నిర్గమకాండము 30

30
ధూప పీఠం
1“తుమ్మ కర్రతో ఒక వేదిక చేయి. ధూపం వేసేందుకు ఈ పీఠమును నీవు ఉపయోగించాలి. 2వేదికను 18 అంగుళాలు పొడవు, 18 అంగుళాలు వెడల్పు గల చతురస్రముగా నీవు చేయాలి. దీని ఎత్తు 36 అంగుళాలు ఉండాలి. నాలుగు మూలల కొమ్ములు ఉండాలి. ఈ కొమ్ముల్ని వేదికతో కలిపి ఒకటిగా చేయాలి. 3బలిపీఠం పైభాగాన్ని, అన్ని ప్రక్కలను స్వచ్ఛమైన బంగారం పొదిగించాలి. బలిపీఠం చుట్టూ బంగారు నగిషిబద్ద పెట్టాలి. 4నగిషీబద్ద అడుగు భాగాన బంగారు ఉంగరాలు నాలుగు ఉండాలి. ఈ బలిపీఠానికి ఎదురుగా రెండు బంగారు ఉంగరాలు ఉండాలి. బలిపీఠం మోసే కర్రలకోసం ఈ బంగారు ఉంగరాలు ఉపయోగించబడతాయి. 5తుమ్మకర్రతోనే ఆ కర్రలు చేయాలి. కర్రలకు బంగారు తాపడం చేయాలి. 6ప్రత్యేక తెరముందు ఈ బలిపీఠాన్ని ఉంచాలి. ఒడంబడిక పెట్టెను తెర అవతల ఉంచాలి. ఆ పెట్టె మూతకు ముందర బలిపీఠం ఉంచాలి. నేను నిన్ను కలుసుకోనే చోటు ఇదే.
7“ప్రతీ ఉదయం పరిమళ ద్రవ్యాల ధూపాన్ని బలిపీఠం మీద అహరోను వేయాలి. దీపాలు సరిచేసేందుకు వచ్చినప్పుడు అతడు దీనిని చేయాలి. 8మరల సాయంత్రం అతడు ధూపం వేయాలి. ఇది అతడు సాయంత్రం దీపాలను సరిచేసే వేళ. కనుక ప్రతిరోజూ శాశ్వతంగా యెహోవా ఎదుట ధూపం వేయబడుతుంది. 9ఇంకే విధమైన ధూపం వేసేందుకు గాని, దహన బలి కోసంగాని ఈ బలిపీఠాన్ని ఉపయోగించవద్దు. ఏ విధమైన ధాన్యార్పణగాని, పానార్పణంగాని అర్పించేదుకు ఈ బలిపీఠాన్ని ఉపయోగించవద్దు.
10“సంవత్సరానికి ఒక సారి అహరోను యెహోవాకు ఒక ప్రత్యేక బలి అర్పించాలి. ప్రజల పాప పరిహారం నిమిత్తం చెల్లించేందుకు పాపపరిహారార్థ బలి రక్తాన్ని అహరోను ఉపయోగించాలి. ఈ బలిపీఠపు కొమ్ముల దగ్గర అహరోను దీనిని చేయాలి. ఇది, ప్రాయశ్చిత్తార్థ దినం అని పిలువబడుతుంది. ఇది యెహవాకు అతి ప్రత్యేక దినం.”
