నిర్గమకాండము 32
32
బంగారు దూడ
1చాలాకాలం గడిచిపోయినా, మోషే పర్వతం దిగి రాకపోవడం ప్రజలు గమనించారు. కనుక ప్రజలు అహరోను చుట్టూ చేరారు, “చూడు, ఈజిప్టు దేశం నుండి మోషే మమ్మల్ని బయటకు నడిపించాడు. అయితే అతనికి ఏమయిందో మాకు తెలియదు. అందుచేత మా ముందర నడవడానికి ఒక దేవతను చేసి మమ్మల్ని నడిపించు” అని వారతనితో చెప్పారు.
2“మీ భార్యలు, కుమారులు, కుమార్తెలకు చెందిన బంగారు వస్తువులను తీసుకురండి” అని అహరోను ప్రజలతో అన్నాడు.
3కాబట్టి ప్రజలంతా వారి బంగారు వస్తువులను పోగుచేసి వాటిని అహరోను దగ్గరకు తెచ్చారు. 4ప్రజల దగ్గర నుండి అహరోను బంగారం తీసుకున్నాడు. అప్పుడు వాటితో ఒక దూడ విగ్రహం చేసాడు. విగ్రహం చెక్కడానికి అహరోను ఉలి ఉపయోగించాడు. (తర్వాత దానికి బంగారం పొదిగించాడు.)
అప్పుడు ప్రజలు, “ఓ ఇశ్రాయేలూ, ఈజిప్టు నుండి మిమ్మల్ని బయటకు నడిపించింది ఈ దేవుడే” అన్నారు.
5అహరోను వీటన్నింటినీ చూసాడు. కనుక ఆ దూడ ఎదుట ఒక బలిపీఠం నిర్మించాడు. అప్పుడు అహరోను ఒక ప్రకటన చేసాడు. “రేపు యెహోవాకు ప్రత్యేక పండుగ” అని చెప్పాడు.
6మర్నాడు ఉదయం పెందలాడే ప్రజలు మేల్కొన్నారు. వాళ్లు జంతువులను చంపి దహన బలులుగాను, సమాధాన బలులుగాను అర్పించారు. తిని, తాగేందుకు ప్రజలు కూర్చున్నారు. అప్పుడు వాళ్లు విచ్చలవిడిగా సంబరం చేసుకున్నారు.
7అదే సమయంలో మోషేతో యెహోవా ఇలా అన్నాడు: “ఈ పర్వతం దిగి వెళ్లు. నీ ప్రజలు, ఈజిప్టు దేశం నుండి నీవు బయటకు తీసుకు వచ్చిన ప్రజలు భయంకర పాపం చేసారు. 8వాళ్లు చేయాలని నేను ఆజ్ఞాపించిన సంగతుల నుండి వాళ్లు చాల త్వరగా తప్పి పోయారు. కరిగించిన బంగారంతో వాళ్లు ఒక దూడను చేసుకొన్నారు. వాళ్లు ఆ దూడను పూజిస్తూ దానికి బలులు చెల్లిస్తున్నారు. ‘ఇశ్రాయేలూ, ఈజిప్టు నుండి నిన్ను బయటకు రప్పించిన దేవుడు ఇదే, అని ప్రజలు చెప్పుకొనుచున్నారు.’”
9“ఈ ప్రజలను నేను చూశాను. వీళ్లు ఎప్పుడూ నన్ను వ్యతిరేకించే మొండి ప్రజలని నాకు తెలుసు. 10కనుక కోపంతో వాళ్లను నాశనం చేయనివ్వు, అప్పుడు నీలోనుండి ఒక జనాన్ని నేను తయారు చేస్తాను” అని మోషేతో యెహోవా అన్నాడు.
11అయితే, మోషే తన దేవుడైన యెహవాను బ్రతిమాలుకొని: “ప్రభూ! నీ కోపం చేత నీ ప్రజలను నాశనం చేయకు. నీవే నీ మహాశక్తితో బలంతో ఈ ప్రజలను ఈజిప్టు నుండి తీసుకువచ్చావు. 12అయితే, నీవే నీ ప్రజలను నాశనం చేస్తే, ‘యెహోవా తన ప్రజలకు చెడ్డకార్యాలను చేయాలని తలపెట్టాడు. అందుకే ఆయన వాళ్లను ఈజిప్టు నుండి బయటకు రప్పించాడు. పర్వతాల్లోనే వాళ్లను చంపాలని ఆయన అనుకున్నాడు. భూమి మీద తన ప్రజల్ని నాశనం చేయాలని ఆయన అనుకొంటున్నాడు’ అని ఈజిప్టు ప్రజలు చెప్పవచ్చు. కనుక నీ ప్రజల మీద కోపగించవద్దు. నీ కోపం విడిచిపెట్టేయి. నీ ప్రజల్ని నాశనం చేయకు. 13నిన్ను సేవించిన మనుష్యులు అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలును (యాకోబు) జ్ఞాపకం చేసుకో. నీవు నీ పేరు ప్రయోగించి ఆ మనుష్యులకు వాగ్దానం చేసావు. ‘నీ ప్రజలను ఆకాశంలో నక్షత్రాలు ఎన్ని ఉన్నాయో అంతగా చేస్తాను. నేను వారికి వాగ్దానం చేసిన ఈ దేశం అంతా నీ ప్రజలకు ఇస్తాను. ఈ దేశం శాశ్వతంగా వారిదే అవుతుంది’ అని నీవు చెప్పావు.”
14కనుక యెహోవా తన ప్రజలను గూర్చి సంతాపపడ్డాడు. ఆయన చేస్తానన్న కీడును వారికి చేయలేదు. అంటే, ప్రజలను ఆయన నాశనం చేయలేదు.
15అప్పుడు మోషే పర్వతం దిగి వెళ్లాడు. ఆజ్ఞలు రాయబడ్డ రెండు రాతి పలకలు మోషే దగ్గర ఉన్నాయి. రాతికి వెనుక, ముందు రెండు వైపుల ఆజ్ఞలు రాయబడి ఉన్నాయి. 16దేవుడు తానే ఆ రాళ్లను చేసాడు. మరియు దేవుడే ఆ రాళ్ల మీద ఆజ్ఞలు రాసాడు.
17వారు పర్వతం దిగి వెళ్తున్నప్పుడు ప్రజలు బస చేసిన చోటు నుండి వచ్చిన శబ్ధం యెహోషువా విన్నాడు, “కింద బసలో యుద్ధధ్వని వినిపిస్తున్నట్టుంది” అని మోషేతో యెహోషువా అన్నాడు.
18“అందుకు మోషే, అది జయధ్వనులు చేస్తున్న సైన్యం శబ్దం కాదు. ఓటమివల్ల ఒక సైన్యం ఏడుస్తున్న శబ్దమూ కాదు అది, నాకు వినబడుతోన్నది సంగీత శబ్దం” అని జవాబిచ్చాడు.
19మోషే బసను సమీపించినప్పుడు, అతడు బంగారు దూడను, ప్రజలు నాట్యమాడటమూ చూసాడు. మోషేకు చాలా కోపం వచ్చి, ఆ ప్రత్యేక రాతి పలకలను నేలకేసి కొట్టాడు. పర్వతం కింది భాగంలో ఆ రాతి పలకలు ముక్కలు ముక్కలయ్యాయి. 20అప్పుడు ప్రజలు చేసిన దూడను మోషే నాశనం చేసాడు. దాన్ని మంటల్లో వేసి కరిగించేసాడు. అప్పుడు ఆ బంగారం దుమ్ము అయ్యేంత వరకు నూరేసాడు. ఆ దుమ్మును నీళ్లలో పడేసి ఇశ్రాయేలు ప్రజల చేత బలవంతంగా ఆ నీళ్లు తాగించాడు.
21“ఈ ప్రజలు నీకేమి చేసారు? ఇలాంటి చెడ్డ పాపం చేయడానికి నీవెందుకు వాళ్లను నడిపించావు?” అని అహరోనును మోషే అడిగాడు.
22“అయ్యా, కోపగించకు. ఈ ప్రజలు తప్పు చేసేందుకు ఎప్పుడూ సిద్ధమేనని నీకు తెలుసు. 23‘ఈజిప్టు నుండి మోషే మమ్మల్ని నడిపించాడు. అయితే అతనికి ఏమయిందో మాకు తెలియదు. కనుక మమ్మల్ని నడిపించేందుకు మా కోసం ఒక దేవతను తయారు చేయి’ అని ప్రజలు నాతో అన్నారు. 24కనుక ‘మీవద్ద ఉన్న బంగారు నగలను నాకు ఇవ్వండి’ అని ప్రజలతో చెప్పాను. ప్రజలు వారి బంగారం నాకు ఇచ్చారు. నేను ఆ బంగారాన్ని అగ్నిలో వేసాను. అగ్నిలో నుండి ఆ దూడ బయటకు వచ్చింది” అని అహరోను జవాబిచ్చాడు.
25అహరోను అక్కడ గలభాకు కారణమని మోషే తెలుసుకున్నాడు. శత్రువులంతా చూడగలిగేటట్టు ప్రజలు వెర్రివాళ్లలా విచ్చలవిడిగా తిరుగుతున్నారు. 26కనుక నివాసాల ప్రవేశం దగ్గర మోషే నిలబడ్డాడు. “యెహోవాను వెంబడించాలని కోరేవారు ఎవరో వారు నా దగ్గరకు రావాలి.” అన్నాడు. లేవీ కుటుంబానికి చెందిన ప్రజలంతా మోషే దగ్గరకు పరుగెత్తారు.
27అప్పుడు మోషే అన్నాడు, “ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా ఏమి చెబుతున్నాడో నేను మీకు చెబుతాను. ‘ప్రతి మనిషి తన కత్తి తీసుకొని మన బసలో ఒక చివర నుండి మరో చివరకు వెళ్లాలి. ప్రతి మనిషి తన సోదరుణ్ణి, స్నేహితుల్ని, ఇరుగు పొరుగువారిని చంపాల్సి వచ్చినా మీరు వారిని చంపాలి.’”
28లేవీ కుటుంబానికి చెందిన ప్రజలు మోషే మాటకులోబడ్డారు. ఆ రోజు ఇశ్రాయేలీయులలో సుమారు 3,000 మంది చనిపోయారు. 29అప్పుడు, “మీ కుమారులను, మీ సోదరులను దీవించే వారినిగా యెహోవా నేడు మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు” అని మోషే చెప్పాడు.
30మర్నాటి ఉదయం ప్రజలందరికి మోషే, “మీరు భయంకర పాపం చేసారు. అయితే ఇప్పుడు నేను యెహోవా దగ్గరకు పైకి వెళ్తాను. ఆయన మీ పాపం విషయం మిమ్మల్ని క్షమించేందుకు నేనేమైనా చేయగలనేమో” అని చెప్పాడు. 31కనుక మోషే యెహోవా దగ్గరకు తిరిగి వెళ్లి, “దయచేసి ఆలకించు! ఈ ప్రజలు చాలా చెడ్డ పాపం చేసి, బంగారంతో దేవుణ్ణి చేసారు. 32ఇప్పుడు ఈ పాపం విషయం వారిని క్షమించు. నీవు గనుక వారిని క్షమించకపోతే, నీవు వ్రాసిన గ్రంథంలో#32:32 గ్రంథం ఇది బహుశా జీవ గ్రంథం కావచ్చు. దేవుడు తన ప్రజలందరి పేర్లు వ్రాసిన పుస్తకం ఒకటి పెట్టుకుంటాడన్నట్టు ఉంది. నా పేరు తుడిచేయి” అన్నాడు.
33అయితే మోషేతో యెహోవా అన్నాడు, “నాకు వ్యతిరేకంగా ఎవరు పాపం చేస్తారో ఆ ప్రజల పేర్లు మాత్రమే నా గ్రంథంలో నుండి తుడిచి వేస్తాను. 34కనుక కిందకు వెళ్లి, నేను నీకు చెప్పిన చోటుకు ప్రజలను నడిపించు. నీకు ముందు నా దేవదూత నడుస్తూ నిన్ను నడిపిస్తాడు. పాపం చేసిన వాళ్లను శిక్షించవలసిన సమయం వచ్చినప్పుడు వాళ్లు శిక్షించబడుతారు.” 35కనుక ఆ ప్రజలకు భయంకర వ్యాధి వచ్చేటట్టు యెహోవా చేసాడు. వారు బంగారు దూడను చేయమని అహరోనుతో చెప్పినందువల్ల అతను అలా చేసాడు.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
నిర్గమకాండము 32: TERV
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Telugu Holy Bible: Easy-to-Read Version
All rights reserved.
© 1997 Bible League International