సంఖ్యాకాండము 12

12
మిర్యాము, అహరోను మోషేను విమర్శించటం
1మిర్యాము, అహరోను మోషేకు వ్యతిరేకంగా మాట్లాడటం మొదలు పెట్టారు. అతని భార్య ఇథియోపియా స్త్రీ గనుక వారు అతణ్ణి విమర్శించారు. మోషే ఇథియోపియా ప్రజల్లోని స్త్రీని వివాహం చేసుకోవటం మంచిది కాదని వారు తలంచారు. 2“ప్రజలతో మాట్లాడటానికి యెహోవా మోషేను వాడుకొన్నాడు. కానీ మోషే ఒక్కడే ఉన్నాడా? మన ద్వారా కూడ యెహోవా మాట్లాడాడు కదా” అని వారు తమలో తాము అనుకొన్నారు.
యెహోవా ఇది విన్నాడు. 3(మోషే చాలా దీనుడు. అతడు గొప్పలు చెప్పుకోలేదు, సణగ లేదు, భూమి మీద అందరికంటె అతడు దీనుడు.) 4కనుక యెహోవా అకస్మాత్తుగా మోషే, అహరోను, మిర్యాములతో మాట్లాడాడు. “మీరు ముగ్గురూ ఇప్పుడే సన్నిధి గుడారానికి రండి” అని చెప్పాడు.
కనుక మోషే, అహరోను, మిర్యాము గుడారానికి వెళ్లారు. 5అప్పుడు యెహోవా ఒక మేఘంలో దిగివచ్చాడు. గుడార ప్రవేశం దగ్గర యెహోవా నిలబడ్డాడు. “అహరోను, మిర్యామును” తన దగ్గరకు రమ్మని పిల్చాడు యెహోవా. వాళ్లిద్దరూ ఆయనకు దగ్గరగా రాగానే 6దేవుడు అన్నాడు: “నా మాటలు వినండి, మీ మధ్యకు నేను ప్రవక్తలను పంపినప్పుడు, యెహోవానగు నేను వారికి దర్శనంలో కనబడతాను. కలలో నేనే వారితో మాట్లాడతాను. 7కానీ నా సేవకుడైన మోషే అట్టివాడు కాదు. అతడు నా ఇల్లంతటిలో నమ్మకస్థుడు. 8నేను అతనితో మాట్లాడినప్పుడు ముఖాముఖిగా నేను అతనితో మాట్లాడతాను. అతనితో నేను చెప్పాలనుకొనే విషయాలు వివరంగా నేను చెబుతాను. గూఢార్థపు పొడుపు కథలు నేను ప్రయోగించను. మోషే సాక్షాత్తు యెహోవా రూపాన్ని చూడవచ్చు. కనుక నా సేవకుడైన మోషేకు వ్యతిరేకంగా మీరెందుకు అంత ధైర్యంగా మాట్లాడారు?”
9అంతట యెహోవా వారిని విడిచి వెళ్లి పోయాడు. కానీ ఆయనకు వారిమీద చాలా కోపం వచ్చింది. 10యెహోవా మేఘం గుడారం మీదనుండి పైకి లేచి పోయింది. అప్పుడు అహరోను అటు తిరిగి మిర్యామును చూడగా, ఆమెకు భయంకర కుష్ఠురోగం రావటం అతనికి కనబడింది. ఆమె శరీరం మంచులా తెల్లగా ఉంది.
11అప్పుడు మోషేతో అహరోను అన్నాడు: “అయ్యా, బుద్ధిహీనంగా మేము పాపం చేసాము, మమ్మల్ని క్షమించు. 12చచ్చి పుట్టిన శిశువులా ఆమె తన శరీరాన్ని పోగొట్టుకోనియ్యకు.” (కొన్ని సార్లు అలాంటి శిశువు సగం శరీరం తినివేయబడి పుడుతుంది.)
13కనుక మోషే, “ఓ దేవా ఈ రోగంనుండి ఆమెను బాగుచేయి” అని యెహోవాకు మొరపెట్టాడు.
14“ఆమె తండ్రి ఆమె ముఖం మీద ఉమ్మి వేస్తే ఆమెకు ఏడు రోజులు అవమానం కలుగుతుంది. కనుక ఆమెను ఏడురోజులు పాళెమునకు బయట ఉంచండి. ఆ తర్వాత ఆమె తిరిగి లోనికి రావచ్చు” అని యెహోవా జవాబిచ్చాడు.
15కనుక మిర్యాము ఏడు రోజులపాటు పాళెమునకు వెలుపల ఉంచబడింది. ఆమె మరల లోనికి తీసుకొని రాబడేంతవరకు ప్రజలు అక్కడనుండి కదలలేదు. 16అది జరిగిన తర్వాత ప్రజలు హజేరోతు విడిచి పారాను అరణ్యానికి ప్రయాణం చేసారు. ప్రజలు ఆ అరణ్యంలో గుడారాలు వేసుకొన్నారు.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

సంఖ్యాకాండము 12: TERV

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి