సంఖ్యాకాండము 34

34
కనాను — సరిహద్దులు
1మోషేతో యెహోవా మాట్లాడాడు. ఆయన ఇలా అన్నాడు: 2“ఇశ్రాయేలు ప్రజలకు ఈ ఆజ్ఞ ఇవ్వుము. మీరు కనాను దేశానికి వస్తున్నారు. ఈ దేశాన్ని మీరు జయిస్తారు. కనాను దేశం అంతా మీరు స్వాధీనం చేసుకొంటారు. 3దక్షిణాన ఎదోము దగ్గర సీను అరణ్యంలో కొంత భాగం మీకు వస్తుంది. మృత సముద్రపు దక్షిణ కొనలో మీ దక్షిణాది సరిహద్దు మొదలవుతుంది. 4అక్రబ్బీము దక్షిణాన్ని అది దాటిపోతుంది. సీను అరణ్యంనుండి కాదేషు, బర్నేయ, అక్కడ్నుండి హసరద్దారు మళ్లీ అక్కడ్నుండి అస్మోను వరకు ఉంటుంది. 5అస్మోను నుండి ఈజిప్టు నది వరకు పోయి, మధ్యధరా సముద్రం దగ్గర సరిహద్దు ముగిస్తుంది. 6మీ పశ్చిమ సరిహద్దు మధ్యధరా సముద్రం. 7మీ ఉత్తర సరిహద్దు మధ్యధరా సముద్రం దగ్గర ప్రారంభమై, హోరు కొండవరకు ఉంటుంది. (లెబానోనులో.) 8హోరు కొండ నుండి లెబోహమత్ వరకు, అక్కడ నుండి సెదాదు వరకు ఉంటుంది. 9తర్వాత జిప్రోను వరకు వ్యాపించి, హసరేనాన్ దగ్గర అయిపోతుంది. కనుక అది మీ ఉత్తర సరిహద్దు. 10మీ తూర్ఫు సరిహద్దు ఎనాను దగ్గర ప్రారంభమై షెపాము వరకు వ్యాపిస్తుంది. 11షెపామునుండి సరిహద్దు అయీనుకు తూర్పుగా వ్యాపించి రిబ్లావరకు ఉంటుంది. కిన్నెరెతు సముద్రం (గలలీయ సముద్రం) ప్రక్కగా కొండల వెంబడి సరిహద్దు సాగిపోతుంది. 12తర్వాత సరిహద్దు యొర్దాను నదీ తీరం వెంబడి కొనసాగుతుంది. మృత సముద్రం దగ్గర అది అయిపోతుంది. అవి మీ దేశం చుట్టూ సరిహద్దులు.”
13కనుక ఇశ్రాయేలు ప్రజలకు మోషే ఈ ఆజ్ఞ ఇచ్చాడు: “అది మీకు లభించే దేశం. పది వంశాలు, మనష్షే వంశంలో సగం మంది కలసి చీట్లు వేసుకొని ఆ దేశాన్ని పంచుకోవాలి. 14రూబేను, గాదు వంశాలు, మనష్షే వంశంలో సగంమంది ముందే వారి భూమిని తీసుకున్నారు. 15ఆ రెండున్నర వంశాల వారు యొర్దాను నదికి తూర్పువైపు యెరికో దగ్గర్లో భూమి తీసుకున్నారు.”
16అప్పుడు యెహోవా మోషేతో మాట్లాడాడు. ఆయన ఇలా అన్నాడు: 17“దేశాన్ని భాగాలు చేసేందుకు యాజకుడైన ఎలియాజరు, నూను కుమారుడు యెహోషువ నీకు సహయపడతారు. వీరు 18అన్ని వంశాల నాయకులు. ఒక్కో వంశంనుండి ఒక్కో నాయకుడు ఉంటాడు. వారు దేశాన్ని భాగిస్తారు. 19ఆ నాయకుల పేర్లు ఇవి:
యూదా వంశంనుండి – యెపున్నె కుమారుడు కాలేబు;
20షిమ్యోను వంశంనుండి – అమ్మిహూదు కుమారుడు షెమూయేలు;
21బెన్యామీను వంశంనుండి – కిస్లోను కుమారుడు ఎలీదాదు
22దాను వంశంనుండి – యొగ్లి కుమారుడు బుక్కి
23మనష్షే (యోసేపు కుమారుడు) వంశంనుండి
ఏఫోదు కుమారుడు హన్నీయేలు
24ఎఫ్రాయిము (యోసేపు కుమారుడు) వంశంనుండి – షిఫ్తాను కుమారుడు కెమూయేలు
25జెబూలూను వంశంనుండి – పర్నాకు కుమారుడు ఎలీషాపాను
26ఇశ్శాఖారు వంశంనుండి – అజాను కుమారుడు పల్తీయేలు
27ఆషేరు వంశంనుండి – షెలోమి కుమారుడు అహీహోదు
28నఫ్తాలి వంశంనుండి – అమ్మీహోదు కుమారుడు పెదహేలు.”
29ఇశ్రాయేలు ప్రజలకు కనాను దేశాన్ని పంచేందుకు ఆ మనుష్యులను యెహోవా ఏర్పరచుకొన్నాడు.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

సంఖ్యాకాండము 34: TERV

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి