లూకా 15:11-24

లూకా 15:11-24 TERV

యేసు ఇంకా ఇలా చెబుతూ పోయాడు: “ఒకనికి యిద్దరు కుమారులు ఉన్నారు. చిన్నవాడు తండ్రితో, ‘నాన్నా! నా భాగం ఆస్తి నాకు ఇచ్చేయి’ అని అడిగాడు. తండ్రి సరేనని తన ఆస్తిని ఇరువురి మధ్య పంచిపెట్టాడు. “కొద్ది రోజుల్లో చిన్నవాడు తనపాలు భాగం తీసుకొని దూర దేశాలకు వెళ్ళి పొయ్యాడు. ఉన్న డబ్బంతా విలాసాలకు ఖర్చు పెట్టాడు. అంతా ఖర్చయి పోయింది. ఇంతలో అతడున్న దేశంలో తీవ్రమైన క్షామం వచ్చింది. అతని దగ్గర ఏమీ మిగల్లేదు. కనుక ఆ దేశంలో ఉన్న ఒక ఆసామి దగ్గర ఉద్యోగంలో చేరాడు. ఆ ఆసామి అతణ్ణి పందులు కాయటానికి నియమించాడు. ఆ పందులు తీనే ఆహారంతో తన కడుపు నింపుకోవాలని అనుకున్నాడు. ఆయినా ఎవ్వరూ అతనికి ఏదీ ఇవ్వలేదు. “అతనికి బుద్ధి వచ్చింది. అతడు ‘నా తండ్రి పనివాళ్ళ దగ్గర కూడా కావలసినంత తిండి ఉంది. నేనేమో ఇక్కడ ఆకలితో చచ్చిపోతున్నాను. నేను ఈ గ్రామం వదిలి తిరిగి తండ్రి దగ్గరకు వెళ్తాను. వెళ్లి అతనితో నాన్నా! నేను దేవుని పట్ల, నీ పట్ల కూడా పాపం చేశాను. నేను నీ కుమారుడనని చెప్పుకొంటానికి కూడా తగను. నన్ను కూడా నీ దగ్గర పని చేసేవాళ్ళతో ఉండనీ!’ అని చెప్పాలని మనస్సులో అనుకున్నాడు. వెంటనే అతడు తన తండ్రి దగ్గరకు వెళ్ళాడు. “ఇంటికి కొంత దూరంలో ఉండగానే అతని తండ్రికి తనకుమారుణ్ణి చూసి చాలా కనికరం కలిగింది. అతడు పరుగెత్తుకొంటూ తన కుమారుని దగ్గరకు వెళ్ళి అతణ్ణి కౌగిలించుకొని ముద్దు పెట్టుకొన్నాడు. అతడు తండ్రితో, ‘నాన్నా! నేను దేవుని పట్ల, నీ పట్ల పాపం చేసాను. నేను నీ కుమారుణ్ణని చెప్పుకోవటానికి కూడా తగను’ అని అన్నాడు. “అతని తండ్రి పని వాళ్ళతో, ‘వెంటనే వెళ్ళి మంచి దుస్తులు, వేలికి ఉంగరము, కాళ్లకు జోళ్ళు తెచ్చి యితనికి తొడిగించండి. బాగా బలిసిన దూడను తీసుకు వచ్చి కొయ్యండి. పండుగ చేసుకొందాం. చనిపోయిన నా కుమారుడు బ్రతికి వచ్చాడు. తప్పి పోయినవాడు తిరిగి దొరికాడు’ అని అన్నాడు. వాళ్ళు వెంటనే పండుగ చేసుకోవడం మొదలు పెట్టారు.