జెకర్యా 4
4
దీపస్తంభం-రెండు ఒలీవ చెట్లు
1పిమ్మట నాతో మాట్లాడుతూవున్న దేవదూత నా వద్దకు వచ్చి నన్ను లేపాడు. నేను నిద్ర నుండి మేల్కొంటున్న వ్యక్తివలె ఉన్నాను. 2“నీవు ఏమి చూస్తున్నావు?” అని దేవదూత నన్ను అడిగాడు.
నేను ఇలా చెప్పాను: “ఒక గట్టి బంగారు దీపస్తంభాన్ని చూస్తున్నాను. ఆ స్తంభం మీద ఏడు దీపాలు (ప్రమిదెలు) ఉన్నాయి. దీపస్తంభం మీద ఒక గిన్నెఉంది. గిన్నెనుండి ఏడు గొట్టాలు వచ్చాయి. ప్రతి దీపానికీ ఒక గొట్టం చొప్పున వెళ్లాయి. ఆ గొట్టాలు దీపాలకు కావలసిన నూనెను గిన్నెనుండి చేరవేస్తున్నాయి. 3గిన్నె పక్కగా కుడి వైవున ఒకటి, ఎడమవైపున ఒకటి ఒలీవ చెట్లు ఉన్నాయి.” 4తరువాత నాతో మాట్లాడుతూవున్న దేవదూతను, “అయ్యా, ఈ వస్తువులు ఏమి తెలియజేస్తున్నాయి?” అని అడిగాను.
5“ఈ వస్తువులు ఏమిటో నీకు తెలియదా?” అని నాతో మాట్లాడుతూ ఉన్న దేవదూత అన్నాడు.
“లేదయ్యా” అని నేను చెప్పాను.
6అతడు నాతో ఇలా అన్నాడు: “యెహోవానుంచి జెరుబ్బాబెలుకు వచ్చిన వర్తమానం ఇది: ‘నీ శక్తి సామర్థ్యాలవల్ల నీకు సహాయం రాదు. నీ సహాయం నా ఆత్మ నుండి వస్తుంది.’ సర్వశక్తిమంతుడైన యెహోవా ఆ విషయాలు చెప్పాడు! 7ఆ ఎత్తైన పర్వతం జెరుబ్బాబెలుకు సమమైన ప్రదేశంగా ఉంటుంది. అతడు ఆలయ నిర్మాణం చేస్తాడు. దానికి చివరి రాయి పెట్టబడినప్పుడు, ‘అందంగా ఉంది! అందంగా ఉంది!’ అని ప్రజలు కేకలు పెడతారు.”
8నాకు వచ్చిన యెహోవా వర్తమానం ఇంకా ఇలా చెప్పింది: 9“నా ఆలయానికి జెరుబ్బాబెలు పునాదులు నిర్మిస్తాడు. మరియు జెరుబ్బాబెలు ఆలయ నిర్మాణం పూర్తిచేస్తాడు. అప్పుడు సర్వశక్తిమంతుడైన యెహోవా తన ప్రజలైన మీ వద్దకు నన్ను పంపినట్టు మీరు తెలుసుకుంటారు. 10సామాన్యంగా ప్రారంభించబడే పనులపట్ల ప్రజలు సిగ్గుచెందరు. జెరుబ్బాబెలు గుండు, దారం తీసికొని, తయారైన భవనాన్ని తనిఖీచేసి, కొలవటం చూసినప్పుడు, ప్రజలు నిజంగా సంతోషిస్తారు. ఆ రాతికి మీరు ఇప్పుడు చూసిన ఏడు పక్కలు యెహోవా యొక్క ఏడు కండ్లకు చిహ్నాలుగా ఉండి, అన్ని దిశలకూ చూస్తూ ఉంటాయి. అవి భూమి మీద ప్రతిదాన్నీ చూస్తాయి.”
11పిమ్మట నేను (జెకర్యా) అతనికి చెప్పాను: “దీపస్తంభానికి కుడి పక్కన ఒక ఒలీవ చెట్టును, ఎడమ పక్కన మరొక చెట్టును నేను చూశాను. ఆ రెండు ఒలీవ చెట్ల అర్థం ఏమిటి?” 12నేనింకా ఇలా అన్నాను: “బంగారు రంగుగల నూనె ప్రవహించే బంగారు గొట్టాలవద్ద నేను రెండు ఒలీవ కొమ్మలు చూశాను. వీటి అర్థం ఏమిటి?”
13తరువాత దేవదూత నాతో, “వీటి అర్థం ఏమిటో నీకు తెలియదా?” అని అన్నాడు.
“లేదయ్యా” అని నేను చెప్పాను.
14“ఈ సర్వజగత్తుకు ప్రభువైన యెహోవాను సేవించటానికి ఎంపిక చేయబడిన ఇద్దరు మనుష్యులను అవి సూచిస్తాయి,” అని అతడు చెప్పాడు.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
జెకర్యా 4: TERV
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Telugu Holy Bible: Easy-to-Read Version
All rights reserved.
© 1997 Bible League International