వుంచాడు. ఆ వస్తువులన్నీ వెండి, బంగారాలతో చేయించినవి. 19ఆసా పాలనలో ముప్పైయైదవ సంవత్సరం#15:19 ఆసా … సంవత్సరం అనగా సుమారు క్రీ. పూ 880వ సంవత్సరం. వరకు యుద్ధాలు ఏ మాత్రం జరగలేదు.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
2 దినవృత్తాంతములు 15: TERV
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Telugu Holy Bible: Easy-to-Read Version
All rights reserved.
© 1997 Bible League International