అపొస్తలుల కార్యములు 9:1-19
అపొస్తలుల కార్యములు 9:1-19 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
సౌలు ఇంకను ప్రభువుయొక్క శిష్యులను బెదరించు టయును హత్యచేయుటయును తనకు ప్రాణాధారమైనట్టు ప్రధానయాజకునియొద్దకు వెళ్లి యీ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొనినయెడల, వారిని బంధించి యెరూషలేమునకు తీసికొని వచ్చుటకు దమస్కులోని సమాజములవారికి పత్రికలిమ్మని అడిగెను. అతడు ప్రయాణము చేయుచు దమస్కుదగ్గరకు వచ్చి నప్పుడు, అకస్మాత్తుగా ఆకాశమునుండి యొక వెలుగు అతనిచుట్టు ప్రకాశించెను. అప్పుడతడు నేలమీదపడి –సౌలా, సౌలా, నీవేల నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. –ప్రభువా, నీవెవడవని అతడడుగగా ఆయన–నేను నీవు హింసించు చున్న యేసును; లేచి పట్టణములోనికి వెళ్లుము, అక్కడ నీవు ఏమి చేయవలెనో అది నీకు తెలుపబడునని చెప్పెను. అతనితో ప్రయాణము చేసిన మనుష్యులు ఆ స్వరము వినిరి గాని యెవనిని చూడక మౌనులై నిలువ బడిరి. సౌలు నేలమీదనుండి లేచి కన్నులు తెరచినను ఏమియు చూడలేక పోయెను గనుక వారతని చెయ్యి పట్టుకొని దమస్కులోనికి నడిపించిరి. అతడు మూడుదినములు చూపులేక అన్నపానము లేమియు పుచ్చుకొనకుండెను. దమస్కులో అననీయ అను ఒక శిష్యుడుండెను. ప్రభువు దర్శనమందు–అననీయా, అని అతనిని పిలువగా అతడు–ప్రభువా, యిదిగో నేనున్నాననెను. అందుకు ప్రభువు–నీవు లేచి, తిన్ననిదనబడిన వీధికి వెళ్లి, యూదా అనువాని యింట తార్సువాడైన సౌలు అనువానికొరకు విచారించుము; ఇదిగో అతడు ప్రార్థనచేయుచున్నాడు. అతడు అననీయ అను నొక మనుష్యుడు లోపలికివచ్చి, తాను దృష్టిపొందునట్లు తలమీద చేతులుంచుట చూచియున్నాడని చెప్పెను. అందుకు అననీయ–ప్రభువా, యీ మనుష్యుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసియున్నాడని అతనిగూర్చి అనేకులవలన వింటిని. ఇక్కడను నీ నామమునుబట్టి ప్రార్థనచేయు వారినందరిని బంధించుటకు అతడు ప్రధానయాజకులవలన అధికారము పొంది యున్నాడని ఉత్తరమిచ్చెను. అందుకు ప్రభువు–నీవు వెళ్లుము, అన్యజనుల యెదుటను రాజుల యెదుటను ఇశ్రాయేలీయుల యెదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమై యున్నాడు ఇతడు నా నామముకొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలెనో నేను ఇతనికి చూపుదునని అతనితో చెప్పెను. అననీయ వెళ్లి ఆ యింట ప్రవేశించి, అతని మీద చేతులుంచి–సౌలా, సహోదరుడా నీవు వచ్చిన మార్గములో నీకు కనబడిన ప్రభువైన యేసు, నీవు దృిష్టిపొంది, పరిశుద్ధాత్మతో నింపబడునట్లు నన్ను పంపి యున్నాడని చెప్పెను. అప్పుడే అతని కన్నులనుండి పొరలవంటివి రాలగా దృష్టికలిగి, లేచి బాప్తిస్మము పొందెను; తరువాత ఆహారము పుచ్చుకొని బలపడెను. పిమ్మట అతడు దమస్కులోనున్న శిష్యులతోకూడ కొన్ని దినములుండెను.
అపొస్తలుల కార్యములు 9:1-19 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
మరోవైపు, సౌలు, ప్రభువు శిష్యులను చంపుతానని బెదిరిస్తూనే ఉన్నాడు. అతడు ప్రధాన యాజకుని దగ్గరకు వెళ్లి, ఆ మార్గాన్ని అనుసరిస్తూ ఎవరైనా తనకు కనబడితే, పురుషులనైనా స్త్రీలనైనా బంధీలుగా యెరూషలేముకు తీసుకొనిరావడానికి, దమస్కులోని సమాజమందిరాల వారికి ఉత్తరాలు రాసి ఇవ్వుమని అడిగాడు. వాటిని తీసుకొని అతడు ప్రయాణిస్తూ, దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా పరలోకం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించింది. అతడు నేల మీద పడిపోయి, ఒక స్వరం “సౌలా, సౌలా, నీవు నన్ను ఎందుకు హింసిస్తున్నావు?” అని అనడం విన్నాడు. అందుకు సౌలు, “ప్రభువా, నీవు ఎవరు?” అని అడిగాడు. అప్పుడు ఆ స్వరం అతనితో, “నేను, నీవు హింసిస్తున్న యేసును నీవు లేచి పట్టణంలోనికి వెళ్లు, నీవు అక్కడ ఏమి చేయాలో నీకు తెలుస్తుంది” అన్నది. సౌలుతో పాటు ప్రయాణం చేస్తున్నవారు ఆ శబ్దాన్ని విన్నారు కాని మౌనంగా నిలబడిపోయారు, వారికి స్వరం వినబడింది కాని ఎవ్వరూ కనబడలేదు. సౌలు నేల నుండి లేచి, కళ్లు తెరిచినప్పుడు ఏమి చూడలేకపోయాడు. కనుక వారు అతని చేయి పట్టుకొని దమస్కు పట్టణంలోనికి నడిపించారు. మూడు రోజులు చూపులేకుండా ఉన్నాడు, ఏమి తినలేదు త్రాగలేదు. దమస్కు పట్టణంలో అననీయ అనే ఒక శిష్యుడు ఉన్నాడు. దర్శనంలో ప్రభువు అతన్ని “అననీయా!” అని పిలిచారు. అప్పుడు అతడు, “ప్రభువా” నేనే అని సమాధానం చెప్పాడు. ప్రభువు అతనితో, “తిన్నని వీధిలో యూదా అనే వాని ఇంటికి వెళ్లి తార్సు నుండి వచ్చిన సౌలును గురించి అడుగు, ఎందుకంటే అతడు ప్రార్థన చేస్తున్నాడు. అననీయ అనే వ్యక్తి వచ్చి, తాను చూపు పొందుకోవడానికి తనపై చేతులు ఉంచుతాడని ఒక దర్శనంలో అతడు చూసాడు” అన్నారు. అందుకు అననీయ, “ప్రభువా, అతని గురించి, అతడు యెరూషలేములో నిన్ను విశ్వసించిన వారికి చేసిన హానిని గురించి అనేక విషయాలను నేను విన్నాను. ఇంకా ఇక్కడ కూడా నీ పేరట ప్రార్థించే వారందరిని బంధించడానికి ముఖ్యయాజకుల నుండి అధికారాన్ని పొందుకొని ఇక్కడికి వచ్చాడు” అని జవాబిచ్చాడు. అయితే ప్రభువు అననీయతో, “వెళ్లు! ఇతడు ఇశ్రాయేలీయులకు మరియు యూదేతరులకు మరియు వారి రాజులకు నా నామంను ప్రకటించడానికి నేను ఏర్పరచుకున్న నా సాధనం. నా పేరు కొరకు ఇతడు ఎన్ని శ్రమలు అనుభవించాలో నేను ఇతనికి చూపిస్తాను” అని చెప్పారు. అప్పుడు అననీయ ఆ ఇంటికి వెళ్లి సౌలు మీద తన చేతులుంచి అతనితో, “సహోదరుడా సౌలు, నీవు ఇక్కడ వస్తున్నప్పుడు మార్గంలో నీకు కనబడిన ప్రభువైన యేసు, నీవు మరలా చూపు పొందాలని, పరిశుద్ధాత్మతో నింపబడాలని నన్ను నీ దగ్గరకు పంపించారు” అని చెప్పాడు. వెంటనే, సౌలు కళ్ళ నుండి పొరల వంటివి రాలిపడి, అతడు మరలా చూడగలిగాడు. అతడు లేచి బాప్తిస్మం పొందుకొన్నాడు. అతడు కొంత ఆహారం తీసుకున్న తర్వాత శక్తి పొందుకొన్నాడు.
అపొస్తలుల కార్యములు 9:1-19 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ప్రభువు శిష్యులను హతమారుస్తానని సౌలు యింకా బెదిరింపు మాటలు పలుకుతూ ప్రధాన యాజకుని దగ్గరికి వెళ్ళి యేసు మార్గాన్ని అనుసరించే పురుషులు గానీ స్త్రీలు గానీ తనకు దొరికితే, వారిని బంధించి యెరూషలేముకు తీసికొచ్చేలా దమస్కు ఊరి సమాజ మందిరాల వారికి ఉత్తరాలు రాసి ఇమ్మని అడిగాడు. అతడు ప్రయాణం చేస్తూ దమస్కు సమీపించే సరికి, అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించింది. అప్పుడతడు నేల మీద పడిపోయాడు. “సౌలూ, సౌలూ, నీవెందుకు నన్ను హింసిస్తున్నావు?” అనే ఒక శబ్దం విన్నాడు. “ప్రభూ, నీవెవరివి?” అని అతడు అడిగినప్పుడు, ప్రభువు, “నువ్వు హింసిస్తున్న యేసుని. లేచి పట్టణంలోకి వెళ్ళు, అక్కడ నీవేం చేయాలో అది నీకు తెలుస్తుంది” అని చెప్పాడు. అతనితో కూడా ప్రయాణించే వారు ఆ శబ్దం విన్నారు గాని మాటల్లేక నిలబడిపోయారు. వారికి ఏమీ కనబడలేదు. సౌలు నేలమీద నుండి లేచి కళ్ళు తెరచినా ఏమీ చూడలేకపోయాడు కాబట్టి వారతని చెయ్యి పట్టుకుని దమస్కులోకి నడిపించారు. అతడు మూడు రోజులు చూపు లేకుండా ఉన్నాడు. ఏమీ తినలేదు, తాగలేదు. దమస్కులో అననీయ అనే ఒక శిష్యుడున్నాడు. ప్రభువు దర్శనంలో, “అననీయా!” అని అతనిని పిలిచాడు. అతడు, “చిత్తం” అన్నాడు. అందుకు ప్రభువు, “నువ్వు లేచి, ‘తిన్ననిది’ అనే పేరున్న వీధికి వెళ్ళు. అక్కడ యూదా అనే అతని ఇంట్లో తార్సు ఊరి వాడైన సౌలు అనే మనిషి కోసం అడుగు. అతడు ప్రార్థన చేసుకుంటున్నాడు. దర్శనంలో అతడు అననీయ అనే వ్యక్తి లోపలికి వచ్చి అతడు చూపు పొందేలా తల మీద చేతులుంచడం చూశాడు” అని చెప్పాడు. అయితే అననీయ, “ప్రభూ, ఈ వ్యక్తి యెరూషలేములోని నీ ప్రజలకు ఎంతో కీడు చేశాడని అతని గురించి చాలామంది చెప్పారు. ఇక్కడ కూడా నీ నామంలో ప్రార్థన చేసే వారిందరినీ బంధించడానికి అతడు ప్రధాన యాజకుల నుండి అధికారం పొందాడు” అని జవాబిచ్చాడు. అందుకు ప్రభువు, “నీవు వెళ్ళు, యూదేతరుల ముందూ, రాజుల ముందూ, ఇశ్రాయేలీయుల ముందూ నా నామం భరించడానికి ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనం. ఇతడు నా నామం కోసం ఎన్ని బాధలు అనుభవించాలో నేనతనికి చూపిస్తాను” అని అతనితో చెప్పాడు. అననీయ వెళ్ళి ఆ ఇంట్లో ప్రవేశించి, అతని మీద చేతులుంచి, “సౌలా, సోదరా, నీవు వచ్చిన దారిలో నీకు కనబడిన ప్రభు యేసు, నీవు చూపు పొంది, పరిశుద్ధాత్మతో నిండేలా నన్ను నీ దగ్గరకి పంపాడు” అని చెప్పాడు. వెంటనే అతని కళ్ళ నుండి పొరల్లాంటివి రాలిపోగా అతడు చూపు పొంది, లేచి బాప్తిసం పొందాడు. తరువాత భోజనం చేసి బలం పుంజుకున్నాడు. అతడు దమస్కులో ఉన్న శిష్యులతో చాలా రోజులు గడిపాడు.
అపొస్తలుల కార్యములు 9:1-19 పవిత్ర బైబిల్ (TERV)
సౌలు ప్రభువు అనుచరుల్ని చంపిస్తానని ఇంకా ఎగిరిపడ్తూనే ఉన్నాడు. ప్రధానయాజకుని దగ్గరకు వెళ్ళి డెమాస్కసు పట్టణంలోని సమాజ మందిరాలకు ఉత్తరాలు వ్రాసి యివ్వమని అడిగాడు. ప్రభువు మార్గాన్ని అనుసరించేవాళ్ళు కనిపిస్తే స్త్రీ, పురుష భేదం లేకుండా వాళ్ళను బంధించి యెరూషలేముకు తీసుకు రావాలని అతని ఉద్దేశ్యం. అతడు డెమాస్కసు పొలిమేరలు చేరుకున్నాడు. అకస్మాత్తుగా ఆకాశంనుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించింది. అతడు నేలకూలిపొయ్యాడు. ఒక స్వరం, “సౌలా! సౌలా! నన్నెందుకు హింసిస్తున్నావు?” అని వినబడింది. “ప్రభూ! మీరెవరు?” అని సౌలు అడిగాడు. “నేను నీవు హింసిస్తున్న యేసును. లేచి పట్టణంలోకి వెళ్ళు. నీవేం చెయ్యాలో అక్కడ నీకు చెప్పబడుతుంది” అని ఆయన సమాధానం చెప్పాడు. సౌలుతో ప్రయాణం చేస్తున్నవాళ్ళు మూగవాళ్ళలా నిల్చున్నారు. వాళ్ళు ఆ స్వరం విన్నారే కాని వాళ్ళకెవ్వరూ కనపడలేదు. క్రింద పడ్డ సౌలు లేచి నిలుచొని కళ్ళు తెరిచాడు. కాని అతనికి ఏమీ కనిపించలేదు. వాళ్ళతని చేయి పట్టుకొని డెమాస్కసులోనికి నడిపించారు. మూడు రోజుల దాకా అతడు గ్రుడ్డివానిగానే ఉండిపోయాడు. ఆహారం కాని, నీళ్ళు కాని ముట్టలేదు. డెమాస్కసులో యేసు భక్తుడొకడుండేవాడు. అతని పేరు అననీయ. ప్రభువతనికి దివ్యదర్శనంలో కనపడి, “అననీయా!” అని పిలిచాడు. “ఇదిగో, ఇక్కడున్నాను ప్రభూ!” అని అతడు జవాబు చెప్పాడు. ప్రభువతనితో, “‘తిన్నని వీధి’ అని పిలువబడే వీధిలో ఉన్న ‘యూదా’ యింటికి వెళ్ళు, ‘తార్సు’ అనే పట్టణంనుండి వచ్చిన సౌలు అనే వ్యక్తి కోసం అడుగు. అతడు ప్రార్థిస్తూ ఉంటాడు. అతడొక దివ్యదర్శనంలో ‘అననీయ’ అనే పేరుగలవాడు అతని దగ్గరకు వచ్చినట్లు, అతనికి దృష్టి రావటానికి అతనిపై చేతులుంచబడినట్లు చూసాడు” అని చెప్పాడు. అననీయ, “ప్రభూ, అతడు యెరూషలేంలోని పరిశుద్ధులకు చాలా హాని చేసినట్లు చాలా మంది విన్నారు. మిమ్మల్ని శరణుజొచ్చిన ప్రతి ఒక్కణ్ణి బంధించే అధికారం అతడు ప్రధానయాజకుల దగ్గరనుండి పొందాడు”, అని సమాధానం చెప్పాడు. అప్పుడు ప్రభువు అననీయతో, “వెళ్ళు! నా పేరు యూదులు కానివాళ్ళకు, వాళ్ళ పాలకులకు, ఇశ్రాయేలు ప్రజలకు ప్రచారం చేయటానికి యితణ్ణి నేను ఒక సాధనంగా ఎన్నుకొన్నాను. నా పేరిట అతడెన్ని కష్టాలు పడవలసి వస్తుందో నేనతనికి తెలియచేస్తాను” అని అన్నాడు. ఆ తర్వాత అననీయ అక్కడినుండి బయలుదేరి సౌలు ఉన్న యింటికి వెళ్ళాడు. తన చేతుల్ని సౌలు మీద ఉంచి, “సోదరుడా! సౌలా! యేసు ప్రభువు నీవిక్కడికి వస్తున్నప్పుడు నీకు దారిలో కనిపించాడే, ఆయనే, నీవు మళ్ళీ చూడగలగాలని, పవిత్రాత్మ నీలో నిండాలని నన్ను పంపాడు” అని అన్నాడు. వెంటనే పొరల్లాంటివి సౌలు కళ్ళనుండి రాలి క్రిందపడ్డాయి. అతడు మళ్ళీ చూడగలిగాడు. అతడు లేచి బాప్తిస్మము పొందాడు. ఆ తర్వాత కొంత ఆహారాన్ని పుచ్చుకొన్నాక అతనికి బలం వచ్చింది.
అపొస్తలుల కార్యములు 9:1-19 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
మరోవైపు, సౌలు, ప్రభువు శిష్యులను చంపుతానని బెదిరిస్తూనే ఉన్నాడు. అతడు ప్రధాన యాజకుని దగ్గరకు వెళ్లి, ఆ మార్గాన్ని అనుసరిస్తూ ఎవరైనా తనకు కనబడితే, పురుషులనైనా స్త్రీలనైనా బందీలుగా యెరూషలేముకు తీసుకురావడానికి, దమస్కులోని సమాజమందిరాల వారికి ఉత్తరాలు రాసి ఇవ్వమని అడిగాడు. వాటిని తీసుకుని అతడు ప్రయాణిస్తూ, దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా పరలోకం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించింది. అతడు నేల మీద పడిపోయి, ఒక స్వరం, “సౌలా, సౌలా, నీవు నన్ను ఎందుకు హింసిస్తున్నావు?” అని అనడం విన్నాడు. అందుకు సౌలు, “ప్రభువా, నీవెవరు?” అని అడిగాడు. అప్పుడు ఆ స్వరం అతనితో, “నేను నీవు హింసిస్తున్న యేసును నీవు లేచి పట్టణంలోనికి వెళ్లు, నీవు అక్కడ ఏం చేయాలో నీకు తెలుస్తుంది” అన్నది. సౌలుతో పాటు ప్రయాణం చేస్తున్నవారు ఆ శబ్దాన్ని విన్నారు కాని మౌనంగా నిలబడిపోయారు, వారికి స్వరం వినబడింది కాని ఎవ్వరూ కనబడలేదు. సౌలు నేల నుండి లేచి, కళ్లు తెరిచినప్పుడు ఏమి చూడలేకపోయాడు. కాబట్టి వారు అతని చేయి పట్టుకుని దమస్కు పట్టణంలోనికి నడిపించారు. మూడు రోజులు చూపులేకుండా ఉన్నాడు, ఏమి తినలేదు త్రాగలేదు. దమస్కు పట్టణంలో అననీయ అనే ఒక శిష్యుడు ఉన్నాడు. దర్శనంలో ప్రభువు అతన్ని, “అననీయా!” అని పిలిచారు. అప్పుడు అతడు, “ప్రభువా” నేనే అని సమాధానం చెప్పాడు. ప్రభువు అతనితో, “తిన్నని వీధిలో యూదా అనే వాని ఇంటికి వెళ్లి తార్సు నుండి వచ్చిన సౌలును గురించి అడుగు, ఎందుకంటే అతడు ప్రార్థన చేస్తున్నాడు. అననీయ అనే వ్యక్తి వచ్చి, తాను చూపు పొందుకోవడానికి తనపై చేతులు ఉంచుతాడని ఒక దర్శనంలో అతడు చూశాడు” అన్నారు. అందుకు అననీయ, “ప్రభువా, అతని గురించి, అతడు యెరూషలేములో నిన్ను విశ్వసించిన వారికి చేసిన హానిని గురించి అనేక విషయాలను నేను విన్నాను. ఇంకా ఇక్కడ కూడా నీ పేరట ప్రార్థించే వారందరిని బంధించడానికి ముఖ్య యాజకుల నుండి అధికారాన్ని పొందుకొని ఇక్కడకు వచ్చాడు” అని జవాబిచ్చాడు. అయితే ప్రభువు అననీయతో, “వెళ్లు! ఇతడు ఇశ్రాయేలీయులకు యూదేతరులకు వారి రాజులకు నా నామాన్ని ప్రకటించడానికి నేను ఏర్పరచుకున్న నా సాధనము. నా పేరు కోసం ఇతడు ఎన్ని శ్రమలు అనుభవించాలో నేను ఇతనికి చూపిస్తాను” అని చెప్పారు. అప్పుడు అననీయ ఆ ఇంటికి వెళ్లి సౌలు మీద తన చేతులుంచి అతనితో, “సహోదరుడా సౌలు, నీవు ఇక్కడ వస్తున్నప్పుడు మార్గంలో నీకు కనబడిన ప్రభువైన యేసు, నీవు మరలా చూపు పొందాలని, పరిశుద్ధాత్మతో నింపబడాలని నన్ను నీ దగ్గరకు పంపించారు” అని చెప్పాడు. వెంటనే, సౌలు కళ్ల నుండి పొరల వంటివి రాలిపడి, అతడు మరలా చూడగలిగాడు. అతడు లేచి బాప్తిస్మం పొందుకొన్నాడు. అతడు కొంత ఆహారం తీసుకున్న తర్వాత శక్తి పొందుకొన్నాడు.