2 రాజులు 14
14
అమాజ్యా యూదాలో తన పరిపాలన ప్రారంభించుట
1యూదా రాజయిన యోవాషు కుమారుడైన అమాజ్యా యెహోయాహాజు కొడుకైన యోవాషు ఇశ్రాయేలు రాజుగా వున్న రెండవ సంవత్సరమున యూదాకు రాజయ్యాడు. 2అమాజ్యా పరిపాలన ప్రారంభించేనాటికి 25 యేళ్లవాడు. యెరూషలేములో అమాజ్యా 29 సంవత్సరాలు పరిపాలించాడు. అతని తల్లి పేరు యెహోయద్దాను. 3యెహోవా మెచ్చుకున్న పనులు అమాజ్యా జరిగించాడు. తన పూర్వికుడైన దావీదువలె అతను పూర్తిగా దేవుని అనుసరించలేదు. తన తండ్రి అయిన యోవాషు చేసిన పనులన్నీ అతను చేశాడు. 4అతను ఉన్నత స్థానాలను నాశనం చేయలేదు. ఆ ఆరాధనా స్థలాలలో ఆ నాటికీ ప్రజలు బలులు అర్పించుచూ, ధూపం వేస్తూ ఉన్నారు.
5అమాజ్యాకు తన రాజ్యం మీద మంచి అదుపు వున్న ఆ సమయమున, తన తండ్రిని చంపిన అధికారులను అతను చంపాడు. 6కాని హంతకుల పిల్లలను అతను చంపలేదు. యెహోవా మోషే ధర్మశాస్త్రంలో ఈ ఆజ్ఞను ఇచ్చాడు; “తమ పిల్లలు చేసినదానికి వారి తల్లిదండ్రులను చంపకూడదు. తమ తల్లిదండ్రులు చేసిన దానికి వారి పిల్లలను చంపకూడదు. అతనే స్వయంగా చేసిన చెడు పనికి అతనినే చంపవలెను.”#ద్వితీ. 24:16.
7అమాజ్యా ఉప్పు లోయలో పదివేల మంది ఎదోము వాళ్లను చంపాడు. యుద్ధంలో అమాజ్యా సెలా అనే స్థలాన్ని “యొక్తయేలు” అని వ్యవహరించాడు. ఆ స్థలం నేటికీ “యొక్తయేలు” అని పిలువ బడుచున్నది.
అమాజ్యా యెహోయాషుకి ప్రతికూలంగా యుద్ధం కోరుకొనుట
8అమాజ్యా యెహోయాహాజు కుమారుడైన యెహోయాషు వద్దకు దూతల్ని పంపాడు. యెహోయాహాజు ఇశ్రాయేలు రాజయిన యెహూ కుమారుడు. “మనము ముఖాముఖిగా కలుసుకుని యుద్ధం చేద్దాము” అని అమాజ్యా సందేశం పంపించాడు.
9ఇశ్రాయేలు రాజయిన యెహోయాషు యూదా రాజయిన అమాజ్యకు తిరిగి వ్రాశాడు. యెహోయాషు ఇలా చెప్పాడు. “లెబానోను దేవదారు చెట్టుకి లెబానోనులోని ముళ్లపొద ఒక సందేశం పంపింది. అది ఏమనగా, నీవు నీ కుమార్తెను నా కుమారుడికి పెళ్లి చేసుకునేందుకు యిమ్ము. కాని లెబానోనులోని ఒక దుష్ట మృగం ఆ త్రోవను వెళుతూ ముళ్లపొద మీద నడిచింది. నీవు ఎదోముని ఓడించిన మాట నిజమే. 10కాని నీవు ఎదోము మీద పొందిన విజయానికి నీవు గర్వపడుతున్నావు. నీవు ఎదోములో వుండి మిడిసిపడుతున్నావు. ఇంతకు నీవు ఎందుకు ఆపద తెచ్చుకుంటావు. నీవు ఇలా చేస్తే, నీవు పతనంకాగలవు. మరియు యూదా నీతో పాటు నాశనం కాగలదు.”
11కాని అమాజ్యా యెహోయాషు ఇచ్చిన హెచ్చరికను లెక్కచేయలేదు. అందువల్ల ఇశ్రాయేలు రాజైన యెహోయాషు యూదా రాజైన అమాజ్యాకు ప్రతి కూలంగా బేత్షెమెషు అనే చోట యుద్ధం చేయడానికి వెళ్లాడు. 12ఇశ్రాయేలు యూదాను ఓడించాడు. యూదాకు చెందిన ప్రతి వ్యక్తి పారిపోయాడు. 13బేత్షెమెషు వద్ద ఇశ్రాయేలు రాజైన యెహోయాషు యూదా రాజైన అమాజ్యాను బంధించాడు. అమాజ్యా యెవాషు కుమారుడు. అతను అహజ్యా కుమారుడు. యెహోయాషు అమాజ్యాను యెరూషలేముకు తీసుకువెళ్లాడు. యెహోయాషు ఎఫ్రాయీము ద్వారం నుంచి కోట ద్వారం, 600 అడుగుల యెరూషలేము ప్రాకారమును పగలగొట్టాడు. 14తర్వాత యెహోయాషు యెహోవా ఆలయం లోని బంగారం, వెండి, వస్తువులను రాజభవనంలోని నిధులను తీసుకుపోయాడు. యెహోయాషు ప్రజలను కూడా తన బందీలుగా తీసుకుపోయాడు. తర్వాత అతను షోమ్రోనుకు తిరిగి వెళ్లాడు.
15యెహోయాషు చేసిన ఘనకార్యములు యూదా రాజయిన అమాజ్యాతో అతను పోరాడిన విధంతో సహా “ఇశ్రాయేలు రాజ్య చరిత్ర” అనే గ్రంథంలో వ్రాయబడి వున్నవి. 16యెహోయాషు మరణించగా, అతనిని అతని పూర్వికులతో పాటు సమాధి చేశారు. ఇశ్రాయేలు రాజులతో పాటుగా షోమ్రోనులో యెహోయాషు సమాధి చేయబడ్డాడు. యెహోయాషు కుమారుడు యరొబాము, అతని తర్వాత క్రొత్తగా రాజయ్యాడు.
అమాజ్యా మరణం
17ఇశ్రాయేలు రాజైన యెహోయాహాజు కుమారుడు యెహోయాషు మరణించిన 15 సంవత్సరాల వరకు యూదా రాజయిన యెవాషు కుమారుడు అమాజ్యా బ్రదికాడు. 18అమాజ్యా జరిగించిన ఘనకార్యాలన్నీ “యూదా రాజుల చరిత్ర” అనే గ్రంథంలో వ్రాయబడివున్నాయి. 19యెరూషలేములో ప్రజలు అమాజ్యాకు ప్రతి కూలంగా ఒక పధకం వేశారు. అమాజ్యా లాకీషుకు పారిపోయాడు. కాని ప్రజలు లాకీషుకు అమాజ్యా వెనుకాల కొందరు వ్యక్తులను పంపారు. ఆ వ్యక్తులు లాకీషులో అమాజ్యాను చంపివేశారు. 20ప్రజలు అమాజ్యా దేహాన్ని గుర్రాల మీద వెనక్కి తీసుకువచ్చి, దావీదు నగరంలో అతని పూర్వికులతో పాటు అమాజ్యాను సమాధి చేశారు.
అజర్యా యూదా మీద తన పరిపాలన ప్రారంభించుట
21తర్వాత యూదాలోని మనుష్యులందురు అమాజ్యా కుమారుడైన అజర్యాను క్రొత్త రాజుగా చేశారు. అజర్యా 16 యేండ్లవాడు. 22అమాజ్యా రాజు మరణించగా, అతని పూర్వికులతో పాటు అతనిని సమాధి చేశారు. తర్వాత అజర్యా ఏలతు పట్టణం మరల నిర్మించి, దానిని యూదాకు స్వాధీన పరిచాడు.
రెండవ యరొబాము ఇశ్రాయేలు మీద తన పరిపాలన ప్రారంభించుట
23యూదా రాజుగా యోవాషు కుమారుడైన అమాజ్యా పరిపాలనలో 15వ సంవత్సరమున ఇశ్రాయేలు రాజైన యెహోయాషు కుమారుడు యరొబాము సమరియాలో పరిపాలన ప్రారంభించెను. యరొబాము 41 సంవత్సరాలు పరిపాలించాడు. 24యెహోవా తప్పు అని చెప్పిన కార్యములు ఈ యరొబాము చేశాడు. నెబాతు కుమారుడు యరొబాము ఇశ్రాయేలు పాపాలకు కారణమైన ఆ పాపకార్యములను యరొబాము ఆపలేదు. 25హమాతు నుండి అరబా సముద్రం దాకా వ్యాపించిన ఇశ్రాయేలు దేశమును యరొబాము మరల తీసుకున్నాడు. ఇశ్రాయేలు దేవుడగు యెహోవా తన భక్తుడైన అమిత్తయి కుమారుడు యోనాకు చెప్పినట్లు ఇది జరిగింది. అమిత్తయి గత్హేపెరు నుండి వచ్చిన ఒక ప్రవక్త. 26ఇశ్రాయేలు వారందరికీ చాలా ఇబ్బందులున్నాయని యెహోవా చూశాడు. బానిసలు, స్వతంత్రులూ వున్నారని చూశాడు. ఇశ్రాయేలుకు సహాయం చేయదగిన వ్యక్తి ఎవరూ లేరు. 27ప్రపంచంలో ఇశ్రాయేలు అన్న పేరుని తీసివేస్తానని యెహోవా చెప్పలేదు. అందువల్ల యెహోవా యెహోయాషు కుమారుడైన యరొబాముని ఇశ్రాయేలు ప్రజలను రక్షించేందుకు ఏర్పాటు చేసాడు.
28యరొబాము చేసిన ఘనకార్యాలన్ని “ఇశ్రాయేలు రాజుల చరిత్ర” అనే గ్రంథంలో వ్రాయబడినవి. ఇశ్రాయేలుకు గాను దమస్కు మరియు హమాతులను యరొబాము తిరిగి పొందిన కథకూడా ఇందులో పొందుపరచబడింది. (ఈ నగరాలు యూదాకి చెందినవి). 29యరొబాము మరణించగా, ఇశ్రాయేలీయుల రాజులైన అతని పూర్వికులతో పాటుగా అతను సమాధి చేయబడ్డాడు. యరొబాము కుమారుడైన జెకర్యా, అతని తర్వాత క్రొత్తగా రాజయ్యాడు.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
2 రాజులు 14: TERV
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Telugu Holy Bible: Easy-to-Read Version
All rights reserved.
© 1997 Bible League International