అపొస్తలుల 7:51-60

అపొస్తలుల 7:51-60 TERV

స్తెఫను ఉపన్యాసం సాగిస్తూ, “మూర్ఖులారా! మీ హృదయాలు యూదులు కానివాళ్ళ హృదయాల వలే ఉన్నాయి. మీ చెవులు దైవసందేశాన్ని వినటానికి నిరాకరిస్తున్నాయి. మీరు మీ పూర్వులు ప్రవర్తించినట్లు ప్రవర్తిస్తున్నారు. వాళ్ళవలె మీరు కూడా అన్ని వేళలా పవిత్రాత్మను తృణీకరించారు. మీ పూర్వులు హింసించని ప్రవక్త ఒక్కడైనా ఉన్నాడా! నీతిమంతుడు రానున్నాడని ప్రవచనం చెప్పినవాళ్ళను వాళ్ళు చంపివేసారు. ఇక మీరు ద్రోహం చేసి క్రీస్తుని కూడా చంపేసారు. దేవదూతల ద్వారా అందివ్వబడిన దేవుని ధర్మశాస్త్రం లభించింది మీకు. కాని దాన్ని మీరు పాటించను కూడా లేదు” అని అన్నాడు. ఈ మాటలు విని వాళ్ళు కోపంతో మండిపోయి, అతణ్ణి చూసి పళ్ళు కొరికారు. కాని స్తెఫను పవిత్రాత్మతో నిండిపోయి పరలోకం వైపు చూసి దేవుని తేజస్సును, యేసు దేవుని కుడి వైపు ఉండటం చూసాడు. “అదిగో చూడండి! పరలోకం తెరుచుకోవటం. దేవుని కుమారుడు ఆయన కుడి వైపు నిలుచొని వుండటం చూస్తున్నాను!” అని అన్నాడు. ఈ మాటలు విని వెంటనే వాళ్ళు తమ చెవులు మూసుకున్నారు. బిగ్గరగా కేకలు వేస్తూ అతని మీదికి వెళ్ళారు. అతణ్ణి ఊరి బయటికి లాగి రాళ్ళతో కొట్టటం మొదలు పెట్టారు. ఈ సంఘటనను చూస్తున్నవాళ్ళు తమ వస్త్రాల్ని “సౌలు” అనబడే ఒక యువకుని కాళ్ళ ముందు వుంచారు. వాళ్ళు రాళ్ళు విసరుతుండగా స్తెఫను, “యేసు ప్రభూ! నా ఆత్మను నీలో చేర్చుకో!” అని ప్రార్థించాడు. ఆ తదుపరి మోకరిల్లి, “ప్రభూ! వాళ్ళపై ఈ పాపం మోపవద్దు!” అని బిగ్గరగా అన్నాడు. ఈ మాట అన్న వెంటనే కళ్ళు మూసాడు.