ఆలయ పన్ను
11మోషేతో యెహోవా ఇలా చెప్పాడు, 12“ఎంత మంది ప్రజలు ఉన్నారో నీకు తెలిసేటట్టు, ఇశ్రాయేలు ప్రజల్ని లెక్కబెట్టు. ఇలా చేసినప్పుడల్లా, ప్రతి వ్యక్తి తనకోసం యెహోవాకు క్రయధనం చెల్లించాలి. ప్రతి వ్యక్తి ఇలా చేస్తే ఏ విధమైన దారుణం ప్రజలకు సంభంవిచదు. 13లెక్కించబడ్డ ప్రతి మనిషి అరతులం చెల్లించాలి. (ఇది అధికార పూర్వకమైన తులంలో సగం, అధికార తులం అంటే 20 గొర్రెలు). ఈ అరతులం యెహోవాకు అర్పణం. 14లెక్కించబడి, 20 సంవత్సరాలు లేక అంతకు ఎక్కువ వయసుగల ప్రతి వ్యక్తి యెహోవాకు ఈ అర్పణ చెల్లించాలి. 15ధనికులు అరతులం కంటె ఎక్కువ చెల్లించకూడదు. ప్రజలందరూ ఒకే అర్పణ యెహోవాకు చెల్లించాలి. ఇది మీ ప్రాణం కోసం చెల్లించే అర్పణ. 16ఇశ్రాయేలు ప్రజల దగ్గర్నుండి ఈ సొమ్ము పోగుచేయి. సన్నిధి గుడారంలో సేవకోసం ఈ సొమ్ము ఉపయోగించు. యెహోవా తన ప్రజలను జ్ఞాపకం ఉంచుకొనేందుకు ఈ చెల్లింపు ఒక విధానం. వారు తమ స్వంత ప్రాణాల నిమిత్తం చెల్లిస్తారు.”
కడుగుకొనేందుకు గంగాళం
17మోషేతో యెహోవా ఇలా చెప్పాడు, 18“ఇత్తడి గంగాళం#30:18 గంగాళం లోహముతో చేయబడిన పాత్ర. ఒకటి చేసి ఇత్తడి పీటమీద దాన్ని పెట్టు. కడుగుకొనేందుకు నీవు దీనిని ఉపయోగించాలి. సన్నిధి గుడారానికి, బలిపీఠానికి మధ్య దీనిని ఉంచి, నీళ్లతో నింపు. 19ఈ గంగాళంలోని నీళ్లతో అహరోను, అతని కుమారులు వారి కాళ్లు చేతులు కడుక్కోవాలి 20సన్నిధి గుడారం ప్రవేశించేటప్పుడు, లేక బలిపీఠం సమీపించేటప్పుడు ప్రతిసారీ వారు నీళ్లతో కడుక్కోవాలి. ఈ విధంగా వారు మరణించరు. 21మరియు తాము చావకుండా ఉండేందుకు వారు తమ కాళ్లు చేతులు కడుక్కోవాలి. అహరోనుకు, అతని ప్రజలకు ఎప్పటికీ కొనసాగే చట్టం యిది. భవిష్యత్తులో జీవించే అహరోను సంతతి వాళ్లందరికీ యిది కొనసాగుతుంది.”
అభిషేక తైలం
22అప్పుడు మోషేతో యెహోవా ఇలా చెప్పాడు: 23“శ్రేష్ఠమైన సుగంధద్రవ్యాలు సంపాదించు. పరిమళ ధూపం చేయడానికి 500 తులాల స్వచ్ఛమైన గోపరసం, 250 తులాల సువాసనగల లవంగపట్ట, 500 తులాల సుగంధ ద్రవ్యాలు, 24500 తులాల లవంగపట్ట తీసుకో. వీటన్నింటినీ కొలిచేందుకు అధికారిక కొలత ఉపయోగించు. మరియు మూడు పళ్ల ఒలీవ నూనె తీసుకో.
25“ఒక పరిమళ అభిషేక తైలంగా చేయటానికి వీటన్నింటినీ కలపాలి. 26సన్నిధి గుడారం మీద, ఒడంబడిక పెట్టె మీద ఈ తైలం పోయి, వీటికి ఒక ప్రత్యేక ఉద్దేశం వుంది అని ఇది తెలియజేస్తుంది. 27బల్లమీద, దానిమీద ఉన్న పాత్రలన్నింటిమీద తైలం పోయి. దీపం మీద, దాని పరికరాలన్నింటి మీద ఈ తైలం పోయి. ధూపవేదిక మీద తైలం పోయి. 28ఇంకా దేవునికి అర్పణలు దహనం చేసే బలిపీఠం మీద ఈ తైలం పోయి. ఆ బలిపీఠం పైన ఉండే సమస్తం మీద ఈ తైలం పోయి. గంగాళంమీద, దాని పీటమీద ఈ తైలం పోయి. 29వీటన్నింటినీ నీవు పవిత్రం చేయాలి. అవి యెహోవాకు చాల ప్రత్యేకం. వీటిని ఏది తాకినా అది పవిత్రం అవుతుంది.
30“అహరోను, అతని కుమారుల మీద ఈ తైలంపోయి. వారు ఒక ప్రత్యేక విధానంలో నన్ను సేవిస్తున్నారని ఇది తెలియజేస్తుంది. అప్పుడు యాజకులుగా వారు నా సేవ చేయవచ్చు. 31అభిషేక తైలం ఎల్లప్పుడు నాకు ప్రత్యేకమైనదిగా ఉంటుందని ఇశ్రాయేలు ప్రజలతో చెప్పు. 32సామాన్యమైన సుగంధ తైలంగా ఎవరూ దీనిని వాడకూడదు. ఈ ప్రత్యేక తైలం తయారు చేసిన విధానంలో సుగంధ తైలం తయారు చేయకూడదు. ఈ తైలం పవిత్రం, ఇది మీకు చాల ప్రత్యేకమైనదిగా ఉండాలి. 33ఎవరైనా ఈ పవిత్ర తైలం వలె సుగంధ తైలం తయారు చేసి అన్యునికి యిస్తే, ఆ వ్యక్తి తన ప్రజల్లో నుండి వేరు చేయబడాలి.”
ధూపం
34అప్పుడు మోషేతో యెహోవా ఇలా చెప్పాడు, “ఈ పరిమళ ద్రవ్యాలను తీసుకురా! జటామాంసి, గోపి చందనం, గంధపుచెక్క స్వచ్ఛమైన సాంబ్రాణి. ఈ పరిమళ ద్రవ్యాలన్నీ సమపాళ్లలో ఉండేటట్టు తప్పక చూడాలి. 35సుగంధ పరిమళ ధూపంగా ఉండేటట్టు ఈ పరిమళ ద్రవ్యాలన్నిటినీ కలపాలి. పరిమళ తైలం తయారుచేసే వాడు చేసినట్టే దీనిని చేయాలి. మరియు ఈ ధూపంలో ఉప్పు కలుపు. అది దీనిని స్వచ్ఛమైనదిగా, ప్రత్యేకమైనదిగా చేస్తుంది. 36ధూప ద్రవ్యంలో కొంత మెత్తటి పొడుం అయ్యేంత వరకు నూరాలి. సన్నిధి గుడారంలో, ఒడంబడిక పెట్టె ఎదుట ఆ పొడుం ఉంచు. ఇది నేను నిన్ను కలుసుకొనే చోటు. ఈ ధూపపు పొడుంను దాని ప్రత్యేక పని కోసమే నీవు ఉపయోగించాలి. 37యెహోవా కోసం ఈ ప్రత్యేక విధానంలో మాత్రమే నీవు ఈ ధూపాన్ని ఉపయోగించాలి. ఈ ధూపాన్ని ఒక ప్రత్యేక పద్ధతిలో నీవు తయారు చేయాలి. ఇంక ఏ యితరమైన ధూపం చేయడానికి కూడ ఈ ప్రత్యేక పద్ధతిని వినియోగించవద్దు. 38ఒక వ్యక్తి, తన కోసం ఈ ధూపం కొంత తయారు చేసి, దాని పరిమళాన్ని అనుభవించాలని కోరవచ్చు. అయితే, అతడు గనుక అలా చేస్తే, వాడు తన ప్రజల నుండి వేరు చేయబడాలి.”

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

నిర్గమకాండము 30: TERV

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి