2 రాజులు 21
21
యూదాలో మనష్షే దుష్ట పరిపాలన ప్రారంభించుట
1మనష్షే పరిపాలన చేయడం మొదలుపెట్టిన నాటికి అతను పన్నెండేళ్లవాడు. అతను 55 సంవత్సరాలు యెరూషలేంలో పరిపాలించాడు. అతని తల్లి పేరు హెఫ్సిబా.
2యెహోవా తప్పని చెప్పిన పనులు మనష్షే చేశాడు. ఇతర జాతుల వారు చేసినట్లుగా మనష్షే భయంకరమైన పనులు చేశాడు. (ఇశ్రాయేలు వారు రాగా, ఆయా జాతులవారు దేశాన్ని విడిచి వెళ్లునట్లుగా యెహోవా చేశాడు). 3తన తండ్రి హిజ్కియా ధ్వంసం చేయించిన ఉన్నత స్థలాలను మనష్షే మరల నిర్మించాడు. బయలు దేవతకు మరల మనష్షే బలిపీఠాలు నిర్మించాడు. ఇశ్రాయేలు రాజు అహాబువలె, అషెరా స్తంభము ఏర్పాటు చేశాడు. మనష్షే ఆకాశంలోని నక్షత్రాలను కొలిచాడు. 4యెహోవా ఆలయంలో మనష్షే అబద్ధపు దేవుళ్లను గౌరవించేందుకు బలిపీఠాలు నిర్మించాడు. “యెరూషలేములో నాపేరు స్థాపిస్తాను.” అని యెహోవా చెప్పిన స్థలం ఇది. 5యెహోవా ఆలయము యొక్క రెండు ఆవరణాలలో ఆకాశంలోని నక్షత్రాలకు మనష్షే బలిపీఠాలు నిర్మించాడు. 6మనష్షే తన కుమారుని బలిపీఠము మీద దహన బలిగా ఇచ్చాడు. భవిష్యత్తుని తెలుసుకునేందుకు మనష్షే వేర్వేరు మార్గాలు అవలంబించాడు. అతను కర్ణ పిశాచి గలవారిని సోదె చెప్పేవారిని దర్శించాడు.
యెహోవా తప్పని చెప్పిన పనులు మరింత ఎక్కువగా మనష్షే చేశాడు. అందువల్ల యెహోవాకు కోపము వచ్చింది. 7మనష్షే అషేరాదేవి విగ్రహం ఒకటి మలిచాడు. దానిని అతను ఆలయంలో ఉంచాడు. ఈ ఆలయం గురించి దావీదుకు, అతని కుమారుడు సొలోమోనుకు యెహోవా ఇలా చెప్పాడు: “ఇశ్రాయేలులోని నగరములన్నిటి నుండి నేను యెరూషలేమును ఎంపిక చేశాను. నేను నా పేరును యెరూషలేము ఆలయములో ఎన్నటికీ వుంచుతాను. 8తమ దేశం విడిచి వెళ్లేటట్లుగా నేను ఇశ్రాయేలు ప్రజలను చేయను. అది వారి పూర్వికులకు తెలియబడింది. నేను వారికి ఆజ్ఞాపించినట్లుగా వారు మెలిగినచో, నా సేవకుడైన మోషేవారికి ఇచ్చిన బోధనలను పాటించినచో నేను వారిని తమ దేశంలోనే వుండేటట్లు చేస్తాను.” 9కాని ప్రజలు యెహోవాకు విధేయులు కాలేదు. ఇశ్రాయేలు రావడానికి పూర్వం కనానులోని అన్ని జనాంగముల వారు చేసిన దుష్టకార్యాముల కంటె ఎక్కువగా మనష్షే చేశాడు. మరియు యెహోవా ఆ జనాంగములను నాశనము చేశాడు; ఇశ్రాయేలు ప్రజలు తమ దేశాన్ని ఆక్రమించుటకు వచ్చినప్పుడు ఇది జరిగింది.
10తన సేవకులైన ప్రవక్తులను ఈ విషయాలు చెప్పమని యెహోవా నియమించాడు. 11“యూదా రాజైన మనష్షే తనకు పూర్వమున్న ఆ ప్రాంతములో నివసించిన అమోరీయుల కంటె ఎక్కువగా నీచమైన దుష్కార్యాలు చేసాడు. తన విగ్రహాల కారణంగా, యూదాని కూడా పాపం చేయడానికి మనష్షే కారకుడయ్యాడు. 12అందువల్ల ఇశ్రాయేలు దేవుడు చెప్పుచున్నాడు; ‘చూడండి. విన్న వ్యక్తి కూడా ఆశ్చర్యము చెందేటట్లుగా, నేను యెరూషలేము, యూదాలకు విరుద్ధంగా చాలా కష్టము కలిగిస్తాను. 13నేను షోమ్రోనులలో కొలత సూత్రాన్ని సాగదీస్తాను. మరియు యెరూషలేము మీదా అహాబు వంశముయొక్క మట్టపు గుండును సాగదీస్తాను. ఒక వ్యక్తి పాత్రను కడుగవచ్చు; తర్వాత దానిని బోర్లించవచ్చు. నేను, ఆ విధంగా యెరూషలేముకు చేస్తాను. 14అక్కడ ఇంకా నావారు కొద్ది మంది వుండవచ్చు. కాని నేను వారిని విడిచిపెడ్తాను. నేను వారిని వారి శత్రువుల పరము చేస్తాను. వారి శత్రువులు వారిని బందీలుగా చేస్తారు. వారు యుద్ధాలలో సైనికులు అపహరించుకు వెళ్లే అమూల్య వస్తువుల వంటివారు. 15ఎందుకని? నేను తప్పని చెప్పిన పనులు వారు చేశారు కనుక. తమ పూర్వికులు ఈజిప్టు నుంచి వెలుపలికి వచ్చిననాటినుంచీ వారు నన్ను కోపానికి గురిచేసారు. 16మరియు మనష్షే పలువురు అమాయకులను చంపివేశాడు. అతను యెరూషలేమును ఒక కొననుంచి మరొక కొనదాకా రక్తముతో నింపి వేశాడు. ఈ పాపాలన్నీ అదనంగా యూదావారు పాపము చేయడానికి దోహదపడ్డాయి. యెహోవా తప్పు అని చెప్పినవాటిని యూదా చేయునట్లుగా మనష్షే చేశాడు.’”
17మనష్షే చేసిన అన్ని పనులు పాప కార్యములతో సహా “యూదా రాజుల చరిత్ర” అనే గ్రంథంలో వ్రాయబడివున్నాయి. 18మనష్షే మరణించగా, అతని పూర్వికులతో పాటుగా, అతను తన యింటి తోటలో సమాధి చేయబడ్డాడు. ఆ తోటకు, “ఉజ్జా ఉద్యానవనం” అని పేరు పెట్టబడింది. మనష్షే కుమారుడు ఆమోను, అతని తర్వాత క్రొత్తగా రాజయ్యాడు.
ఆమోను చిన్న పాలన
19ఆమోను పరిపాలనకు వచ్చేనాటికి 22 యేండ్ల వయస్సుగలవాడు. అతను యెరూషలేములో రెండు సంవత్సరములు పాలించాడు. అతని తల్లి పేరు మెషుల్లెతు ఆమె యొట్బకి చెందిన హారూసు కుమార్తె.
20యెహోవా తప్పు అని చెప్పిన పనులు ఆమోను చేశాడు. 21తన తండ్రియైన మనష్షేవలె, ఆమోను కూడా జీవించాడు. తండ్రి పూజించిన ఆ విగ్రహాలనే ఆమోను పూజించి అనుసరించాడు. 22తన పూర్వికుల దేవుని ఆమోను విడిచిపెట్టాడు. యెహోవా ఆశించిన మార్గాలను విడనాడి అతను జీవించాడు.
23ఆమోను సేవకులు అతనికి వ్యతిరేకంగా పన్నాగాలు పన్ని అతనిని అతని ఇంటిలోనే చంపివేశారు. 24సామన్య ప్రజలు, ఏఏ అధికారులు ఆమోనుకు వ్యతిరేకంగా పన్నాగాలు పన్నారో ఆ అధికారులను చంపివేశారు. అప్పుడు ప్రజలు ఆమోను కుమారుడైన యోషీయాను క్రొత్త రాజుగా నియమించారు.
25ఆమోను చేసిన ఇతర పనులు “యూదా రాజుల చరిత్ర” అనే గ్రంథంలో వ్రాయబడ్డవి. 26ఉజ్జా తోటలో ఆమోను సమాధి చేయబడ్డాడు. ఆమోను కుమారుడైన యోషీయా క్రొత్తగా రాజయ్యాడు.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
2 రాజులు 21: TERV
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Telugu Holy Bible: Easy-to-Read Version
All rights reserved.
© 1997 Bible League International