యెషయా 10

10
1చెడు చట్టం వ్రాసే చట్టాల నిర్మాతలను చూడండి. ప్రజలకు జీవితాన్ని దుర్బరం చేసే చట్టాలు ఆ నిర్మాతలు రాస్తారు. 2ఆ చట్ట నిర్మాతలు పేద ప్రజలకు న్యాయం చేకూర్చలేదు. పేద ప్రజల హక్కులను వారు తీసి వేస్తారు. వారు విధవల వద్ద, అనాధల వద్ద ప్రజలను దొంగిలించనిస్తారు.
3చట్ట నిర్మాతలారా, మీరు చేసిన పనులను మీరు వివరించాల్సి ఉంటుంది. ఆ సమయంలో మీరేమి చేస్తారు? దూరదేశంనుండి మీ నాశనం వస్తుంది. సహాయం కోసం మీరు ఎక్కడికి పరుగెత్తుకు వెళ్తారు? మీ ధనం, మీ ఐశ్వర్యాలు మీకేం సాయం చేయవు. 4ఒక ఖైదీలా మీరు శిరస్సు వంచాలి. చచ్చిన వాడిలా మీరు పడిపోతారు. కాని దానివల్ల మీకు సహాయం జరగదు. దేవుడు ఇంకా కోపంగానే ఉంటాడు. దేవుడు ఇంకా మిమ్మల్ని శిక్షించటానికి సిద్ధంగానే ఉంటాడు.
అష్షూరు గర్వాన్ని దేవుడు శిక్షిస్తాడు
5దేవుడు అంటాడు: “అష్షూరును నేను ఒక కర్రలా వాడుకొంటాను. కోపంతో నేను ఇశ్రాయేలును శిక్షించడానికి అష్షూరును వాడుకొంటాను.” 6చెడుకార్యాలు చేసే వారిమీద యుద్ధం చేయటానికి నేను అష్షూరును పంపిస్తాను. వాళ్ల మీద నేను కోపంగా ఉన్నాను. వారిమీద యుద్ధం చేయమని అష్షూరుకు నేను ఆజ్ఞాపిస్తాను. వారిని అష్షూరు ఓడించి, వారి ఐశ్వర్యాలను కొల్లగొట్టుకొంటారు. ఇశ్రాయేలీయులు, వీధుల్లో అష్షూరు వారి పాదాల క్రింద తొక్కబడే ధూళిలా ఉంటారు.
7“అయితే అష్షూరును నేను వాడుకొంటాను అనే విషయం వారికి తెలియదు. అష్షూరు నాకు ఒక సాధనం అని అతనికి తెలియదు. ఇతరులను నాశనం చేయటమే అష్షూరుకు కావాలి. అష్షూరు అనేక రాజ్యాలను నాశనం చేయాలని మాత్రమే పథకం వేస్తుంది. 8అష్షూరు తనకు తాను ఇలా చెప్పుకొంటాడు, ‘నా నాయకులంతా రాజుల్లాంటి వాళ్లు. 9కల్కో పట్టణం కర్కెమీషు పట్టణంలా ఉంటుంది. అర్పాదు పట్టణం హమాతు పట్టణంలా ఉంటుంది. షోమ్రోను పట్టణం దమస్కు పట్టణంలా ఉంటుంది. 10అనేక విగ్రహాలున్న ఆ రాజ్యాలను నేను ఓడించేశాను, ఇప్పుడు అవి నా అధికారంలో ఉన్నాయి. వాళ్లు పూజించే విగ్రహాలు యెరూషలేము, సమరయలో ఉన్న విగ్రహాలకంటె గొప్పవి. 11షోమ్రోనును, దాని విగ్రహాలను నేను ఓడించాను. యెరూషలేమును, దాని ప్రజలు తయారుచేసిన విగ్రహాలను కూడ నేను ఓడిస్తాను.’”
12యెరూషలేముకు, సీయోను కొండకు నా ప్రభువు చేయదలచిన వాటిని చేయటం ముగిస్తాడు. అప్పుడు యెహోవా అష్షూరును శిక్షిస్తాడు. అష్షూరు రాజు చాలా గర్విష్ఠి. అతడు గర్వం చేత చాలా చెడ్డ పనులు చేశాడు. అందుచేత దేవుడు అతణ్ణి శిక్షిస్తాడు.
13అష్షూరు రాజు అంటున్నాడు: “నేను చాలా తెలివిగలవాడ్ని. నా స్వంత జ్ఞానం, శక్తి మూలంగా నేను ఎన్నోగొప్ప కార్యాలు చేశాను. అనేక రాజ్యాల్ని నేను ఓడించాను. వారి ఐశ్వర్యం నేను దోచుకొన్నాను. వారి ప్రజలను నేను బానిసలుగా చేసుకొన్నాను. నేను చాలా శక్తిగలవాణ్ణి. 14ఒకడు పక్షి గూటిలోనుండి గుడ్లు తీసినట్టుగా, నేను నా స్వంత చేతుల్తో ఈ ప్రజలందరి సంపదలు తీసుకొన్నాను. ఒక పక్షి తన గూడును, గుడ్లను తరచు విడిచిపెడ్తుంటుంది. ఆ గూటిని కాపాడేందుకు ఏమీ లేదు. కిచకిచలాడ్తూ, తన రెక్కలతో, ముక్కుతో కొట్లాడేందుకు అక్కడ ఏ పక్షి లేదు. అందుచేత మనుష్యులు ఆ గుడ్లు తీసుకొంటారు. ఆదే విధంగా భూలోకంలోని మనుష్యులందరినీ నేను తీసుకొనకుండా నన్ను ఆపగలిగిన వాడు ఎవడూ లేడు.”
15గొడ్డలి, దానిని ప్రయోగించే వానికంటె గొప్పదేంకాదు. రంపం, దానితో కోసే వానికంటె గొప్పదేంకాదు. కాని అష్షూరు తాను దేవునికంటే ముఖ్యం అనుకొంటుంది. ఎవరినైనా శిక్షించేందకు ఒకడు బెత్తం తీసుకొని ప్రయోగిస్తే, అతనికంటె ఆ బెత్తం ఎక్కువ శక్తి గలది, ముఖ్యమయింది అన్నట్టు ఉంటుంది. 16అష్షూరు చాల గొప్పవాడ్ని అని అనుకొంటాడు. కానీ సర్వశక్తిమంతుడైన యెహోవా అష్షూరు మీదికి గొప్ప రోగం పంపిస్తాడు. ఒక రోగి బరువు కోల్పోయినట్టు అష్షూరు తన ఐశ్వర్యాన్ని, శక్తిని పోగొట్టుకొంటాడు. అప్పుడు అష్షూరు మహిమ నాశనం అవుతుంది. సర్వం పోయేవరకు మండుతూ ఉండే అగ్నిలా అది ఉంటుంది. 17ఇశ్రాయేలు వెలుగు (దేవుడు) అగ్నిలా ఉంటాడు. ఆ పరిశుద్ధుడు ఒక జ్వాలలా ఉంటాడు. మొట్టమొదట పొదలను, ముళ్లకంపలను కాల్చేసే అగ్నిలా ఆయన ఉంటాడు. 18ఆ తర్వాత అగ్ని మహా వృక్షాలను, ద్రాక్షాతోటలను కాల్చివేస్తుంది. చివరికి సర్వం, ప్రజలతో సహా నాశనం చేయబడుతుంది. దేవుడు అష్షూరును నాశనం చేసినప్పుడు అలా ఉంటుంది. అష్షూరు కుళ్లిపోతున్న మొద్దులా ఉంటుంది. 19అరణ్యంలో కొన్ని చెట్లు మాత్రం నిలిచి ఉండవచ్చు. కానీ అవి ఒక పిల్లవాడు కూడ లెక్కబెట్ట గలిగినన్ని ఉంటాయి.
20ఆ సమయంలో ఇశ్రాయేలులో ఇంకా బ్రతికి ఉన్నవారు, యాకోబు వంశ ప్రజలు, వారిని కొట్టేవాని మీద ఆధారపడరు. ఇశ్రాయేలీయుల పరిశుద్ధుడైన యెహోవా మీద నిజంగా ఆధారపడటం వారు నేర్చుకొంటారు. 21యాకోబు వంశంలో మిగిలిన ప్రజలు శక్తివంతుడైన దేవున్ని మరల వెంబడిస్తారు.
22మీ ప్రజలు చాలామంది ఉన్నారు. వారు సముద్రపు ఇసుకలా ఉన్నారు. కానీ ఆ ప్రజల్లో కొద్ది మంది మాత్రమే యెహోవా దగ్గరకు తిరిగి వచ్చేందుకు మిగిలి ఉంటారు. ఆ ప్రజలు దేవుని దగ్గరకు తిరిగి వస్తారు. కాని ముందు మీ దేశం నాశనం చేయబడుతుంది. దేశాన్ని నాశనం చేస్తానని దేవుడు ప్రకటించాడు. ఆ తర్వాత దేశానికి మంచి కలుగుతుంది. అది నిండుగా ప్రవహిస్తున్న నదిలా ఉంటుంది. 23నా ప్రభువు, సర్వశక్తిమంతుడైన యెహోవా నిశ్చయంగా ఈ దేశాన్ని నాశనం చేస్తాడు.
24నా ప్రభువు, సర్వశక్తిమంతుడైన యెహోవా చెబుతున్నాడు: “సీయోనులో నివసిస్తున్న నా ప్రజలారా, అష్షూరు గూర్చి భయపడకండి. గతంలో ఈజిప్టు మిమ్మల్ని కొట్టినట్టు అతడు మిమ్మల్ని కొడతాడు. మిమ్మల్ని కొట్టడానికి అష్షూరు బెత్తం ఉపయోగించినట్టు అది ఉంటుంది. 25అయితే కొంచెం కాలం కాగానే నా కోపం నిలిచిపోతుంది. అష్షూరు మిమ్మల్ని తగినంతగా శిక్షించిందని నేను తృప్తి పడతాను.”
26అప్పుడు సర్వశక్తిమంతుడైన యెహోవా కొరడాతో అష్షూరును కొడతాడు. గతంలో యెహోవా ఓరేబు బండ దగ్గర మిద్యానును ఓడించాడు. యెహోవా అష్షూరు మీద దాడి చేసినప్పుడు కూడా అలాగే ఉంటుంది. గతంలో యెహోవా ఈజిప్టును శిక్షించాడు. ఆయన సముద్రం మీద కర్ర ఎత్తి, తన ప్రజలను ఈజిప్టునుండి బయటకు నడిపించాడు. యెహోవా తన ప్రజలను అష్షూరు నుండి రక్షించినప్పుడు కూడ అలాగే ఉంటుంది.
27మీరు మీ భుజాల మీద కాడిపైన మోయాల్సిన బరువుల్లాంటి కష్టాలు అష్షూరు మీకు కలిగిస్తాడు. కాని ఆ కాడి మీ మెడమీద నుండి తొలగించబడుతుంది. మీ (దేవుడు) బలం చేత ఆ కాడి విరుగగొట్టబడుతుంది.
అష్షూరు సైన్యం ఇశ్రాయేలును ముట్టడిస్తుంది
28“శిథిలాల” (ఆయాతు) దగ్గర సైన్యం చొరబడుతుంది. సైన్యం “కళ్లం” (మిగ్రోను) మీద నడచిపోతుంది. సైన్యం తన ఆహారాన్ని “గిడ్డంగిలో” దాచుకొంటుంది. 29సైన్యం రేవు దగ్గర (మాబారా) నది దాటుతుంది. గెబలో సైన్యం నిద్రపోతుంది. రామా భయపడుతుంది. సౌలు గిబ్యాలో ప్రజలు పారిపోతారు.
30బాత్ గల్లీము గట్టిగా కేకలు వేయి! లాయిషా, ఆలకించు! అనాతోతూ, నాకు జవాబు చెప్పు, 31మద్మేనా ప్రజలు పారిపోతున్నారు. గిబాని ప్రజలు దాక్కుంటున్నారు. 32ఈ రోజే సైన్యం నోబు దగ్గర నిలుస్తుంది. యెరూషలేము పర్వతంలో సీయోను కొండకు విరోధంగా యుద్ధం చేయటానికి సైన్యం సిద్ధం అవుతుంది.
33చూడండి! మన ప్రభువు, సర్వశక్తిమంతుడైన యెహోవా ఆ మహా వృక్షాన్ని (అష్షూరు) నరికి వేస్తాడు. యెహోవా తన మహా శక్తతో దీన్ని చేస్తాడు. గొప్ప వాళ్లు, ప్రముఖులు నరికివేయబడి, ముఖ్యత లేని వారవుతారు. 34యెహోవా తన గొడ్డలితో అరణ్యం నరికివేస్తాడు. లెబానోనులో మహా వృక్షాలు (ప్రముఖ వ్యక్తులు) పడిపోతాయి.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

యెషయా 10: TERV

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి