నిర్గమకాండము 23
23
1“ప్రజలకు వ్యతిరేకంగా అబద్ధాలు చెప్పకండి. న్యాయస్థానంలో మీరు సాక్షులుగా ఉంటే, ఒక దుర్మార్గుడు అబద్ధాలు చెప్పేందుకు సహాయం చేయడానికి ఒప్పుకోవద్దు.
2“మిగిలిన వారంతా చేస్తున్నారనిచెప్పి నీవు ఏదీ చేయవద్దు. ఒక గుంపు ప్రజలు తప్పు చేస్తుంటే, నీవు వారితో కలువ వద్దు. నీవు చెడ్డ పనులు చేసేటట్టు ఆ ప్రజలు నిన్ను ఒప్పించనియ్యవద్దు. సరియైనది, న్యాయమైనది నీవు చెయ్యాలి.
3“ఒక పేదవానికి తీర్పు జరుగుతుంటే, కొన్నిసార్లు అతని విషయంలో జాలిపడి, కొందరు అతణ్ణి బలపరుస్తారు. నీవు అలా చేయకూడదు. (అతనిది సరిగ్గా ఉంటేనే బలపర్చు.)
4“తప్పిపోయిన ఒక ఎద్దును లేక గాడిదను నీవు చూస్తే, దాన్ని దాని యజమానికి నీవు తిరిగి అప్పగించాలి. ఆ యజమాని నీకు శత్రువైనా సరే, నీవు ఇలా చేయాల్సిందే. 5మోయలేనంత భారం ఉండడం చేత ఒక జంతువు నడవలేక పోతున్నట్టు నీవు చూస్తే, నీవు ఆగి ఆ జంతువుకు సహాయం చేయాలి. ఆ జంతువు నీ శత్రువులలో ఒకనికి చెందినా సరే నీవు దానికి సహాయం చేయాలి.
6“ఒక పేదవానికి ప్రజలు అన్యాయం చేయకూడదు. ఇతరులు ఎవరికైనా తీర్చినట్టే తీర్పు తీర్చాలి.
7“ఏదైనా విషయంలో ఒకడు నేరస్థుడు అని నీవు చెబితే, నీవు చాల జాగ్రత్తగా ఉండాలి. ఒకడి మీద అబద్ధపు నిందలు వేయవద్దు. నిర్దోషియైన ఒకడ్ని తాను చేయని పనికి శిక్షగా ఎన్నడూ మరణించనివ్వవద్దు. ఒక నిర్దోషిని చంపేవాడు ఎవడైనా సరే చెడ్డవాడే, ఆ మనిషిని నేను క్షమించను.
8“ఒకడు తప్పు చేస్తూ నీవు అతనితో ఏకీభవించాలని చెప్పి, నీకు డబ్బు ఇవ్వ జూస్తే, ఆ డబ్బు తీసుకోవద్దు. అలా చెల్లించిన డబ్బు న్యాయమూర్తులు సత్యాన్ని చూడకుండా చేస్తుంది. అలా చెల్లించిన డబ్బు మంచివాళ్లు అబద్ధాలు చెప్పేటట్టు చేస్తుంది.
9“విదేశీయుని యెడల నీవు ఎన్నడూ తప్పు చేయకూడదు. మీరు ఈజిప్టు దేశంలో నివసించినప్పుడు మీరు పరాయి వాళ్లేనని జ్ఞాపకం ఉంచుకోవాలి. (ఒకడు తన స్వంతంకాని దేశంలో వుంటే వాడికి ఎలా వుంటుందో మీరు అర్థం చేసుకోవాలి.)
ప్రత్యేకమైన పండుగలు
10“విత్తనాలు చల్లి పంటకోసి, ఆరు సంవత్సరాల పాటు భూమిని సాగుచేయండి. 11అయితే ఏడో సంవత్సరం భూమిని ఉపయోగించకండి. (ఏడో సంవత్సరం భూమికి ఒక ప్రత్యేక విశ్రాంతి సమయంగా ఉండాలి) మీ పొలాల్లో ఏమీ నాటవద్దు. ఒకవేళ అక్కడ ఏవైనా పంటలు పెరిగితే, వాటిని పేద ప్రజలను తీసుకోనివ్వాలి. మిగిలిపోయిన ఆహారాన్ని అడవి మృగాల్ని తిననివ్వాలి మీ ద్రాక్షాతోటలు, ఒలీవ మొక్కలు, తోటల విషయంలో కూడ మీరు అలాగే చేయాలి.
12“ఆరు రోజులు పని చేయండి. ఏడోరోజున విశ్రాంతి! మీ బానిసలు, ఇతర పని వాళ్లకు దీనివల్ల విశ్రాంతి, మరియు విరామం లభిస్తుంది. మీ ఎడ్లు, మీ గాడిదలకు కూడ విశ్రాంతి దొరుకుతుంది.
13“ఈ ఆజ్ఞలన్నింటికీ విధేయులు కావాలని మాత్రం ఖచ్చితంగా తెల్సుకోండి. వేరే దేవుళ్లను పూజించకండి. చివరకి వాళ్ల పేర్లు కూడా మీరు పలుకగూడదు.
14“ప్రతి సంవత్సరం మూడు ప్రత్యేక పండుగలు మీకు ఉంటాయి. ఈ పండుగల రోజుల్లో మీరు నన్ను ఆరాధించటానికి నా ప్రత్యేక స్థలానికి రావాలి. 15మొదటిది పులియని రొట్టెల పండుగ. ఇది నేను మీకు ఆజ్ఞాపించినట్టే ఉంటుంది. ఈ సమయంలో పులియజేసే పదార్థం వినియోగించకుండా చేయబడ్డ రొట్టెలు మీరు తింటారు. ఇలా ఏడు రోజుల పాటు కొనసాగుతుంది. అబీబు#23:15 అబీబు లేక “నిసాన్” అనే వసంతకాలం సుమారు మార్చి, ఏప్రిల్. మాసంలో మీరు దీన్ని చేయాలి. ఎందుకంటే మీరు ఈజిప్టు నుండి బయటకు వచ్చిన సమయం యిదే. ఆ సమయంలో ప్రతి వ్యక్తి ఒక బలి అర్పణ నాకు తీసుకురావాలి.
16“రెండోది కోత పండుగ. ఈ పండుగ వేసవి పూర్వార్ధంలో అంటే మీ పొలాల్లో మీరు నాట్లు వేసిన పంటల కోత మొదలుబెట్టే సమయంలో ఉంటుంది. మూడోది గుడారాల పండుగ.
“ఇది ఆకురాలు కాలంలో ఉంటుంది. ఇది మీ పొలాల్లో పంటలన్నీ కూర్చుకొనే సమయంలో ఉంటుంది.
17“కనుక యెహోవా ప్రభువుతో ఉండేందుకు సంవత్సరానికి మూడుసార్లు పురుషులంతా ఒక ప్రత్యేక స్థలానికి వస్తారు.
18“నీవు ఒక జంతువును చంపి దాని రక్తం బలిగా అర్పించేటప్పుడు, పులియజేసే పదార్థంతో చేయబడ్డ రొట్టెలు నీవు అర్పించకూడదు. ఈ బలి అర్పణలోని మాంసం మీరు తినేటప్పుడు ఆ మాంసం అంతా ఒక్క రోజులోనే తినెయ్యాలి. మాంసంలో ఏమీ మర్నాటికి మిగల్చకూడదు.
19“మీరు మీ పంట కూర్చుకొనే కోత కాలంలో మీరు కోసే ప్రతి దానిలో మొదటి భాగం మీ యెహోవా దేవుని ఆలయానికి తీసుకురావాలి.
“దాని తల్లి పాలతో ఉడకబెట్టబడిన మేకపిల్ల మాంసాన్ని మీరు తినకూడదు.”
ఇశ్రాయేలీయులు దేశాన్ని ఆక్రమించుటకు దేవుడు సహాయం చేయటం
20దేవుడు యిలా చెప్పాడు: “మీకు ముందర ఒక దేవదూతను నేను పంపుతున్నాను. మీ కోసం నేను సిద్ధం చేసిన చోటికి ఈ దేవదూత మిమ్మల్ని నడిపించటం జరుగుతుంది. 21ఈ దేవదూతకు విధేయులుగా వెంబడించండి. ఆయన మీద తిరుగుబాటు చేయవద్దు. ఆయన విషయంలో మీరు చేసే తప్పిదాలను ఈ దేవదూత క్షమించడు. ఆయనలో నా శక్తి ఉంది. 22ఆయన చెప్పే ప్రతి దానికీ మీరు లోబడాలి. నేను మీతో చెప్పే ప్రతీదీ మీరు చేయాలి. మీ శత్రువులందరికీ నేను వ్యతిరేకంగా ఉంటాను. మీకు వ్యతిరేకంగా ఉండే ప్రతి వ్యక్తికి నేను విరోధినే.”
23దేవుడు చెప్పాడు: “ఈ దేశంలోనుంచి నా దూత మిమ్మల్ని నడిపిస్తాడు. అమోరీయులు, హిత్తీయులు, పెరిజ్జీయులు, కనానీయులు, హివ్వీయులు, యెబూసీయులు అనే వేర్వేరు ప్రజల మీదికి ఆయన మిమ్మల్ని నడిపిస్తాడు. అయితే వీళ్లందర్నీ నేను ఓడిస్తాను.
