నిర్గమకాండము 8

8
1మోషేతో యెహోవా ఇలా అన్నాడు, “ఫరో దగ్గరకు వెళ్లి, ‘నన్ను ఆరాధించడానికి నా ప్రజలను వెళ్లనివ్వు, అని యెహోవా చెబుతున్నాడని అతనితో చెప్పు. 2వారు వెళ్లడానికి ఫరో నిరాకరిస్తే నేను ఈజిప్టును కప్పలతో నింపేస్తాను 3నైలు నది కప్పలతో నిండిపోతుంది. అవి నదిలోనుంచి వచ్చి మీ ఇళ్లలో దూరుతాయి. అవి మీ పడక గదుల్లో పడకల మీద వుంటాయి. మీ అధికారుల ఇళ్లలో, మీ వంట పాత్రల్లో, నీళ్ల బానల్లో కప్పలే ఉంటాయి. 4నీవు, నీ ప్రజలు, నీ అధికారులు అందరి మీదికీ కప్పలు వచ్చేస్తాయి.’”
5అప్పుడు మోషేతో యెహోవా, “కాలువలు, నదులు, చెరువులు, అన్నింటి మీదికీ తన చేతి కర్రను ఎత్తమని అహరోనుతో చెప్పు. కప్పలు బయటకు వచ్చి ఈజిప్టు అంతటా నిండుతాయి” అని చెప్పాడు.
6కనుక ఈజిప్టు జలాలపై అహరోను తన చేయి ఎత్తగా నీళ్లలో నుండి కప్పలు బయటకు వచ్చి, ఈజిప్టు దేశమంతా నిండిపోవటం మొదలయింది.
7మాయలు చేసే ఈజిప్టు మాంత్రికులు కూడా అలాగే చేసారు, కనుక ఈజిప్టు మీదికి ఇంకా ఎక్కువ కప్పలు వచ్చాయి.
8మోషే, అహరోనులను ఫరో పిలిపించాడు, “నా దగ్గర్నుండి, నా ప్రజల దగ్గర్నుండి కప్పలను తీసివేయుమని యెహోవాను అడగండి. యెహోవాకు బలులు అర్పించేందుకు ప్రజల్ని నేను వెళ్లనిస్తాను” అన్నాడు ఫరో.
9ఫరోతో మోషే ఇలాగు చెప్పాడు, “కప్పలు ఎప్పుడు పోవాలనుకుంటున్నావో నాతో చెప్పు, నీ కోసం, నీ ప్రజల కోసం, నీ అధికారుల కోసం నేను ప్రార్థన చేస్తాను. అప్పుడే కప్పలు మిమ్మల్ని, మీ ఇళ్లను విడిచిపెట్టి నదిలోనే ఉండిపోతాయి. (కప్పలు ఎప్పుడు నిన్ను వదిలి పోవాలనుకొంటున్నావు?)”
10“రేపే” అన్నాడు ఫరో.
మోషే అన్నాడు: “నీవు చెప్పినట్టే జరుగుతుంది. మా దేవుడైన, యెహోవాలాంటి దేవుడు ఇంకెవ్వరూ లేరని నీవు తెలుసుకొంటావు. 11నిన్ను, నీ ఇంటిని, నీ అధికారుల్ని, నీ ప్రజల్ను కప్పలు విడిచిపోతాయి. ఆ కప్పలు నదిలోనే ఉండిపోతాయి.”
12మోషే, అహరోను ఫరో దగ్గర్నుండి వెళ్లిపోయారు. ఫరో మీదికి ఆయన పంపిన కప్పల్నిగూర్చి మోషే యెహోవాకు మొరపెట్టాడు. 13మోషే అడిగిన ప్రకారం దేవుడు చేసాడు. ఇళ్లలో, వాకిళ్లలో, పొలాల్లో కప్పలు చచ్చాయి. 14అవి కుళ్లిపోయి దేశమంతా కంపు కొట్టడం మొదలయింది. 15కప్పల బాధ వదలిపోవడం చూచి ఫరో మళ్లీ మొండికెత్తాడు. అతను ఏమి చెయ్యాలని మోషే అహరోనులు అడిగారో, అలా చేయలేదు. ఇదంతా సరిగ్గా యెహోవా చెప్పినట్టే జరిగింది.
పేలు
16యెహోవా మోషేతో ఇలా అన్నాడు “నీ కర్ర పై కెత్తి నేలమీద దుమ్మును కొట్టు ఈజిప్టుదేశ వ్యాప్తంగా దుమ్ము పేలు అవుతాయి. అని అహరోనుతో చెప్పు.”
17వారు అలా చేసారు. అహరోను తన చేతి కర్ర పై కెత్తి నేలమీద దుమ్మును కొట్టాడు. ఈజిప్టు అంతటా దుమ్ము పేలు అయింది. మనుష్యుల మీద జంతువుల మీద పేలు ఎక్కేసాయి.
18ఈజిప్టు మాంత్రికులు వారి మాయల్ని ప్రయోగించి వారు కూడ అలా చేయాలని ప్రయత్నం చేసారు. కానీ దుమ్ము నుండి పేలు వచ్చేటట్టు చేయలేక పోయారు. జంతువుల మీద, మనుష్యుల మీద పేలు అలాగే ఉండిపోయాయి.
19కనుక ఇది యెహోవా శక్తివల్లే జరిగిందని మాంత్రికులు ఫరోతో చెప్పారు. కాని ఫరో వారు చెప్పింది ఒప్పుకోలేదు. ఇదీ సరిగ్గా యెహోవా చెప్పినట్టే జరిగింది.
ఈగలు
20యెహోవా మోషేతో ఇలా అన్నాడు, “ఉదయాన్నే లేచి ఫరో దగ్గరకు వెళ్లు. ఫరో నదికి వెళ్తాడు. ‘నన్ను ఆరాధించడానికి నా ప్రజల్ని వెళ్లనివ్వు’ అని యెహోవా అంటున్నాడని అతనితో చెప్పు. 21‘నీవు నా ప్రజల్ని వెళ్లనివ్వక పోతే, నీ ఇండ్లలోకి ఈగలు వచ్చేస్తాయి, నీ మీద, నీ అధికారుల మీద ఈగలు పట్టేస్తాయి. ఈజిప్టు గృహాలన్నీ ఈగలతో నిండిపోతాయి. ఈజిప్టు దేశమంతా ఈగలతో నిండిపోతుంది.’ 22అయితే ఈజిప్టు ప్రజలను చూచినట్టు మాత్రం ఇశ్రాయేలు ప్రజల్ని నేను చూడను. నా ప్రజలు నివసిస్తున్న గోషెనులో మాత్రం ఈగలు ఉండవు. ఈ విధంగా నేను అంటే యెహోవాను ఈ భూమి మీద ఉన్నానని నీవు తెలుసుకొంటావు. 23కనుక రేపు నా ప్రజల్ని నీ ప్రజల కంటే వేరుగా చూస్తాను. అదే నా రుజువు.”
24అందుచేత యెహోవా అలాగే చేసాడు. ఈజిప్టు మీదికి విస్తారంగా ఈగలు వచ్చేసాయి. ఫరో ఇంట్లోను, అతని అధికారుల ఇండ్లన్నింటిలోను ఈగలు ఉన్నాయి. ఈజిప్టు అంతటా ఈగలు ముసురుకొన్నాయి. ఈగలు దేశాన్ని నాశనం చేస్తున్నాయి. 25కనుక మోషే అహరోనుల్ని ఫరో పిలిపించాడు. “ఈ దేశంలోనే ఇక్కడే మీ దేవునికి బలులు అర్పించండి” అని ఫరో వాళ్లతో చెప్పాడు.
26కానీ మోషే అన్నాడు, “అలా చేయటం సరికాదు. మా దేవుడైన యెహోవాకు బలులు అర్పించటం చాలా భయంకర విషయం అని ఈజిప్టు వాళ్లు అనుకొంటారు. ఈజిప్టు వాళ్లకు కనబడేటట్టు మేము గనుక ఇలా చేస్తే, ఈజిప్టు వాళ్లు మమ్మల్ని రాళ్లతో కొట్టి చంపుతారు. 27మూడు రోజుల ప్రయాణమంత దూరం మమ్మల్ని అరణ్యంలోకి వెళ్లనిచ్చి, అక్కడ మా యెహోవా దేవునికి బలులు అర్పించనివ్వు. యెహోవా మమ్మల్ని ఇలాగే చేయమన్నాడు.”
28అందుకు ఫరో, “మీరు వెళ్లి అరణ్యంలో మీ యెహోవా దేవునికి బలులు అర్పించనిస్తాను. కానీ మీరు మాత్రం మూడు రోజుల ప్రయాణమంత దూరంకంటే ఎక్కువ దూరం వెళ్లకూడదు. ఇక పోయి నాకోసం ప్రార్థించు.” అని మోషేతో అన్నాడు.
29“సరే రేపు నీ నుండి, నీ ప్రజలనుండి, నీ అధికారుల దగ్గర్నుండి ఈగలను తొలిగించమని నేను పోయి యెహోవాను వేడుకొంటాను. కాని, ప్రజలు బలులు అర్పించకుండా నీవు మాత్రం ఆపు చేయకూడదు” అన్నాడు మోషే.
30కనుక మోషే ఫరో దగ్గర్నుండి వెళ్లిపోయి యెహోవాకు ప్రార్థన చేసాడు. 31మోషే కోరినట్టు యెహోవా చేసాడు. ఫరోనుండి, అతని ప్రజలనుండి అధికారుల నుండి ఈగలను యెహోవా తొలగించాడు. ఈగలు ఒక్కటి కూడా మిగుల లేదు. 32అయితే ఫరో మళ్లీ మొండికెత్తి ప్రజలను వెళ్ల నివ్వలేదు.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

నిర్గమకాండము 8: TERV

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి