2 దినవృత్తాంతములు 28
28
యూదా రాజుగా ఆహాజు
1ఆహాజు రాజయ్యేనాటికి ఇరవై యేండ్లవాడు. అతడు యెరూషలేములో పదహారు సంవత్సరాలు పాలించాడు. తన పూర్వీకుడైన దావీదువలె ఆహాజు మంచి మార్గంలో నడవలేదు. యెహోవా ఆశించిన విధంగా సత్కార్యాలు చేయలేదు. 2ఇశ్రాయేలు రాజులు అనుసరించిన చెడుమార్గాన్నే ఆహాజు కూడ అనుసరించాడు. బయలు దేవతలను ఆరాధించటానికి అతడు విగ్రహాలను పోతపోయించాడు. 3బెన్‌హీన్నోము లోయలో#28:3 బన్‌హిన్నోము లోయ బెన్‌హిన్నోము లోయ యెరూషలేముకు దక్షిణంగా వుంది. అనేక మంది పసిపిల్లలను, చిన్న పిల్లలను బూటకపు దేవతలకు ఈ లోయలో బలి ఇచ్చేవారు. ఆహాజు ధూపం వేశాడు. అతడు తన స్వంత కుమారులనే అగ్నిలో కాల్చి దేవతలకు బలియిచ్చాడు. ఆ ప్రాంతంలో నివసించే ప్రజలు ఒడిగట్టే భయంకర పాపాలకే అతడు కూడా పాల్పడ్డాడు. ఇశ్రాయేలు ప్రజలు ఆ రాజ్యంలో ప్రవేశించినప్పుడు యెహోవా బయటకు తరిమివేసిన నీచవ్యక్తులే ఈ ప్రజలు. 4గుట్టలమీద, కొండలమీద, ప్రతి పచ్చని చెట్టు కిందా ఆహాజు బలులు అర్పించి, ధూపం వేశాడు.
5-6ఆహాజు పాపం చేయటంతో అతని దేవుడైన యెహోవా అతనిని అరాము (సిరియా) రాజు చేతిలో ఓడిపోయేలా చేశాడు. అరాము రాజు, అతని సైన్యం ఆహాజును ఓడించి, అనేకమంది యూదా వారిని బందీలుగా పట్టుకున్నారు. అరాము రాజు ఆ బందీలను దమస్కు (డెమాస్కస్) నగరానికి పట్టుకుపోయాడు. ఇశ్రాయేలు రాజైన పెకహు కూడా ఆహాజును ఓడించేలా యెహోవా చేశాడు. పెకహు తండ్రి పేరు రెమల్యా. పెకహు అతని సైన్యం కలిసి ఒక్కరోజులో యూదాకు చెందిన ఒక లక్షా ఇరవై వేలమంది ధైర్యంగల సైనికులను చంపివేశారు. వారి పూర్వీకులు విధేయులైవున్న వారి దేవుడైన యెహోవాకు వారు అవిధేయులైనందువల్ల పెకహు యూదా ప్రజలను ఓడించ గలిగాడు. 7ఎఫ్రాయిముకు చెందిన జిఖ్రి ధైర్యంగల సైనికుడు. రాజైన ఆహాజు కుమారుడు మయశేయాను, రాజగృహ నిర్వహణాధికారి అజ్రీకామును, మరియు ఎల్కానాను జిఖ్రి చంపివేశాడు. రాజు తరపున అధికారం చెలాయించే వారిలో రాజు తరువాతివాడు ఎల్కానా.
8ఇశ్రాయేలు సైన్యం యూదాలో నివసిస్తున్న తమ బంధువులైన రెండు లక్షల మందిని బందీచేశారు. వారు యూదా నుంచి స్త్రీలను, పిల్లలను, అనేక విలువైన వస్తువులను పట్టుకుపోయారు. ఇశ్రాయేలీయులు ఆ బందీలను, వస్తువులను సమరయకు (షోమ్రోను) తీసుకొనిపోయారు. 9కాని యెహోవా ప్రవక్తలలో ఒకడు అక్కడ వున్నాడు. ఈ ప్రవక్త పేరు ఓదేదు. సమరయకు తిరిగి వచ్చిన ఇశ్రాయేలు సైన్యాన్ని ఓదేదు కలిశాడు. ఇశ్రాయేలు సైన్యంతో ఓదేదు యిలా అన్నాడు: “మీ పూర్వీకులు ఆరాధించిన దేవుడైన యెహోవా యూదా ప్రజలపట్ల కోపంగా వున్న కారణంగా వారిని మీరు ఓడించగలిగేలా చేశాడు. మీరు యూదా ప్రజలను నీచమైన విధంగా చంపి, శిక్షించారు. ఇప్పుడు యెహోవా మీపట్ల కోపంగా వున్నాడు. 10మీరు యూదా, యెరూషలేము ప్రజలను బానిసలుగా చేయాలని తలస్తున్నారు. మీరు మీ దేవుడైన యెహోవాపట్ల కూడా పాపం చేశారు. 11ఇప్పుడు నేను చెప్పేది వినండి. మీరు చెరపట్టిన మీ సోదరులను వెనుకకు పంపివేయండి. యెహోవా యొక్క భయంకరమైన కోపం మీమీది వుంది గనుక మీరీపని చేయండి.”
12ఎఫ్రాయిములో కొంతమంది పెద్దలు ఇశ్రాయేలు సైనికులు యుద్ధం నుండి తిరిగి రావటం చూశారు. ఆ పెద్దలు ఇశ్రాయేలు సైనికులను కలిసి వారిని హెచ్చరించారు. ఆ పెద్దలు యెహానాను కుమారుడు అజర్యా, మెషిల్లేమోతు కుమారుడు బెరెక్యా, షల్లూము కుమారుడు యెహిజ్కియా, మరియు హద్లాయి కుమారుడు అమాశా. 13వారు ఇశ్రాయేలు సైనికులతో యిలా చెప్పారు: “యూదా నుండి బందీలను ఇక్కడికి తీసుకొని రావద్దు. మీరాపని చేస్తే అది యెహోవా పట్ల మన పాపాన్ని, దోషాన్ని మరింత ఎక్కువ చేస్తుంది. దానితో ఇశ్రాయేలుపట్ల యెహోవా కోపం పట్టరానిదవుతుంది.”
14అందువల్ల బందీలను, విలువైన వస్తులను సైనికులు ఆ పెద్దలకు, ఇశ్రాయేలు ప్రజలకు అప్పజెప్పారు. 15ఇంతకుముందు పేర్కొన్న పెద్దలు (అజర్యా, బెరెక్యా, యెహిజ్కియా, మరియు అమాశా) నిలబడి బందీలకు సహాయపడ్డారు. ఇశ్రాయేలు సైనికులు తీసుకొన్న వారి దుస్తులను పెద్దలు తిరిగి తీసుకొని, దిగంబరంగా ఉన్న బందీలకు యిచ్చారు. పెద్దలు వారికి పాదరక్షలు కూడా యిచ్చారు. యూదా నుండి వచ్చిన బందీలకు అన్నపానాదులు కూడా పెద్దలు యిచ్చారు. సేద తీరటానికి వారికి నూనెతో కూడ వారు మర్దనా చేశారు. పిమ్మట ఆ ఎఫ్రాయిము పెద్దలు నీరసంగా వున్న బందీలను గాడిదలపై ఎక్కించి యెరికో పట్టణంలో తమ ఇండ్లకు తీసుకొని వెళ్లారు. యెరికోకు ఖర్జూర చెట్ల పట్టణమని పేరు. పిమ్మట ఆ నలుగురు పెద్దలు సమరయకు తిరిగి వెళ్లారు.
16-17అదే సమయంలో ఎదోమీయులు మళ్లీ వచ్చి యూదా ప్రజలను ఓడించారు. ఎదోమీయులు ప్రజలను బందీలుగా పట్టుకుపోయారు. అందువల్ల రాజైన ఆహాజు అష్షూరు రాజు సహాయాన్ని అర్థించాడు. 18కొండప్రాంతంలోను, దక్షిణ యూదా ప్రాంతంలోనుగల పట్టణాలపై ఫిలిష్తీయులు దాడులు జరిపారు. బేత్షెమెషు, అయ్యాలోను, గెదెరోతు, శోకో, తిమ్నా మరియు గిమ్జో పట్టణాలను ఫిలిష్తీయులు పట్టుకున్నారు. వారా పట్టణాలకు సమీపంలో వున్న గ్రామాలను కూడా ఆక్రమించుకున్నారు. పిమ్మట ఫిలిష్తీయులు వాటిలో నివసించసాగారు. 19యూదా రాజైన ఆహాజు యూదా ప్రజలను పాపకార్యాలకు ప్రోత్సహించిన కారణంగా యెహోవా వారికి కష్టాలు కల్పించాడు. యెహోవా పట్ల అతడు అసలు విశ్వాసం లేకుండా ప్రవర్తించాడు. 20అష్షూరు రాజైన తిగ్లత్పిలేసెరు వచ్చి ఆహాజుకు సహాయం చేయటానికి బదులు అతనికి కష్టనష్టాలు కల్గించాడు. 21ఆహాజు ఆలయం నుండి, రాజగృహం నుండి, యువరాజు ఆలయం నుండి విలువైన వస్తువులు కొన్ని తీశాడు. ఆహాజు వాటిని అష్షూరు రాజుకు యిచ్చాడు. అయినా ఆ పని అతనికి సహాయపడలేదు.
22ఆహాజు తన కష్టాలతో సతమతమవుతూ మరిన్ని పాపాలు చేసి యెహోవా పట్ల మరీ విశ్వాసంలేని వాడయ్యాడు. 23దమస్కు ప్రజలు ఆరాధించే దేవతలకు అతడు బలులు అర్పించాడు. దమస్కు ప్రజలు ఆహాజును ఓడించారు. అందువల్ల అతడిలా అనుకున్నాడు: “అరాము (సిరియా) ప్రజలు పూజించే దేవుళ్లు వారికి సహాయపడి వుండవచ్చు. కావున నేను కూడా ఆ దేవుళ్లకు బలులు అర్పిస్తే బహుశః వారు నాకు కూడా సహాయం చేయవచ్చు.” అందువల్ల ఆహాజు ఆ దేవుళ్లను ఆరాధించాడు. ఈ రకంగా అతడు పాపం చేసి, ఇశ్రాయేలు ప్రజలు కూడా పాపం చేయటానికి కారకుడయ్యాడు.
24ఆహాజు ఆలయంలో వున్న వస్తువులను సేకరించి వాటిని ముక్కలు ముక్కలు చేశాడు. పిమ్మట అతడు ఆలయాన్ని మూసేశాడు. అతడు బలిపీఠాలు తయారు చేయించి, వాటిని యెరూషలేములో ప్రతివీధి చివర నెలకొల్పాడు. 25యూదాలో ప్రతి పట్టణంలోనూ ఆహాజు ధూపాలు వేసి అన్యదేవతలను ఆరాధించటానికి ఉన్నత స్థలాలను ఏర్పాటు చేశాడు. ఇవన్నీ చేసి ఆహాజు తన పూర్వీకులు ఆరాధించిన ప్రభువైన యెహోవాకు ఎక్కడలేని కోపాన్నీ కల్గించాడు.
26మొదటి నుండి చివరి వరకు ఆహాజు చేసిన పనులన్నీ యూదా, ఇశ్రాయేలు రాజుల గ్రంథంలో వ్రాయబడ్డాయి. 27ఆహాజు చనిపోగా, అతడు అతని పూర్వీకులతోపాటు సమాధి చేయబడ్డాడు. ప్రజలు ఆహాజును యెరూషలేము నగరంలో సమాధి చేశారు. కాని ఆహాజును ఇశ్రాయేలు రాజులను సమాధిచేసే చోట మాత్రం వారు సమాధి చేయలేదు. ఆహాజు స్థానంలో అతని కుమారుడు హిజ్కియా కొత్త రాజయ్యాడు.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
2 దినవృత్తాంతములు 28: TERV
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Telugu Holy Bible: Easy-to-Read Version
All rights reserved.
© 1997 Bible League International