దానియేలు 7

7
నాలుగు మృగాల్ని గూర్చి దానియేలుకు కల
1బెల్షస్సరు#7:1 బెల్షస్సరు … మొదటి సంవత్సరం క్రీ.పూ. 553 బబులోనుకు రాజుగా ఉన్న మొదటి సంవత్సరంలో, దానియేలు ఒక కలగన్నాడు. దానియేలు ఈ దర్శనాలు చూశాడు. అప్పుడతను తన పడకమీద పడుకునివున్నాడు. తాను కలగన్న విషయాల్ని దానియేలు వ్రాశాడు. 2దానియేలు ఇలా చెప్పాడు: “నేను రాత్రివేళ ఒక దర్శనం చూశాను. అందులో నాలుగు వైపులనుండి గాలి వీచింది. ఆ గాలులకు సముద్రం అల్లకల్లోలంగా ఉండింది. 3నేను నాలుగు పెద్ద మృగాల్ని చూశాను. అవి ఒక్కొక్కటి ఒక్కొక్క విధంగా వున్నాయి. ఆ నాలుగు మృగాలు సముద్రం నుండి పైకి వచ్చాయి.
4“మొదటి మృగము సింహంవలె ఉండింది. దానికి గ్రద్ద రెక్కలున్నాయి. ఆ మృగాన్ని గమనిస్తూండగా దాని రెక్కలు విరిచివేయబడ్డాయి. అది నేలనుండి పైకి లేచి, మనిషిలాగ రెండు కాళ్లమీద నిలబడింది. దానికి మానవుని మనస్సువంటి మనస్సు ఇవ్వబడింది.
5“ఆ తర్వాత నా ఎదుట రెండవ మృగాన్ని చూశాను. ఇది ఎలుగుబంటివలె కనిపించింది. ఒక వైపుకి అది లేవనెత్తబడింది. దాని నోట్లో పళ్ల మధ్య మూడు ప్రక్కటెముకలున్నాయి. పైకి లేచి, నీకు కావలసినంత మాంసం తిను” అని దానికి చెప్పబడింది.
6“తర్వాత నేను చూడగా నా ఎదుట మూడవ మృగము ఉంది. ఇది చిరుతపులిలాగ ఉంది. దానివీపుమీద నాలుగు పక్షి రెక్కలున్నాయి. దీనికి నాలుగు తలలున్నాయి. పరిపాలించే అధికారం దానికి ఇవ్వబడింది.
7“ఆ తర్వాత, నా దర్శనాలలో రాత్రివేళ చూస్తూండగా నా ఎదుట నాలుగవ మృగము ఉంది. ఇది చాలా ఘోరంగాను, భయంకరంగాను కనిపించింది. అది మహా బలంగా ఉంది. దానికి ఇనుప పళ్లు ఉన్నాయి. ఈ మృగం సమస్తాన్ని ముక్కలుగా చీల్చి మ్రింగుచూ, మిగిలిన దాన్ని తన కాళ్ల క్రింద త్రొక్కుచుండినది. అంతకు మునుపు నేను చూసిన ఇతర మృగాలకంటె ఈ నాలుగవ మృగం భిన్నంగా ఉంది. దీనికి పది కొమ్ములున్నాయి.
8“ఈ కొమ్ముల విషయం నేను తలస్తూండగా వాటిమధ్యలో ఒక చిన్న కొమ్ము పైకి వచ్చింది. దాని స్థానంలో మొదట ఉన్న మూడు కొమ్ములు కుదురుతో సహా పెరికివేయబడ్డాయి. ఈ చిన్న కొమ్ముమీద మానవ కళ్లలాంటి కళ్లు, డంబాలు పలికేనోరు దానికి ఉన్నాయి.
నాలుగవ మృగం తీర్పు
9“నేను చూస్తూండగా సింహాసనాలు వేయబడ్డాయి.
మరియు ప్రాచీన రాజు#7:9 ప్రాచీన రాజు వాస్తవంగా “ప్రాచీన రోజులు” అని వ్రాయబడివుంది. అనగా దేవుడు అనాది కాలంనుంచి ఉన్నవాడని అర్థము. తన సింహాసనమున ఆసీనుడై ఉన్నాడు.
ఆయన వస్త్రాలు మంచులా తెల్లగాను,
ఆయన తల వెంట్రుకలు స్వచ్ఛమైన ఉన్నివలె తెల్లగా ఉండినవి.
ఆయన సింహాసనం అగ్ని జ్వాలలతోను,
ఆ సింహాసనపు చక్రాలు మంటలతోను మండుచున్నవి.
10ఆయన ఎదుట నుండి
అగ్ని ప్రవాహము బయలు వెళ్లింది.
వేవేల కొలది ఆయనకు సేవ చేస్తూ ఉన్నారు.
కోట్లకొలది ఆయన ఎదుట నిలబడ్డారు.
తీర్పుకై ఆయన న్యాయసభలో
కూర్చుండగా గ్రంథాలు తెరువబడ్డాయి.
11“చిన్న కొమ్ము గర్వపు మాటలు మాట్లాడుచున్న శబ్దం విని అటు చూశాను. నేను చూస్తుండగా ఆ నాలుగవ మృగం చంపబడింది. దాని శరీరం నాశనం చేయబడింది. అది మండుచున్న మంటల్లోకి త్రోసివేయబడింది. 12మిగిలిన మృగాల అధికారం వాటినుండి తీసివేయబడింది. కాని కొంతకాలంపాటు అవి నివసించి ఉండడానికి అనుమతి ఇవ్వబడింది.
13“రాత్రి దర్శనాలలో, మానవ కుమారుని పోలిన ఒక వ్యక్తి రావటం నేను చూశాను. ఆయన ఆకాశంలోని మబ్బులమీద ప్రాచీన రాజు#7:13 ప్రాచీన రాజు అనగా బహు కాలపు దేవుడు. వద్దకు వచ్చి, ఆయన ముందు నిలబడ్డాడు.
14“మానవ కుమారునివలె కనిపించిన ఆ వ్యక్తికి అధికారం, ప్రభావం, సంపూర్ణ పరిపాలనాధికారం ఇవ్వబడ్డాయి. అందునుబట్టి ప్రజలందరు, అన్ని దేశాలు, ప్రతి భాషకు చెందినవారు ఆయన్ని సేవిస్తారు. ఆయన పరిపాలన ఎప్పటికీ ఉంటుంది. ఆయన రాజ్యం ఎప్పుడూ కొనసాగుతూ ఉంటుంది. అది ఎన్నటికీ అంతం కానిది.
దానియేలు కల భావము
15“దానియేలు అను నేను నా ఆత్మలో చింతించాను. నేను చూసిన దర్శనాలు నన్ను కలవర పెట్టాయి. 16అక్కడ నిలబడిన ఒకనిని నేను సమీపించి ఇదంతా ఏమిటని అతన్ని అడిగాను. 17అందువల్ల, అతను వాటి అర్థాలేమిటో వివరించి చెప్పాడు, ‘నాలుగు మృగాలు నాలుగు రాజ్యాలు.#7:17 నాలుగు రాజ్యాలు “నలుగురు రాజులు” అని కూడా పాఠాంతరం. ఆ నాలుగు రాజ్యాలు భూమిమీద ఉద్భవిస్తాయి. 18కాని మహోన్నతుడైన దేవుని ప్రత్యేక జనులే ఆ రాజ్యాన్ని పొందుతారు. వారా రాజ్యాన్ని ఎల్లప్పుడూ కలిగియుంటారు.’
19“తర్వాత ఆ నాలుగవ మృగంయొక్క అర్థం తెలుసుకోదలచాను. మిగిలిన మృగాలకంటె నాలుగవ మృగం భిన్నమైంది, మహా భయంకరంగా ఉండింది. దానికి ఇనుప పళ్లు, కంచు గోళ్లు ఉన్నాయి. అది తన బలి పశువుల్ని అన్నింటిని చీల్చి తిని, మిగిలినదాన్ని కాళ్ల క్రింద త్రొక్కి వేసింది. 20నాలుగవ మృగం తలమీదవున్న పది కొమ్ముల గురించి తెలుసు కోవాలను కున్నాను. అక్కడ పెరిగిన చిన్న కొమ్ము గురించి తెలుసుకోదలిచాను. వాటిలో మూడు కొమ్ముల్ని చిన్న కొమ్ము పెరికివేసింది. ఇతర కొమ్ముల కంటె చిన్న కొమ్ము గొప్పదిగా, నీచంగా కనిపించింది. అది మానవ కన్నులవంటి కన్నులు కలిగియుండినది. అది డంబములు పలుకుతూనే ఉండినది. 21నేనది గమనిస్తూండగా, ఈ చిన్న కొమ్ము దేవుని ప్రత్యేక జనుల్ని ఎదిరించి వారితో యుద్ధం చేయసాగింది. 22మరియు ఆ కొమ్ము వారిని చంపుతూ ఉండెను. ప్రాచీన రాజు వచ్చి, న్యాయవిచారణ చేసేంతవరకు అది దేవుని ప్రత్యేక జనుల్ని చంపుచుండెను. ప్రాచీన రాజు చిన్న కొమ్మును గురించి తీర్పు ప్రకటించాడు. ఆ తీర్పు దేవుని ప్రత్యేక జనులకు సహాయము చేసింది. మరియు వారు రాజ్యమును స్వీకరించే సమయము వచ్చింది.
23“అతను నాకిది వివరించాడు: ‘భూమిమీద అవతరించే నాలుగవ రాజ్యమే ఆ నాలుగవ మృగం. అది యితర రాజ్యాలకు భిన్నంగా వుంటుంది. ఆ నాలుగవ రాజ్యం ప్రపంచమంతట వుండే ప్రజల్ని తన వశం చేసుకొంటుంది. ప్రపంచంలో వుండే రాజ్యాలను అణచివేస్తుంది. 24ఈ నాలుగవ రాజ్యం నుండి వచ్చే పదిమంది రాజులే పది కొమ్ములు. ఆ పదిమంది రాజులు పోయిన తర్వాత, మరొక రాజు వస్తాడు. తనకు పూర్వం పరిపాలించిన రాజులకంటె ఈ రాజు భిన్నంగా ఉంటాడు. ఇతర ముగ్గురు రాజుల్ని అతను జయిస్తాడు. 25ఈ ప్రత్యేక రాజు సర్వోన్నతుడైన ఆ దేవునికి విరుద్ధంగా మాట్లాడుతాడు. ఆ రాజు దేవుని ప్రత్యేక జనుల్ని గాయపరచి చంపివేస్తాడు. అంతకు పూర్వమే వున్న సమయాలను, చట్టాలను మార్చివేయడానికి అతను ప్రయత్నిస్తాడు. దేవుని ప్రత్యేక జనులు ఆ రాజు ఆధిపత్యంలో మూడున్నర సంవత్సరాలుంటారు.
26“‘కాని ఏమి జరగవలెనో, (దేవుని) న్యాయ స్థానమే నిర్ణయిస్తుంది. మరియు ఆ రాజుయొక్క అధికారము తీసివేయ బడుతుంది. వాని రాజ్యం సమూలంగా నాశనమవుతుంది. 27తర్వాత దేవుని ప్రత్యేక జనులు రాజ్యాన్ని పరిపాలిస్తారు. వారు భూమిమీద సర్వరాజ్యాలను పాలిస్తారు. ఈ రాజ్యం ఎన్నటికీ ఉంటుంది. ఇతర రాజ్యాలకు చెందిన ప్రజలు వారిని గౌరవిస్తారు, సేవిస్తారు.’
28“ఇదే కలయొక్క ముగింపు. దానియేలు అను నేను చాలా భయపడ్డాను. ఆ భయంవల్ల నా ముఖం పాలిపోయింది. మరియు నేను చూసిన, విన్న విషయాలను నా మనస్సులో ఉంచుకొన్నాను.”

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

దానియేలు 7: TERV

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి