రోమీయులకు వ్రాసిన లేఖ 15:1-7
రోమీయులకు వ్రాసిన లేఖ 15:1-7 TERV
సంపూర్ణ విశ్వాసం గల మనము సంపూర్ణ విశ్వాసం లేనివాళ్ళ బలహీనతల్ని సహించాలి. మనం మన ఆనందం మాత్రమే చూసుకోకూడదు. ప్రతి వ్యక్తి తన సోదరుని మేలు కోసం, అభివృద్ధి కోసం అతనికి అనుగుణంగా నడుచుకోవాలి. క్రీస్తు కూడా తన ఆనందం మాత్రమే చూసుకోలేదు. దీన్ని గురించి ఈ విధంగా వ్రాసారు: “దేవా! నిన్ను అవమానించినవాళ్ళు నన్నూ అవమానించారు.” గతంలో వ్రాసిన లేఖనాలు మనకు బోధించటానికి వ్రాశారు. వాటి ద్వారా సహనము, ప్రోత్సాహము పొంది, రక్షణ లభిస్తుందన్న నమ్మకం మనలో కలగాలని దానిలోని ఉద్దేశ్యం. మనలో సహనము, ప్రోత్సాహము కలుగచేసే దేవుడు, యేసు క్రీస్తు ద్వారా మీ మధ్య ఐకమత్యము కలుగచేయునుగాక! అప్పుడు మనము ఒకే హృదయంతో, ఒకే నాలుకతో మన యేసు క్రీస్తు ప్రభువుకు తండ్రి అయినటువంటి దేవుణ్ణి స్తుతించగలుగుతాము. దేవునికి ఘనత కలగాలని క్రీస్తు మిమ్మల్ని అంగీకరించినట్లే మీరు కూడా ఇతర్లను అంగీకరించండి.

