స్తెఫను చనిపోయిన తర్వాత జరిగిన హింసలకు భక్తులు చెదిరిపోయారు. వీళ్ళలో కొందరు ఫొనీషియ, సైప్రసు, అంతియొకయ పట్టణాలకు వెళ్ళి దైవసందేశాన్ని యూదులకు మాత్రమే చెప్పారు. సైప్రసు, కురేనీ పట్టణాలకు చెందిన వీళ్ళలో కొందరు అంతియొకయకు వెళ్ళి, గ్రీకువారితో కూడా మాట్లాడటం మొదలు పెట్టారు. ప్రభువు అభయ హస్తం వాళ్ళ వెంట ఉంది. కనుక అనేకులు వాళ్ళు చెప్పిన దానిలో ఉన్న సత్యాన్ని గ్రహించి ప్రభువునందు విశ్వాసులయ్యారు. యెరూషలేములో వున్న సంఘం ఈ వార్త విని బర్నబాను అంతియొకయకు పంపింది. అతడు అంతియొకయకు వెళ్ళి అక్కడి ప్రజలపై దైవానుగ్రహం అమితంగా ఉండటం గమనించి చాలా ఆనందించాడు. ప్రభువు పట్ల మనసారా భక్తి చూపుతూ ఉండమని అక్కడి వాళ్ళందర్ని వేడుకున్నాడు. బర్నబా ఉత్తముడు. పరిశుద్ధాత్మ ప్రభావం అతనిపై సంపూర్ణంగా ఉంది. అంతేకాక దేవుని పట్ల సంపూర్ణమైన విశ్వాసం ఉంది. అనేకులు ప్రభువునందు విశ్వాసులయ్యారు. ఆ తర్వాత బర్నబా, తార్సు అనే పట్టణానికి వెళ్ళి సౌలు కోసం చూసాడు. అతణ్ణి కలుసుకొని అంతియొకయకు పిలుచుకు వచ్చాడు. సౌలు, బర్నబా ఒక సంవత్సరం అంతియొకయలో ఉన్నారు. అక్కడి సంఘాన్ని కలుసుకొంటూ అనేకులకు బోధించేవాళ్ళు. అంతియొకయలోని శిష్యులు మొదటిసారిగా “క్రైస్తవులు” అని పిలువబడ్డారు. ఆ రోజుల్లో కొంత మంది ప్రవక్తలు యెరూషలేమునుండి అంతియొకయకు వచ్చారు. వాళ్ళలో ఒకతని పేరు అగబు. అతడు లేచి నిలబడి పరిశుద్ధాత్మ శక్తితో, “తీవ్రమైన కరువు త్వరలో ప్రపంచమంతా రాబోతోంది” అని సూచించాడు. ఈ కరువు క్లౌదియ చక్రవర్తి పరిపాలిస్తున్న కాలంలో సంభవించింది. ఇది విని అంతియొకయలో ఉన్న శిష్యులు యూదయలో నివసిస్తున్న తమ సోదరుల కోసం తమకు చేతనయిన సహాయం వాళ్ళు చెయ్యాలని నిర్ణయించుకొన్నారు. అనుకొన్న విధంగా బర్నబా, సౌలు ద్వారా తాము పంపదలచిన వాటిని యూదయలోని పెద్దలకు పంపారు.
Read అపొస్తలుల 11
వినండి అపొస్తలుల 11
షేర్ చేయి
అన్ని అనువాదాలను సరిపోల్చండి: అపొస్తలుల 11:19-30
వచనాలను సేవ్ చేయండి, ఆఫ్‌లైన్‌లో చదవండి, బోధన క్లిప్‌లను చూడండి ఇంకా మరెన్నో చేయండి!
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు