సంఖ్యాకాండము 9
9
పస్కా పండుగ ఆచరణ
1సీనాయి అరణ్యంలో మోషేతో యెహోవా మాట్లాడాడు: ఇశ్రాయేలీయులు ఈజిప్టు నుండి బయటకు వచ్చిన తర్వాత ఒక సంవత్సరం, ఒక నెల నాటి మాట ఇది. మోషేతో యెహోవా అన్నాడు: 2“నిర్ణీత సమయంలో పస్కా భోజనం చేయటం జ్ఞాపకం ఉంచుకోవాలని ఇశ్రాయేలు ప్రజలతో చెప్పు. 3ఈ నెల పద్నాల్గవ రోజు ఆ నిర్ణీత సమయం. మసక చీకటి వేళ వారు ఆ భోజనం చేయాలి. మరియు భోజనంనుగూర్చి నేను ఇచ్చిన నియమాలన్నింటినీ వారు జ్ఞాపకం ఉంచుకోవాలి.”
4కనుక పస్కా భోజనం చేయటం జ్ఞాపకం ఉంచుకోమని ఇశ్రాయేలు ప్రజలకు మోషే చెప్పాడు. 5పద్నాల్గవ రోజున మసక చీకటివేళ సీనాయి అరణ్యంలో ప్రజలు ఇది చేసారు. ఇది మొదటి నెలలో. మోషేకు యెహోవా ఆజ్ఞాపించిన దానంతటి ప్రకారం ఇశ్రాయేలీయులు జరిగించారు.
6అయితే ఆ రోజున కొందరు ప్రజలు పస్కా భోజనం చేయలేకపోయారు. ఒక శవంమూలంగా వారు అపవిత్రులయ్యారు. కనుక ఆ రోజున మోషే అహరోనుల దగ్గరకు వారు వెళ్లారు. 7“ఒక శవం మూలంగా మేము ‘అపవిత్రులమయ్యాము’. అయితే ఇశ్రాయేలీయుల్లోని ఇతరులతో కలిసి మేము కూడ యెహోవాకు ఈ నిర్ణీత సమయంలో కానుకలు అర్పించటంలోను పస్కా ఆచరించుటలోను యాజకులు అడ్డుకొన్నారు” అని ఆ ప్రజలు మోషేతో చెప్పారు.
8“దీన్ని గూర్చి యెహోవా ఏమంటాడో నేను అడుగుతాను” అన్నాడు మోషే వారితో.
9అప్పుడు మోషేతో యెహోవా: 10“ఇశ్రాయేలీయులతో ఈ విషయాలు చెప్పు, ఒకవేళ సరైన సమయంలో మీరు పస్కాను ఆచరించలేకపోతున్నారేమో. మీరో లేక మీ సంతానంలోవారెవరైనా ఒక శవాన్ని ముట్టినందువల్ల అపవిత్రంగా ఉన్నారేమో. లేదా మీరు ప్రయాణంలో ఉన్నారేమో. 11అయితే మీరు కూడ పస్కాను ఆచరించగలరు గాని నిర్ణీత సమయంలో కాదు. రెండవ నెల పద్నాలుగో రోజు సందెవేళ మీరు పస్కాను ఆచరించాలి. ఆ సమయంలో మీరు గొర్రెపిల్లను, పులియని రొట్టెలను, చేదు ఆకుకూరలను తినాలి. 12ఆ భోజనంలో ఏమీ మర్నాటి ఉదయానికి మీరు మిగల్చకూడదు. మరియు ఎముకలు ఏవీ మీరు విరుగగొట్టకూడదు. మీరు పస్కావిందు భోజనం చేసేటప్పుడు నియమాలన్నింటినీ మీరు పాటించాలి. 13అయితే ఆచరించగల ప్రతి మనిషి పస్కావిందును నిర్ణీత సమయంలో తినాలి. అతడు పవిత్రుడై, ప్రయాణంలో లేకుండా ఉండి పస్కాను ఆచరించకపోతే, అతనికి క్షమాపణ లేదు. అతుడు నిర్ణీత సమయంలో పస్కా విందుభోజనం చేయకపోతే, అప్పుడు అతడ్ని తన ప్రజల్లోనుంచి వెళ్లగొట్టి వేయాలి. ఎందుచేతనంటే నిర్ణీత సమయంలో అతడు తన అర్పణను యెహోవాకు అర్పించలేదు గనుక అతడు దోషి.
14“ఇశ్రాయేలీయులకు చెందని ఒకడు మీతో నివసిస్తుంటే, అతడు మీతో కలిసి యెహోవా పస్కాలో పాలు పుచ్చుకోవాలనుకోవచ్చు. ఇది అంగీకారమే గాని మీకు ఇవ్వబడిన నియమాలన్నిటినీ అతడు పాటించాలి. మీకోసం ఉన్న నియమాలే మీరు ఇతరులకోసం కూడ పెట్టాలి.”
మేఘం — అగ్ని స్థంబాలు
15పవిత్ర గుడారం (ఒడంబడిక గుడారం) నిలబెట్టిన రోజున ఒక మేఘం దానిమీద నిలిచింది. రాత్రి పూట ఆ మేఘం అగ్నిలా కనబడింది. 16ఆ మేఘం రాత్రి అంతా పవిత్ర గుడారం మీదే నిలిచి ఉంది. 17ఆ మేఘం పవిత్ర గుడారం మీద నుండి కదలినప్పుడు ఇశ్రాయేలీయులు దానిని వెంబడించారు. ఆ మేఘం ఆగిపోయినప్పుడు, అక్కడే ఇశ్రాయేలు ప్రజలు గుడారాలు వేసుకొన్నారు. 18ఇశ్రాయేలు ప్రజలను ఈ విధంగా సాగిపొమ్మని యెహోవా ఆజ్ఞాపించాడు అలాగే వారు గుడారాలు వేసే స్థలం విషయంకూడా. ఆయన ఇచ్చిన ఆజ్ఞ ఇదే. మేఘం పవిత్రగుడారం మీద నిలిచి ఉండగా, ప్రజలు ఆ చోటనే నివాసం కొనసాగించారు. 19కొన్నిసార్లు చాలకాలంగా పవిత్ర గుడారంమీదనే ఆ మేఘం నిలిచిపోయేది. ఇశ్రాయేలీయులు యెహోవాకు విధేయులై ముందుకు కదల్లేదు. 20కొన్నిసార్లు కొద్ది రోజులవరకు మాత్రమే మేఘం పవిత్ర గుడారంమీద నిలిచేది. ప్రజలు యెహోవా ఆజ్ఞకు విధేయులయ్యారు. మేఘం కదిలినప్పుడు వారు ఆ మేఘాన్ని వెంబడించారు. 21కొన్నిసార్లు ఆ మేఘము రాత్రి మాత్రమే నిలిచి ఉండేది. ఆ మర్నాడు మేఘము కదలగానే, ప్రజలుకూడా వారి సామగ్రి కూర్చుకొని వెంబడించారు. పగలుకాని రాత్రికాని మేఘము కదిలితే అప్పుడు ప్రజలుకూడా బయల్దేరారు. 22రెండు రోజులుకానీ, ఒక నెలకానీ, ఒక సంవత్సరంకానీ ఆ మేఘము పవిత్ర గుడారంమీద నిలిచిన ప్రజలు యెహోవాకు విధేయులవుతూనే ఉన్నారు. తర్వాత మేఘము తన స్థానంనుండి లేచి బయల్దేరితే, ప్రజలు కూడ బయల్దేరారు. 23కనుక ప్రజలు యెహోవా ఆజ్ఞకు విధేయులయ్యారు. యెహోవా వారికి చూపించిన చోట వారు గుడారాలు వేసారు. మరల బయల్దేరమని యెహోవా ఆజ్ఞాపించగానే వారు బయల్దేరారు, మేఘాన్ని వెంబడించారు. యెహోవా ఆజ్ఞకు ప్రజలు లోబడ్డారు. ఇది మోషే ద్వారా ఆయన వారికి ఇచ్చిన ఆజ్ఞ.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
సంఖ్యాకాండము 9: TERV
హైలైట్
షేర్ చేయి
కాపీ
![None](/_next/image?url=https%3A%2F%2Fimageproxy.youversionapistaging.com%2F58%2Fhttps%3A%2F%2Fweb-assets.youversion.com%2Fapp-icons%2Fte.png&w=128&q=75)
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Telugu Holy Bible: Easy-to-Read Version
All rights reserved.
© 1997 Bible League International