అపొస్తలుల కార్యములు 9:1-19

అపొస్తలుల కార్యములు 9:1-19 OTSA

మరోవైపు, సౌలు, ప్రభువు శిష్యులను చంపుతానని బెదిరిస్తూనే ఉన్నాడు. అతడు ప్రధాన యాజకుని దగ్గరకు వెళ్లి, ఆ మార్గాన్ని అనుసరిస్తూ ఎవరైనా తనకు కనబడితే, పురుషులనైనా స్త్రీలనైనా బందీలుగా యెరూషలేముకు తీసుకురావడానికి, దమస్కులోని సమాజమందిరాల వారికి ఉత్తరాలు రాసి ఇవ్వమని అడిగాడు. వాటిని తీసుకుని అతడు ప్రయాణిస్తూ, దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా పరలోకం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించింది. అతడు నేల మీద పడిపోయి, ఒక స్వరం, “సౌలా, సౌలా, నీవు నన్ను ఎందుకు హింసిస్తున్నావు?” అని అనడం విన్నాడు. అందుకు సౌలు, “ప్రభువా, నీవెవరు?” అని అడిగాడు. అప్పుడు ఆ స్వరం అతనితో, “నేను నీవు హింసిస్తున్న యేసును నీవు లేచి పట్టణంలోనికి వెళ్లు, నీవు అక్కడ ఏం చేయాలో నీకు తెలుస్తుంది” అన్నది. సౌలుతో పాటు ప్రయాణం చేస్తున్నవారు ఆ శబ్దాన్ని విన్నారు కాని మౌనంగా నిలబడిపోయారు, వారికి స్వరం వినబడింది కాని ఎవ్వరూ కనబడలేదు. సౌలు నేల నుండి లేచి, కళ్లు తెరిచినప్పుడు ఏమి చూడలేకపోయాడు. కాబట్టి వారు అతని చేయి పట్టుకుని దమస్కు పట్టణంలోనికి నడిపించారు. మూడు రోజులు చూపులేకుండా ఉన్నాడు, ఏమి తినలేదు త్రాగలేదు. దమస్కు పట్టణంలో అననీయ అనే ఒక శిష్యుడు ఉన్నాడు. దర్శనంలో ప్రభువు అతన్ని, “అననీయా!” అని పిలిచారు. అప్పుడు అతడు, “ప్రభువా” నేనే అని సమాధానం చెప్పాడు. ప్రభువు అతనితో, “తిన్నని వీధిలో యూదా అనే వాని ఇంటికి వెళ్లి తార్సు నుండి వచ్చిన సౌలును గురించి అడుగు, ఎందుకంటే అతడు ప్రార్థన చేస్తున్నాడు. అననీయ అనే వ్యక్తి వచ్చి, తాను చూపు పొందుకోవడానికి తనపై చేతులు ఉంచుతాడని ఒక దర్శనంలో అతడు చూశాడు” అన్నారు. అందుకు అననీయ, “ప్రభువా, అతని గురించి, అతడు యెరూషలేములో నిన్ను విశ్వసించిన వారికి చేసిన హానిని గురించి అనేక విషయాలను నేను విన్నాను. ఇంకా ఇక్కడ కూడా నీ పేరట ప్రార్థించే వారందరిని బంధించడానికి ముఖ్య యాజకుల నుండి అధికారాన్ని పొందుకొని ఇక్కడకు వచ్చాడు” అని జవాబిచ్చాడు. అయితే ప్రభువు అననీయతో, “వెళ్లు! ఇతడు ఇశ్రాయేలీయులకు యూదేతరులకు వారి రాజులకు నా నామాన్ని ప్రకటించడానికి నేను ఏర్పరచుకున్న నా సాధనము. నా పేరు కోసం ఇతడు ఎన్ని శ్రమలు అనుభవించాలో నేను ఇతనికి చూపిస్తాను” అని చెప్పారు. అప్పుడు అననీయ ఆ ఇంటికి వెళ్లి సౌలు మీద తన చేతులుంచి అతనితో, “సహోదరుడా సౌలు, నీవు ఇక్కడ వస్తున్నప్పుడు మార్గంలో నీకు కనబడిన ప్రభువైన యేసు, నీవు మరలా చూపు పొందాలని, పరిశుద్ధాత్మతో నింపబడాలని నన్ను నీ దగ్గరకు పంపించారు” అని చెప్పాడు. వెంటనే, సౌలు కళ్ల నుండి పొరల వంటివి రాలిపడి, అతడు మరలా చూడగలిగాడు. అతడు లేచి బాప్తిస్మం పొందుకొన్నాడు. అతడు కొంత ఆహారం తీసుకున్న తర్వాత శక్తి పొందుకొన్నాడు.