24“వాళ్ల దేవుళ్లను పూజించవద్దు. ఆ దేవుళ్లకు ఎన్నడూ సాష్టాంగపడవద్దు. వాళ్ల జీవిత విధానంలో మీరు ఎన్నడూ జీవించకూడదు. వాళ్ల విగ్రహాల్ని మీరు నాశనం చేయాలి. వాళ్ల దేవుళ్లను వాళ్లు జ్ఞాపకం చేసుకొనేందుకు వాళ్లకు తోడ్పడే వాటన్నిటినీ మీరు విరుగగొట్టాలి. 25మీ యెహోవా దేవుణ్ణి మీరు సేవించాలి. మీరు ఇలా చేస్తే, భోజన పానీయాలు సమృద్ధిగా ఇచ్చి నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. సర్వరోగాల్నీ మీలోనుండి తొలగించి వేస్తాను. 26మీ స్త్రీలంతా పిల్లల్ని కనగల్గుతారు. వారి శిశువుల్లో ఏ ఒక్కరూ పుట్టుకలో చావరు. మిమ్మల్ని అందరినీ సుదీర్ఘ ఆయుష్షుతో బ్రతకనిస్తాను.
27“మీరు మీ శత్రువుతో యుద్ధం చేసేటప్పుడు నా మహత్తర శక్తిని మీ ముందర పంపిస్తాను. మీరు మీ శత్రువులందర్నీ ఓడించటానికి నేను మీకు సహాయం చేస్తాను. మీకు వ్యతిరేకంగా ఉండే మనుష్యులు యుద్ధంలో కలవరపడిపోయి, పారిపోతారు. 28మీకు ముందు కందిరీగలను#23:28 కందిరీగలు ఇది నిజంగా కందిరీగ కావచ్చు, లేదా “దేవుని దూత,” లేక “ఆయన మహాశక్తి కావచ్చు.” నేను పంపిస్తాను. ఆ కందిరీగలు మీ శత్రువులు పారిపొయ్యేట్టు చేస్తాయి. హివ్వీ ప్రజలు, కనానీ ప్రజలు, హిత్తీ ప్రజలు, మీ దేశాన్ని వదిలేస్తారు. 29అయితే త్వరగా మీ దేశాన్ని విడిచి పెట్టేటట్టు నేను వాళ్లను బలవంతం చేయను. ఇదంతా నేను ఒక్క సంవత్సరంలోనే చేయను. ఆ ప్రజల్ని నేను అంత వేగంగా వెళ్లగొడితే, దేశం ఖాళీగా ఉంటుంది. అలాగైతే అడవి మృగాలు అధికమై దేశాన్ని ఆక్రమించుకొంటాయి. అవి మీకు చాల తొందర కలిగిస్తాయి. 30కనుక ఆ ప్రజల్ని చాలా నిదానంగా బయటకు వెళ్లగొడతాను. దేశంలోనికి మీరు చొచ్చుకు పోతూనే ఉంటారు. మరి మీరు ఎక్కడికి వెళ్లినా, అక్కడ ఇతర ప్రజలను నేను బలవంతంగా వెళ్లగొట్టేస్తాను.
31“ఎర్ర సముద్రం నుండి యూఫ్రటీస్ నదివరకు ఉన్న దేశం అంతా నేను మీకు యిస్తాను. ఫిలిష్తీ సముద్రం (మధ్యధరా సముద్రం) పశ్చిమాన సరిహద్దుగాను, అరేబియా ఎడారి తూర్పు సరిహద్దుగాను ఉంటాయి. అక్కడ నివసిస్తున్న ప్రజల్ని మీరు ఓడించేటట్టు చేస్తాను.
32“ఆ ప్రజల్లో ఎవరితో గాని లేక వారి దేవుళ్లతోగాని మీరు ఎలాంటి ఒడంబడికలూ చేసుకోకూడదు. 33వాళ్లను మీ దేశంలో ఉండనివ్వవద్దు. మీరు వాళ్లను ఉండనిస్తే, మీరు పాపం చేయటానికి వాళ్లు కారకులు అవుతారు. ఒకవేళ మీరు వాళ్లను ఉండనిస్తే వాళ్లు ఒక ఉరిలా ఉంటారు. మీరేమో వాళ్ల దేవుళ్లను పూజించటం మొదలు పెడతారు.”
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
నిర్గమకాండము 23: TERV
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Telugu Holy Bible: Easy-to-Read Version
All rights reserved.
© 1997 Bible League International