సంఖ్యాకాండము 27

27
సెలోపెహాదు కుమార్తెలు
1హెసెరు కుమారుడు సెలోపెహాదు. హెసెరు గిలాదు కుమారుడు. గిలాదు మాకీరు కుమారుడు. మాకీరు మనష్షే కుమారుడు. మనష్షే యోసేపు కుమారుడు. సెలోపెహాదుకు ఐదుగురు కుమార్తెలు ఉన్నారు. వారి పేర్లు మహలా, నోయా, హొగ్లా, మిల్కా, తిర్సా. 2సన్నిధి గుడారం దగ్గర సమావేశం అవుతోన్న మోషే, యాజకుడైన ఎలియాజరు, పెద్దలు, ప్రజలు అందరి ముందరకు ఈ అయిదుగురు స్త్రీలూ వెళ్లి, సన్నిధి గుడారం ఎదుట నిలబడ్డారు.
ఈ ఐదుగురు కూతుళ్లు ఈ విధంగా చెప్పారు: 3“మనం అరణ్య ప్రయాణంలో ఉన్నప్పుడే మా తండ్రి చనిపోయాడు. అతడు కోరహు గుంపులో చేరినవాడు కాడు. (కోరహు యెహోవానుంచి తొలగి ఎదురు తిరిగినవాడు.) మా తండ్రిది సహజ మరణం. కానీ మా తండ్రికి కుమారులు లేరు. 4అంటే మా తండ్రి పేరు కొనసాగదు. మా తండ్రి పేరు కొనసాగక పోవటం సక్రమం కాదు. ఆయనకు కుమారులు లేరు గనుక ఆయన పేరు అంతం అవుతుంది. అందుచేత మా తండ్రి సోదరులకు వచ్చే భూమిలో మాకు కొంత ఇవ్వవలసిందిగా మేము మీకు మనవి చేస్తున్నాము.”
5కనుక ఏమి చేయాలని యెహోవాను మోషే అడిగాడు. 6అతనితో యెహోవా ఇలా అన్నాడు, 7“సెలోపెహాదు కుమార్తెలు చెప్పినది సరియైనదే. వాళ్లు వారి తండ్రి సోదరులతో పాటు భూమిని పంచుకోవలసిందే. కనుక నీవు వారి తండ్రికిచ్చిన భూమిని వారికి ఇవ్వాలి.
8“కనుక ఇశ్రాయేలు ప్రజలకు, ఇలా చట్టం తయారు చేయి. ‘ఒకనికి కుమారులు లేకుండానే అతడు చనిపోతే, అతని ఆస్తి అంతా అతని కుమార్తెలకు ఇవ్వాలి. 9అతనికి కుమార్తెలు లేకపోతే, అతని ఆస్తి అంతా అతని సోదరులకు ఇవ్వాలి. 10అతనికి సోదరులు లేకపోతే అతని ఆస్తి అంతా అతని తండ్రి సోదరులకు ఇవ్వాలి. 11అతని తండ్రికి సోదరులు లేకపోతే, అతని ఆస్తి అంతా, అతని కుటుంబంలో దగ్గర బంధువులకు ఇవ్వాలి. ఇశ్రాయేలు ప్రజల్లో ఇది ఒక చట్టంగా ఉండాలి. యెహోవాయే ఈ ఆజ్ఞను మోషేకు ఇస్తున్నాడు.’”
కొత్త నాయకుడుగా యెహోషువ
12అప్పుడు మోషేతో యెహోవా ఇలా చెప్పాడు: “ఆ కొండమీదికి ఎక్కు. యొర్దాను నదికి తూర్పున ఉన్న కొండల్లో అది ఒకటి. ఇశ్రాయేలు ప్రజలకు నేను ఇస్తున్న దేశాన్ని నీవు అక్కడ నుండి చూస్తావు. 13నీవు ఈ దేశాన్ని చూశాక, నీ సోదరుడు అహరోను మరణించినట్టే నీవు మరణిస్తావు. 14సీను అరణ్యంలో నీళ్లకోసం ప్రజలు కోపగించుకోవటం జ్ఞాపకం చేసుకో. నీవూ, అహరోనూ కూడ నా ఆజ్ఞకు విధేయులయ్యేందుకు నిరాకరించారు. ప్రజల ముందు నీవు నన్ను ఘనపర్చలేదు, పవిత్రంగా చూడలేదు.” (ఇది సీను అరణ్యంలో కాదేషు దగ్గర మెరీబా నీళ్ల సంగతి.)
15యెహోవాతో మోషే ఇలా అన్నాడు: 16“ప్రజల ఆలోచనలు తెలిసిన దేవుడు యెహోవా ప్రభువు, నీవే ఈ ప్రజలకోసం మరో నాయకుడిని ఎంచుకోమని మనవి చేస్తున్నాను. 17ఈ దేశంలోనుండి వీరిని బయటకు నడిపించి, కొత్త దేశంలో చేర్చగల నాయకుడిని ఎంచవలసిందిగా నేను యెహోవాకు మనవి చేస్తున్నాను. అప్పుడు యెహోవా ప్రజలు కాపరి లేని గొర్రెల్లా ఉండరు.”
18కనుక మోషేతో యెహోవా ఇలా అన్నాడు: “నూను కుమారుడైన యెహోషువ నాయకుడుగా ఉంటాడు. యెహోషువ ఆత్మను పొందినవాడు. అతడిని కొత్త నాయకునిగా చేయి. 19యాజకుడైన ఎలియాజరు ఎదుటా, ప్రజలందరి ఎదుటా నిలబడమని అతనితో చెప్పు. అప్పుడు అతడిని కొత్త నాయకునిగా నీవు చేయి.
20“అతడిని నీవు నాయకునిగా చేస్తున్నావని ప్రజలకు చూపెట్టు, అప్పుడు ప్రజలంతా అతనికి లోబడతారు. 21ఒకవేళ యెహోషువ ఒక కొత్త నిర్ణయం ఏదైనా చేయాలంటే అతడు యాజకుడైన ఎలియాజరు దగ్గరకు వెళతాడు. యెహోవా జవాబు తెలుసుకొనేందుకు ఎలియాజరు ఊరీమును ప్రయోగిస్తాడు. అప్పుడు యెహోషువ, ప్రజలందరూ దేవుడు చెప్పిన వాటిని చేస్తారు. ‘యుద్ధానికి వెళ్లండి’ అని అతడు చెబితే వారు యుద్ధానికి వెళ్తారు. ఒకవేళ ‘ఇంటికి వెళ్లండి’ అని అతడు చెబితే వారు ఇంటికి వెళతారు.”
22మోషే యెహోవాకు విధేయుడయ్యాడు. యాజకుడైన ఎలియాజరు ముందు, ప్రజలందరి ఎదుట నిలబడమని యెహోషువాతో చెప్పాడు. మోషే, 23అప్పుడు అతడే కొత్త నాయకుడు అని చూపెట్టేందుకు అతనిమీద మోషే చేతులు పెట్టాడు. అతనితో యెహోవా చెప్పినట్టే అతడు చేసాడు.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

సంఖ్యాకాండము 27: TERV

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి