2 దినవృత్తాంతములు 35
35
యోషీయా పస్కా పండుగ జరుపుట
1యెరూషలేములో యెహోవాకు యోషీయా రాజు పస్కా పండుగ జరిపించాడు. మొదటి నెలలో పదునాల్గవ రోజున పస్కా గొఱ్ఱెపిల్ల చంపబడింది. 2వారి వారి విధులు నిర్వర్తించటానికి యోషీయా యాజకులను ఎన్నుకొన్నాడు. ఆలయంలో సేవ చేస్తున్నప్పుడు యాజకులను యోషీయా ఉత్సాహపర్చాడు. 3ఇశ్రాయేలు ప్రజలకు బోధకులుగా వున్నవారితోను, ఆలయంలో సేవ చేయటానికి పవిత్రులైన లేవీయులతోను, యోషీయా మాట్లాడినాడు. ఆ లేవీయులతో అతడిలా అన్నాడు: “సొలొమోను నిర్మించిన ఆలయంలో పవిత్ర పెట్టెను వుంచండి. సొలొమోను దావీదు కుమారుడు. దావీదు ఇశ్రాయేలు రాజు. పవిత్ర పెట్టెను ఇక మీరు మీ భుజాల మీద ఒకచోటు నుండి మరియొక చోటికి మోయవద్దు. మీ దేవుడైన యెహోవాకు ఇప్పుడు మీరు సేవ చేయండి. దేవుని ప్రజలగు ఇశ్రాయేలీయులకు సేవ చేయండి. 4మీమీ వంశాల ప్రకారం ఆలయంలో సేవచేయటానికి సిద్ధమవ్వండి. రాజైన దావీదు, అతని కుమారుడు రాజైన సొలొమోను మీరు చేయాలని చెప్పిన పనులను మీరు చేయండి. 5కొంత మంది లేవీయులు పవిత్రస్థలంలో నిలబడాలి. ప్రజలలో ప్రతి వంశంవారికి సహాయపడే నిమిత్తం, మీరలా నిలబడండి. 6పస్కా గొఱ్ఱెపిల్లను వధించి యెహోవా సేవకు మిమ్మల్ని మీరు పవిత్రులుగా చేసికొనండి. మీ సోదరులైన ఇశ్రాయేలీయుల కొరకు గొఱ్ఱెపిల్లలను సిద్ధం చేయండి. యెహోవా మనకు ఆజ్ఞాపించిన విధంగా మీరు మీ ధర్మాన్ని సక్రమంగా నిర్వర్తించండి. యెహోవా తన ధర్మాన్ని మోషేద్వారా మనకు ప్రసాదించాడు.”
7పస్కా బలులుగా అర్పించేటందుకు ఇశ్రాయేలు ప్రజలకు యోషీయా ముప్పైవేల గొఱ్ఱెలను ఇచ్చాడు. ప్రజలకు అతడింకా మూడువేల పశువులను కూడా ఇచ్చాడు. ఈ జంతువులన్నీ రాజైన యోషీయా పశుసంపద నుండి ఇవ్వబడినాయి. 8పస్కా పండుగలో వినియోగించే నిమిత్తం ప్రజలకు, యాజకులకు, లేవీయులకు జంతువులను, ఇతర వస్తువులను కూడా యోషీయా అధికారులు ఉదారంగా ఇచ్చారు. ప్రధాన యాజకుడు హిల్కీయా, జెకర్యా, యెహీయేలు అనువారు ఆలయ నిర్వహణాధికారులు. వారు యాజకులకు పస్కాబలుల నిమిత్తం రెండువేల ఆరువందల గొఱ్ఱె పిల్లలను, మేకలను, మరియు మూడువందల గిత్తలను ఇచ్చారు. 9పైగా కొనన్యా, అతని సోదరులు షెమయా మరియు నెతనేలు, మరియు హషబ్యా, యెహీయేలు, యోజాబాదు లేవీయులకు పస్కా బలులకుగాను ఐదువందల గొఱ్ఱెలను, మేకలను, మరియు ఐదువందల కోడె దూడలను ఇచ్చారు. వారంతా లేవీయుల పెద్దలు.
10పస్కా సేవ ప్రారంభానికి సమస్తము సిద్ధం చేయబడిన తరువాత యాజకులు, లేవీయులు వారి వారి నియమిత స్థానాలకు వెళ్లారు. రాజు ఆ మేరకు వారిని ఆజ్ఞాపించాడు. 11పస్కా గొఱ్ఱెపిల్లలు చంపబడ్డాయి. తరువాత లేవీయులు ఆ జంతువుల చర్మాలను ఒలిచి, వాటి రక్తాన్ని యాజకులకు ఇచ్చారు. యాజకులు రక్తాన్ని బలిపీఠం మీద చల్లారు. 12పిమ్మట బలియిచ్చిన ఆ జంతువులను దహనబలులకుగాను వివిధ వంశాల వారికి యిచ్చారు. మోషే ధర్మశాస్త్రం నిర్దేశించిన విధంగా దహనబలులు జరగటానికే ఇది ఈ విధంగా చేయబడింది. 13లేవీయులు పస్కా బలుల మాంసాన్ని ధర్మశాస్త్ర ప్రకారం అగ్నిలో కాల్చారు. పవిత్ర అర్పణలను వారు కుండలలోను, పాత్రలలోను, పెనముల మీద వుడకబెట్టారు. వారు తక్షణమే ఆ మాంసాన్ని ప్రజలకు పంచిపెట్టారు. 14ఇది జరిగిన తరువాత లేవీయులు, అహరోను సంతతి యాజకులు తమ వంతు మంసాన్ని తీసుకున్నారు. ఆ యాజకులు చీకటి పడేవరకు పనిలో నిమగ్నమయ్యారు. దహనబలి మంసాన్ని అర్పణల కొవ్వును కాల్చడంలో వారు కష్టపడి పనిచేశారు. 15రాజైన దావీదు నిర్ణయించిన స్థలంలో ఆసాపు వంశీయులగు లేవీ గాయకులు నిలబడ్డారు. వారు ఆసాపు, హేమాను, మరియు రాజు యొక్క ప్రవక్త యెదూతూను. ప్రతిద్వారం వద్ద నున్న ద్వారపాలకులు తమ తమ స్థానాలు వదలవలసిన అవసరం లేకుండ వారి సోదరులగు లేవీయులు అన్నీ సిద్ధంచేసి వారి పస్కా అవసరాలన్నీ తీర్చారు.
16రాజైన యోషీయా ఆజ్ఞాపించిన విధంగా ఆరోజు యెహోవా ఆరాధనకు సమస్తం ఏర్పాటు చేయబడింది. పస్కా పండుగ జరుపబడింది. యెహోవా బలిపీఠం మీద దహనబలులు అర్పించబడ్డాయి. 17అక్కడున్న ఇశ్రాయేలీయులంతా పస్కాను, పులియని రొట్టెల పండుగను ఏడు రోజులపాటు జరుపుకున్నారు. 18ప్రవక్తయగు సమూయేలు జీవించియున్న కాలంనుండి ఈ రకంగా పస్కా పండుగ జరుపబడలేదు! ఇశ్రాయేలు రాజులలో ఏ ఒక్కడు గతంలో ఇంత ఘనంగా పస్కాపండుగ జరుపలేదు. రాజైన యోషీయా, యాజకులు, లేవీయులు, అక్కడున్న యూదా మరియు ఇశ్రాయేలు ప్రజలు యెరూషలేము వాసులతో కలిసి పస్కా పండుగను ఘనంగా ఒక ప్రత్యేక పద్ధతిలో జరిపారు. 19యోషీయా రాజ్యపాలనలో పదునెనిమిదవ సంవత్సరం గడుస్తూ వున్నప్పుడు ఈ పస్కా పండుగ జరుపబడింది.
యోషీయా మరణం
20యోషీయా ఆలయం విషయంలో ఈ మంచి పనులన్నీ చేసిన పిమ్మట రాజైన నెకో యూఫ్రటీసు నదీతీర పట్టణమైన కర్కెమీషు మీదికి దండెత్తి వచ్చాడు. నెకో ఈజిప్టు రాజు. రాజైన యోషీయా నెకోను ఎదిరించటానికి బయలుదేరి వెళ్లాడు. 21కాని నెకో యోషీయా వద్దకు దూతలను పంపాడు.
వారు యిలా అన్నారు: “యోషీయా రాజా, ఈ యుద్ధం నీకు సంబంధించినది కాదు. నేను నీమీద యుద్ధానికి రాలేదు. నేను నా శత్రువుతో పోరాడటానికి వచ్చాను. దేవుడు నన్ను తొందరచేసి పంపినాడు. దేవుడు నా పక్షాన వున్నాడు. కావున నీవు అనవసరమైన శ్రమ తీసుకోవద్దు. నీవు గనుక నాతో యుద్ధం చేస్తే. దేవుడు నిన్ను నాశనం చేస్తాడు!”
22కాని యోషీయా వెళ్లి పోలేదు. అతడు నెకోతో యుద్ధం చేయటానికే నిశ్చయించాడు. అందువల్ల అతడు తన వేషం మార్చుకొని యుద్ధానికి వెళ్లాడు. దేవుని ఆజ్ఞ విషయంలో నెకో చెప్పిన దానిని యోషీయా వినటానికి నిరాకరించాడు. మెగిద్దో మైదానంలో యుద్ధం చేయటానికి యోషీయా వెళ్లాడు. 23రాజైన యోషీయా యుద్ధంలో వుండగా, అతడు బాణాలతో కొట్టబడ్డాడు. అతడు తన సేవకులతో, “నన్ను దూరంగా తీసుకొని వెళ్లండి. నేను తీవ్రంగా గాయపడ్డాను!” అని చెప్పాడు.
24దానితో అతని సేవకులు యోషీయాను అతని రథం నుండి దించి తనతో యుద్ధరంగానికి తెచ్చిన మరియొక రథంలో అతనిని వుంచారు. వారు యోషీయాను యెరూషలేముకు తీసికొని వచ్చారు. రాజైన యోషీయా యెరూషలేములో చనిపోయాడు. తన పూర్వీకులు వుంచబడిన సమాధులలోనే యోషీయా సమాధి చేయబడినాడు. యోషీయా చనిపోయినందుకు యూదా, యెరూషలేము ప్రజలంతా చాలా దుఃఖించారు. 25యోషీయాపై యిర్మీయా కొన్ని ప్రగాఢ విలాపగీతికలు వ్రాశాడు. ఆ విలాపగీతాలు ఆలపిస్తూ స్త్రీ పురుష గాయకులు ఈనాటికీ యోషీయాను తలచుకొని గౌరవిస్తారు. యోషీయాను తలుస్తూ ఒక విలాపగీతిక ఆలపించటం ఇశ్రాయేలీయులకు వాడుక అయ్యింది. ఆ గీతికలు విలాప వాక్యములలో పొందుపర్చబడినాయి.
26-27తాను రాజుగా వున్న కాలంలో యోషీయా మొదటినుండి తన పాలన అంతం అయ్యే వరకు చేసిన ఇతర కార్యములన్నీ ఇశ్రాయేలు, యూదా రాజుల చరిత్ర గ్రంథంలో వ్రాయబడినాయి. ఆ గ్రంథం యెహోవాపట్ల అతనికున్న ప్రేమ, యెహోవా ధర్మశాస్త్రాన్ని అతను అనుసరించిన తీరును తెలియజేస్తుంది.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
2 దినవృత్తాంతములు 35: TERV
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Telugu Holy Bible: Easy-to-Read Version
All rights reserved.
© 1997 Bible League International