యెషయా 42

42
యెహోవా యొక్క ప్రత్యేకమైన సేవకుడు
1“నా సేవకుణ్ణి చూడండి!
నేను అతన్ని బలపరుస్తాను.
నేను ఏర్పరచుకొన్నవాడు అతడే.
అతని గూర్చి నేను ఎంతో ఆనందిస్తున్నాను.
నా ఆత్మను నేను అతనిలో ఉంచాను.
జనాలన్నింటికి అతడు న్యాయం చేకూరుస్తాడు.
2అతడు వీధుల్లో కేకలు వేయడు
అతడు గట్టిగా అరిచి శబ్దం చేయడు.
3అతడు సౌమ్యుడు. అతడు నలిగిన గడ్డిపరకను గూడ విరువడు.
మిణుకు మిణుకు మంటున్న మంటనుగూడ అతడు ఆర్పడు.
అతడు న్యాయాన్ని ప్రయోగించి ఏది సత్యమో తెలుసుకొంటాడు.
4లోకానికి న్యాయం చేకూర్చేవరకు
అతడు బలహీనం కాడు, నలిగిపోడు.
దూర స్థలాల్లోని ప్రజలు అతని ఉపదేశాలను విశ్వసిస్తారు.”
ప్రపంచాన్ని చేసినవాడు, పరిపాలించేవాడు యెహోవా
5యెహోవా, సత్యదేవుడు ఈ సంగతులు చెప్పాడు: (ఆకాశాలను యెహోవా చేశాడు. ఆకాశాలను భూమిమీద విస్తరింపజేసినవాడు యెహోవా. ఆయనే భూమిమీద సమస్తం చేసాడు. భూమిమీద మనుష్యులందరికి ఆయనే జీవం ప్రసాదిస్తాడు. భూమిమీద నడిచే ప్రతి వ్యక్తికి ఆయనే ప్రాణం పోస్తాడు.)
6“మీరు సరైనది చేయాలని నిన్ను పిలిచింది నేనే, యెహోవాను.
నేను నీ చేయి పట్టుకొంటాను. నేను నిన్ను కాపాడుతాను.
ప్రజలతో నాకు ఒక ఒడంబడిక ఉంది అని తెలియజేసేందుకు నీవే ఒక సంకేతం.
నీవు ప్రజలందరి కోసం ప్రకాశించే వెలుగుగా ఉంటావు.
7గుడ్డివాళ్ల కళ్లు నీవు తెరుస్తావు. వాళ్లు చూడగలుగుతారు.
అనేక మంది ప్రజలు చెరలో ఉన్నారు. ఆ ప్రజలను నీవు విడుదల చేస్తావు.
అనేక మంది ప్రజలు చీకట్లో జీవిస్తున్నారు. ఆ బందీ గృహంనుండి నీవు వారిని బయటకు నడిపిస్తావు.
8“నేను యెహోవాను.
నా పేరు యెహోవా.
నేను నా మహిమను మరొకరికి ఇవ్వను.
నాకు చెందాల్సిన స్తుతిని విగ్రహాలకు (అబద్ధపు దేవుళ్ళకు) చెందనివ్వను.
9కొన్ని సంగతులు జరుగుతాయని మొదట్లోనే నేను చెప్పాను,
ఆ సంగతులు జరిగాయి.
ఇప్పుడు, భవిష్యత్తులో జరుగబోయే సంగతులను గూర్చి,
అవి జరుగక ముందే నేను మీకు వాటిని గూర్చి చెబుతాను.”
దేవునికొక స్తుతి గీతం
10యెహోవాకు క్రొత్త కీర్తన పాడండి.
భూమి మీద చాలా దూరంలో ఉన్న సర్వ ప్రజలారా,
సముద్రాల్లో ప్రయాణం చేసే సర్వ ప్రజలారా,
మహా సముద్రాల్లోని సర్వ ప్రాణులారా,
దూర స్థలాల్లో ఉన్న సర్వ ప్రజలారా యెహోవాను స్తుతించండి!
11అరణ్యాలు, పట్టణాలు కేదారు పొలాలు
యెహోవాను స్తుతించండి
సెలా నివాసులారా ఆనందంగా పాడండి.
మీ పర్వత శిఖరం మీదనుండి పాడండి.
12యెహోవాకు మహిమ ఆపాదించండి.
దూర దేశాల్లోని ప్రజలంతా ఆయనను స్తుతించాలి.
13యెహోవా ఒక పరాక్రమ సైనికునిలా బయలుదేరుతున్నాడు.
ఆయన యుద్ధం చేయటానికి సిద్ధంగా ఉన్న వానిలా ఉంటాడు. ఆయన చాలా ఉర్రూతలూగుతూంటాడు.
ఆయన గట్టిగా కేకలు వేసి అరుస్తాడు.
ఆయన తన శత్రువులను ఓడిస్తాడు.
దేవుడు చాలా ఓర్పుగలవాడు
14“చాలా కాలంగా నేను మౌనంగా ఉన్నాను.
నేను అలానే మౌనంగా ఉండి, నన్ను నేను నిగ్రహించుకొన్నాను.
కానీ ఇప్పుడు శిశువును కంటున్న స్త్రీలా నేను గట్టిగా అరుస్తాను.
నేను కఠినంగా, గట్టిగా ఊపిరి పీలుస్తాను.
15కొండలను, పర్వతాలను నేను నాశనం చేస్తాను.
అక్కడ మొలిచే మొక్కలన్నింటిని నేను ఎండిపోయేట్టు చేస్తాను.
నదులను నేను పొడి నేలగా చేస్తాను.
నీటి మడుగులను నేను ఎండిపోయేట్టు చేస్తాను.
16గుడ్డివారికి ఇదివరకు తెలియని మార్గంలో నేను వారిని నడిపిస్తాను
ఆ గుడ్డివారు ఇదివరకు ఎన్నడూ తిరుగని బాటలలో నేను వారిని నడిపిస్తాను.
చీకటిని నేను వారికి వెలుగుగా చేస్తాను.
కరకు నేలను నేను చదును చేస్తాను.
నేను వాగ్దానం చేసే పనులను నేను చేస్తాను.
నా ప్రజలను నేను విడువను.
17కానీ కొంతమంది మనుష్యులు నన్ను వెంబడించటం మానివేశారు.
బంగారపు పూత పూయబడిన విగ్రహాలు వారికి ఉన్నాయి. ‘మీరే మా దేవుళ్లు’ అని వారు ఆ విగ్రహాలతో చెబుతారు.
ఆ ప్రజలు వారి అబద్ధపు దేవుళ్లను నమ్ముతారు.
కానీ ఆ ప్రజలు నీరాశ చెందుతారు.”
దేవుని మాట వినటానికి ఇశ్రాయేలు నిరాకరించింది
18“చెవిటి ప్రజలారా నా మాట వినాలి.
గుడ్డి మనుష్యులారా మీరు కళ్లు తెరిచి, నన్ను చూడాలి.
19ప్రపంచం అంతటిలోకెల్లా నా సేవకుడు#42:19 నా సేవకుడు ఇక్కడ ఇది ఇశ్రాయేలు ప్రజలు అని కూడా అర్థం చెప్పవచ్చు. ఎక్కువ గుడ్డివాడు.
నేను ప్రపంచంలోకి పంపించిన నా సేవకుడు మహా చెవిటివాడు.
నేను ఒడంబడిక చేసుకొన్న ఆ వ్యక్తి యెహోవా సేవకుడు అందరికంటె మహా గుడ్డివాడు.
20ఈ సేవకుడు తాను ఏమి చేయాలో అది చూడాలి.
కానీ అతడు నాకు విధేయత చూపడం లేదు.
అతడు తన చెవులతో వినగలడు.
కానీ అతడు నా మాట వినుటకు నిరాకరిస్తున్నాడు.”
21యెహోవా తన సేవకుని ఎడల న్యాయం చూపగోరుతున్నాడు.
కనుక అద్భుతమైన ఉపదేశాలను యెహోవా తన ప్రజలకు చేస్తాడు.
22అయితే ప్రజలను చూడండి
ఇతరులు వారిని ఓడించి, వారి దగ్గర దొంగిలించారు.
యువకులంతా భయపడ్తున్నారు.
వారు చెరలో బంధించబడ్డారు.
మనుష్యులు వారి ధనం వారి దగ్గర్నుండి దోచుకొన్నారు.
వారిని రక్షించేందుకు ఏ మనిషిలేడు.
ఇతరులు వారి డబ్బు దోచుకొన్నారు.
“దానిని తిరిగి ఇచ్చేయండి” అని చెప్పగల వాడు ఒక్కడూ లేడు.
23మీలో ఎవరైనా దేవుని మాట విన్నారా? లేదు. కానీ మీరు ఆయన మాటలు జాగ్రత్తగా విని, జరిగిన దానిని గూర్చి ఆలోచించాలి. 24యాకోబు, ఇశ్రాయేలునుండి ధనాన్ని దోచుకోనిచ్చింది ఎవరు? యెహోవాయే వారిని ఇలా చేయనిచ్చాడు. మనం యెహోవాకు విరోధంగా పాపం చేశాం. అందుచేత యెహోవా మన ధనాన్ని ఇతరులు దోచుకోనిచ్చాడు. యెహోవా కోరిన విధంగా జీవించటానికి ఇశ్రాయేలు ప్రజలు ఇష్టపడలేదు. ఇశ్రాయేలు ప్రజలు ఆయన ఉపదేశాలను వినిపించుకోలేదు. 25అందుచేత యెహోవా వారిమీద కోపగించాడు. యెహోవా వారి మీదకు గొప్పయుద్ధాలు వచ్చేట్టు చేశాడు. ఇశ్రాయేలు ప్రజలకు వారి చుట్టూరా అగ్ని ఉన్నట్టుగా ఉంది. కానీ జరుగుతోంది ఏమిటో వారికి తెలియలేదు. వారు కాలిపోతున్నట్టే ఉంది. కానీ జరుగుతోన్న సంగతులను గ్రహించేందుకు వారు ప్రయత్నించలేదు.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

యెషయా 42: TERV

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి