అపొస్తలుల కార్యములు 7:51-60

అపొస్తలుల కార్యములు 7:51-60 OTSA

“మెడవంచని ప్రజలారా! మీ హృదయాలు మీ చెవులు ఇంకా సున్నతి పొందనివిగా ఉన్నాయి. మీరు మీ పితరుల వలె ఎప్పుడు పరిశుద్ధాత్మను వ్యతిరేకిస్తున్నారు. మీ పితరులు హింసించని ప్రవక్త ఒకడైనా ఉన్నాడా? ఆ నీతిమంతుని రాకను ముందుగానే ప్రవచించిన వారందరిని చంపేశారు. ఇప్పుడు మీరు అతన్ని అప్పగించి హత్య చేశారు. దేవదూతల ద్వారా చేయించిన ధర్మశాస్త్రాన్ని మీరు పొందుకున్నారు కాని దానికి లోబడలేదు” అన్నాడు. న్యాయసభ సభ్యులు ఈ మాటలు విన్నప్పుడు, చాలా కోపంతో స్తెఫెనును చూసి పండ్లు కొరికారు. కానీ స్తెఫెను పరిశుద్ధాత్మతో నింపబడి ఆకాశం వైపు తన తలనెత్తి దేవుని మహిమను, దేవుని కుడిచేతి వైపున యేసు నిలబడి ఉండడం చూశాడు. అతడు వారితో, “చూడండి! నేను పరలోకం తెరవబడి ఉండడం, మనుష్యకుమారుడు దేవుని కుడిచేతి వైపున నిలబడి ఉండడం నేను చూస్తున్నాను” అని చెప్పాడు. అందుకు వారందరు తమ చెవులను మూసుకొని పెద్దగా కేకలువేస్తూ, అతని మీద పడి, పట్టణం బయటకు అతన్ని ఈడ్చుకొని వెళ్లి, రాళ్లతో కొట్టడం మొదలుపెట్టారు. చూసే సాక్షులందరు తమ వస్త్రాలను సౌలు అనే యువకుని పాదాల దగ్గర పెట్టారు. వారు స్తెఫెనును రాళ్లతో కొడుతున్నప్పుడు అతడు, “యేసు ప్రభువా, నా ఆత్మను చేర్చుకో” అని ప్రార్థించాడు. తర్వాత అతడు మోకరించి, “ప్రభువా, ఈ పాపాన్ని వీరి మీద మోపకు” అని మొరపెట్టాడు. ఈ మాటలు చెప్పిన తర్వాత, అతడు నిద్రించాడు.