రోమా 15:1-7 - అన్ని సంస్కరణలను పోల్చండి
రోమా 15:1-7 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
కాగా బలవంతులమైన మనము, మనలను మనమే సంతోషపరచుకొనక, బలహీనుల దౌర్బల్యములను భరించుటకు బద్ధులమై యున్నాము. తన పొరుగువానికి క్షేమాభివృద్ధి కలుగునట్లు మనలో ప్రతివాడును మేలైన దానియందు అతనిని సంతోషపరచవలెను. క్రీస్తు కూడ తన్ను తాను సంతోషపరచుకొనలేదు గాని– నిన్ను నిందించువారి నిందలు నామీద పడెను. అని వ్రాయబడియున్నట్లు ఆయనకు సంభవించెను. ఏలయనగా ఓర్పువలనను, లేఖనములవలని ఆదరణవలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడిన వన్నియు మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి యున్నవి. మీరేకభావము గలవారై యేకగ్రీవముగా మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రియగు దేవుని మహిమ పరచు నిమిత్తము, క్రీస్తుయేసు చిత్తప్రకారము ఒకనితో నొకడు మనస్సు కలిసినవారై యుండునట్లు ఓర్పునకును ఆదరణకును కర్తయగు దేవుడు మీకు అనుగ్రహించును గాక. కాబట్టి క్రీస్తు మిమ్మును చేర్చుకొనిన ప్రకారము దేవునికి మహిమ కలుగునట్లు మీరును ఒకనినొకడు చేర్చు కొనుడి.
రోమా 15:1-7 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
కాబట్టి బలమైన విశ్వాసం కలిగిన మనం, మనలను మనమే సంతోషపెట్టుకోకుండా, విశ్వాసంలో బలహీనుల లోపాలను భరించాలి. మన సాటిమనిషికి క్షేమాభివృద్ధి కలిగేలా మనలో ప్రతివాడూ మంచి విషయాల్లో అతణ్ణి సంతోషపరచాలి. క్రీస్తు కూడా తనను తాను సంతోషపరచుకోలేదు. “నిన్ను నిందించే వారి నిందలు నా మీద పడ్డాయి” అని రాసి ఉన్నట్టు ఆయనకు జరిగింది. ఎందుకంటే, గతంలో రాసి ఉన్నవన్నీ మన ఉపదేశం కోసమే ఉన్నాయి. కారణం, ఓర్పు వలనా, దేవుని వాక్కులోని ఆదరణ వలనా, మనలో ఆశాభావం కలగడం కోసం. మీరు ఒకే మనసుతో ఏక స్వరంతో అందరూ కలిసి, మన ప్రభు యేసు క్రీస్తు తండ్రి అయిన దేవుణ్ణి మహిమ పరచడానికి, ఓర్పుకు, ఆదరణకు కర్త అయిన దేవుడు క్రీస్తు యేసును అనుసరించి మీ మధ్య ఐకమత్యం కలుగజేయు గాక. కాబట్టి క్రీస్తు మిమ్మల్ని ఎలాగైతే చేర్చుకున్నాడో అలాగే దేవునికి మహిమ కలిగేలా మీరు ఒకరిని ఒకడు చేర్చుకోండి.
రోమా 15:1-7 TERV (పవిత్ర బైబిల్)
సంపూర్ణ విశ్వాసం గల మనము సంపూర్ణ విశ్వాసం లేనివాళ్ళ బలహీనతల్ని సహించాలి. మనం మన ఆనందం మాత్రమే చూసుకోకూడదు. ప్రతి వ్యక్తి తన సోదరుని మేలు కోసం, అభివృద్ధి కోసం అతనికి అనుగుణంగా నడుచుకోవాలి. క్రీస్తు కూడా తన ఆనందం మాత్రమే చూసుకోలేదు. దీన్ని గురించి ఈ విధంగా వ్రాసారు: “దేవా! నిన్ను అవమానించినవాళ్ళు నన్నూ అవమానించారు.” గతంలో వ్రాసిన లేఖనాలు మనకు బోధించటానికి వ్రాశారు. వాటి ద్వారా సహనము, ప్రోత్సాహము పొంది, రక్షణ లభిస్తుందన్న నమ్మకం మనలో కలగాలని దానిలోని ఉద్దేశ్యం. మనలో సహనము, ప్రోత్సాహము కలుగచేసే దేవుడు, యేసు క్రీస్తు ద్వారా మీ మధ్య ఐకమత్యము కలుగచేయునుగాక! అప్పుడు మనము ఒకే హృదయంతో, ఒకే నాలుకతో మన యేసు క్రీస్తు ప్రభువుకు తండ్రి అయినటువంటి దేవుణ్ణి స్తుతించగలుగుతాము. దేవునికి ఘనత కలగాలని క్రీస్తు మిమ్మల్ని అంగీకరించినట్లే మీరు కూడా ఇతర్లను అంగీకరించండి.
రోమా 15:1-7 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
బలవంతులమైన మనం, మనల్ని మనం సంతోషపరచుకోవడం కాక బలహీనులైన వారి దోషాలను భరించవలసినవారిగా ఉన్నాము. మనలో ప్రతి ఒక్కరూ తన పొరుగువారు వృద్ధిచెందేలా, వారి మంచి కోసం వారిని సంతోషపెట్టాలి. క్రీస్తు కూడా తనను తానే సంతోషపరచుకోలేదు కాని, “నిన్ను అవమానపరిచేవారి అవమానాలు నాపై పడ్డాయి” అని లేఖననాల్లో వ్రాయబడిన ప్రకారం ఆయన వాటిని అనుభవించారు. గతంలో వ్రాయబడిన సంగతులన్ని, లేఖనాల్లో బోధించబడిన ఓర్పు ద్వారా అవి ఇచ్చే ప్రోత్సాహాన్ని బట్టి మనం నిరీక్షణ కలిగి ఉండడం కోసం మనకు బోధించడానికి వ్రాయబడ్డాయి. మన ప్రభువైన యేసు క్రీస్తు తండ్రియైన దేవున్ని మీరు ఒకే మనస్సుతో ఒకే స్వరంతో మహిమపరిచేలా, మనకు ఓర్పును ప్రోత్సాహాన్ని ఇస్తున్న దేవుడు క్రీస్తు యేసు కలిగి ఉన్న వైఖరి మనం ఒకరిపట్ల ఒకరం కలిగి ఉండేలా మనకు అనుగ్రహించును గాక. క్రీస్తు మిమ్మల్ని అంగీకరించినట్టుగా దేవునికి మహిమ కలిగేలా మీరు కూడా ఒకరిని ఒకరు అంగీకరించండి.