హబక్కూకు 1

1
దేవునికి హబక్కూకు ఫిర్యాదు చేయటం
1ప్రవక్తయైన హబక్కూకునకు ఇవ్వబడిన వర్తమానం ఇది.
2యెహోవా, నేను సహాయం కొరకు అర్థిస్తూనే వున్నాను. నీవు నా మొర ఎన్నడు ఆలకిస్తావు? దౌర్జన్యం విషయంలో నేను నీకు మొరపెట్టాను. కాని నీవేమీ చేయలేదు! 3ప్రజలు వస్తువులను దొంగిలిస్తున్నారు. ఇతరులను బాధపెట్టుతున్నారు. ప్రజలు వాదులాడుతూ, కలహిస్తున్నారు. నీవెందుకు నన్నీ భయంకర విషయాలు చూసేలా చేస్తున్నావు? 4న్యాయవ్యవస్థ బలహీనపడింది. ప్రజలకు న్యాయం జరుగటం లేదు. మంచివారిపై దుష్టులు తమ తగాదాలలో గెలుస్తున్నారు. అందువల్ల న్యాయం ఎంతమాత్రం పక్షపాత రహితంగా లేదు.
దేవుడు హబక్కూకునకు సమాధానమివ్వటం
5యెహోవా సమాధానమిచ్చాడు: “ఇతర జనులవైపు చూడు! వారిని గమనించు. నీకు విస్మయం కలుగుతుంది. నీ జీవిత కాలంలో నీకు విస్మయం కలిగించే ఒక పని చేస్తాను. నీవు అది నమ్మాలంటే చూసి తీరాలి. దాని విషయం నీకు చెపితే అది నీవు నమ్మవు. 6బబులోను ప్రజలను నేను బలమైన రాజ్యంగా తీర్చిదిద్దుతాను. ఆ ప్రజలు నీచులు; శక్తిగల యుద్ధవీరులు. వారు భూమికి అడ్డంగా నడుస్తారు. వారికి చెందని ఇండ్లను, నగరాలను వారు వశపర్చుకుంటారు. 7బబులోనువారు ఇతర ప్రజలను భయపెడతారు. బబులోనువారు వారు చేయదల్చుకున్నది చేస్తారు; వెళ్ళదల్చుకున్న చోటుకి వెళతారు. 8వారి గుర్రాలు చిరుతపులులకంటే వేగం కలవి. సూర్యుడు అస్తమించాక అవి తోడేళ్ళకంటె నీచంగా ఉంటాయి. వారి గుర్రపు దళంవారు దూరప్రాంతలనుండి వస్తారు. ఆకలిగొన్న గరుడ పక్షి ఆకాశంనుండి కిందికి దూసుకు వచ్చినట్లు, వారు తమ శత్రువులను వేగంగా ఎదుర్కొంటారు. 9వారంతా చేయకోరుకునే ఒకే ఒక్క విషయం యుద్ధం. వారి సైన్యాలు ఎడారిలో గాలిలా వేగంగా నడుస్తాయి. మరియు బబులోను సైనికులు అనేకానేక మందిని చెరబడతారు. ఇసుక రేణువుల్లా లెక్కలేనంత మందిని పట్టుకుంటారు.
10“బబులోను సైనికులు ఇతర దేశాల రాజులను చూసి నవ్వుతారు. పరదేశ పాలకులు వారికి హాస్యగాండ్రవలె ఉంటారు. పొడవైన, బలమైన గోడలు గల నగరాలను చూచి బబులోను సైనికులు నవ్వుతారు. ఆ సైనికులు గోడమీదికంటె మట్టి బాట సునాయాసంగా నిర్మించి, నగరాలను తేలికగా జయిస్తారు. 11పిమ్మట వారు గాలిలా వెళ్లి మరో ప్రాంతంలో యుద్ధం చేస్తారు. బబులోనువారు ఆరాధించే ఒకే ఒక్క వస్తువు వారి స్వయంశక్తి.”
హబక్కూకు రెండవ ఫిర్యాదు
12పిమ్మట హబక్కూకు చెప్పాడు:
“యెహోవా, నీవు ఎల్లకాలములయందు ఉండే దేవుడవు!
నీవు చావులేని పవిత్ర దేవుడవు!
యెహోవా, జరుగవలసిన కార్యం జరిపించటానికే నీవు బబులోను ప్రజలను సృష్టించావు.
మా ఆశ్రయ దుర్గమా, యూదా ప్రజలను శిక్షించటానికి నీవు వారిని సృష్టించావు.
13నీ కండ్లు దుష్టత్వాన్ని చూడలేవు.
ప్రజలు తప్పు చేయటాన్ని నీవు చూడలేవు.
మరి అటువంటి నీవు ఆ దుష్టులు జయించటం ఎలా చూడగలుగుతున్నావు?
దుష్టులు మంచివారిని ఓడించటం నీవెలా చూడగలుగుతున్నావు?
14“నీవు ప్రజలను సముద్రంలో చేపల్లా తయారు చేశావు.
నాయకుడులేని చిన్న సముద్ర జంతువుల్లా వారున్నారు.
15వారందరినీ గాలాలు, వలలు వేసి శత్రువు పట్టుకుంటాడు.
శత్రువు వారిని తన వలలో పట్టి లాగుతాడు,
తను పట్టుకున్న దానిని చూసి శత్రువు చాలా సంతోషిస్తాడు.
16శత్రువు తను భాగ్యవంతుడుగా నివసించటానికి,
మంచి ఆహారం తినటానికి అతని వల అతనికి సహాయపడుతుంది.
కావున శత్రువు తన వలను ఆరాధిస్తాడు.
తన వల యొక్క గౌరవార్థం అతడు దానికి బలులు అర్పించి, ధూపంవేస్తాడు.
17తన వలతో ధనాన్ని తీసుకుపోవటం అతడు కొనసాగిస్తాడా?
దయా దాక్షిణ్యం లేకుండా అతడు (బబులోను సైన్యం) ప్రజలను నాశనం చేయటం కొనసాగిస్తాడా?”

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

హబక్కూకు 1: TERV

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి