లూకా 5:17-26

లూకా 5:17-26 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

ఒకనాడాయన బోధించుచుండగా, గలిలయ యూదయదేశముల ప్రతి గ్రామమునుండియు యెరూషలేమునుండియు వచ్చిన పరిసయ్యులును ధర్మశాస్త్రోపదేశ కులును కూర్చుండియుండగా, ఆయన స్వస్థపరచునట్లు ప్రభువు శక్తి ఆయనకుండెను. ఇదిగో కొందరు మనుష్యులు పక్షవాయువుగల యొక మనుష్యుని మంచముమీద మోసికొని, వానిని లోపలికి తెచ్చి, ఆయన యెదుట ఉంచుటకు ప్రయత్నము చేసిరి గాని జనులు గుంపుకూడి యుండి నందున, వానిని లోపలికి తెచ్చుటకు వల్లపడక పోయెను గనుక, ఇంటిమీది కెక్కి పెంకులు విప్పి, మంచముతోకూడ యేసు ఎదుట వారిమధ్యను వానిని దించిరి. ఆయన వారి విశ్వాసము చూచి–మనుష్యుడా, నీ పాపములు క్షమింపబడియున్నవని వానితో చెప్పగా, శాస్త్రులును పరిసయ్యులును–దేవదూషణ చేయుచున్న యితడెవడు? దేవుడొక్కడే తప్ప మరి ఎవడు పాపములు క్షమింపగలడని ఆలోచించుకొనసాగిరి. యేసు వారి ఆలోచన లెరిగి–మీరు మీ హృదయములలో ఏమి ఆలోచించుచున్నారు? –నీ పాపములు క్షమింపబడి యున్నవని చెప్పుట సులభమా? –నీవు లేచి నడువుమని చెప్పుట సులభమా? అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్యకుమారునికి అధికారము కలదని మీరు తెలిసికొనవలెను అని వారితో చెప్పి, పక్షవాయువు గల వాని చూచి–నీవు లేచి, నీ మంచమెత్తికొని, నీ యింటికి వెళ్లుమని నీతో చెప్పుచున్నాననెను. వెంటనే వాడు వారియెదుట లేచి, తాను పండుకొనియున్న మంచము ఎత్తికొని, దేవుని మహిమపరచుచు తన యింటికి వెళ్లెను. అందరును విస్మయమొంది–నేడు గొప్ప వింతలు చూచితి మని దేవుని మహిమపరచుచు భయముతో నిండుకొనిరి.

షేర్ చేయి
Read లూకా 5

లూకా 5:17-26 తెలుగు సమకాలీన అనువాదము (TCV)

ఒక రోజు యేసు బోధిస్తూ ఉండగా, పరిసయ్యులు మరియు ధర్మశాస్త్ర ఉపదేశకులు అక్కడ కూర్చొని ఉన్నారు. వారు గలిలయ, యూదయ, యెరూషలేము ప్రాంతాలలోని ప్రతి గ్రామం నుండి వచ్చారు. ఆ సమయంలో రోగులను బాగుచేసే ప్రభువు శక్తి యేసులో ఉంది. కొందరు మనుష్యులు పక్షవాతంగల ఒక వ్యక్తిని చాపమీద మోసుకొని వచ్చి, యేసు ముందు ఉంచాలని ఇంట్లోకి తీసుకువెళ్లడానికి ప్రయత్నించారు. కానీ ప్రజలు గుంపుగా ఉన్నందుకు వానిని తీసుకువెళ్లే మార్గం కనిపించలేదు, గనుక వారు ఆ ఇంటి కప్పుమీదికి ఎక్కి పెంకులు తీసి ప్రజల మధ్య, ఆ చాపతోనే వానిని యేసు ముందు దింపారు. యేసు వారి విశ్వాసం చూసి, అతనితో, “స్నేహితుడా, నీ పాపాలు క్షమించబడ్డాయి” అన్నారు. పరిసయ్యులు మరియు ధర్మశాస్త్ర ఉపదేశకులు, తమలో తాము, “దైవదూషణ చేస్తున్న వీడు ఎవడు? దేవుడు తప్ప పాపాలను క్షమించగలవారెవరు?” అని ఆలోచించడం మొదలుపెట్టారు. యేసు వారి ఆలోచనలను గ్రహించి, “మీ హృదయాల్లో మీరు ఇలా ఎందుకు ఆలోచిస్తున్నారు? వీటిలో ఏది చెప్పడం సులభం: ‘నీ పాపాలు క్షమించబడ్డాయి’ అని చెప్పడమా లేక ‘లేచి నడువు’ అని చెప్పడమా?” అయితే మనుష్యకుమారునికి భూలోకంలో పాపాలను క్షమించే అధికారం ఉందని మీరు తెలుసుకోవాలని “నేను కోరుతున్నాను” అని అన్నారు. ఆయన పక్షవాతం గలవానితో, “నేను చెప్తున్నా, నీవు లేచి, నీ పరుపెత్తుకొని ఇంటికి వెళ్లు” అన్నారు. వెంటనే వాడు వారి ముందే లేచి, తాను పడుకొని ఉన్న పరుపెత్తుకొని దేవుని స్తుతిస్తూ తన ఇంటికి వెళ్లాడు. అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ఆశ్చర్యంతో దేవుని స్తుతించారు. వారు భయంతో నిండుకొని, “ఈ రోజు మేము అద్బుతాలను చూసాం” అని చెప్పుకొన్నారు.

షేర్ చేయి
Read లూకా 5

లూకా 5:17-26 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

ఒక రోజు ఆయన బోధిస్తున్నపుడు గలిలయ, యూదయ ప్రాంతాల్లోని చాలా ఊళ్ళ నుండీ యెరూషలేము నుండీ వచ్చిన పరిసయ్యులూ ధర్మశాస్త్రోపదేశకులూ అక్కడ కూర్చుని ఉన్నారు. స్వస్థపరచే ప్రభువు శక్తి ఆయనలో ఉంది. కొందరు మనుషులు పక్షవాత రోగిని పరుపు మీద మోసుకు వచ్చారు. అతణ్ణి లోపలికి తెచ్చి, ఆయన ముందు ఉంచాలని చూశారు గాని ప్రజలు కిక్కిరిసి ఉండడం చేత అతణ్ణి లోపలికి తేవడానికి వీలు కాలేదు. కాబట్టి, వారు ఇంటికప్పు మీదికెక్కి పెంకులు తీసి పరుపుతో పాటు రోగిని సరిగ్గా యేసు ముందే దింపారు. యేసు వారి విశ్వాసం చూసి, “అయ్యా, నీ పాపాలకు క్షమాపణ దొరికింది” అన్నాడు. శాస్త్రులూ పరిసయ్యులూ, “దేవదూషణ చేస్తున్న ఇతడు ఎవడు? దేవుడు తప్ప పాపాలు ఎవరు క్షమించగలరు?” అనుకున్నారు యేసు వారి ఆలోచన గ్రహించి, “మీరు మీ హృదయాల్లో అలా ఎందుకు ఆలోచిస్తున్నారు? ఏది సులభమంటారు? ‘నీ పాపాలు క్షమిస్తున్నాను’ అనడమా, ‘లేచి నడువు’ అనడమా? అయితే మనుష్యకుమారుడికి భూమి మీద పాపాలు క్షమించే అధికారం ఉందని మీరు తెలుసుకోవాలి” అన్నాడు. తరువాత పక్షవాత రోగిని చూసి, “లేచి, నీ పరుపు తీసుకుని ఇంటికి వెళ్ళు” అన్నాడు. వెంటనే వాడు వారి ముందే లేచి నిలబడి, తాను పడుకున్న పరుపు ఎత్తుకుని, దేవుణ్ణి స్తుతిస్తూ తన ఇంటికి వెళ్ళాడు. అందరూ విస్మయం చెంది, “ఈ రోజు విచిత్రమైన విషయాలు చూశాం” అని దేవుణ్ణి స్తుతిస్తూ భయంతో నిండిపోయారు.

షేర్ చేయి
Read లూకా 5

లూకా 5:17-26 పవిత్ర బైబిల్ (TERV)

ఒక రోజు ఆయన బోధిస్తుండగా పరిసయ్యులు, శాస్త్రులు అక్కడ కూర్చొని ఉన్నారు. వీళ్ళు గలిలయలోని పల్లెల నుండి, యూదయ, యెరూషలేము పట్టణాల నుండి వచ్చిన వాళ్ళు. రోగులకు నయం చేసే శక్తి యేసులో ఉంది. కొంతమంది ఒక పక్షవాత రోగిని ఒక మంచం మీద మోసుకొని వచ్చారు. అతణ్ణి యేసు ముందు ఉంచాలని, యేసు ఉన్న యింట్లోకి తీసుకువెళ్ళటానికి ప్రయత్నించారు. కాని ప్రజాసమూహం అధికముగా ఉండటం వల్ల అలా చెయ్యటం వీలుకాలేదు. వాళ్ళు ఇంటి మీదికి వెళ్ళి పైకప్పు ద్వారా ఆ రోగిని మంచంతో సహా యేసు ముందు దించారు. యేసు ప్రజల మధ్య ఉన్నాడు. ఆయన వాళ్ళ విశ్వాసం చూసి, “మిత్రమా, నీ పాపాలు క్షమించాను!” అని అన్నాడు. పరిసయ్యులు, శాస్త్రులు మనస్సులో, “భక్తి హీనునిగా మాట్లాడుతున్నాడే? వీడెవడు? దేవుడు తప్ప యితరులెవరు పాపాలు క్షమించగలరు?” అని అనుకున్నారు. వాళ్ళేమనుకుంటున్నారో యేసుకు తెలిసి పోయింది. ఆయన, “మీరు మీ మనస్సులో అలా ఎందుకాలోచిస్తున్నారు? ‘నీ పాపాలు క్షమించాను’ అని అనటం తేలికా? లేదా ‘లేచి నడు’ అని అనటం తేలికా? కాని మనుష్యకుమారునికి ఈ భూమ్మీద పాపాలు క్షమించటానికి అధికారముందని మీరు గ్రహించాలి” అని అంటూ ఆ పక్షవాత రోగితో, “నేను చెబుతున్నాను; లేచి నీ మంచం తీసుకొని యింటికి వెళ్ళు!” అని అన్నాడు. ఆ పక్షవాత రోగి వెంటనే అందరి ముందు లేచి తానిదివరకు పడుకున్న మంచమును తీసుకొని దేవుణ్ణి స్తుతిస్తూ యింటికి వెళ్ళిపోయాడు. అక్కడున్న వాళ్ళంతా దిగ్భ్రాంతి చెంది దేవుణ్ణి స్తుతించటం మొదలు పెట్టారు. వాళ్ళు భయంతో, “ఈ రోజు మనం అనుకోని గొప్ప సంఘటన చూసాము” అని అన్నారు.

షేర్ చేయి
Read లూకా 5