లూకా 5:17-26

లూకా 5:17-26 TERV

ఒక రోజు ఆయన బోధిస్తుండగా పరిసయ్యులు, శాస్త్రులు అక్కడ కూర్చొని ఉన్నారు. వీళ్ళు గలిలయలోని పల్లెల నుండి, యూదయ, యెరూషలేము పట్టణాల నుండి వచ్చిన వాళ్ళు. రోగులకు నయం చేసే శక్తి యేసులో ఉంది. కొంతమంది ఒక పక్షవాత రోగిని ఒక మంచం మీద మోసుకొని వచ్చారు. అతణ్ణి యేసు ముందు ఉంచాలని, యేసు ఉన్న యింట్లోకి తీసుకువెళ్ళటానికి ప్రయత్నించారు. కాని ప్రజాసమూహం అధికముగా ఉండటం వల్ల అలా చెయ్యటం వీలుకాలేదు. వాళ్ళు ఇంటి మీదికి వెళ్ళి పైకప్పు ద్వారా ఆ రోగిని మంచంతో సహా యేసు ముందు దించారు. యేసు ప్రజల మధ్య ఉన్నాడు. ఆయన వాళ్ళ విశ్వాసం చూసి, “మిత్రమా, నీ పాపాలు క్షమించాను!” అని అన్నాడు. పరిసయ్యులు, శాస్త్రులు మనస్సులో, “భక్తి హీనునిగా మాట్లాడుతున్నాడే? వీడెవడు? దేవుడు తప్ప యితరులెవరు పాపాలు క్షమించగలరు?” అని అనుకున్నారు. వాళ్ళేమనుకుంటున్నారో యేసుకు తెలిసి పోయింది. ఆయన, “మీరు మీ మనస్సులో అలా ఎందుకాలోచిస్తున్నారు? ‘నీ పాపాలు క్షమించాను’ అని అనటం తేలికా? లేదా ‘లేచి నడు’ అని అనటం తేలికా? కాని మనుష్యకుమారునికి ఈ భూమ్మీద పాపాలు క్షమించటానికి అధికారముందని మీరు గ్రహించాలి” అని అంటూ ఆ పక్షవాత రోగితో, “నేను చెబుతున్నాను; లేచి నీ మంచం తీసుకొని యింటికి వెళ్ళు!” అని అన్నాడు. ఆ పక్షవాత రోగి వెంటనే అందరి ముందు లేచి తానిదివరకు పడుకున్న మంచమును తీసుకొని దేవుణ్ణి స్తుతిస్తూ యింటికి వెళ్ళిపోయాడు. అక్కడున్న వాళ్ళంతా దిగ్భ్రాంతి చెంది దేవుణ్ణి స్తుతించటం మొదలు పెట్టారు. వాళ్ళు భయంతో, “ఈ రోజు మనం అనుకోని గొప్ప సంఘటన చూసాము” అని అన్నారు.