అపొస్తలుల కార్యములు 7:51-60
అపొస్తలుల కార్యములు 7:51-60 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచనొల్లనివారలారా, మీపితరులవలె మీరును ఎల్లప్పుడు పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. మీపితరులు ప్రవక్తలలో ఎవనిని హింసింపక యుండిరి? ఆ నీతిమంతుని రాకనుగూర్చి ముందు తెలిపినవారిని చంపిరి. ఆయనను మీరు ఇప్పుడు అప్పగించి హత్య చేసినవారైతిరి. దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రమును మీరు పొందితిరిగాని దానిని గైకొనలేదని చెప్పెను. వారీ మాటలు విని కోపముతో మండిపడి అతనిని చూచి పండ్లుకొరికిరి. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనినవాడై ఆకాశమువైపు తేరిచూచి, దేవుని మహిమను యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి యుండుటను చూచి –ఆకాశము తెరవబడుటయు, మనుష్యకుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి యుండుటయు చూచుచున్నానని చెప్పెను. అప్పుడు వారు పెద్ద కేకలువేసి చెవులు మూసికొని యేకముగా అతనిమీదపడి పట్టణపు వెలుపలికి అతనిని వెళ్లగొట్టి, రాళ్లు రువ్వి చంపిరి. సాక్షులు సౌలు అను ఒక యౌవనుని పాదములయొద్ద తమ వస్త్రములుపెట్టిరి. ప్రభువునుగూర్చి మొరపెట్టుచు–యేసు ప్రభువా, నా ఆత్మను చేర్చుకొనుమని స్తెఫను పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరి. అతడు మోకాళ్లూని – ప్రభువా, వారిమీద ఈ పాపము మోపకుమని గొప్ప శబ్దముతో పలికెను; ఈ మాట పలికి నిద్రించెను. సౌలు అతని చావునకు సమ్మతించెను.
అపొస్తలుల కార్యములు 7:51-60 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
“మెడవంచని ప్రజలారా! మీ హృదయాలు మరియు మీ చెవులు ఇంకా సున్నతి పొందనివిగా ఉన్నాయి. మీరు మీ పితరుల వలె ఎప్పుడు పరిశుద్ధాత్మను వ్యతిరేకిస్తున్నారు. మీ పితరులు హింసించని ప్రవక్త ఒకడైనా ఉన్నాడా? ఆ నీతిమంతుని రాకను ముందుగానే ప్రవచించిన వారందరిని చంపేశారు. ఇప్పుడు మీరు అతన్ని అప్పగించి హత్య చేశారు. దేవదూతల ద్వారా అందించిన ధర్మశాస్త్రాన్ని మీరు పొందుకొన్నారు కాని దానికి లోబడలేదు” అన్నాడు. న్యాయసభ సభ్యులు ఈ మాటలు వినినప్పుడు, చాలా కోపంతో స్తెఫనును చూసి పండ్లు కొరికారు. కానీ స్తెఫను పరిశుద్ధాత్మతో నింపబడి ఆకాశం వైపు తన తలనెత్తి దేవుని మహిమను, దేవుని కుడి వైపు యేసు నిలబడి ఉండడం చూసాడు. అతడు వారితో, “చూడండి! నేను పరలోకం తెరవబడి ఉండడం మరియు మనుష్యకుమారుడు దేవుని కుడి వైపు నిలబడి ఉండడం నేను చూస్తున్నాను” అని చెప్పాడు. అందుకు వారందరు తమ చెవులను మూసుకొని పెద్దగా కేకలువేస్తూ, అతని మీద పడి, పట్టణం బయటకు అతన్ని ఈడ్చుకొని వెళ్లి, రాళ్లతో కొట్టడం మొదలుపెట్టారు. చూసే సాక్షులందరు తమ వస్త్రాలను సౌలు అనే యువకుని పాదాల దగ్గర పెట్టారు. వారు స్తెఫనును రాళ్ళతో కొడుతున్నప్పుడు అతడు, “యేసు ప్రభువా, నా ఆత్మను చేర్చుకో” అని ప్రార్థించాడు. తర్వాత అతడు మోకరించి, “ప్రభువా, ఈ పాపాన్ని వీరి మీద మోపకు” అని మొరపెట్టాడు. ఈ మాటలు చెప్పిన తర్వాత, అతడు నిద్రించాడు.
అపొస్తలుల కార్యములు 7:51-60 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
“మీరు మెడ వంచనివారూ, హృదయంలో చెవులలో సున్నతి లేని వారు. మీరు కూడా మీ పూర్వీకుల లాగే ప్రవర్తిస్తున్నారు, ఎప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరిస్తున్నారు. మీ పూర్వీకులు ఏ ప్రవక్తను హింసించకుండా ఉన్నారు? ఆ నీతిమంతుని రాకను గూర్చి ముందే తెలియజేసిన వారిని చంపేశారు. ఆయనను కూడా మీరిప్పుడు అప్పగించి హత్య చేసిన వారయ్యారు. దూతలు అందించిన ధర్మశాస్త్రాన్ని పొందారు గాని దాన్ని మీరే పాటించలేదు” అని చెప్పాడు. మహాసభ వారు ఈ మాటలు విని కోపంతో మండిపడి స్తెఫనును చూసి పళ్ళు కొరికారు. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండి ఆకాశం వైపు తదేకంగా చూస్తూ, దేవుని తేజస్సును చూశాడు. దేవుని కుడి పక్కన యేసు నిలబడి ఉండడం చూసి “ఆకాశం తెరుచుకోవడం, మనుష్య కుమారుడు దేవుని కుడి పక్క నిలిచి ఉండడం చూస్తున్నాను” అని పలికాడు. అప్పుడు వారు గట్టిగా కేకలు వేస్తూ చెవులు మూసుకుని మూకుమ్మడిగా అతని మీదికి వచ్చి అతనిని పట్టణం బయటకు ఈడ్చుకు పోయి, రాళ్ళతో కొట్టారు. సాక్షులు సౌలు అనే యువకుని పాదాల దగ్గర తమ పైబట్టలు పెట్టారు. వారు స్తెఫనును రాళ్ళతో కొడుతూ ఉన్నపుడు అతడు ప్రభువును పిలుస్తూ, “యేసు ప్రభూ, నా ఆత్మను చేర్చుకో” అని చెప్పాడు. అతడు మోకరించి, “ప్రభూ, వీరి మీద ఈ పాపం మోపవద్దు” అని గొంతెత్తి పలికాడు. ఈ మాట పలికి కన్ను మూశాడు. సౌలు అతని చావుకు సమ్మతించాడు.
అపొస్తలుల కార్యములు 7:51-60 పవిత్ర బైబిల్ (TERV)
స్తెఫను ఉపన్యాసం సాగిస్తూ, “మూర్ఖులారా! మీ హృదయాలు యూదులు కానివాళ్ళ హృదయాల వలే ఉన్నాయి. మీ చెవులు దైవసందేశాన్ని వినటానికి నిరాకరిస్తున్నాయి. మీరు మీ పూర్వులు ప్రవర్తించినట్లు ప్రవర్తిస్తున్నారు. వాళ్ళవలె మీరు కూడా అన్ని వేళలా పవిత్రాత్మను తృణీకరించారు. మీ పూర్వులు హింసించని ప్రవక్త ఒక్కడైనా ఉన్నాడా! నీతిమంతుడు రానున్నాడని ప్రవచనం చెప్పినవాళ్ళను వాళ్ళు చంపివేసారు. ఇక మీరు ద్రోహం చేసి క్రీస్తుని కూడా చంపేసారు. దేవదూతల ద్వారా అందివ్వబడిన దేవుని ధర్మశాస్త్రం లభించింది మీకు. కాని దాన్ని మీరు పాటించను కూడా లేదు” అని అన్నాడు. ఈ మాటలు విని వాళ్ళు కోపంతో మండిపోయి, అతణ్ణి చూసి పళ్ళు కొరికారు. కాని స్తెఫను పవిత్రాత్మతో నిండిపోయి పరలోకం వైపు చూసి దేవుని తేజస్సును, యేసు దేవుని కుడి వైపు ఉండటం చూసాడు. “అదిగో చూడండి! పరలోకం తెరుచుకోవటం. దేవుని కుమారుడు ఆయన కుడి వైపు నిలుచొని వుండటం చూస్తున్నాను!” అని అన్నాడు. ఈ మాటలు విని వెంటనే వాళ్ళు తమ చెవులు మూసుకున్నారు. బిగ్గరగా కేకలు వేస్తూ అతని మీదికి వెళ్ళారు. అతణ్ణి ఊరి బయటికి లాగి రాళ్ళతో కొట్టటం మొదలు పెట్టారు. ఈ సంఘటనను చూస్తున్నవాళ్ళు తమ వస్త్రాల్ని “సౌలు” అనబడే ఒక యువకుని కాళ్ళ ముందు వుంచారు. వాళ్ళు రాళ్ళు విసరుతుండగా స్తెఫను, “యేసు ప్రభూ! నా ఆత్మను నీలో చేర్చుకో!” అని ప్రార్థించాడు. ఆ తదుపరి మోకరిల్లి, “ప్రభూ! వాళ్ళపై ఈ పాపం మోపవద్దు!” అని బిగ్గరగా అన్నాడు. ఈ మాట అన్న వెంటనే కళ్ళు మూసాడు.
అపొస్తలుల కార్యములు 7:51-60 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
“మెడవంచని ప్రజలారా! మీ హృదయాలు మీ చెవులు ఇంకా సున్నతి పొందనివిగా ఉన్నాయి. మీరు మీ పితరుల వలె ఎప్పుడు పరిశుద్ధాత్మను వ్యతిరేకిస్తున్నారు. మీ పితరులు హింసించని ప్రవక్త ఒకడైనా ఉన్నాడా? ఆ నీతిమంతుని రాకను ముందుగానే ప్రవచించిన వారందరిని చంపేశారు. ఇప్పుడు మీరు అతన్ని అప్పగించి హత్య చేశారు. దేవదూతల ద్వారా చేయించిన ధర్మశాస్త్రాన్ని మీరు పొందుకున్నారు కాని దానికి లోబడలేదు” అన్నాడు. న్యాయసభ సభ్యులు ఈ మాటలు విన్నప్పుడు, చాలా కోపంతో స్తెఫెనును చూసి పండ్లు కొరికారు. కానీ స్తెఫెను పరిశుద్ధాత్మతో నింపబడి ఆకాశం వైపు తన తలనెత్తి దేవుని మహిమను, దేవుని కుడిచేతి వైపున యేసు నిలబడి ఉండడం చూశాడు. అతడు వారితో, “చూడండి! నేను పరలోకం తెరవబడి ఉండడం, మనుష్యకుమారుడు దేవుని కుడిచేతి వైపున నిలబడి ఉండడం నేను చూస్తున్నాను” అని చెప్పాడు. అందుకు వారందరు తమ చెవులను మూసుకొని పెద్దగా కేకలువేస్తూ, అతని మీద పడి, పట్టణం బయటకు అతన్ని ఈడ్చుకొని వెళ్లి, రాళ్లతో కొట్టడం మొదలుపెట్టారు. చూసే సాక్షులందరు తమ వస్త్రాలను సౌలు అనే యువకుని పాదాల దగ్గర పెట్టారు. వారు స్తెఫెనును రాళ్లతో కొడుతున్నప్పుడు అతడు, “యేసు ప్రభువా, నా ఆత్మను చేర్చుకో” అని ప్రార్థించాడు. తర్వాత అతడు మోకరించి, “ప్రభువా, ఈ పాపాన్ని వీరి మీద మోపకు” అని మొరపెట్టాడు. ఈ మాటలు చెప్పిన తర్వాత, అతడు నిద్రించాడు.