యిర్మీయా 27

27
యెహోవా నెబుకద్నెజరును పాలకునిగా చేయుట
1యెహోవా నుండి ఒక వర్తమానం యిర్మీయాకు వచ్చింది. సిద్కియా యూదాకు రాజైన పిమ్మట తన పరిపాలనలో నాలుగవ సంవత్సరం#27:1 సిద్కియా … నాలుగవ సంవత్సరం హెబ్రీ గ్రంథంలో యెహోయాకీము పరిపాలన ఆరంభంలో అని వుంది. ఇది వ్రాత పొరపాటు కావచ్చు. యిర్మీయా 28:1 నాల్గవ సంవత్సరం అని చెపుతుంది. మూడవ వచనం సిద్కియాను గురించి చెపుతుంది. ఇది క్రీ. పూ. 594–593వ సంవత్సరం. జరుగుతూ ఉండగా ఈ వర్తమానం వచ్చింది. రాజైన సిద్కియా యోషీయా కుమారుడు. 2యోహోవా నాకు ఈ విధంగా చెప్పాడు. “యిర్మీయా! వారులతోను, నిలువు కట్టెతోను ఒక కాడి తయారు చేయి. ఆ కాడిని నీ మెడపై వేసుకో. 3తరువాత ఎదోము, మోయబు, అమ్మోను, తూరు, సీదోను రాజుల వద్దకు వర్తమానాలు పంపు. యూదా రాజైన సిద్కియాను చూడటానికి యెరూషలేముకు వచ్చే ఆయా రాజ దూతల ద్వారా వర్తమానాలను పంపు.#27:3 యిర్మీయా … పంపు అక్షరార్థముగా “తరువాత అటువంటి కాడినే పంపు.” 4ఈ వర్తమానాన్ని వారి యజమానులకిమ్మని ఆ దూతలతో ఇలా చెప్పుము. ‘ఇశ్రాయేలు దేవుడు, సర్వశక్తిమంతుడైన యెహోవా చెప్పేదేమంటే: మీ యాజమానులతో 5నేనే భూమండలాన్ని, దానిపై ఉండే మనుష్యులందరినీ సృష్టించానని చెప్పండి. భూమి పైగల జంతుజలాన్ని కూడా నేనే సృష్టించాను. ఇదంతా నా గొప్ప మహిమ చేతను, నా దృఢమైన హస్తముతోను చేసియున్నాను. ఈ భూమిని నా ఇష్టమైన వాని కెవనికైనా ఇచ్చి వేయగలను. 6ఇప్పుడు మీ దేశాలన్నిటినీ బబులోను రాజైన నెబుకద్నెజరుకు ఇచ్చి వేశాను. అతడు నా సేవకుడు. అడవి జంతువులు కూడ అతనికి లోబడి వుండేలా చేస్తాను. 7దేశాన్నీ నెబుకద్నెజరుకు, అతని కుమారునికి, అతని మనుమనికి దాసులై సేవచేస్తాయి. ఆ తరువాత బబులోను పతనానికి సమయం ఆసన్నమౌతాది. చాలా రాజ్యాలు, గొప్ప రాజులు బబులోనును వశపర్చుకొని దాస్యం చేయించుకుంటారు.
8“‘కాని ఇప్పుడు కొన్ని దేశాలు, రాజ్యాలు నెబుకద్నెజరుకు దాస్యం చేయటానికి నిరాకరించవచ్చు. వారు అతని కాడిని తమ మెడపై పెట్టుకోటానికి నిరాకరించవచ్చు. (తమపై అతని ఆధిపత్యాన్ని తిరస్కరించవచ్చు.) అది గనుక జరిగితే, ఆయా దేశాలను, రాజ్యాలను కత్తితోను, ఆకలితోను, రోగాలతోను శిక్షిస్తాను. ఈ వర్తమానం యెహోవా నుండి వచ్చినది. ఆ దేశాన్ని నాశనం చేసే వరకు నేనది చేస్తాను. నెబుకద్నెజరును వ్యతిరేకించే రాజ్యం పైకి అతనినే వినియోగించి దానిని నాశనం చేయిస్తాను. 9కావున మీరు మీ ప్రవక్తలు చెప్పే దానిని వినవద్దు. మంత్ర విద్యచే మోసం చేసి భవిష్యత్తును చెప్పజూచే వారి మాయలో పడవద్దు. కలల ఆంతర్యాలను చెపుతామనే వారి మాటలు నమ్మవద్దు. చనిపోయిన వారితో మాట్లాడుతామనేవారు, కనికట్టు విద్యలను ఆచరించే వారు చెప్పే మాటలు వినవద్దు. ఆ మనుష్యులు, “మీరు బబులోను రాజుకు బానిసలు కానేరరు” అని చెపుతారు. 10కాని వారు మీతో అబద్దమాడుతున్నారు. వారు కేవలం మీరు మీ మాతృదేశం నుండి దూర దేశాలకు తీసుకొని పోబడటానికి కారకులవుతారు. మీరు మీ ఇండ్లు వాకిళ్లు వదిలి పోయేలా నేను వత్తిడిచేస్తాను. పైగా మీరు వేరొక దేశంలో చనిపోతారు.
11“‘తమ మెడవంచి బబులోను రాజు కాడిని ధరించి అతనికి విధేయులై ఉన్న దేశాల వారు జీవిస్తారు. అటువంటి వారిని బబులోను రాజును సేవిస్తూ తమ దేశంలోనే ఉండేలా చేస్తాను.’ ఈ వర్తమానం యెహోవా నుండి వచ్చినది ‘ఆయా దేశాల వారంతా తమ తమ స్వదేశాలలోనే ఉంటూ. తమ భూముల్లో సేద్యం చేసుకుంటూ ఉంటారు.’”
12యూదా రాజైన సిద్కియాకు కూడ ఇదే సందేశం ఇచ్చాను. నేనిలా చెప్పాను: “సిద్కియా, బబులోను రాజు యొక్క కాడి క్రింద నీ మెడ వుంచి అతనికి విధేయుడవై వుండాలి. నీవు బబులోను రాజుకు, అతని ప్రజలకు దాస్యం చేస్తే నీవు బ్రతుకుతావు. 13నీవు బబులోను రాజుకు దాస్యం చేయటానికి ఒప్పుకొనకపోతే నీవు, నీ ప్రజలు శత్రువు యొక్క కత్తివాత బడి, ఆకలితోను, భయంకర రోగాలతోను చనిపోతారు. ఇవి జరిగి తీరుతాయని యెహోవా చెప్పాడు! 14కాని అబద్ధ ప్రవక్తలు మాత్రం, ‘నీవు బబులోను రాజుకు బానిసవు కానేరవు’ అని చెపుతున్నారు.
“ఆ ప్రవక్తలు చెప్పేది వినవద్దు. ఎందువల్లనంటే వారు నీకు అబద్దాలు చెపుతున్నారు. 15‘నేనా ప్రవక్తలను పంపలేదు.’ ఇదే యెహోవా వాక్కు ‘వారు అబద్దాలు బోధిస్తున్నారు. పైగా, ఆ సందేశం నా నుండి వచ్చినదే అని కూడ చెపుతున్నారు. కావున ఓ యూదా ప్రజలారా, మిమ్ముల్ని దూరంగా పంపివేస్తాను. మీరు చనిపోతారు! మీకు బోధించే ఆ ప్రవక్తలు కూడా చనిపోతారు.’”
16అప్పుడు యిర్మీయానైన నేను యాజకులతోను, అ ప్రజలందరితోను ఇలా చెప్పాను: “యెహోవా చెప్పేదేమంటే ఆ అబద్ధ ప్రవక్తలు, ‘బబులోనీయులు యెహోవా నుండి ఎన్నో వస్తువులు తీసుకొని పోయారు. అవన్నీ శీఘ్రమే తిరిగి తీసుకొని రాబడుతాయి.’ అని చెపుతున్నారు. వారి మాటలు మీరు నమ్మవద్దు. ఎందువల్లనంటే వారు మీకు అబద్ధ ప్రవచనాలను బోధిస్తున్నారు. 17ఆ ప్రవక్తలు చెప్పే వాటిని మీరు వినవద్దు. బబులోను రాజుకు దాస్యంచేయండి. మీ శిక్షను మీరు ఆమోదించండి. మీరు జీవిస్తారు. ఈ యెరూషలేము నగరం సర్వనాశనం అయ్యేలా మీరు చేయటానికి కారణమే కన్పించటం లేదు. 18ఈ మనుష్యులు నిజంగానే ప్రవక్తలయితే, వారికి యెహోవా సందేశం అందితే వారిని ప్రార్థన చేయనివ్వండి. ఇంకా దేవునిలో వున్న వస్తువుల గురించి ప్రార్థన చేయనివ్వండి. రాజ భవనంలో యింకా మిగిలివున్న వస్తువుల గురించి వారిని ప్రార్థన చేయనివ్వండి. ఇంకా యెరూషలేములో వున్న వాటిని గురించి ప్రార్థన చేయనివ్వండి. ఆయా వస్తుసముదాయాలు బబులోనుకు తీసుకొని పోబడకుండా వుండేలా ఆ ప్రవక్తలను ప్రార్థన చేయనివ్వండి.
19“సర్వశక్తిమంతుడైన యెహోవా యెరూషలేములో ఇంకా మిగిలివున్న వస్తువులను గూర్చి ఇది చెపుతున్నాడు. దేవాలయంలో స్తంభాలు, కంచుకోనేరు, కదిలించగల దిమ్మెలు ఇంకా ఇతరమైన వస్తు సామగ్రి ఉంది.#27:19 స్తంభాలు … వుంది వివరాలకు చూడండి 1 రాజులు 7:23-37. బబులోను రాజైన నెబుకద్నెజరు వీటిని యెరూషలేములో వదిలి వేశాడు. 20యూదా రాజైన యెహోయాకీనును#27:20 యెహోయాకీను ఇతనినే యెకొన్యా అని, కొన్యా అని కూడ పిలుస్తారు. బందీగా కొనిపోయేటప్పుడు నెబుకద్నెజరు వాటన్నిటినీ తీసుకొని పోలేదు. రాజైన యెహోయాకీను యెహోయాకీము కుమారుడు. యూదా నుండి, యెరూషలేము నుండి ఇతర ప్రముఖ వ్యక్తులను కూడా నెబుకద్నెజరు బందీలుగా పట్టుకుపోయాడు. 21దేవాలయంలోను, రాజభవనంలోను, మరియు యెరూషలేములోను ఇంకా మిగిలివున్న వస్తువుల విషయంలో ఇశ్రాయేలీయుల దేవుడు, సర్వశక్తిమంతుడైన యెహోవా ఇలా చెపుతున్నాడు. ‘ఆ వస్తువులన్ని బబులోనుకు తీసుకొని పోబడతాయి. 22నేను వాటిని తిరిగి తీసుకొని వచ్చే రోజు వరకు అవి అక్కడే వుంచబడతాయి.’ ఇది యెహోవా వాక్కు. ‘పిమ్మట వాటిని నేను తీసుకొని వస్తాను. తిరిగి వాటిని యధాస్థానంలో వుంచుతాను.’”

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

యిర్మీయా 27: TERV

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి