2 రాజులు 23
23
ప్రజలు ధర్మశాస్త్రము వినుట
1యూదా నాయకులందరిని యెరూషలేము నాయకులను తనను కలుసుకోవలసిందిగా యోషీయా రాజు చెప్పాడు. 2తర్వాత రాజు యెహోవా యొక్క ఆలయము వద్దకు వెళ్లాడు. యూదాలోని మనష్యులందరు మరియు యెరుషలేములో నివసించేవారు. అతనితో పాటు వెళ్లారు. యాజకులు, ప్రవక్తలు, అందరు మనుష్యులు తక్కువ ప్రాముఖ్యము కలవారి నుండి ఎక్కువ ప్రాముఖ్యం కలవారి వరకు అతనితో పాటు వెళ్లారు. తర్వాత అతను ఒడంబడిక పుస్తకము చదివాడు. ఇది యెహోవా యొక్క ఆలయములో కనిపించిన ధర్మశాస్త్ర గ్రంథము. యోషీయా అందరు వినేటట్లుగా పుస్తకము చదివాడు.
3రాజు స్తంభం ప్రక్కగా నిలబడి యెహోవాతో ఒడంబడిక కుదుర్చుకొన్నాడు. యెహోవా ఆజ్ఞలను, ఒడంబడికను, అతని నిబంధనలను పాటించడానికి అతను సమ్మతించాడు. హృదయపూర్వకంగా అతను వాటికి సమ్మతించాడు. ఆ పుస్తకంలోని ఒడంబడికను పాటించడానికి సమ్మతించాడు. రాజు ఒడంబడికను తాము అంగీకరిస్తున్నట్టుగా ప్రజలందరు నిలబడ్డారు.
4తర్వాత ప్రధాన యాజకుడు అయిన హిల్కీయా, ఇతర యాజకులు, ద్వారపాలకులు మొదలైన వారికి రాజు ఆజ్ఞాపించాడు, యెహోవా యొక్క ఆలయము నుండి బయలు అషేరాదేవికి, ఆకాశములోని నక్షత్రాలను గౌరవించేందుకు చేయబడిన అన్ని పాత్రలు తీసుకురమ్మని తర్వాత యోషీయా ఆ వస్తువులను యెరూషలేముకు వెలుపల కిద్రోను లోయలో కాల్చివేశాడు. తర్వాత వారు బూడిదను బెతేలుకు తీసుకువెళ్లారు.
5యూదా రాజులు కొందరు సామాన్యులను యాజకులుగా ఎంపిక చేశారు. ఆ మనుష్యులు అహరోను వంశానికి చెందినవారు కారు. ఆ అబద్ధపు యాజకులు యూదాలోని ప్రతినగరంలో ఉన్నత స్థానాలలోను యెరూషలేముకు చుట్టుప్రక్కలనున్న పట్టణాలలోను ధూపం వెలిగించారు. వారు బయలునకు సూర్య చంద్రులను, నక్షత్రగణాలను, ఆకాశంలోని అన్ని నక్షత్రాలను గౌరవించేందుకు ధూపం వేసారు. కాని యోషీయా ఆ అబద్ధపు యాజకుల చేతలు ఆపివేశాడు.
6యోషీయా యెహోవాయొక్క ఆలయము నుండి అషేరా స్తంభము తొలగించాడు. అతను అషేరా స్తంభము యెరూషలేము వెలుపలికి తీసుకువెళ్లి కిద్రోను లోయలో కాల్చివేశాడు. తర్వాత ఆ కాల్చిన వస్తువులను ధూళిగా చేసి, ఆ ధూళిని సామాన్యుల సమాధుల మీద చల్లాడు.
7తర్వాత యోషీయా రాజు యెహోవా ఆలయంలోని పురుష వ్యభిచారుల ఇండ్లను ధ్వంసము చేశాడు. ఆ ఇండ్లను స్త్రీలు కూడా ఉపయోగించి, అబద్ధపు దేవత అషేరా గౌరవార్థం గుడారపు కప్పులు తయారు చేశారు.
8-9ఆ సమయాన యాజకులు బలులు యెరూషలేముకు తీసుకురాలేదు; ఆలయములో బలిపీఠం మీద వాటిని నివేదించలేదు. యూదా అంతటా నగరాలలో యాజకులు నివసించారు. ఆ నగరాలలో వారు ఉన్నత స్థానాలలో ధూపము వేసేవారు. బలులు సమర్పించేవారు. ఆ ఉన్నత స్థలాలు గెబానుండి బెయేర్షెబా వరకు అన్ని చోట్ల వుండేవి. మరియు యాజకులు ఆ పట్టణాలలో పులియని రొట్టెను సామాన్యులతో కలిసి తింటూ ఉన్నారు. యెరూషలేములో యాజకులకోసం ప్రత్యేకించబడిన స్థలంలో కాదు. కాని యోషీయా రాజు ఆ ఉన్నత స్థానాలను ధ్వంసము చేసి, యెరూషలేముకు ఆ యాజకులను తీసుకువచ్చాడు. యోషీయా యెహోషువ ద్వారానికి ఎడమ నున్న ఉన్నత స్థానాలను కూడా ధ్వంసము చేశాడు. (యెహోషువ ఆ నగరపు పాలకుడు).
10అబద్ధపు దేవుడైన మొలెకు గౌరవార్థం ప్రజలు తమ పిల్లలను చంపి బలిపీఠం మీద కాల్చివేసేవారు. ఈ పని బెన్హిన్నోము లోయలో తోఫెతు అనేచోట జరిగేది. యోషీయా ఆ స్థలాన్ని ప్రజలు దానిని మరల ఉపయోగించుకొనేందుకు వీలులేనంతగా ధ్వంసము చేశాడు. 11వెనకటి కాలంలో, యూదా రాజులు యెహోవా యొక్క ఆలయ ప్రవేశద్వారం వద్ద కొన్ని గుర్రాలను, ఒక రథాన్ని ఉంచేవారు. నెతన్మెలకు అనే ముఖ్య అధికారి గదికి దగ్గరగా వుండేది. ఆ గుర్రాలూ, రథమూ సూర్యదేవుని గౌరవార్థం నిలపబడేవి. యోషీయా ఆ గుర్రాలను తొలగించి రథాన్ని కాల్చివేశాడు.
12వెనుకటి రోజుల్లో, యూదా రాజుల అహాబు భవనం కప్పు మీద బలిపీఠాలు అమర్చారు. మనష్షే రాజు కూడా యెహోవా యొక్క ఆలయము రెండు ప్రాంగణాలలో బలిపీఠాలు నిర్మించాడు. యోషీయా ఆ బలిపీఠాలన్నిటినీ నాశనము చేశాడు. విరిగిపోయిన ముక్కలను కిద్రోను లోయలోకి విసిరివేశాడు.
13వెనుకటి కాలములో, సొలొమోను రాజు యెరూషలేముకు దగ్గరలో “నాశన పర్వతము” మీద కొన్ని ఉన్నత స్థలాలు నిర్మించాడు. ఆ కొండకు దక్షిణంగా ఆ ఉన్నత స్థలాలు ఉండేవి. ఆ ఉన్నతస్థలాలలో ఒకటి అష్ఠారోతు గౌరవార్థము కట్టబడింది. సీదోను ప్రజలు ఆరాధించే హేయమైన విగ్రహమది. మరియు సొలొమోను రాజు మిలోము గౌరవార్థం ఒక ఉన్నత స్థానము నిర్మించాడు. అమ్మోనీయులు కొలిచే హేయమైన విగ్రహమది. కాని యోషీయా రాజు ఆ ఆరాధనా స్థలాలన్నిటినీ ధ్వంసంచేశాడు. 14యోషీయా రాజు స్మారక శిలలను పగులగొట్టాడు; అషరా స్తంభాలను విరగగొట్టాడు. తర్వాత అతను ఆ స్థలము మీద చచ్చినవారి ఎముకలను వెదజల్లాడు.
15యోషీయా బేతేలు వద్ద గల బలిపీఠాన్ని ఉన్నత స్థలమును ధ్వంసము చేశాడు. నెబాతు కొడుకైన యరొబాము ఈ బలిపీఠం నిర్మించాడు. యరొబాము ఇశ్రాయేలుని పాపానికి పాల్పడజేశాడు. యోషీయా బలిపీఠపు శిలలను ముక్కలు ముక్కలుగా చేశాడు. యోషీయా బలిపీఠమును ఉన్నత స్థానమును ధ్వంసము చేశాడు. తర్వాత వాటిని ధూళిగా చేశాడు. మరియు అతను అషేరా స్తంభమును కాల్చివేసెను. 16యోషీయా చుట్టు ప్రక్కలు చూచెను; కొండమీద సమాధులు కనిపించాయి అతను మనుష్యులను పంపాడు. వారు ఆ సమాధులనుండి ఎముకలు తీసుకువాచ్చారు. తర్వాత బలిపీఠం మీద ఆ ఎముకలను కాల్చాడు. ఈ విధంగా యోషీయా బలిపీఠాన్ని అపవిత్రము చేశాడు. దైవజనుడు ప్రకటించెనని యెహోవా యొక్క సందేశం తెలిపినట్లుగా ఇది జరిగింది. యరొబాము బలిపీఠం ప్రక్కగా నిలబడినప్పుడు దైవజనుడు ఇది ప్రకటించాడు.
తర్వాత యోషీయా చుట్టుప్రక్కల చూశాడు. దైవజనుడి సమాధి చూశాడు.
17“నేను చూస్తున్న సమాధి ఏమిటి?” అని యోషీయా అడిగాడు.
“యూదానుంచి వచ్చిన దైవజనుని సమాధి ఇది. బేతేలులోని బలిపీఠానికి నీవు చేసిన పనులను ఈ దైవజనుడు చెప్పాడు. ఈ విషయాలను అతను చాలా కాలము క్రిందటనే సూచించాడు” అని ఆ నగర ప్రజలు చెప్పారు.
18“దైవజనుడను ఒంటరిగా విడిచిపెట్టండి, అతని ఎముకలను కదిలించకండి” అని యోషీయా చెప్పాడు. అందువల్ల వారు అతని ఎముకలు విడిచిపెట్టారు. షోమ్రోను నుంచి వచ్చిన దైవజనుని ఎముకలు కూడా విడిచిపెట్టారు.
19యోషీయా షోమ్రోను నగరాలలోని ఉన్నత స్థలాలలో వున్న అన్ని ఆలయాలను కూడా ధ్వంసము చేశాడు. ఇశ్రాయేలు రాజులు ఆ ఆలయాలను నిర్మించారు. అది యెహోవాను ఆగ్రహాపరిచింది. యోషీయా బేతేలులోని ఆరాధనాస్థలాలను ధ్వంసము చేసినట్లుగా, ఆ ఆలయాలను కూడా ధ్వంసము చేశాడు.
20యోషీయా షోమ్రోనులోని ఉన్నత స్థలాలకు చెందిన యాజకులందరినీ చంపివేశాడు. ఆ బలిపీఠముల మీద ఆ యాజకులను చంపాడు. బలిపీఠముల మీద మనుష్యుల ఎముకలు కాల్చాడు. ఈ విధంగా అతను ఆ ఆరాధనా స్థలాలను పాడుచేశాడు. తర్వాత అతను యెరుషలేముకు మరలి వెళ్లాడు.
యూదా ప్రజలు పస్కా పండుగను ఆచరించుట
21తర్వాత యోషీయా రాజు ప్రజలందరకు ఒక ఆజ్ఞ విధించాడు. “మీ దేవుడైన యెహోవాకు పస్కా పండుగను ఆచరించండి. ఒడంబడిక పుస్తకంలో వ్రాయబడినట్లుగా జరపండి” అని అతను చెప్పాడు.
22న్యాయాధిపతులు ఇశ్రాయేలుని పరిపాలించిన నాటినుంచి ప్రజలు ఈ విధంగా ఆ ఉత్సవము జరపలేదు. ఇశ్రాయేలు రాజులుగాని, యూదా రాజులుగాని పస్కా పండుగను అంత బ్రహ్మాండంగా ఆచరించి వుండలేదు. 23యోషీయా రాజయిన 18వ సంవత్సరాన యెరూషలేములో యెహోవాకు ఈ ఉత్సవము జరిపారు.
24కర్ణపిశాచి గలవారిని, సొదె చెప్పువారిని, గృహదేవతలను, విగ్రహాలను, యూదా యెరూషలేములోనున్న ప్రజలు పూజించే ఆ భయంకర వస్తువులను యోషీయా నాశనము చేశాడు. హిల్కీయా యాజకుడు యెహోవాయొక్క ఆలయములో కనుగొన్న ధర్మశాస్త్రములోని నియమాలను పాటించేందుకు యోషీయా ఈ విధముగా చేశాడు.
25అంతకు ముందు యోషీయా వంటి రాజు లేడు. యోషీయా పూర్ణహృదయముతో, పూర్ణ ఆత్మతో శక్తినంతా కూడాగట్టుకుని యెహోవా వైపు నిలిచాడు. యోషీయా వలె మోషే ధర్మశాస్త్రాన్ని ఏ రాజు పాటించి వుండలేదు. ఆ తర్వాత కూడా యోషీయా వంటి మరొక రాజు లేడు.
26కాని యూదా ప్రజలపట్ల యెహోవా తన ఆగ్రహాన్ని మానలేదు. మనష్షే చేసిన అన్ని పనులకు యెహోవా వారిపట్ల కోపముగా వున్నాడు. 27“ఇశ్రాయేలు ప్రజలు తమ దేశాన్ని బలవంతంగా వీడునట్లుగా నేను చేశాను. యూదాకు కూడా ఇలాగే చేస్తాను. నా దృష్టినుండి యూదాని మరలిస్తాను. నేను యెరూషలేమును అంగీకరించను. అవును. నేను నగరాన్ని ఏర్పరచుకున్నాను. నేను మాటలాడేటప్పుడు యెరూషలేము గురించి నేను ఇలా అన్నాను: ‘నా పేరు అక్కడ వుంటుంది’ అని. కాని నేను ఆ ప్రదేశంలో వున్న ఆలయాన్ని ధ్వంసము చేస్తాను” అని యెహోవా చెప్పాడు.
28యోషీయా చేసిన ఇతర పనులు “యూదా రాజుల చరిత్ర” అనే గ్రంథములో వ్రాయబడివున్నవి.
యోషీయా మరణం
29యెషీయా పరిపాలనా కాలంలో ఈజిప్టు రాజైన ఫరోనెకో యూఫ్రటీసు నది వద్ద అష్షూరు రాజుమీదికి దండెత్తి పోయెను. మెగిద్దోలో ఫరో యోషీయాను కలుసుకోడానికి వెళ్లాడు. ఫరో యోషీయాను చూసి, అతనిని చంపాడు. 30యోషీయా అధికారులు అతని దేహాన్ని రథము మీద వుంచి మెగిద్డోనుంచి యెరూషలేము వరకు మోసుకుపోయారు. వారు యోషీయాను అతని సమాధిలో సమాధి చేశారు.
తర్వాత సామాన్యులు యోషీయా కుమారుడైన యెహోయాహాజును అభిషేకించారు. వారు యెహోయాహాజును తమ క్రొత్త రాజుగా చేసుకున్నారు.
యెహోయాహాజు యూదా రాజుగా నియమింపబడుట
31యెహోయాహాజు రాజగు నాటికి, అతను 23 యేండ్లవాడు. యెరూషలేములో అతను మూడు నెలలు పరిపాలించాడు. అతని తల్లి పేరు హమూటలు. ఆమె లిబ్నాకి చెందిన యిర్మీయా కుమార్తె. 32యెహోయాహాజు యెహోవా తప్పు అని చెప్పిన పనులు చేశాడు. తన పూర్వీకులు చేసిన ఆ పనులనే యెహోయాహాజు చేశాడు.
33ఫరోనెకో హమాతు దేశములో రిబ్లా చెరసాలలో యెహోయాహాజును బంధించాడు.
34అందువల్ల యెహోయాహాజు యెరూషలేములో పరిపాలించలేకపోయాడు. ఫరోనెకో 7,500 తులాల వెండిని, 75 పౌన్ల బంగారమును యూదా కట్టునట్లుగా చేశాడు. ఫరోనెకో యోషీయా కుమారుడైన ఎల్యాకీమును కొత్త రాజుగా చేశాడు. ఫరోనెకో ఎల్యాకీము పేరుని యెహోయాకీము అని మార్చాడు. మరియు ఫరోనెకో ఎల్యాకీము యెహోయాహాజుని ఈజిప్టుకు తీసుకుని పోయాడు. యెహోయాహాజు ఈజిప్టులో మరణించాడు. 35యెహోయాకీము వెండి బంగారాలు ఫరోనెకోకి ఇచ్చాడు. కాని యెహోయాకీము ప్రజలచేత పన్నులు కట్టింపజేసి, ఆ ధనాన్ని ఫరోనెకోకి ఇచ్చాడు. అందువల్ల ప్రతి వ్యక్తి తనవంతు వెండిని, బంగారాన్ని ఇచ్చాడు. మరియు యెహోయాకీము రాజు ఆ ధనాన్ని ఫరోనెకోకి ఇచ్చాడు.
36యెహోయాకీము రాజగునాటికి, అతను 25 యేండ్లవాడు. అతను యెరూషలేములో 11 సంవత్సరాలు పరిపాలించాడు. అతని తల్లి పేరు జెబూదా. ఆమె రూమాకి చెందిన పెదాయా కుమార్తె. 37యెహోవా తప్పు అని చెప్పిన కార్యములు యెహోయాకీము చేసాడు. తన పూర్వికులు చేసిన పనులే యెహోయాకీము చేశాడు.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
2 రాజులు 23: TERV
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Telugu Holy Bible: Easy-to-Read Version
All rights reserved.
© 1997 Bible League International