సౌలు ప్రభువు అనుచరుల్ని చంపిస్తానని ఇంకా ఎగిరిపడ్తూనే ఉన్నాడు. ప్రధానయాజకుని దగ్గరకు వెళ్ళి డెమాస్కసు పట్టణంలోని సమాజ మందిరాలకు ఉత్తరాలు వ్రాసి యివ్వమని అడిగాడు. ప్రభువు మార్గాన్ని అనుసరించేవాళ్ళు కనిపిస్తే స్త్రీ, పురుష భేదం లేకుండా వాళ్ళను బంధించి యెరూషలేముకు తీసుకు రావాలని అతని ఉద్దేశ్యం. అతడు డెమాస్కసు పొలిమేరలు చేరుకున్నాడు. అకస్మాత్తుగా ఆకాశంనుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించింది. అతడు నేలకూలిపొయ్యాడు. ఒక స్వరం, “సౌలా! సౌలా! నన్నెందుకు హింసిస్తున్నావు?” అని వినబడింది. “ప్రభూ! మీరెవరు?” అని సౌలు అడిగాడు. “నేను నీవు హింసిస్తున్న యేసును. లేచి పట్టణంలోకి వెళ్ళు. నీవేం చెయ్యాలో అక్కడ నీకు చెప్పబడుతుంది” అని ఆయన సమాధానం చెప్పాడు. సౌలుతో ప్రయాణం చేస్తున్నవాళ్ళు మూగవాళ్ళలా నిల్చున్నారు. వాళ్ళు ఆ స్వరం విన్నారే కాని వాళ్ళకెవ్వరూ కనపడలేదు. క్రింద పడ్డ సౌలు లేచి నిలుచొని కళ్ళు తెరిచాడు. కాని అతనికి ఏమీ కనిపించలేదు. వాళ్ళతని చేయి పట్టుకొని డెమాస్కసులోనికి నడిపించారు. మూడు రోజుల దాకా అతడు గ్రుడ్డివానిగానే ఉండిపోయాడు. ఆహారం కాని, నీళ్ళు కాని ముట్టలేదు. డెమాస్కసులో యేసు భక్తుడొకడుండేవాడు. అతని పేరు అననీయ. ప్రభువతనికి దివ్యదర్శనంలో కనపడి, “అననీయా!” అని పిలిచాడు. “ఇదిగో, ఇక్కడున్నాను ప్రభూ!” అని అతడు జవాబు చెప్పాడు. ప్రభువతనితో, “‘తిన్నని వీధి’ అని పిలువబడే వీధిలో ఉన్న ‘యూదా’ యింటికి వెళ్ళు, ‘తార్సు’ అనే పట్టణంనుండి వచ్చిన సౌలు అనే వ్యక్తి కోసం అడుగు. అతడు ప్రార్థిస్తూ ఉంటాడు. అతడొక దివ్యదర్శనంలో ‘అననీయ’ అనే పేరుగలవాడు అతని దగ్గరకు వచ్చినట్లు, అతనికి దృష్టి రావటానికి అతనిపై చేతులుంచబడినట్లు చూసాడు” అని చెప్పాడు. అననీయ, “ప్రభూ, అతడు యెరూషలేంలోని పరిశుద్ధులకు చాలా హాని చేసినట్లు చాలా మంది విన్నారు. మిమ్మల్ని శరణుజొచ్చిన ప్రతి ఒక్కణ్ణి బంధించే అధికారం అతడు ప్రధానయాజకుల దగ్గరనుండి పొందాడు”, అని సమాధానం చెప్పాడు. అప్పుడు ప్రభువు అననీయతో, “వెళ్ళు! నా పేరు యూదులు కానివాళ్ళకు, వాళ్ళ పాలకులకు, ఇశ్రాయేలు ప్రజలకు ప్రచారం చేయటానికి యితణ్ణి నేను ఒక సాధనంగా ఎన్నుకొన్నాను. నా పేరిట అతడెన్ని కష్టాలు పడవలసి వస్తుందో నేనతనికి తెలియచేస్తాను” అని అన్నాడు. ఆ తర్వాత అననీయ అక్కడినుండి బయలుదేరి సౌలు ఉన్న యింటికి వెళ్ళాడు. తన చేతుల్ని సౌలు మీద ఉంచి, “సోదరుడా! సౌలా! యేసు ప్రభువు నీవిక్కడికి వస్తున్నప్పుడు నీకు దారిలో కనిపించాడే, ఆయనే, నీవు మళ్ళీ చూడగలగాలని, పవిత్రాత్మ నీలో నిండాలని నన్ను పంపాడు” అని అన్నాడు. వెంటనే పొరల్లాంటివి సౌలు కళ్ళనుండి రాలి క్రిందపడ్డాయి. అతడు మళ్ళీ చూడగలిగాడు. అతడు లేచి బాప్తిస్మము పొందాడు. ఆ తర్వాత కొంత ఆహారాన్ని పుచ్చుకొన్నాక అతనికి బలం వచ్చింది.
Read అపొస్తలుల 9
వినండి అపొస్తలుల 9
షేర్ చేయి
అన్ని అనువాదాలను సరిపోల్చండి: అపొస్తలుల 9:1-19
వచనాలను సేవ్ చేయండి, ఆఫ్‌లైన్‌లో చదవండి, బోధన క్లిప్‌లను చూడండి ఇంకా మరెన్నో చేయండి!
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు