జెకర్యా 7

7
యెహోవా దయాదాక్షిణ్యాలను కోరుట
1దర్యావేషు పర్షియా రాజుగావున్న కాలంలో నాలుగవ సంవత్సరంలో యెహోవానుండి జెకర్యా ఒక వర్తమానం అందుకున్నాడు. ఇది తొమ్మిదవ నెలలో (కిస్లేవు) నాల్గవ రోజున జరిగింది. 2బేతేలు ప్రజలు షెరెజెరును, రెగెమ్మెలెకును, వారి మనుష్యులను యెహోవా వద్దకు ఒక ప్రశ్న అడగటానికి పంపారు. 3వారు సర్వశక్తిమంతుడైన యెహోవా ఆలయంలో ఉన్న ప్రవక్తలు, యాజకుల వద్దకు వెళ్లారు. ఆ మనుష్యులు వారిని ఈ ప్రశ్న అడిగారు: “ఆలయ వినాశనానికి కొన్ని సంవత్సరాలుగా మా విషాదాన్ని వ్యక్తం చేస్తూ వచ్చాము. ప్రతి సంవత్సరం ఐదవ నెలలో ఒక ప్రత్యేక సంతాపదినాన్ని, నిరాహార దీక్షను పాటిస్తున్నాము. మేము ఇలా చేస్తూ ఉండవలసిందేనా?”
4సర్వశక్తిమంతుడైన యెహోవానుండి నేను ఈ వర్తమానం అందుకున్నాను: 5“ఈ దేశంలోని యాజకులకు, తదితర ప్రజలకు ఈ విషయం చెప్పు, ‘మీరు ఉపవాసాలు చేసి, మీ సంతాపాన్ని ఐదవ నెలలోను, ఏడవ నెలలోను ప్రకటించారు. నిజానికి ఆ ఉపవాసం నా కొరకకేనా? కాదు! 6మరియు మీరు తినటం, తాగటం కూడ నా కొరకేనా? కాదు! అది మీ మంచి కొరకు మాత్రమే. 7దేవుడు ఏనాడో ఈ విషయాలు చెప్పటానికి ఆనాటి ప్రవక్తలను వినియోగించాడు. యెరూషలేము జనంతో నిండి, ఐశ్వర్యంతో తులతూగేనాడే ఆయన ఈ విషయాలు చెప్పాడు. యెరూషలేము చుట్టూవున్న పట్టణాలలో, దక్షిణ పల్లపు ప్రాంతంలో, పడమటి కొండవాలులలో ప్రజలు నివసిస్తున్న రోజులలోనే దేవుడు ఈ విషయాలు చెప్పాడు.’”
8యెహోవా నుండి జెకర్యాకు వచ్చిన వర్తమానం ఇది:
9సర్వశక్తిమంతుడైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు.
“ఏది ధర్మమో, ఏది న్యాయమో మీరది చేయాలి.
మీరందరూ ఒకరికొకరు దయ,
కరుణ కలిగి ఉండాలి.
10విధవ స్త్రీలను, అనాథ పిల్లలను,
కొత్తవారిని, పేదవారిని బాధించవద్దు.
కనీసం ఒకరికొకరు కీడు చేసుకోవాలనే
ఆలోచన కూడా మీరు రానీయకండి!”
11కాని ఆ ప్రజలు ఇది వినటానికి నిరాకరించారు.
ఆయన కోరింది చేయటానికి వారు నిరాకరించారు.
దేవుడు చెప్పింది వినకుండా వుండేటందుకు వారు
తమ చెవులు మూసుకున్నారు.
12వారు చాలా మొండి వైఖరి దాల్చారు.
వారు న్యాయాన్ని పాటించరు.
ఆత్మ ప్రేరణతో సర్వశక్తిమంతుడైన యెహోవా తన ప్రజలకు
ప్రవక్తల ద్వారా వర్తమానాలు పంపాడు.
కాని ప్రజలు వాటిని వినలేదు.
అందువల్ల సర్వశక్తిమంతుడైన యెహోవా మిక్కిలి కోపగించాడు.
13కావున సర్వశక్తిమంతుడైన యెహోవా చెప్పాడు,
“నేను వారిని పిలిచాను,
కాని వారు పలకలేదు.
అందువల్ల ఇప్పుడు వారు పిలిస్తే
నేను పలకను.
14ఇతర దేశాలను వారి మీదికి ఒక తుఫానులా తీసుకువస్తాను.
వారెవరో వీరికి తెలియదు;
కాని వారు దేశంలో తిరిగాక
అది నాశనమై పోతుంది.
రమ్యమైన ఈ దేశం నాశనమై పోతుంది.”

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

జెకర్యా 7: TERV

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి