లూకా 5:17-26

లూకా 5:17-26 TCV

ఒక రోజు యేసు బోధిస్తూ ఉండగా, పరిసయ్యులు మరియు ధర్మశాస్త్ర ఉపదేశకులు అక్కడ కూర్చొని ఉన్నారు. వారు గలిలయ, యూదయ, యెరూషలేము ప్రాంతాలలోని ప్రతి గ్రామం నుండి వచ్చారు. ఆ సమయంలో రోగులను బాగుచేసే ప్రభువు శక్తి యేసులో ఉంది. కొందరు మనుష్యులు పక్షవాతంగల ఒక వ్యక్తిని చాపమీద మోసుకొని వచ్చి, యేసు ముందు ఉంచాలని ఇంట్లోకి తీసుకువెళ్లడానికి ప్రయత్నించారు. కానీ ప్రజలు గుంపుగా ఉన్నందుకు వానిని తీసుకువెళ్లే మార్గం కనిపించలేదు, గనుక వారు ఆ ఇంటి కప్పుమీదికి ఎక్కి పెంకులు తీసి ప్రజల మధ్య, ఆ చాపతోనే వానిని యేసు ముందు దింపారు. యేసు వారి విశ్వాసం చూసి, అతనితో, “స్నేహితుడా, నీ పాపాలు క్షమించబడ్డాయి” అన్నారు. పరిసయ్యులు మరియు ధర్మశాస్త్ర ఉపదేశకులు, తమలో తాము, “దైవదూషణ చేస్తున్న వీడు ఎవడు? దేవుడు తప్ప పాపాలను క్షమించగలవారెవరు?” అని ఆలోచించడం మొదలుపెట్టారు. యేసు వారి ఆలోచనలను గ్రహించి, “మీ హృదయాల్లో మీరు ఇలా ఎందుకు ఆలోచిస్తున్నారు? వీటిలో ఏది చెప్పడం సులభం: ‘నీ పాపాలు క్షమించబడ్డాయి’ అని చెప్పడమా లేక ‘లేచి నడువు’ అని చెప్పడమా?” అయితే మనుష్యకుమారునికి భూలోకంలో పాపాలను క్షమించే అధికారం ఉందని మీరు తెలుసుకోవాలని “నేను కోరుతున్నాను” అని అన్నారు. ఆయన పక్షవాతం గలవానితో, “నేను చెప్తున్నా, నీవు లేచి, నీ పరుపెత్తుకొని ఇంటికి వెళ్లు” అన్నారు. వెంటనే వాడు వారి ముందే లేచి, తాను పడుకొని ఉన్న పరుపెత్తుకొని దేవుని స్తుతిస్తూ తన ఇంటికి వెళ్లాడు. అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ఆశ్చర్యంతో దేవుని స్తుతించారు. వారు భయంతో నిండుకొని, “ఈ రోజు మేము అద్బుతాలను చూసాం” అని చెప్పుకొన్నారు.