అపొస్తలుల కార్యములు 11:19-30
అపొస్తలుల కార్యములు 11:19-30 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
స్తెఫను చంపబడినప్పుడు హింస కారణంగా చెదిరిపోయిన విశ్వాసులు ఫేనీకే, కుప్ర మరియు అంతియొకయ పట్టణ ప్రాంతాల వరకు వెళ్లి కేవలం యూదుల మధ్యనే సువార్త ప్రకటించారు. వారిలో కుప్ర మరియు కురేనీకు చెందిన కొందరు అంతియొకయ పట్టణానికి వెళ్లి గ్రీకు దేశస్థులతో కూడా ప్రభువైన యేసు సువార్తను చెప్పడం మొదలుపెట్టారు. ప్రభువు హస్తం వారికి తోడుగా ఉన్నందున, పెద్ద సంఖ్యలలో ప్రజలు నమ్మి, ప్రభువు వైపు తిరిగారు. ఈ సమాచారం యెరూషలేములో ఉన్న సంఘానికి చేరినప్పుడు వారు బర్నబాను అంతియొకయ ప్రాంతానికి పంపించారు. అతడు అక్కడ చేరాక దేవుని కృప చేసిన కార్యాలను చూసి అతడు సంతోషించి, తమ పూర్ణహృదయంతో ప్రభువుకు నమ్మకంగా ఉండాలని వారందరిని ప్రోత్సాహించాడు. బర్నబా మంచివాడు, పరిశుద్ధాత్మతో మరియు విశ్వాసంతో నిండినవాడు, అతని ద్వార పెద్ద సంఖ్యలో ప్రజలు ప్రభువులోనికి చేర్చబడ్డారు. ఆ తర్వాత బర్నబా సౌలును వెదకడానికి తార్సు పట్టణానికి వెళ్లి, అతన్ని కలుసుకొని అంతియొకయ ప్రాంతానికి తీసుకు వచ్చాడు. ఒక సంవత్సరం అంతా బర్నబా మరియు సౌలు ఆ సంఘంతో కలిసి ఉంటూ అనేకమందికి బోధించారు. అంతియొకయలో శిష్యులు మొదటిసారిగా క్రైస్తవులు అని పిలువబడ్డారు. ఆ రోజులలో యెరూషలేము నుండి అంతియొకయకు కొందరు ప్రవక్తలు వచ్చారు. వారిలో అగబు అనే పేరుగలవాడు నిలబడి, రోమా సామ్రాజ్యం అంతటా గొప్ప కరువు వస్తుందని ఆత్మ ద్వారా ప్రవచించాడు. అతడు చెప్పింది క్లౌదియ చక్రవర్తి కాలంలో జరిగింది. అప్పుడు ప్రతి ఒక్క విశ్వాసి తమ శక్తికొలది యూదయలో నివసిస్తున్న విశ్వాసులకు సహాయం అందించడానికి నిశ్చయించుకున్నారు. కనుక వారు బర్నబా మరియు సౌలుల ద్వారా ఆ సహాయాన్ని అక్కడి సంఘ పెద్దలకు పంపించారు.
అపొస్తలుల కార్యములు 11:19-30 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
స్తెఫను విషయంలో కలిగిన హింస వలన చెదరిపోయిన వారు యూదులకు తప్ప మరి ఎవరికీ వాక్కు బోధించకుండా ఫేనీకే, సైప్రస్, అంతియొకయ వరకూ సంచరించారు. వారిలో కొంతమంది సైప్రస్ వారూ, కురేనీ వారూ అంతియొకయ వచ్చి గ్రీకు వారితో మాట్లాడుతూ యేసు ప్రభువును ప్రకటించారు. ప్రభువు హస్తం వారికి తోడై ఉంది. అనేక మంది నమ్మి ప్రభువు వైపు తిరిగారు. వారిని గూర్చిన సమాచారం యెరూషలేములో ఉన్న సంఘం విని బర్నబాను అంతియొకయకు పంపింది. అతడు వచ్చి దైవానుగ్రహాన్ని చూసి సంతోషించి, ప్రభువులో పూర్ణ హృదయంతో నిలిచి ఉండాలని అందరినీ ప్రోత్సాహపరిచాడు. అతడు పరిశుద్ధాత్మతో విశ్వాసంతో నిండిన మంచి వ్యక్తి గనుక చాలామంది ప్రభువును నమ్మారు. బర్నబా సౌలును వెదకడానికి తార్సు ఊరు వెళ్ళి, అతనిని వెదికి కనుగొని అంతియొకయ తోడుకుని వచ్చాడు. వారు కలిసి ఒక సంవత్సరమంతా సంఘంతో ఉండి చాలామందికి బోధించారు. అంతియొకయలోని శిష్యులను మొట్టమొదటి సారిగా ‘క్రైస్తవులు’ అన్నారు. ఆ రోజుల్లో కొంతమంది ప్రవక్తలు యెరూషలేము నుండి అంతియొకయ వచ్చారు. వారిలో అగబు అనే ఒకడు నిలబడి, లోకమంతటా తీవ్రమైన కరువు రాబోతున్నదని ఆత్మ ద్వారా సూచించాడు. ఇది క్లాడియస్ చక్రవర్తి రోజుల్లో జరిగింది. అప్పుడు శిష్యుల్లో ప్రతివారూ తమ శక్తి కొద్దీ యూదయలోని సోదరులకు సహయం పంపడానికి నిశ్చయించుకున్నారు. వారు అలా చేసి, బర్నబా, సౌలుల ద్వారా పెద్దలకు డబ్బు పంపించారు.
అపొస్తలుల కార్యములు 11:19-30 పవిత్ర బైబిల్ (TERV)
స్తెఫను చనిపోయిన తర్వాత జరిగిన హింసలకు భక్తులు చెదిరిపోయారు. వీళ్ళలో కొందరు ఫొనీషియ, సైప్రసు, అంతియొకయ పట్టణాలకు వెళ్ళి దైవసందేశాన్ని యూదులకు మాత్రమే చెప్పారు. సైప్రసు, కురేనీ పట్టణాలకు చెందిన వీళ్ళలో కొందరు అంతియొకయకు వెళ్ళి, గ్రీకువారితో కూడా మాట్లాడటం మొదలు పెట్టారు. ప్రభువు అభయ హస్తం వాళ్ళ వెంట ఉంది. కనుక అనేకులు వాళ్ళు చెప్పిన దానిలో ఉన్న సత్యాన్ని గ్రహించి ప్రభువునందు విశ్వాసులయ్యారు. యెరూషలేములో వున్న సంఘం ఈ వార్త విని బర్నబాను అంతియొకయకు పంపింది. అతడు అంతియొకయకు వెళ్ళి అక్కడి ప్రజలపై దైవానుగ్రహం అమితంగా ఉండటం గమనించి చాలా ఆనందించాడు. ప్రభువు పట్ల మనసారా భక్తి చూపుతూ ఉండమని అక్కడి వాళ్ళందర్ని వేడుకున్నాడు. బర్నబా ఉత్తముడు. పరిశుద్ధాత్మ ప్రభావం అతనిపై సంపూర్ణంగా ఉంది. అంతేకాక దేవుని పట్ల సంపూర్ణమైన విశ్వాసం ఉంది. అనేకులు ప్రభువునందు విశ్వాసులయ్యారు. ఆ తర్వాత బర్నబా, తార్సు అనే పట్టణానికి వెళ్ళి సౌలు కోసం చూసాడు. అతణ్ణి కలుసుకొని అంతియొకయకు పిలుచుకు వచ్చాడు. సౌలు, బర్నబా ఒక సంవత్సరం అంతియొకయలో ఉన్నారు. అక్కడి సంఘాన్ని కలుసుకొంటూ అనేకులకు బోధించేవాళ్ళు. అంతియొకయలోని శిష్యులు మొదటిసారిగా “క్రైస్తవులు” అని పిలువబడ్డారు. ఆ రోజుల్లో కొంత మంది ప్రవక్తలు యెరూషలేమునుండి అంతియొకయకు వచ్చారు. వాళ్ళలో ఒకతని పేరు అగబు. అతడు లేచి నిలబడి పరిశుద్ధాత్మ శక్తితో, “తీవ్రమైన కరువు త్వరలో ప్రపంచమంతా రాబోతోంది” అని సూచించాడు. ఈ కరువు క్లౌదియ చక్రవర్తి పరిపాలిస్తున్న కాలంలో సంభవించింది. ఇది విని అంతియొకయలో ఉన్న శిష్యులు యూదయలో నివసిస్తున్న తమ సోదరుల కోసం తమకు చేతనయిన సహాయం వాళ్ళు చెయ్యాలని నిర్ణయించుకొన్నారు. అనుకొన్న విధంగా బర్నబా, సౌలు ద్వారా తాము పంపదలచిన వాటిని యూదయలోని పెద్దలకు పంపారు.
అపొస్తలుల కార్యములు 11:19-30 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
స్తెఫను విషయములో కలిగినశ్రమనుబట్టి చెదరి పోయినవారు యూదులకు తప్ప మరి ఎవనికిని వాక్యము బోధింపక, ఫేనీకే, కుప్ర, అంతియొకయ ప్రదేశములవరకు సంచరించిరి. కుప్రీయులు కొందరును కురేనీయులు కొందరును వారిలో ఉండిరి. వీరు అంతియొకయకు వచ్చి గ్రీసు దేశపువారితో మాటలాడుచు ప్రభువైన యేసునుగూర్చిన సువార్త ప్రకటించిరి; ప్రభువు హస్తము వారికి తోడైయుండెను గనుక నమ్మిన వారనేకులు ప్రభువుతట్టు తిరిగిరి. వారినిగూర్చిన సమాచారము యెరూషలేములోనున్న సంఘపువారు విని బర్నబాను అంతియొకయవరకు పంపిరి. అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి, ప్రభువును స్థిరహృదయముతో హత్తుకొనవలెనని అందరిని హెచ్చరించెను. అతడు పరిశుద్ధాత్మతోను విశ్వాసముతోను నిండుకొనిన సత్పురుషుడు; బహుజనులు ప్రభువు పక్షమున చేరిరి. అంతట అతడు సౌలును వెదకు టకు తార్సునకు వెళ్లి అతనిని కనుగొని అంతియొకయకు తోడుకొని వచ్చెను. వారు కలిసి యొక సంవత్సర మంతయు సంఘములో ఉండి బహుజనములకు వాక్యమును బోధించిరి. మొట్టమొదట అంతియొకయలో శిష్యులు క్రైస్తవులనబడిరి. ఆ దినములయందు ప్రవక్తలు యెరూషలేమునుండి అంతియొకయకు వచ్చిరి. వారిలో అగబు అను ఒకడు నిలువబడి, భూలోకమంతట గొప్ప కరవు రాబోవుచున్నదని ఆత్మ ద్వారా సూచించెను. అది క్లౌదియ చక్రవర్తి కాలమందు సంభవించెను. అప్పుడు శిష్యులలో ప్రతివాడును తన తన శక్తికొలది యూదయలో కాపురమున్న సహోదరులకు సహాయము పంపుటకు నిశ్చయించుకొనెను. ఆలాగున చేసి బర్నబా సౌలు అను వారిచేత పెద్దలయొద్దకు దానిని పంపిరి.
అపొస్తలుల కార్యములు 11:19-30 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
స్తెఫెను చంపబడినప్పుడు హింస కారణంగా చెదిరిపోయిన విశ్వాసులు ఫేనీకే, కుప్ర అంతియొకయ పట్టణ ప్రాంతాల వరకు వెళ్లి కేవలం యూదుల మధ్యనే సువార్త ప్రకటించారు. వారిలో కుప్ర కురేనీకు చెందిన కొందరు అంతియొకయ పట్టణానికి వెళ్లి గ్రీకు దేశస్థులతో కూడా ప్రభువైన యేసు సువార్తను చెప్పడం మొదలుపెట్టారు. ప్రభువు హస్తం వారికి తోడుగా ఉన్నందున, పెద్ద సంఖ్యలలో ప్రజలు నమ్మి, ప్రభువు వైపు తిరిగారు. ఈ సమాచారం యెరూషలేములో ఉన్న సంఘానికి చేరినప్పుడు వారు బర్నబాను అంతియొకయ ప్రాంతానికి పంపించారు. అతడు అక్కడ చేరాక దేవుని కృప చేసిన కార్యాలను చూసి అతడు సంతోషించి, తమ పూర్ణహృదయంతో ప్రభువుకు నమ్మకంగా ఉండాలని వారందరిని ప్రోత్సాహించాడు. బర్నబా మంచివాడు, పరిశుద్ధాత్మతో విశ్వాసంతో నిండినవాడు, అతని ద్వార పెద్ద సంఖ్యలో ప్రజలు ప్రభువులోనికి చేర్చబడ్డారు. ఆ తర్వాత బర్నబా సౌలును వెదకడానికి తార్సు పట్టణానికి వెళ్లి, అతన్ని కలుసుకొని అంతియొకయ ప్రాంతానికి తీసుకువచ్చాడు. ఒక సంవత్సరం అంతా బర్నబా సౌలు ఆ సంఘంతో కలిసి ఉంటూ అనేకమందికి బోధించారు. అంతియొకయలో శిష్యులు మొదటిసారిగా క్రైస్తవులు అని పిలువబడ్డారు. ఆ రోజుల్లో యెరూషలేము నుండి అంతియొకయకు కొందరు ప్రవక్తలు వచ్చారు. వారిలో అగబు అనే పేరు కలవాడు నిలబడి, రోమా సామ్రాజ్యం అంతటా గొప్ప కరువు వస్తుందని ఆత్మ ద్వారా ప్రవచించాడు. అతడు చెప్పింది క్లౌదియ చక్రవర్తి కాలంలో జరిగింది. అప్పుడు ప్రతి ఒక్క విశ్వాసి తమ శక్తికొలది యూదయలో నివసిస్తున్న విశ్వాసులకు సహాయం అందించడానికి నిశ్చయించుకున్నారు. కాబట్టి వారు బర్నబా సౌలుల ద్వారా ఆ సహాయాన్ని అక్కడి సంఘ పెద్దలకు పంపించారు.