యెషయా 28

28
ఉత్తర ఇశ్రాయేలుకు హెచ్చరికలు
1షోమ్రోనును చూడండి!
ఎఫ్రాయిము త్రాగుబోతులు ఆ పట్టణాన్ని గూర్చి గర్విస్తున్నారు.
చుట్టూ ఐశ్వర్యవంతమైన లోయ గల కొండ మీద ఆ పట్టణం ఆసీనమయింది.
షోమ్రోను ప్రజలు తమ పట్టణం అందమైన పూలకిరీటం అనుకొంటారు.
కానీ వారు మద్యంతో మత్తెక్కి ఉన్నారు
మరియు “అందమైన ఈ కిరీటం” కేవలం చస్తున్న ఒక మొక్క మాత్రమే.
2చూడు, బలమూ, ధైర్యమూ గల ఒకడు నా ప్రభువు దగ్గర ఉన్నాడు.
ఆ వ్యక్తి వడగండ్ల వర్షపు తుఫానులా దేశంలోనికి వస్తాడు. తుఫాను వచ్చినట్టు ఆయన దేశంలోనికి వస్తాడు.
దేశాన్ని వరదలో ముంచెత్తే బలమైన నీటి ప్రవాహంలా ఆయన ఉంటాడు.
ఆ కిరీటాన్ని (సమరయ) ఆయన నేలకేసి కొడ్తాడు.
3ఎఫ్రాయిము త్రాగుబోతులు, తమ “అందమైన కిరీటం” గూర్చి గర్విస్తున్నారు.
కానీ ఆ పట్టణం కాళ్ల క్రింద తొక్కబడుతుంది.
4చుట్టూరా ఐశ్వర్యవంతమైన లోయగల ఆ పట్టణం ఒక కొండమీద ఆసీనమై ఉంది.
అయితే ఆ “అందాల పూల కిరీటం” కేవలం చస్తున్న ఒక మొక్క మాత్రమే
ఆ పట్టణం వసంత కాలానికి ముందు కాసే అంజూర పండులా ఉంటుంది.
ఒక వ్యక్తి ఆ అంజూరాలు ఒకటి చూస్తే అతడు వెంటనే అంజూరం తెంపి, తింటాడు.
5ఆ సమయంలో సర్వశక్తిమంతుడైన యెహోవా “సౌందర్య కిరీటం” అవుతాడు. విడువబడిన తన ప్రజలకు ఆయనే “పూల అద్భుత కిరీటం” అవుతాడు. 6అప్పుడు ప్రజలకు తీర్పు తీర్చే న్యాయమూర్తులకు యెహోవా జ్ఞానం ప్రసాదిస్తాడు. పట్టణ ద్వారం దగ్గర యుద్ధాలలో ఉండే ప్రజలకు యెహోవా బలం ప్రసాదిస్తాడు. 7కానీ ఆ నాయకులు ఇప్పుడు తాగి మత్తులుగా ఉన్నారు. యాజకులు, ప్రవక్తలు అందరూ ద్రాక్షమద్యం తాగి మత్తెక్కి ఉన్నారు. వారు తూలి పడుతున్నారు. ప్రవక్తలు వారి దర్శనాలు చూచినప్పుడు మత్తులుగా ఉన్నారు. న్యాయమూర్తులు వారి నిర్ణయాలు చేసేటప్పుడు మత్తులుగా ఉన్నారు. 8ప్రతిబల్లా వాంతులతో నిండిపోయింది. ఎక్కడా శుభ్రమైన స్థలం లేదు.
దేవుడు తన ప్రజలకు సహాయం చేయాలని కోరుట
9యెహోవా ప్రజలకు ఒక పాఠం నేర్పించాలని ప్రయత్నిస్తున్నాడు. ప్రజలు తన ఉపదేశాలను గ్రహించేట్టు చేయాలని యెహోవా ప్రయత్నిస్తున్నాడు. కానీ ప్రజలు చిన్న శిశువుల్లా ఉన్నారు. కొన్నాళ్ల నుంచే తల్లి పాలు తాగటం మొదలు పెట్టిన చిన్న శిశువుల్లా వారు ఉన్నారు. 10కనుక వాళ్లు చిన్న శిశువులు అన్నట్టే యెహోవా వాళ్లతో మాట్లాడుతున్నాడు.
ఇక్కడ ఒక ఆజ్ఞ, అక్కడ ఒక ఆజ్ఞ
ఇక్కడ ఒక నియమం, అక్కడ ఒక నియమం
ఇక్కడ ఒక పాఠం, అక్కడ ఒక పాఠం.
11యెహోవా ఈ వింత విధానంలో మాట్లాడటం ప్రయోగిస్తాడు, ఈ ప్రజలతో మాట్లాడటానికి ఆయన ఇతర భాషలు ఉపయోగిస్తాడు.
12గతంలో దేవుడు ఆ ప్రజలతో మాట్లాడి “ఇదిగో విశ్రాంతి స్థలం, ఇదే శాంతి స్థలం. అలసిపోయిన మనుష్యులు వచ్చి విశ్రాంతి తీసుకోండి. ఇదే శాంతి స్థలం” అని చెప్పాడు.
కానీ ప్రజలు దేవుని మాట వినిపించుకోలేదు. 13అందుచేత దేవుని మాటలు విదేశీ భాషలా ఉన్నాయి:
ఇక్కడ ఒక ఆజ్ఞ, అక్కడ ఒక ఆజ్ఞ
ఇక్కడ ఒక నియమం, అక్కడ ఒక నియమం
ఇక్కడ ఒక పాఠం, అక్కడ ఒక పాఠం.
వారు చేసిందే వారికి నచ్చింది. కనుక ప్రజలు వెనక్కు తగ్గి, ఓడించబడ్డారు. ప్రజలు పట్టుబడి, బంధించబడ్డారు.
దేవుని తీర్పును ఎవరూ తప్పించుకోలేరు
14యెరూషలేములో ఉన్న నాయకులారా, యెహోవా సందేశం మీరు వినాలి. కానీ ఇప్పుడు ఆయన మాట వినడానికి మీరు నిరాకరిస్తున్నారు. 15“మరణంతో మేము ఒక ఒడంబడిక చేసుకున్నాం. చావు స్థలం, పాతాళంతో మాకు ఒక ఒప్పందం ఉంది. కనుక మేము శిక్షించబడం. శిక్ష మమ్మల్ని బాధించకుండానే దాటి పోతుంది. మా మాయలు అబద్ధాల చాటున మేము దాక్కొంటాం” అని మీరు చెబుతున్నారు.
16ఆ విషయాల మూలంగా, నా ప్రభువు యెహోవా చెబుతున్నాడు: “సీయోనులో నేల మీద నేను ఒక బండను, ఒక మూలరాయిని ఉంచుతాను. ఇది చాలా ప్రశస్తమైన రాయి. ముఖ్యమైన ఈ బండమీదనే సమస్తం నిర్మించబడుతుంది. ఆ బండను విశ్వసించిన వారు నిరాశ చెందరు.
17“ఒక గోడ తిన్నగా ఉన్నట్టు చూపించటానికి మనుష్యులు మట్టపుగుండు కట్టిన దారం ఉపయోగిస్తారు. అదే విధంగా ఏది సరైనదో చూపించేందుకు నేను న్యాయం, మంచితనం ఉపయోగిస్తాను. చెడ్డ వాళ్లయిన మీరు మీ అబద్ధాలు, మాయల వెనుక దాగుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ మీరు శిక్షించబడతారు. మనం దాగుకొనే స్థలాలను నాశనం చేసేందుకు వస్తున్న తుఫాను, లేక వరదలా అది ఉంటుంది. 18మరణంతోటి మీ ఒడంబడిక తుడిచి వేయబడుతుంది. పాతాళంతో మీ ఒడంబడిక మీకు సహాయం చేయదు.
“ఒక వ్యక్తి వచ్చి మిమ్మల్ని శిక్షిస్తాడు. ఆయన మిమ్మల్ని తన పాద ధూళిగా చేస్తాడు. 19ఆ వ్యక్తి వచ్చి మిమ్మల్ని తీసుకొని వెళ్లిపోతాడు. మీ శిక్ష భయంకరంగా ఉంటుంది. మీ శిక్ష ఉదయం పెందలాడే వచ్చి, చాలా రాత్రి వరకు ఉంటుంది.
“అప్పుడు మీకు ఈ కథ అర్థం అవుతుంది: 20ఒక మనిషి చాల పొట్టి మంచం మీద నిద్రపోయేందుకు ప్రయత్నించాడు. కప్పుకొనేందుకు సరిపడేంత వెడల్పు లేని దుప్పటి అతని దగ్గర ఉంది. మంచం, దుప్పటి నిష్ప్రయోజనమే, మీ ఒడంబడికలు అలాంటివే.”
21యెహోవా పెరాజీము వద్ద చేసినట్టు యుద్ధం చేస్తాడు. గిబియోను లోయలో ఆయన కోపగించినట్టు యెహోవా కోపగిస్తాడు. తర్వాత యెహోవా చేయాల్సిన వాటిని చేస్తాడు. యెహోవా కొన్ని వింత పనులు చేస్తాడు. అయితే ఆయన తన పని ముగిస్తాడు. ఆయన పని ఒక క్రొత్తవాని పని. 22మీరు వాటికి వ్యతిరేకంగా పోరాడకూడదు. మీరు గనుక పోరాడితే మీ చూట్టూ ఉన్న తాళ్లు మరింత బిగిసిపోతాయి.
నేను విన్న మాటలు మారవు. భూమి అంతటినీ పాలించే సర్వశక్తిమంతుడైన యెహోవా నుండి ఆ మాటలు వచ్చాయి. ఆ విషయాలు జరిగించబడతాయి.
యెహోవా న్యాయంగా శిక్షిస్తాడు
23నేను మీతో చెప్పే సందేశాన్ని శ్రద్ధగా వినండి. 24ఒక రైతు తన పొలాన్ని ఎప్పటికీ దున్నుతూనే ఉంటాడా? లేదు. అతడు ఎప్పుడూ భూమిని చదును చేస్తూనే ఉంటాడా? లేదు. 25రైతు భూమిని సిద్ధంచేసి, విత్తనాలు వేస్తాడు. వేర్వేరు విత్తనాలను వేర్వేరు పద్ధతుల్లో వేస్తాడు. నల్ల జీలకర్ర విత్తనాలు వెదజల్లుతాడు. తెల్ల జీలకర్ర విత్తనాలను నేలమీద చెల్లుతాడు. గోధుమలను వరుస క్రమంలో నాటుతాడు. యవలను దాని ప్రత్యేక స్థలంలో నాటుతాడు, మిరప మొలకలను తన పొలంగట్ల మీద నాటుతాడు.
26మీకు ఒక పాఠం నేర్పించేందుకు మన దేవుడు దీనిని వాడుతున్నాడు. దేవుడు తన ప్రజలను శిక్షించినప్పుడు న్యాయంగానే ఉన్నాడు అని ఈ ఉదాహరణ తెలియజేస్తుంది. 27నల్ల జీలకర్ర నూర్చడానికి రైతు, పదును పళ్లున్న పెద్ద పలకల్ని ఉపయోగిస్తాడా? లేదు. జీలకర్ర నూర్చడానికి రైతు బండిని ఉపయోగిస్తాడా? లేదు. ఆ విత్తనాల మీద గుల్లలను రాల్చడానికి అతడు ఒక చిన్న కర్రను ఉపయోగిస్తాడు. 28ఒక స్త్రీ రొట్టె చేసేటప్పుడు ఆమె తన చేతులతో ముద్దనుచేసి, పిసుకుతుంది. కానీ ఆమె ఎప్పటికీ అదే పని చేస్తూ ఉండదు. అదే విధంగా యెహోవా తన ప్రజలను శిక్షిస్తాడు. బండి చక్రంతో ఆయన వారిని భయపెడతాడు గాని ఆయన వారిని పూర్తిగా చితుకగొట్టడు. అనేక గుర్రాలు వారిని అణగ తొక్కనీయడు. 29ఇది సర్వశక్తిమంతుడైన యెహోవా సందేశం యెహోవా అద్భుతమైన సలహా ఇస్తాడు. దేవుడు నిజంగా జ్ఞానం గలవాడు.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

యెషయా 28: TERV

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి