యెషయా 60

60
దేవుడు వస్తున్నాడు
1“నా వెలుగైన యెరూషలేమా లెమ్ము!
నీ వెలుగు (దేవుడు) వస్తున్నాడు. యెహోవా మహిమ నీ మీద ప్రకాశిస్తుంది.
2ఇప్పుడు భూమిని,
దాని ప్రజలను చీకటి ఆవరించి ఉంది.
కానీ యెహోవా నీ మీద ప్రకాశిస్తాడు.
నీ చుట్టూరా ఆయన మహిమను ప్రజలు చూస్తారు.
3ఆ సమయంలో రాజ్యాలు నీ వెలుగు (దేవుడు) దగ్గరకు వస్తాయి.
ప్రకాశవంతమైన నీ వెలుగు దగ్గరకు రాజులు వస్తారు.
4నీ చుట్టూ చూడు,
చూడు ప్రజలు చూట్టూ చేరి, నీ దగ్గరకు వస్తున్నారు.
ఆ ప్రజలు దూరం నుండి వస్తున్న నీ కుమారులు.
మరియు వారితో నీ కుమార్తెలు వస్తున్నారు.
5“భవిష్యత్తులో ఇది సంభవిస్తుంది. ఆ సమయంలో నీ ప్రజలను నీవు చూస్తావు.
ఆనందంతో మీ ముఖాలు ప్రకాశిస్తాయి.
మొదట, మీరు భయపడతారు,
కానీ తర్వాత మీరు సంబరపడతారు.
సముద్రాల ఆవలి రాజ్యాల ఐశ్వర్యాలన్నీ నీ ముందు ఉంచబడతాయి.
రాజ్యాల ఐశ్వర్యాలు నీకు సంక్రమిస్తాయి.
6మిద్యాను, ఏయిఫాల నుండి ఒంటెల మందలు
నీ దేశంలో నిండిపోతాయి.
షేబనుండి ఒంటెలు బారులు తీరి వస్తాయి.
బంగారం, బోళం అవి తెస్తాయి.
ప్రజలు యెహోవాకు స్తుతులు పాడతారు.
7కేదారు గొర్రెలు అన్నీ నీకు ఇవ్వబడుతాయి.
నెబాయోతు పొట్టేళ్లు నీకోసం తీసుకొని రాబ డతాయి.
అవి నా బలిపీఠం మీద స్వీక రించదగిన బలి అర్పణలవుతాయి.
ఆశ్చర్యకరమైన నా ఆలయాన్ని నేను ఇంకా అందంగా తీర్చిదిద్దుతాను.
8ప్రజలను చూడు!
ఆకాశాన్ని వేగంగా దాటిపోయే మేఘాల్లా వారు త్వరపడుతున్నారు.
వాటి గూళ్లకు ఎగిరిపోతున్న పావురాల్లా ఉన్నారు వారు
9దూర దేశాలు నాకోసం కనిపెడ్తున్నాయి.
తర్షీషు మహా ఓడలు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాయి.
దూర దేశాలనుండి నీ పిల్లలను తీసుకొని వచ్చేందుకు ఆ ఓడలు సిద్ధంగా ఉన్నాయి.
మరియు వారి వెండి బంగారాలను ఆ ఓడలు తీసుకొని వస్తాయి.
నీ దేవుడు యెహోవాను గౌరవించుటకు ఇది జరుగుతుంది.
ఇశ్రాయేలీయుల పరిశుద్ధుడు అద్భుత కార్యాలు చేస్తాడు గనుక ఇది జరుగుతుంది.
10ఇతర దేశాలనుండి వచ్చిన పిల్లలు నీ గోడలను తిరిగి నిర్మిస్తారు.
వారి రాజులు నిన్ను సేవిస్తారు.
“నేను కోపగించినప్పుడు, నేను నిన్ను బాధించాను.
కానీ ఇప్పుడు, నేను నీకు దయచూపించ గోరుతున్నాను.
కనుక నేను నిన్ను ఆదరిస్తాను.
11నీ ద్వారాలు ఎల్లప్పుడూ తెరచి ఉంటాయి.
రాత్రిగాని పగలుగాని అవి మూయబడవు.
రాజులు, రాజ్యాలు వారి ఐశ్వర్యాలను నీకు తీసుకొని వస్తారు.
12కొన్ని దేశాలు, రాజ్యాలు నిన్ను సేవించవు. కానీ ఆ దేశాలు, రాజ్యాలు పాడైపోయి, నాశనం అవుతాయి.
13లెబానోనులోని గొప్పవన్నియు నీకు ఇవ్వబడుతాయి.
దేవదారు, సరళ, గొంజి వృక్షాలను ప్రజలు నీ వద్దకు తీసుకొని వస్తారు.
నా పరిశుద్ధ ఆలయాన్ని మరింత అందంగా తీర్చిదిద్దేందుకు
నీవు ఈ వృక్షాలను ఉపయోగిస్తావు.
(ఈ స్థలం నా సింహాసనం ఎదుట పాదపీఠంలా ఉంటుంది.
నేను దానికి చాలా ఘనత ఇస్తాను.)
14గతంలో ప్రజలు నిన్ను బాధించారు.
ఆ ప్రజలు నీ ఎదుట సాష్టాంగపడతారు.
గతంలో ప్రజలు నిన్ను ద్వేషించారు.
ఆ ప్రజలు నీ పాదాల దగ్గర సాగిలపడతారు.
‘యెహోవా పట్టణం’ అని ‘ఇశ్రాయేలు పరిశుద్ధుని సీయోను’ అనీ ఆ ప్రజలు నిన్ను పిలుస్తారు.
15“నీవు మళ్లీ ఎన్నటికీ ఒంటరిగా విడువబడవు.
నీవు మరల ఎన్నడు ద్వేషించబడవు. నీవు మరల ఎన్నడూ ఖాళీగా ఉండవు.
నిన్ను నేను శాశ్వతంగా గొప్ప చేస్తాను.
నీవు ఎప్పటికి, శాశ్వతంగా సంతోషిస్తావు.
16నీకు అవసరమైన వస్తువులను రాజ్యాలు నీకు ఇస్తాయి.
అది ఒక బిడ్డ తన తల్లి దగ్గర పాలు తాగినట్టుగా ఉంటుంది.
నీవైతే రాజులనుండి ఐశ్వర్యాలను త్రాగుతావు.
అప్పుడు, నిన్ను రక్షించు యెహోవాను నేనే అని నీవు తెలుసు కొంటావు.
యాకోబు యొక్క మహా గొప్పవాడు నిన్ను కాపాడును అని నీవు తెలుసుకొంటావు.
17“ఇప్పుడు నీకు ఇత్తడి ఉంది.
నేను నీకు బంగారం తెస్తాను.
ఇప్పుడు నీకు ఇనుము ఉంది,
నేను నీకు వెండి తెస్తాను.
నీ చెక్కను నేను ఇత్తడిగా మార్చేస్తాను.
నీ బండలను ఇనుముగా నేను మార్చేస్తాను.
నీ శిక్షను నేను శాంతిగా మార్చేస్తాను.
ఇప్పుడు ప్రజలు నిన్ను బాధిస్తున్నారు.
కానీ ప్రజలు నీకు మంచి కార్యాలు చేస్తారు.
18ప్రజలు మరల ఎన్నడూ నీ ఎడల నీచంగా ఉండరు.
నీ దేశంలో నీ దగ్గర్నుండి
ప్రజలు మరల ఎన్నడూ దొంగిలించరు.
‘రక్షణ’ అని నీ గోడలకు నీవు పేరుపెడతావు.
‘స్తుతి’ అని నీ ద్వారాలకు నీవు పేరుపెడతావు.
19“ఇంకెంత మాత్రం పగలు సూర్యుడు నీకు వెలుగుగా ఉండడు.
చంద్రకాంతి ఇంకెంత మాత్రం నీకు వెలుగుగా ఉండదు. ఎందుకు?
ఎందుకంటే యెహోవాయే నీకు శాశ్వత వెలుగుగా ఉంటాడు.
నీ దేవుడే నీ మహిమ.
20నీ ‘సూర్యుడు’ ఇక ఎన్నటికీ అస్తమించడు.
నీ ‘చంద్రుడు’ ఇక ఎన్నటికీ చీకటిగా ఉండడు. ఎందుకు?
ఎందుకంటే యెహోవా నీకు శాశ్వత వెలుగుగా ఉంటాడు.
మరియు నీ దుఃఖకాలం అంతం అవుతుంది.
21“నీ ప్రజలు అందరూ మంచివారుగా ఉంటారు.
ఆ ప్రజలు భూమిని శాశ్వతంగా పొందుతారు.
నేనే ఆ ప్రజలను చేశాను.
నా స్వహస్తాలతో నేనే చేసిన అద్భుతమైన మొక్క వారు.
22అతి చిన్న కుటుంబం ఒక పెద్ద వంశం అవుతుంది.
కడసారపు వ్యక్తి ఒక బలమైన రాజ్యం అవుతాడు.
సమయం సరిగ్గా ఉన్నప్పుడు,
యెహోవానను నేను త్వరగా వస్తాను.
నేను ఈ సంగతులను జరిగిస్తాను.”

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

యెషయా 60: TERV

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి