దానియేలు 4
4
నెబుకద్నెజరు చెట్టు గురించి కలగనుట
1రాజైన నెబుకద్నెజరు తన లేఖను ప్రపంచంలో అన్ని జనాంగాలకు, ఇతర భాషలు మాటలాడే దేశాలకు, ప్రజలకు ఇలా వ్రాయించాడు:
మీ అందరికీ సమాధాన మగుగాక!
2అత్యున్నతుడైన దేవుడు, నా కోసం చేసిన అద్భుత విషయాలు, అద్భుత సంఘటనల గురించి చెప్పడానికి సంతోషిస్తున్నాను.
3దేవుని సూచనలు, అద్భుతాలు
మహాగొప్పవి, శక్తివంతమైనవి.
దేవుని రాజ్యం శాశ్వతమైనది.
దేవుని ప్రభుత్వం అన్ని తరాలు కొనసాగుతుంది.
4నెబుకద్నెజరు అను నేను నా అంతఃపురాన ఉన్నాను. నేను సుఖంగా సంతోషంగా ఉన్నాను. 5అప్పుడు నన్ను భయంగొలిపే కల ఒకటి వచ్చింది. నేను నా పడకమీద ఉన్నాను. నా మనస్సులోని ఆలోచనలు నన్ను భయపెట్టాయి. 6అందువల్ల బబులోనులోని వివేకవంతులందరినీ నావద్దకు తీసుకు రమ్మని ఆజ్ఞ ఇచ్చాను. ఎందుకంటే వారు నా కలయొక్క అర్థం చెప్పగలరని. 7ఇంద్రజాలికులు, కల్దీయులు వచ్చారు. రాగానే వారితో కల వృత్తాంతం చెప్పాను. కాని దాని అర్థమేమిటో వారు చెప్పలేకపోయారు. 8చివరికి దానియేలు వచ్చాడు. (నా దేవుని గౌరవించే నిమిత్తం నేను దానియేలుకు బెల్తెషాజరు అని పేరుపెడితిని. పరిశుద్ధ దేవుళ్ళ ఆత్మ#4:8 ఆత్మ “పరిశుద్ధ దేవుని ఆత్మ” అని అర్థం. అతనిలో వుంది.) నా కల గురించి దానియేలుతో చెప్పాను. 9నేను ఈ విధంగా చెప్పాను: “బెల్తెషాజరూ! ఇంద్రజాలికులందరిలో నీవు చాలా ముఖ్యుడివి. పరిశుద్ధ దేవుళ్ళ ఆత్మ నీలో ఉన్నట్లు నాకు తెలుసు. ఏ రహస్యమూ తెలుసుకోవడం నీకు కష్టం కాదు. ఇది నేను కన్నకల. దాని అర్థమేమిటో చెప్పు. 10నేను నా పడక మీద ఉండగా ఈ దర్శనం నేను చూశాను. నా యెదుట భూమి మధ్యలో ఒక వృక్షం ఉంది. అది చాలా ఎత్తైనది. 11ఆ చెట్టు ఏపుగా దృఢంగా పెరిగింది. ఆ చెట్టు పైభాగం ఆకాశాన్ని అంటిందా అన్నట్లుంది. భూమిమీద ఎక్కడినుంచయినా ఆ చెట్టుని చూడవచ్చు. 12ఆ చెట్టు ఆకులు చాలా అందమైనవి. దాని మీద చాలా పళ్లు ఉన్నాయి. అవి అందరికీ ఆహారంగా ఉన్నాయి. భూజంతువులకు చెట్టుక్రింద నీడ లభించింది. దాని కొమ్మలలో పక్షులు ఉన్నాయి. ప్రతీ జీవి ఆ చెట్టునుండి పోషించబడింది.
13“నేను నా పడక మీదనే పడుకొని, నా దర్శనంలో కావలివానివలె పరలోకంనుంచి ఒక పవిత్రుడు క్రిందికి రావడం చూశాను. 14అతను చాలా బిగ్గరగా మాట్లాడాడు. ‘చెట్టును నరికి వేయండి. చెట్టుకొమ్మల్ని నరికి వేయండి. దాని ఆకుల్ని, దాని పండ్లని త్రుంచి పారవేయండి. చెట్టుకిందవున్న జంతువుల్ని తోలివేయండి. దాని కొమ్మలమీద వున్న పక్షుల్ని ఎగిరి పోనివ్వండి. 15కాని దాని మొద్దును వేళ్లతోసహా భూమిలోనే ఉండనివ్వండి. దాని చుట్టూ ఇనుము, కంచు కలిసిన ఒక బద్దీ వేయండి. చెట్టుమొద్దు, వ్రేళ్లు పొలంలో పెరిగే గడ్డి మధ్యలో భూమిలోనే ఉండనివ్వండి. మంచుచేత దాన్ని తడవనివ్వండి. 16ఇక మీదట అతను మనిషిలా ఆలోచించడు. అతనికి జంతువుల బుద్ధి వస్తుంది. ఏడు కాలాలు (సంవత్సరాలు) అలా గడుస్తాయి’ అని అతను చెప్పాడు.
17“కావలి దూత ద్వారా ఈ ఆజ్ఞ జారీ అయింది. పరిశుద్ధుల ద్వారా నిర్ణయం జరిగింది. ఇది అంతం వరకు ఉంటుంది. మహోన్నతుడైన దేవుడు మనుష్యుల రాజ్యాలను పరిపాలిస్తున్నాడని భూమిమీద నివసించే మనుష్యులందరు తెలుసుకొనేందుకు వీలవుతుంది. ఆయనకు నచ్చిన ఎవరికైనా దేవుడు ఆ రాజ్యాలను ఇచ్చి వేస్తాడు. ఆ రాజ్యాలను పాలించేందుకు వినయ విధేయతలుగల వారిని దేవుడు ఎన్నుకుంటాడు!
18“ఇదే నెబుకద్నెజరు రాజునైన నేను కన్నకల. ఇప్పుడు, బెల్తెషాజరూ (దానియేలూ)! ఈ కల అర్థం చెప్పు. నా రాజ్యంలోని వివేకవంతు లెవ్వరూ నాకు ఆ కల అర్థం చెప్పలేరు. కాని బెల్తెషాజరూ, నీవు ఆ కల గురించి చెప్పగలవు. ఎందుకంటే నీలో పరిశుద్ధ దేవతల ఆత్మవుంది.”
19తర్వాత దానియేలు (బెల్తెషాజరు) కొంచెంసేపు చాలా ఆశ్చర్యచకితుడయ్యాడు. ఆలోచిస్తున్న విషయాలు అతన్ని కలత పరచాయి. అందువల్ల రాజు, “బెల్తెషాజరూ (దానియేలూ)! ఆ కలగాని, ఆ కలయొక్క అర్థంగాని, నిన్ను కలత చెందనీయకుండును గాక” అని చెప్పాడు.
తర్వాత బెల్తెషాజరు (దానియేలు) రాజుతో ఇలా అన్నాడు: “నా రాజా! ఆ కల నీ విరోధులకు జరుగునుగాక! నీ శత్రువులకు ఆ కలయొక్క అర్థము నెరవేరును గాక! 20-21కలలో నీవొక వృక్షాన్ని చూశావు. అది ఏపుగా దృఢంగా పెరిగింది. దాని పైభాగం ఆకాశాన్ని అంటినట్లుగా ఉంది. భూమిమీద ఎక్కడినుంచియైనా దానిని చూడవచ్చు. దాని ఆకులు అందంగా ఉన్నాయి. ఫలసమృద్ధి కూడా ఉంది. ఆ పళ్లు ప్రతివారికీ సమృద్థిగా ఆహారం సమకూర్చాయి. అది అడవి మృగాలకు ఆశ్రయం. దాని కొమ్మలేమో పక్షుల నివాసస్థానం. అలాంటి వృక్షమే నీవు చూసింది. 22రాజా, నీవే ఆ వృక్షానివి. నీవు మహా శక్తిమంతుడవయ్యావు. ఆకాశాన్ని అంటిన ఉన్నత వృక్షంవంటి వాడవు నీవు. నీ అధికారం భూమిమీద దూర భాగాలకు కూడా వ్యాపించింది.”
23“రాజా, పరలోకంనుంచి ఒక పవిత్ర కావలి దేవదూత క్రిందికి రావడం నీవు చూశావు. అతడు ఇలా అన్నాడు: ‘చెట్టుని నరికివేయి; నాశనం చేయిము. ఇనుము, కంచు బద్దీతో కట్టబడి, పొలంలోని గడ్డిమధ్య నాటబడిన ఆ మొద్దును వ్రేళ్ళతోసహా భూమిలోనే విడిచిపెట్టు. ఏడు కాలాలు (సంవత్సరాలు) అతను మంచుకు తడుస్తూ మృగంవలె జీవిస్తాడు.’
24“రాజా, కలయొక్క అర్థం ఇదే. మహోన్నతుడైన దేవుడు ఇవి జరుగుతాయని నా రాజువైన నీకు ఆజ్ఞాపించాడు. 25నెబుకద్నెజరు రాజా, నీ ప్రజలనుంచి దూరంగా నీవు తరుమబడతావు. భూజంతువుల మధ్య నీవు నివసిస్తావు. ఎద్దువలె నీవు పచ్చిక తింటావు. నీవు మంచుచేత తడుస్తావు. అలా ఏడు కాలాలు (సంవత్సరాలు) గడిచి పోతాయి. అప్పుడు నీవీపాఠం నేర్చుకుంటావు-మహోన్నతుడైన దేవుడు మనుష్యుల రాజ్యాలను పరిపాలిస్తున్నాడనీ, తనకు నచ్చిన ఎవనికైనా రాజ్యాలను ఇచ్చివేస్తాడనీ నీవు తెలుసుకుంటావు.
26“చెట్టు మొద్దును, వ్రేళ్లను నేలలోనే ఉంచుము అని ఇవ్వబడిన ఆజ్ఞకు అర్థమిది: మహోన్నతుడైన ఆ దేవుడే మనుష్యుల రాజ్యాలను పరిపాలిస్తున్నాడన్న విషయం నీవు తెలుసుకున్నప్పుడు, నీ రాజ్యం నీకు ఇవ్వబడుతుంది. 27అందువల్ల, రాజా, నా సలహాను స్వీకరించుము. పాపం చేయడం ఆపివేయి. సరియైనదేదో అదే జరిగించు. చెడు విషయాలు చేయడం ఆపివేయి. బీదవారిపట్ల దయగలిగి ఉండుము. అప్పుడు నీవు క్రమంగా విజయాన్ని పొందగలవు.”
28నెబుకద్నెజరు రాజుకు ఆ ఘటనలన్నీ జరిగాయి. 29-30కల వచ్చిన పన్నెండు నెలల తర్వాత, బబులోనులోని తన అంతఃపురం పైభాగాన నెబుకద్నెజరు నడుల్తూ ఉండగా రాజు బబులోనువైపు చూసి, “ఈ గొప్ప నగరాన్ని, ఈ గొప్ప అంతఃపురాన్ని నా శక్తివల్ల నిర్మించాను. నేనెంత గొప్పవాడనో తెలపటానికి ఈ అంతః పురాన్ని నిర్మించాను” అని తన మనస్సులో చెప్పుకొన్నాడు.
31అతని మాటలు ఇంకా అతని నోటిలోనే ఉండగా, ఆకాశమునుంచి ఒక స్వరం ఇలా వినిపించింది: “నెబుకద్నెజరు రాజా, ఈ మాటలు నీకోసమే. నీ వద్దనుంచి నీ అధికారం తీసివేయబడింది. 32ప్రజలనుండి నీవు తరిమి వేయబడతావు. భూజంతువులతో నీవు నివసించాల్సి వస్తుంది. ఎద్దువలె నీవు పచ్చిక మేస్తావు. నీవు గుణపాఠం నేర్చుకునేలోగా ఏడు కాలాలు (సంవత్సరాలు) గడిచి పోతాయి. అప్పుడు మనుష్యుల రాజ్యాలను సర్వోన్నతుడైన దేవుడు పరిపాలిస్తాడనీ, తనకు నచ్చిన వానికి రాజ్యాలు ఇస్తాడనీ నీవు తెలుసుకుంటావు.”
33ఆ విషయాలు వెంటనే జరిగాయి. నెబుకద్నెరును ప్రజలు తమ మధ్యనుండి తరిమివేశారు. అతడు ఎద్దువలె పచ్చిక మేయ సాగాడు. ఆకాశ మంచుచేత అతని దేహం తడిసింది. గ్రద్ద ఈకలవలె అతని వెండ్రుకలు పొడుగ్గా పెరిగాయి. పక్షుల గోళ్లవలె అతని గోళ్లు పొడుగ్గా పెరిగాయి.
34ఆ యేడేళ్ల కాలం పూర్తి కాగానే, నెబుకద్నెజరు అను నేను ఆకాశంవైపు కన్నెత్తి చూశాను. మళ్లీ నాకు మానవబుద్ధి లభించింది. అప్పుడు మహోన్నతుడైన దేవున్ని నేను కీర్తించాను. ఎల్లాకాలము నివసించే ఆయనను గౌరవించి, ఇలా ప్రశంసించాను:
ఆయన పరిపాలన శాశ్వతమైనది,
తరతరాలకు ఆయన రాజ్యం కొనసాగుతుంది.
35భూమిమీద మనుష్యులు
ఆయన ఎదుట లెక్క లేనివారికి సమానము.
దేవుడు పరలోకలమందలి సైన్యాలకు,
భూమిమీది మనుష్యులకు తనకు ఇష్టము వచ్చినట్లు చేస్తాడు.
ఎవ్వరూ ఆయన శక్తివంతమైన హస్తాన్ని ఆపలేరు.
ఎవ్వరూ ఆయన చేసే పనుల్ని ప్రశ్నించలేరు.
36అప్పుడు, ఆ సమయాన, దేవుడు నాకు సరి అయిన బుద్ధిని ప్రసాదించాడు. రాజుగా అధిక గౌరవం, శక్తిని నాకు తిరిగి ఇచ్చాడు. మరల నా సలహాదారులు రాజపురుషులు నా సలహా అడగ సాగారు. నేను మళ్లీ రాజుని అయ్యాను. పూర్వం కంటె ఎక్కువ శక్తి ఎక్కువ గొప్పతనం నాకు వచ్చాయి. 37ఇప్పుడు, నెబుకద్నెజరు అను నేను పరలోక మందున్న రాజును కీర్తిస్తున్నాను, గౌరవిస్తున్నాను. ఆయన చేసే ప్రతిది సరి అయినదే. ఆయన ఎప్పుడూ న్యాయంగానే ఉంటాడు. గర్విష్ఠులను ఆయన అణగ ద్రొక్కుతాడు.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
దానియేలు 4: TERV
హైలైట్
షేర్ చేయి
కాపీ
![None](/_next/image?url=https%3A%2F%2Fimageproxy.youversionapistaging.com%2F58%2Fhttps%3A%2F%2Fweb-assets.youversion.com%2Fapp-icons%2Fte.png&w=128&q=75)
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Telugu Holy Bible: Easy-to-Read Version
All rights reserved.
© 1997 Bible League International