ఆదికాండము 29
29
యాకోబు రాహేలును కలసికొనుట
1ఇంకా యాకోబు తన ప్రయాణం కొనసాగించాడు. తూర్పు దేశానికి అతడు వెళ్లాడు. 2యాకోబు అలా చూడగానే, పొలాల్లో ఒక బావి కనబడింది. గొర్రెల మందలు మూడు ఆ బావి దగ్గర పండుకొని ఉన్నాయి. ఆ గొర్రెలు నీళ్లు త్రాగే స్థలం ఆ బావి. ఆ బావిమీద ఒక పెద్ద బండ పెట్టి ఉంది. 3గొర్రెలన్నీ అక్కడికి రాగానే, ఆ గొర్రెల కాపరులు ఆ బావిమీద బండను దొర్లిస్తారు. అప్పుడు గొర్రెలన్నీ ఆ నీళ్లు త్రాగుతాయి. ఆ గొర్రెలు పూర్తిగా త్రాగిన తర్వాత గొర్రెల కాపరులు ఆ బండను మళ్లీ దాని స్థానంలో పెట్టేస్తారు.
4“సోదరులారా, ఎక్కడి వాళ్లు మీరు?” అని ఆ గొర్రెల కాపరులను యాకోబు అడిగాడు.
“మేము హారాను వాళ్లం” అని వారు జవాబిచ్చారు.
5అందుకు యాకోబు, “నాహోరు కుమారుడు లాబాను మీకు తెలుసా?” అని అడిగాడు.
“మాకు తెలుసు” అని గొర్రెల కాపరులు జవాబు ఇచ్చారు.
6అప్పుడు యాకోబు “అతను ఎలా ఉన్నాడు?” అని అడిగాడు.
“అతను బాగానే ఉన్నాడు, అంతా క్షేమమే. అదిగో చూడు, ఆ వస్తున్నది అతని కుమార్తె. ఆమె పేరు రాహేలు, అతని గొర్రెల్ని తోలుకొస్తున్నది” అన్నారు వాళ్లు.
7“చూడండి, ఇప్పుడు ఇంకా పగలు ఉంది. సూర్యాస్తమయానికి చాలా సమయం ఉంది. రాత్రి కోసం గొర్రెల్ని మందగా చేర్చటానికి ఇంకా వేళ కాలేదు. కనుక వాటికి నీళ్లు పెట్టి, మళ్లీ పొలాల్లోనికి వెళ్లనియ్యండి” అన్నాడు యాకోబు.
8కానీ గొర్రెల కాపరులు, “మందలన్నీ ఇక్కడ గుమిగూడేవరకు మేము అలా చేయటానికి వీల్లేదు. అప్పుడు మేము బావిమీద బండ దొర్లిస్తాము, గొర్రెలు నీళ్లు త్రాగుతాయి” అన్నారు.
9కాపరులతో యాకోబు మాట్లాడుతుండగానే, రాహేలు తన తండ్రి గొర్రెలతో అక్కడికి వచ్చింది. (ఆ గొర్రెల బాధ్యత రాహేలుది.) 10రాహేలు లాబాను కుమార్తె. యాకోబు తల్లియైన రిబ్కాకు లాబాను సోదరుడు. రాహేలును చూడగానే యాకోబు వెళ్లి, బండను దొర్లించి గొర్రెలకు నీళ్లు పెట్టాడు. 11అప్పుడు యాకోబు రాహేలును ముద్దుపెట్టుకొని ఏడ్చాడు. 12తను ఆమె తండ్రి బంధువును అనీ, రిబ్కా కుమారుడననీ యాకోబు రాహేలుతో చెప్పాడు. కనుక రాహేలు యింటికి పరుగెత్తి, తన తండ్రితో ఆ విషయాలు చెప్పింది.
13తన సోదరి కుమారుడు యాకోబును గూర్చిన వార్త లాబాను విన్నాడు. అందుచేత అతణ్ణి కలుసుకొనేందుకు లాబాను పరుగెత్తాడు. లాబాను అతడ్ని కౌగిలించుకొని, ముద్దు పెట్టుకొని, తన యింటికి తీసుకొని వచ్చాడు. జరిగినదంతా యాకోబు లాబానుతో చెప్పాడు.
14అప్పుడు లాబాను, “ఇదంతా భలే బాగుందే, అయితే నీవు నా స్వంత కుటుంబపు వాడివే సుమా” అన్నాడు. అందువల్ల యాకోబు లాబానుతో ఒక నెల అక్కడే నివసించాడు.
లాబాను యాకోబును మోసగించుట
15ఒకనాడు లాబాను, “జీతం లేకుండా నా దగ్గర నీవు ఇలా పనిచేస్తూ ఉండటం సరిగా లేదు. నీవు బంధువుడివి. అంతేగాని బానిసవు కావు. నేను నీకు ఏమి చెల్లించాలి?” అని యాకోబును అడిగాడు.
16లాబానుకు యిద్దరు కుమార్తెలుండిరి. పెద్దామె లేయా, చిన్నామె రాహేలు.
17రాహేలు అందగత్తె. లేయా కళ్ల సమస్యగలది.#29:17 లేయా కళ్ల సమస్యగలది లేయా చాలా సౌందర్యవతి కాదని పరోక్షంగా చెప్పవచ్చు. 18యాకోబు రాహేలును ప్రేమించాడు. యాకోబు “నన్ను నీ చిన్న కుమార్తె రాహేలును పెళ్లాడనిస్తే, నేను నీకు ఏడు సంవత్సరాల పాటు పనిచేస్తాను” అని లాబానుతో చెప్పాడు.
19“మరొకర్ని చేసుకోవడం కంటే ఆమె నిన్ను పెళ్లి చేసుకోవడం మంచిది. కనుక నా దగ్గరే ఉండు” అన్నాడు లాబాను.
20కనుక యాకోబు అక్కడే ఉండి, రాహేలు కోసం ఏడు సంవత్సరాలు పని చేశాడు. అయితే అతడు రాహేలును అధికంగా ప్రేమించాడు గనుక అది అతనికి చాలా కొద్ది కాలంలాగే కనబడింది.
21ఏడు సంవత్సరాలు అయ్యాక, “రాహేలును నాకు యివ్వండి, పెళ్లి చేసుకొంటాను. నీ దగ్గర నేను పని చేయాల్సిన కాలం తీరిపోయింది” అని యాకోబు లాబానుతో చెప్పాడు.
22కనుక ఆ ప్రదేశంలోని ప్రజలందరికి లాబాను విందు ఇచ్చాడు. 23ఆ రాత్రి లాబాను తన కుమార్తె అయిన లేయాను యాకోబు దగ్గరకు తీసుకు వచ్చాడు. యాకోబు లేయాలు లైంగికంగా కలుసుకొన్నారు. 24తన దాసి జిల్ఫాను తన కుమార్తెకు దాసీగా లాబాను ఇచ్చాడు. 25తాను సంభోగించినది లేయా అని తెల్లవారినప్పుడు యాకోబు తెలుసుకొన్నాడు. లాబానుతో యాకోబు, “నీవు నన్ను మోసం చేశావు. నేను రాహేలును పెళ్లి చేసుకోవాలని నీ దగ్గర కష్టపడి పని చేశాను. ఎందుకు నన్ను నీవు మోసం చేశావు?” అన్నాడు.
26లాబాను చెప్పాడు: “పెద్ద కూతురికి పెళ్లికాక ముందు చిన్న కూతురికి పెళ్లి చేయటానికి మా దేశంలో ఒప్పుకోరు. 27అయితే పెళ్లి ఆచారంగా వారం రోజులు ముగించు, రాహేలునుకూడ పెళ్లి చేసుకొనేందుకు ఇస్తాను. కానీ నీవు మాత్రం మరో ఏడు సంవత్సరాలు నా దగ్గర పని చేయాలి.”
28కనుక యాకోబు అలాగే వారం ముగించాడు. అప్పుడు లాబాను తన కుమార్తె రాహేలును అతనికి భార్యగా ఇచ్చాడు. 29తన దాసీ బిల్హాను తన కుమార్తె రాహేలుకు దాసీగా ఇచ్చాడు. 30కనుక యాకోబు రాహేలుతో కూడా సంభోగించాడు. లేయాకంటే రాహేలును యాకోబు ఎక్కువగా ప్రేమించాడు. లాబాను దగ్గర మరో ఏడు సంవత్సరాలు యాకోబు పని చేశాడు.
యాకోబు కుటుంబం పెరుగుట
31లేయాకంటె రాహేలును యాకోబు ఎక్కువగా ప్రేమించడం యెహోవా చూశాడు. అందుచేత యెహోవా లేయాకు పిల్లలు పుట్టేలాగు చేశాడు. రాహేలుకు పిల్లలు లేరు.
32లేయాకు ఒక కొడుకు పుట్టాడు. ఆమె అతనికి రూబేను#29:32 రూబేను “చూడండి, ఒక కొడుకు” అని దీని అర్థం. అని పేరు పెట్టింది. “నా కష్టాలను యెహోవా చూశాడు. నా భర్త నన్ను ప్రేమించటం లేదు. ఒకవేళ నా భర్త ఇప్పుడైనా నన్ను ప్రేమిస్తాడేమో” అని లేయా అతనికి ఈ పేరు పెట్టింది.
33లేయా మళ్లీ గర్భవతి అయింది, మరో కొడుకు పుట్టాడు. ఈ కుమారునికి షిమ్యోను#29:33 షిమ్యోను “ఆయన వింటాడు” అని దీని అర్థం. అని ఆమె పేరు పెట్టింది. “నేను ప్రేమించబడటం లేదని తెలిసి యెహోవా విని, నాకు ఈ కుమారుణ్ణి ఇచ్చాడు” అని లేయా చెప్పింది.
34లేయా మళ్లీ గర్భవతి అయింది, మరో కొడుకు పుట్టాడు. ఆ కుమారునికి ఆమె లేవి#29:34 లేవి “సన్నిహితం అవుట” అని దీని అర్థం. అని పేరు పెట్టింది. “ఇప్పుడు నా భర్త నన్ను తప్పకుండా ప్రేమిస్తాడు. అతనికి ముగ్గురు కుమారుల్ని నేను ఇచ్చాను” అనుకొంది లేయా.
35అప్పుడు లేయాకు మరో కొడుకు పుట్టాడు. ఈ కుమారునికి యూదా#29:35 యూదా “ఆయన స్తుతించబడునుగాక” అని దీని అర్థం. అని ఆమె పేరు పెట్టింది. “నేను ఇప్పుడు యెహోవాను స్తుతిస్తాను” అని అతనికి ఆ పేరు పెట్టింది లేయా. అంతటితో ఆమెకు సంతాన ప్రాప్తి ఆగిపోయింది.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
ఆదికాండము 29: TERV
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Telugu Holy Bible: Easy-to-Read Version
All rights reserved.
© 1997 Bible League International